పశ్చిమాసియాలో సంక్షోభాలు ఆందోళనకరం

అంతర్జాతీయం

యుద్ధక్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదు
పోలండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో భేటీలో ప్రధాని మోడీ
వార్సా : ఉక్రెయిన్‌తో పాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యుద్ధక్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదన్న ఆయన.. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఈ ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు తాము మద్దతు తెలుపుతామన్నారు. పోలండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో భేటీ అయిన తర్వాత విూడియాకు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడిరచారు. ఉక్రెయిన్‌, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్దాలు మనందరికీ తీవ్ర ఆందోళనకరం. యుద్ధక్షేత్రంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకదని భారత్‌ బలంగా విశ్వసిస్తుంది. ఏ సంక్షోభంలోనైనా సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం యావత్‌ మానవాళికే అతిపెద్ద సవాల్‌. చర్చలు, దౌత్యంతోనే శాంతి, స్థిరత్వానికి మేం మద్దతిస్తాం. ఇందుకోసం మిత్రదేశాలతో కలిసి అన్నిరకాల మద్దతు ఇచ్చేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది‘ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలండ్‌ వెళ్లిన ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించామని.. ఇరుదేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. రష్యా దండయాత్ర సమయంలో భారత విద్యార్థుల తరలింపునకు పోలండ్‌ ఎంతో సహకరించిందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. అంతకుముందు అక్కడి ప్రధానమంత్రి కార్యాలయం ’ఛాన్స్‌లరీ’లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. ‘భారత్‌-పోలండ్‌ భాగస్వామ్యంలో సరికొత్త మైలురాయి. వార్సాలోని ఫెడరల్‌ ఛాన్స్‌లరీలో భారత ప్రధానికి పోలండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌ ఘనస్వాగతం పలికారు. 45 ఏళ్ల అనంతరం భారత ప్రధాని పోలండ్‌లో చేపట్టిన ఈ పర్యటన ఇరుదేశాల భాగస్వామ్యానికి సరికొత్త ఊపునిస్తుంది‘ అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు. ఈ విషయంపై పోలండ్‌ ప్రధాని టస్క్‌ స్పందిస్తూ.. ‘ చివరకు, 45ఏళ్ల అనంతరం.. భారత ప్రధానిని వార్సాలో చూడటం సంతోషంగా ఉంది‘ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. భేటీలో భాగంగా పలు అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. ఆ తర్వాత పోలండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ సెబాస్టియన్‌ దుడాతోనూ మోదీ భేటీ కానున్నారు. ప్రధాని మోదీ పోలండ్‌ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌.. ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి రాడోస్లావ్‌ సికోర్క్సీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌ సంక్షోభం, ఇండో-పసిఫిక్‌లో ద్వైపాక్షిక సహకారంపై చర్చించినట్లు ఎస్‌.జైశంకర్‌ పేర్కొన్నారు.
————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *