గోపీచంద్‌ గడియపడని తలుపుల్లో అస్తిత్వవాద వైశిష్ఠ్యం

సాహిత్యం

– డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య.

త్రిపురనేని గోపీచంద్‌ (సెప్టెంబర్‌ 8, 1910 %-% నవంబర్‌ 2, 1962) ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది, మనో వైజ్ఞానిక సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడిగా గుర్తింపు పొందిన త్రిపురనేని గోపీచంద్‌ కష్ణాజిల్లా అంగలూరు గ్రామములో జన్మించారు. గోపీచంద్‌ తండ్రి త్రిపురనేని రామస్వామి, ప్రముఖ రచయిత, హేతువాది, సంఘ సంస్కర్త. హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో పెరిగిన గోపీచంద్‌ నవలలో మార్క్సిస్టు భావాలు కనిపిస్తాయి. మార్కిజాన్నిఅధ్యయనం చేసిన గోపీచంద్‌, 1928 లోనే శంబుక వధ కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్‌ ‘బీదవాళ్ళాంతా ఒక్కటే’, ‘గోడమీద మూడోవాడు’, ‘పిరికివాడు’, ‘మార్కిజం అంటే ఏమిటి?’, ‘పట్టాభి గారి సోషలిజం’, ‘సోషలిజం ఉద్యమ చరిత్ర’ వంటి కథలు గ్రంధాలు రాసారు. తరువాత మార్కిజంలో లోటుపాటులు గ్రహించి ఎం.ఎన్‌. రాయ్‌ గారి నవ్య మానవవాదం వైపు పయనించారు. రాడికల్‌ డెమక్రటిక్‌ పార్టీ కార్యదర్శిగా పార్టీ రహిత నవ్య మానవ సమాజం నిర్మాణం వైపుగా భావ విప్లవం కొరకు సాహిత్య కషి చేసారు. చివరి రోజులలో తత్వవేత్తలు అనే తాత్విక గ్రంథాన్ని రచించారు.
గోపీచంద్‌ అసమర్ధుని జీవయాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, గడియపడని తలుపులు, చీకటి గదులు మొదలైనవి పేరు గాంచాయి. ఆయన వ్రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
గోపీచంద్‌ రాసిన నవలలలో ‘‘గడియపడని తలుపులు’’ నవలలో అస్తిత్వవాదం పుష్కలంగా ఉన్న నవలగా భావిస్తున్నాను. మనిషి తనను గురించి తాను ఆలోచించుకోవాలి. తన జీవితానికి, తన మనుగడకు ఒక అర్ధాన్ని ఆపాదించుకోవాలి. తన జీవితం పట్ల తాను సంతప్తి చెందాలి. ఆ సంతప్తిలో నుండే ‘‘అస్తిత్వం’’ అంటే ఏమిటో తెలుస్తుందని విమర్శకులు అంటారు. అస్తిత్వ సిద్ధాంతాలకు కేంద్ర స్థానం ‘‘వ్యక్తి’’ ప్రథాన స్థానం వ్యక్తి అంతరంగం. అయితే అస్తిత్వవాద దక్పథంతో చూసినప్పుడు ఈ వ్యక్తి నిర్వచనానికి అందడు. స్వయం కషి వల్ల ఏది కాగలుగుతాడో చివరికి అదే అతని అస్తిత్వంగా మిగులుతుంది. అంటే వ్యక్తి తన మనుగడలో పొందిన పరిణతి, తద్వారా సాధించిన ఫలితం అతని ‘‘అస్తిత్వం’’ అవుతుందంటారు మనోవైజ్ఞానికులు. ఈ అంశంపై సిద్ధాంత గ్రంథం వ్రాసిన డా.వాసిలి వసంతకుమార్‌ అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
గోపీచంద్‌ ‘‘గడియపడని తలుపులు’’ నవలలో కోటేశ్వరమ్మ జీవిత చిత్రణ కనిపిస్తుంది. ఆ కోటేశ్వరమ్మ పాత్ర తన జీవిత చరమాంకంలో ఆమె ప్రతి ప్రవర్తనలోను తన వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నవాడు కథకుడు. ఆమె జీవిత చరమాంకంలో అలాంటి ప్రవర్తనకు ఆజ్యం పోసినవాడు కథకుని మిత్రుడు శ్రీనివాసరావు. కథాకాలం నాటికి దాదాపు 10 సంవత్సరాల క్రితం, కథకునితో పరిచయమున్నవాడు శ్రీనివాసరావు. 10 సం.ల తర్వాత తాను ప్రచురించిన పుస్తకాలు పాఠశాలల్లో కళాశాలల్లో పాఠ్య గ్రంథాలుగా రావడానికి చేసే ప్రయత్నంలో హైదరాబాదు వచ్చి కోటేశ్వరమ్మను కలుసుకొని, కథకుణ్ణి చూడ్డానికి రావడంతో ఈ కథ ప్రారంభమవుతుంది.
కోటేశ్వరమ్మ నగరంలో పేరుప్రఖ్యాతులున్న స్త్రీ. ఆమెను భర్తను విడిచిపెట్టి ఐదారు సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటోంది. ఆమెకున్న చెడ్డపేరు ప్రక్కన బెడితే, హైదరాబాదులో పనులున్న చాలామంది ఆమెను కలుసుకుని సహాయం తీసుకుంటూ ఉంటారు. శ్రీనివాసరావు ఆదినుంచీ ఒక ఆశావాది. పరిస్తితులను తనకు అనుకూలంగా అల్లుకునే స్వభావం ఉన్నవాడు అవటంచే జీవితంలో తరచూ ఆశాభంగాలు ఎదురవుతూ ఉంటాయి. పైగా ముక్కుసూటి మనిషి. కథకుడు ‘‘నీ పుస్తకాలను కోటేశ్వరమ్మ చేత సిఫార్సు చేయించుకోరాదా!’’ అన్నప్పుడు ‘‘నేను ఈ ఊరి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొనడానికి వచ్చా గానీ రికమండ్‌ చేయించుకోవడానికి కాదు’’ అంటాడు. లోకం అంతా కోటేశ్వరమ్మను ఒక దష్టితో చూస్తుంటే శ్రీనివాసరావు దష్టి మరో రకంగా ఉంటుంది. శ్రీనివాసరావుకు కోటేశ్వరమ్మతో అంతకుముందే గుంటూరులో పరిచయం ఉండడం వల్ల ఆమె గురించి అనేక అపవాదులు విని ఉంటాడు. అయినా హైదరాబాదులో ఆమెను కలిసినప్పుడు ఆమెను గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం దొరికింది అంటాడు. కథకుడు ఆమె భర్తను విడిచిపెట్టిందననగా శ్రీనివాసరావు అతను ఆమెను చాలా కష్టపెట్టేవాడనీ, ఇంకో స్త్రీని వివాహం చేసుకున్నప్పటికీ సహించి త్యాగం చేసిందని, ఆమె భర్త ఫొటోను ఇప్పటికీ పూజిస్తున్నదని పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు.
కథకుని దష్టిలో శ్రీనివాసరావు స్త్రీ వ్యామోహం ఉన్నవాడు, అబద్ధాలను ఆడేవాడు కాకపోయినా ఒక విషయం నుండి మరొక విషయానికి తనకు అనుకూలించిన రీతిలో అల్లుకుపోగల నేర్పరి. ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకొని ఆకాశ హర్మ్యాలు నిర్మించుకునే తత్వం ఉన్నవాడు. కోటేశ్వరమ్మ కూడా అతనిపట్ల విపరీత ప్రవర్తన మరీ విచిత్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే అతని కథను కాలానికే వదలివేసి ఉండిపోతాడు. తర్వాతికాలంలో శ్రీనివాసరావు కోటేశ్వరమ్మను ఇంటినుండి వెళ్ళిపోయాడని తెలుస్తుంది. ఆమెను ఒక పార్టీలో కలిసినప్పుడు ఆమె ఎవరికోసమో వెదుకుతున్నట్టు ఎవరికోసమో చుట్టూ చూస్తూ ఉంటుంది. ఆమెలో విపరీతమైన దైన్యం గోచరిస్తుంది. వీటివల్ల ఆమెలోని ఏకాకితనం, అన్వేషణ కనిపించి కోటేశ్వరమ్మలోని అస్తిత్వ తపన కథకుడి కళ్ళముందు నిలుపుతాయి. కథకుడు ఒక విలక్షణమైన వ్యక్తిత్వం కలవాడు కావడంచేత కోటేశ్వరమ్మలోని కనిపించే వ్యక్తిత్వం కంటే కనబడని వ్యక్తిత్వం అతణ్ణి ఆకర్షిస్తుంది.
కోటేశ్వరమ్మ భర్తను వదలిపెట్టి డబ్బు అన్వేషణలో పడిపోయి వంటరితనం ఆమెను బాధించక పోయినప్పటికీ, డబ్బుతో భోగభాగ్యాలు అనుభవించే దశలో ఉన్న సమయంలో తానెంత ఒంటరిదో అర్ధంచేసుకుంటుంది. ఆమె భర్త ఫొటొపై అనుబంధం పెంచుకోవడం, తన భర్త స్వభావం ఉన్న శ్రీనివాసరావును చూడగానే వశపఱచుకొనబడినదేమో అనిపిస్తుంది. ఆమె కథకునితో ‘‘ఈ ఏకాంత జీవితాన్ని మరచిపోవడానికే నేను విచ్చలవిడిగా తిరుగుతున్నానా అని అనిపిస్తూ ఉంటుంది’’ అనడంలో అదే అంతరార్ధం కనిపిస్తుంది. ఆమె ఎంతో ప్రయత్నించి శ్రీనివాసరావును ఆకర్షించడానికి ప్రయత్నించినా శ్రీనివాసరావు మాత్రం ఆమె మీద గౌరవ భావం పెంచుకుని ఆమెను ఆరాధించి ఆమెను ఒక దేవతగా భావిస్తాడని డా.అమ్మంగి వేణుగోపాల్‌ తన ‘‘నవలా రచయితగా గోపీచంద్‌’’ సిద్ధాంతగ్రంధంలో వ్యాఖ్యానించాడు. అయినప్పటికీ ఇక్కడే ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. ఒకనాటి రాత్రి శ్రీనివాసరావు కోటేశ్వరమ్మ ఇంట్లో ఉన్నప్పుడు, ఆమె వచ్చి ప్రక్కన పడుకుని, ఒంటరితనం తనను భయపెడుతూ ఉందని అనడంతో, ఆమెను ఓదార్చే క్రమంలో యిద్దరూ ఒకటవుతారు. తాను దేవతగా భావించిన ఆమెతో అలాంటి అనుభవం ఊహించని పరిణామం కాగా, అతని జీవితంలో క్రొత్త వాకిళ్ళను తెరచి, ఫలితంగా శ్రీనివాసరావు బ్రహ్మానందం ఆశ్రమంలోకి అడుగుపెడతాడు.
ఆ విషయం కోటేశ్వరమ్మకు చెప్పడానికి కథకుడు వెళ్ళినప్పుడు ఆమె తాను శ్రీనివాసరావును ప్రేమిస్తున్నానని, తను ఎంతో జీవితం చూసినప్పటికీ, అతని మైకంలో పడ్డానని, అందుకే మందుతాగడం కూడా మానేశానని చెప్పడంతో ఆమె శ్రీనివాసరావు కోసం త్యాగాలకు సైతం సిద్ధమైందని అనిపిస్తుంది. ఆమె ఒంటరితనం ఆమెను ఎప్పుడో ఆత్మహత్యకు సైతం ప్రేరేపించగలదని ఆమె మాటల్లో వ్యక్తమవుతుంది. కథకుడికి కొంతకాలానికి శ్రీనివాసరావు బ్రహ్మానందం ప్రథాన శిష్యుడిగా కనిపిస్తాడు. అన్నిటికీ తాను పరాత్పరుణ్ణే నమ్ముకున్నానని, తిరిగి సంసారంలోకి అడుగుపెట్టే అవకాశం లేదని చెప్తాడు. అయితే కథకుని పరిశీలన ప్రకారం అతని ఈ దీక్ష ఎప్పుడో భగ్నమౌతుందన్న భయం ఏ మూలో అతణ్ణి వెంటాడుతున్నదని అర్ధమవుతుంది. అల్లుకుపోయే స్వభావం ఉన్నవాళ్ళు, తనకు ఆ ఆశ్రమం ఎప్పుడైతే ఆ ప్రవత్తిని నిరాకరిస్తుందో అప్పుడు సంక్షోభంలో పడిపోతాడని తెలిసిన కథకుడికి శ్రీనివాసరావు భక్తిభావం పట్ల సదభిప్రాయం ఉండదని అమ్మంగి వేణుగోపాల్‌ విశ్లేషించాడు.
కథకుని తిరుగు ప్రయాణంలో కోటేశ్వరమ్మ తాను స్వామీజీ ఆశ్రమానికి వెళ్తున్నట్టు చెబుతుంది. కథకుడు ఊహించిన విధంగా అక్కడ ఇద్దరూ కలుసుకొని రసవాహినిలో మునిగితేలి, ఆశ్రమ బహిష్కరణకు గురి అయి, ఇద్దరూ వేరువేరుగా తీర్థ యాత్రలు సాగిస్తారు. చివరకు కోటేశ్వరమ్మ భక్తిమార్గంలో పడి, తన భవనాన్ని అమ్మివేసి చిన్న ఇంట్లో అద్దెకుంటూ, అనారోగ్యంతో తనువు చాలిస్తుంది. కొంతకాలాని శ్రీనివాసరావు భార్య కనిపించి తన భర్త తిరిగి ఇంటికి తిరిగి వచ్చేస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేస్తుంది. తుది ఘడియల్లో కోటేశ్వరమ్మ తన వ్యక్తిత్వ వైశిష్ఠ్యాన్ని ప్రదర్సిస్తుంది. ఆ వైశిష్ఠ్యమే ఆమె అస్తిత్వం. జీవితాన్వేషణలో ఒంటరితనం వల్ల స్వీయ వ్యక్తిత్వం ప్రకాశమానమై అస్తిత్వం అనుభూతమవుతుంది. ఒంటరి తనం వల్ల ఆమె అనుభవించిన అస్తిత్వ జీవనాన్ని వివిధ కోణాల్లో గోపీచంద్‌ కెలిడో స్కోపులో చూపినట్టు మారుతున్న రంగులన్నింటినీ మనకు దశ్యమానం చేయించాడు.
వ్యక్తి తనకు తానుగా పరిణామ చెందడమే అస్తిత్వం అయినప్పుడు ‘‘అస్తిత్వం’’ , ‘‘సత్వం’’ అన్న విషయాల గురించి అస్తిత్వ వాదులు ఆలోచించడం ప్రారంభించారు. అవే అస్తిత్వ వాదంలోని భిన్న దక్పథాలయ్యాయి.
(నవంబరు 2, గోపీచంద్‌ వర్ధంతి).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *