170 వాటర్ ట్యాంకులతో మంచినీటిని సరఫరా
విమర్శలు చేయడమే వైకాపా నేతల పని
మండిపడ్డ హోంమంత్రి వంగలపూడి అనిత
విజయవాడ : వరద ముంపు బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నామని.. విజయవాడలో ఇంకా కొన్ని చోట్ల నీరు నిల్వ ఉందని ఏపీ మంత్రి వంగలపూడి అనిత వెల్లడిరచారు. ఉదయం అల్పాహారం, మంచినీరు, పాల ప్యాకెట్లు సరఫరా చేశామన్నారు. విజయవాడలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ వైకాపా నేతలపై విమర్శలు గుప్పించారు. ముంపు కాలనీల్లో తమ ప్రభుత్వం చేస్తున్న సాయంపై ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. విజయవాడలోని ముంపు కాలనీల్లో 170 వాటర్ ట్యాంకులతో మంచినీటిని సరఫరా చేస్తున్నాం. ఆ వాహనాలు వందల ట్రిప్పులు తిరుగు తున్నాయి. ఉదయం అల్పాహారం, మంచినీరు, పాల ప్యాకెట్లు సరఫరా చేశాం. ఇప్పటి వరకు 27వేలకుపైగా ఇళ్లలో బురదను అధికారులు తొలగించారు. డ్రోన్లతో ఆహారం సరఫరాతోపాటు క్లోరినేషన్ చేపట్టాం. కేవలం డ్రోన్లతోనే లక్షకుపైగా ఆహార పొట్లాలను పంపించాం. సీఎం చంద్రబాబు పండగ కూడా జరుపుకోకుండా శ్రమిస్తున్నారు. అయినా ప్రతిపక్ష నేతలకు ఇవేవీ కనిపించడం లేదు. కలెక్టరేట్‌లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు మూడు రోజుల పాటు బుడమేరు వద్దే కూర్చున్నారు. నిద్రాహారాలు లేకుండా గండ్లను పూడ్చివేయించారు. వైకాపా అధినేత వైఎస్ జగన్ మాత్రం పేటీఎం బ్యాచ్‌ను దింపి విషప్రచారం చేయిస్తున్నారు. జగన్ సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేదు. బెంగళూరులో కూర్చుని పులిహోర కబుర్లు మాత్రం చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి కొట్టుకొచ్చిన బోట్లపై అనుమానాలు ఉన్నాయి. ఇక సోషల్ విూడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా.. వినాయక మండపాలకు ఎలాంటి చలాన్లు విధించలేదు. మండపాలకు డబ్బులు వసూలు చేసే జీవోను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందే. సీఎం చంద్రబాబుకు విషయం తెలియగానే రూపాయి కూడా వసూలు చేయొద్దన్నారని అనిత వెల్లడిరచారు.
