కవి రాసిన కవితల్లో ఒక నదీ ప్రవాహాన్ని పాఠకుడు దర్శించటం, ఆ కవి ప్రతిభా పాటవాలను, ఒక పాట తన స్వరాల రూపంలో అందించినట్లుగా వుంటుంది. ఆకులను, పూలను విస్తారంగా రాల్చే ఒక వృక్షంలా ప్రతి కవిత, పాఠకులను పలకరించినప్పుడు, ఆ అనుభూతికి ఆనకట్టలు కూడా కదిలిపోతాయి. మంచి సాహిత్యాన్ని చదివిన ఒక సంతృప్తి పాఠకుడి మనసును ఆనందాల పల్లకీలలో ఊరేగించినప్పుడు, ఆ కవిత్వాన్ని రాసిన కవి నామధేయం, నుదుటి కస్తూరి తిలకంలా మెరుస్తూనే వుంటుంది. ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సాహితీవేత్త ‘చక్రాల వెంకట సుబ్బు మహేశ్వర్’. ఆయన కలంనుంచి వెలువడిన ఆణిముత్యమే ‘స్వీయచిత్రం’ కవితా సంపుటి. నెల్లూరులో జన్మించిన ఈ కవి శ్రీహరికోట ఇస్రోలో సేఫ్టీ ఆఫీసరుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. మహేష్ కవి, రచయిత, నాటకకర్త. అనేక నాటకాలకు దర్శకత్వం వహించిన రంగస్థల కళాకారుడు. శ్రీ చెంగాళమ్మ శతకం, నన్నయ భారతం (డాక్యుమెంటరీ డ్రామా), క్షీరసాగర మథనం, రాధికాకృష్ణం, సునామీ, సత్యమేవ జయతే, మహాత్మా , భాగ్యనగర్ మొదలైన విశిష్టమైన రచనల ద్వారా మహేష్ సుప్రసిద్ధుడు. కవిగా తన ముద్రను బలంగా ముద్రించుకున్న కవితా సంపుటి ‘స్వీయచిత్రం’.
మహేష్ కవిత్వంలో సదా ఒక గంభీరత చోటు చేసుకోవటం అతి సహజంగా జరిగే ఒక ప్రక్రియ. “హిమాలయమంత తపన అతనిది / సప్త సముద్రాలంత దాహం అతనిది / అడవిలో పిచ్చితీగ ఆరాటం అతనిది.. ‘స్వీయచిత్రం’ కవితలో రాసిన ఈ భావాలనిండా ఆయన అంతరంగమే ప్రతిబింబిస్తుంది. సరిగ్గా ఈ భావాలతోనే ఆయన కవిత్వాన్ని కొనసాగించాడని సాక్ష్యం చెప్పటానికి ఈ సంపుటిలోని ప్రతి కవిత సిద్ధపడుతోంది.
ప్రతిదానికి రాజీపడే మనస్తత్వం కాదు ఈ కవిది, తనను తాను విశ్లేషించుకునే మనస్తత్వం తనది. అందుకే ‘తిరుగుబాటు ‘ కవితలో ఇలా అంటాడు… ‘గుండుసూదుల్ని గుచ్చిన గుండెను / ఇంకెన్నాళ్లని భరిస్తాను / గొంగళిలో రక్తపు కూడు / ఎంతకాలమిలా తింటాను / అందుకే తిరగబడ్డాను / నా పైన నేనే…’ ఈ తిరుగుబాటును ఏ మనిషైతే ఆహ్వానిస్తాడో తనని తాను సంపూర్ణంగా తెలుసుకుంటాడని కవి నమ్మకం. కొన్ని కవితల్లో ఆయన భావాలకు భాష్యం చెప్పటం అంత సులువుకాదు. ‘శనివారం రాత్రి / లైట్లు వెలిగిన రైలును చూస్తే / తిమిరంతో సమరం సాగించే దేవతలా అనిపిస్తుంది / ఆదివారం రాత్రి / కొరివి దెయ్యాలు పరిగెడ్తున్నట్లుంటుంది…’ అంటూ సాగిన ‘ఆదివారం’ కవిత మన ఆలోచనలకు చాలా పదును పెడుతుంది. ఆ గాఢమైన భావాల జడివానలో పాఠకుడు తడిచి ముద్దవడం ఒక మరచిపోలేని అనుభూతి.
జీవిత సత్యాలను చెప్పటానికి కవిత్వాన్ని ఒక సాధనంగా ఆయన ఎన్నుకున్న విధానం ‘గమ్యం’ కవితలో మనకు స్పష్టమవుతుంది. ‘స్వర్గాలను జయించిన వాడికన్నా / సమస్య సాధించిన వాడు ఎక్కువ ఆనందం పొందుతాడు /పరిగెత్తగలిగిన వాడికన్నా / గమ్యం దొరికినవాడు ఎక్కువ ఆనందిస్తాడు…’ ఈ భావాలలో మనుషులు నేర్చుకోవలసిన ఎన్నో పాఠాలు మనతో కరచాలనం చేయటం ఈ కవితలోని ప్రత్యేకత.
వర్తమాన మనిషి నైజాలను సరిగ్గా తూకం వేసిన కవిత ‘బహుముఖం’. ఇందులో ఇలా అంటాడు కవి… ‘నిజంగా మనిషి మొహం / ఇంత భయంగా ఎప్పుడూ లేదు / ప్రతి ముఖమూ / షేక్ అయిన ఫోటోలా కనిపిస్తున్నది / ఆగిపోయిన గడియారంలా / మనిషి ముఖం ఒకే కాలాన్ని చూపుతోంది / చావుకు, పుట్టుకకు మాత్రమే /జీవితానికంతా రెండే సార్లు / బ్రతికున్నట్లు…’ అంటూ చివరగా ఇలా అంటాడు… ‘అందరం కలిసి / ఈ ముఖం మీద / కొంచెం ఆశ, నమ్మకం / కలగలిపి విసురుదాం…’ ఈ కవిత నిండా ఎటుచూసినా మానవజాతి ప్రతిబింబాలే కనిపిస్తున్నాయి. సార్వత్రిక స్థాయిని కలిగిన ఈ కవితలో శిల్పం, భావం పోటీపడి పరుగుపందెంలో పాల్గొన్నట్లుగా వున్నాయి. ఇజాలకు కాకుండా నిజాలకు, ఎత్తిన పిడికిళ్లకు స్పదించే మనస్తత్వం ఈ కవిది. ‘ఇంటికి చేరేది మాత్రం’ కవితలో తన గుండె స్వరాలను వినిపిస్తూ ‘గద్దర్ పాటలతో / రక్తం ఉడుకెత్తిపోతుంది / శత్రువెవడో తెలిస్తే చాలు / వాణ్ణి చితక్కొట్టేయగలను…’ అంటూ తన రక్తంలో వేడెక్కుతున్న భావాలను వెల్లడించిన మహేష్ అభినందనీయుడు.
అదే సందర్భంలో పోరాటాన్ని ప్రేమిస్తూ ‘ఊపిరి’ కవితలో ఏమంటాడో చూడండి… ‘గడియారపు ముళ్లకు / ఉరి తీయబడ్డా / చదరంగపుటెత్తుల్లో / చంపివేయబడ్డా / చివరి క్షణం వరకూ / పోరాటమే నా ఊపిరి…’ అంటూ, తన వ్యక్తిత్వాన్ని వివరించిన కవి, జీవితంలో కూడా తన తుదిశ్వాసదాకా అలాగే జీవించటం, ఆయన నిబద్ధతకు సంతకం చేసిన సందర్భాన్ని మనం గమనించవచ్చు.
తాత్వికతకు పెద్దపీఠం వేసిన ‘మనిషెప్పుడూ’ కవితలో ‘ఎవడికి తోచిన పాట వాడు రాస్తాడు / ఎవడికి తోచిన రాగం వాడు వినిపిస్తాడు / మనిషి మాత్రం నది ఒడ్డున చెట్టులాగా / ప్రతిబింబాన్ని మోసుకుంటూ / ప్రవాహం సాగుతూనే వుంటుంది…’ ఈ వాక్యాలు పాఠకుడ్ని వెంటాడుతూనే వుంటాయి. కొన్ని సత్యాలు కాగడాల్లా ఈ సంపుటిలో వెలుగుతున్నాయి. ‘రాత్రి’ కవితలో… ‘రోజూ బ్రతకడం అనే / మనం చేసే పాపాలు / సూర్యుడిలాగా / మనల్ని పశ్చాత్తాపంతో కాల్చేయకుండా / స్మృతుల చుక్కలుగా / పగలగొడ్తుంది రాత్రి…’ అంటాడు.
