బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో టీమ్‌ఇండియా ఘన విజయం

క్రీడలు

గ్వాలియర్: టెస్టుల్లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన టీమ్‌ఇండియా.. మూడు టీ20ల సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బంగ్లాదేశ్‌ను 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. అనంతరం బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. 128 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (16;7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. సంజు శాంసన్ (29; 19 బంతుల్లో 6 ఫోర్లు) రాణించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29; 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు తనదైన శైలిలో చెలరేగి ఆడాడు. నితీశ్‌కుమార్‌ రెడ్డి (16*) పరుగులు చేయగా.. చివర్లో హార్దిక్‌ పాండ్య (39*; 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. రెండో టీ20 దిల్లీ వేదికగా బుధవారం (అక్టోబర్ 9న) జరగనుంది. బంగ్లా జట్టులో మెహిదీ హసన్ మిరాజ్ (35*; 32 బంతుల్లో 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (27; 25 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. తౌహిద్ హృదయ్ (12), తస్కిన్ అహ్మద్ (12), రిషాద్‌ హొస్సేన్ (11) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ బాటపట్టారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (3/31), అర్ష్‌దీప్‌ సింగ్ (3/14) అదరగొట్టారు. మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్‌ పాండ్య తలో వికెట్ పడగొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *