ఎన్నిసార్లు లేఖలు రాసినా తెలంగాణ సర్కారు పట్టించుకోవడంలేదు
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాష్ట్రప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రామగుండంలోని ఎన్‌టిపిసి 4వేల మెగావాట్ల ప్రాజెక్టులో మిగిలిన 2400 మెగావాట్ల ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ప్రారంభించుకుని రాష్ట్రంలో విద్యుత్ భద్రత కల్పించాలని కేంద్రం భావిస్తోందని, ఇందుకుగానూ ఎన్‌టిపిసితో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (టిఎస్‌ట్రాన్స్‌కో) విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పిపిఎ) చేసుకోవాల్సి ఉంటుందని, దీని తర్వాతే ప్లాంట్ల ఏర్పాటుకు, తగినంత బొగ్గు అందుబాటులో ఉంచుకోవడం మొదలైన అంశాలపై ఎన్‌టిపిసి పని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఒకవైపు దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ నిత్యం పెరుగుతున్న నేపథ్యంలో ఎస్టిటిపి– 2 ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యుదుత్పత్తి పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన అని కిషన్‌రెడ్డి తెలిపారు. దీనికి అనుగుణంగానే పిపిఎ విషయంలో త్వరగా స్పందించి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు సార్లు లేఖలు రాసినా స్పందన రాలేదని ఆయన వెల్లడించారు. 2023 అక్టోబర్ 5న, 2024 జనవరి 9న, 29న, ఆ తర్వాత 2024 ఏప్రిల్ 29న నాలుగు లేఖలు రాసినా టిఎస్ ట్రాన్స్‌కో నుంచి సమాధానం లభించలేదన్నారు. ఇన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి రామగుండంలో కేంద్రం నిర్మించనున్న ఎస్టిపిపి – 2 ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఆసక్తి లేదన్నట్లుగానే భావించాల్సి వస్తుందని ఎన్‌టిపిసి లేఖలో పేర్కొందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆసక్తి లేనట్లయితే దీనిని దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు అనుమతి ఉంటుందన్నది ఎన్‌టిపిసి రాసిన లేఖల సారాంశమని వెల్లడించారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌పై తొలి హక్కు తెలంగాణ ప్రజలదేనని, కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తున్నా దీన్ని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమవుతోందని మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌టిపిసి రాస్తున్న లేఖలపై స్పందించి పిపిఎ చేసుకుంటే అది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడినట్లు అవుతుందని, దీనిని వెంటనే తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుని సానుకూల చర్యలు చేపట్టాల్సిన అవసరముందని కిషన్‌రెడ్డి తెలిపారు.