విశ్వవిజేతగా టీమిండియా..

క్రీడలు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. అసాధారణ ప్రదర్శన ఓటమెరుగని జట్టుగా టైటిల్ ముద్దాడింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో 2000 ఐసీసీ నాకౌట్ టోర్నీ, డబ్ల్యూటీసీ 2021 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాలకు టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్), డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/45), కుల్దీప్ యాదవ్(2/40) రెండేసి వికెట్లు తీయగా… మహమ్మద్ షమీ(1/74), రవీంద్ర జడేజా(1/30) తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో) శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ (2/46), మైకేల్ బ్రేస్‌వెల్(2/28) రెండేసి వికెట్లు తీయగా.. రచిన్ రవీంద్ర, కైల్ జెమీసన్ చెరో వికెట్ పడగొట్టాడు.