అదేవిధంగా ‘నిజానికి’ కవితలో ఒక గొప్ప నిజాన్ని చెప్పుతూ ‘ఒయాసిస్సుల కోసం / వెదికించేవి / బ్రతికించేవి/ ఎండమావులే…’ ఈ కవితల అద్దాలలోకి ఒక్కసారి మనం తొంగిచూస్తే మన ప్రతిబింబాలు, అసలు స్వరూపాలతో మనల్ని భయపెడుతాయి. ఆ తరువాత సుదీర్ఘంగా ఆలోచింపచేస్తాయి. కవిత్వ ప్రయోజనానికి ద్వారాలు తెరుస్తాయి. ఆయన తన కవిత్వం ద్వారా అందించిన కొన్ని సత్యాలు శాశ్వతంగా సాహిత్యంలో నిలిచిపోతాయి. ‘బానిసత్వం’ గురించి చెప్పుతూ… ‘స్వేచ్ఛ చుట్టూ / బానిసత్వపు విశ్వాసంతో / పరిభ్రమించడం / భూగోళపు వారత్వం…’ అంటాడు. ఇక్కడ భూగోళం అంటే మానవలోకం అని అర్థం. ‘ఆత్మహత్య’ గురించి రాస్తూ.. ‘కొంచెం కొంచెం వెలుతుర్ని / చందాలేసుకొని / సూర్యుడ్ని చుక్కల్లాగే / మనమందరం ఓట్లిచ్చి మన సమాధులు కట్టుకుంటున్నాం..’ అన్న కవి మాటల్లో మానవజాతి బలహీనతలు, తరతరాలుగా చేస్తున్న తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
‘ధీరులు’ గురించి చెప్పుతూ… ‘రాత్రంతా వెలుతురు జపంచేసే / చుక్కలు / పగలు రాకుండానే చచ్చిపోతాయి…’ అంటూ ఎంతో గాఢమైన భావాలు, కాలంలోని వాస్తవాలను చిత్రీకరించిన విధానం కవిత్వపు ఉన్నతశ్రేణి స్థాయిని సూచిస్తోంది.
మహేష్ కవిత్వం కాలంలో కరిగిపోయేది కాదు. కాలంతోపాటు నిలిచే కవిత్వమిది. కదులుతూ కదిలించే కవిత్వమిది. తెలుగు సాహిత్యానికి అద్భుత భావాల పట్టుచీరలు అందించిన కవిత్వమిది. ‘అంతరంగం అట్టడుగున/మనిషి నిత్య బహు వచనమంటూ…’ సరికొత్త భావ వ్యక్తీకరణలతో పాఠకుల మనసు పొరల్లో క్రొత్త దీపాలు వెలిగించే కవిత్వమిది. వైజ్ఞానిక కోణాన్ని సైతం కవిత్వ చట్రంలో సమర్థవంతంగా బిగించిన కవి, ఇస్రో శాస్త్రవేత్త ‘చక్రాల వెంకట సుబ్బు మహేశ్వర్’.
మహేశ్వర్ మనిషిని అమితంగా ప్రేమించాడు. మానవత్వంతో సహవాసం చేశాడు. కాలంమీద తిరగబడి, మనిషి, మనిషిలా బ్రతికే గీతాలకు సాహిత్యాన్ని వేదిక చేశాడు. తన ఆలోచన గొప్పది. తన ఆశయం అతీతమైంది. సాహిత్యంలో తన స్థానం సుస్థిరమైంది. కాని మృత్యువు మాత్రం ఆయన శ్వాసను మార్గమధ్యమంలోనే తన బాహుల్లోకి తీసుకుంది. మనిషిని ఈ లోకానికి చెందకుండా చేయగలిగింది. కానీ, ఆయన అక్షరాలముందు మాత్రం మృత్యువు ఓడిపోయింది. సాహిత్యపరంగా ఆయన సజీవుడు. రంగస్థల కళాకారుడిగా చిరంజీవతత్వం ఆయనిది.
తెలుగు సాహిత్యం గర్వించతగ్గ ఈ సాహితీవేత్త భావసంపద ఎప్పటికీ ఆరిపోని కాగడాల్లా వెలుగుతూనే వుంటుంది. తెలుగుజాతికి అందించిన ఆయన కవిత్వపు చిరునవ్వుకు, ఆయన శ్వాస అక్షరాలుగా నడుస్తున్న దారులకు ప్రణామాలు చెల్లించుకుంటూ…