కవిత్వ వర్ణాల పరిమళాలు

సాహిత్యం

మానవుని తొలి సృజనాత్మక ఊహ కవిత్వం. కవిత్వం గురించి వందల వేల సంవత్సరాల నుండి ఎన్నో నిర్వచనాలు వచ్చాయి. ఏది కవిత్వం అనే దాని మీద చాలా చర్చ జరిగింది. జరుగుతూనే ఉంది. తెలుగులో కొంత మంది కవులు వారి కవిత్వం ఎలా ఉంటుందో చెప్పుకున్నారు. మరికొందరు కవిత్వం ఎలా ఉంటుందో కవిత్వీకరించారు. కవిత్వాన్ని చిన్న చూపు చూడడం కూడా ఉంది. అందుకే కవి మీద, కవిత్వం మీద మాత్రమే జోకులు ఉంటాయి. కవిని వికటకవిగా సినిమా తెర మీదకూ లాగారు. కొన్ని వ్యాపార పత్రికలు కవిత్వాన్ని దరి చేరనీయలేదు. కానీ, లాభాపేక్షలేకుండా కవిత్వాన్ని ప్రచురించిన ప్రచురణ కర్తలూ ఉన్నారు. అయినా కవిత్వం తలెత్తుకుని తిరుగుతుంది. తన పని తాను చేస్తుంది.

అందుకే ఆవాల శారద ‘వర్ణాల వాన’ వంటి కవిత్వం అనివార్యమై తన సత్తా చూపించింది. తన చుట్టూ ఉన్న సమాజాన్ని, మనుషుల్నీ చదివింది. తరగతిలో రన్నింగ్ నోట్స్ రాసినట్టు లోకంలోని విషయాలను ఈమె కవిత్వంగా రాసుకుంది. ఏ కవైనా ఇక్కడి నుండే మొదలవుతాడు, ఇంక దాన్ని విడిచి పెట్టకుండా రాసుకుంటూ పోతాడు. ఆవాల శారద అదే చేసింది.

____________

మనుషులంటే తనను తాను ఇష్టపడేంత మక్కువ ఉంటుంది ఈ కవయిత్రికి. మనుషులు ఎదురుపడితే చాలంట.. ఈ కవయిత్రి రీఛార్జ్ అయిపోతాదంట. భారాన్నో, దూరాన్నో పంచుకోడానికి ఓ మనిషి వద్దేంటి అంటూ మనల్ని కూడా తెలివిగా ఒప్పించేస్తుందీ కవయిత్రి. ఈవిడకి మనుషులు మీద ఎంత ప్రేమ అంటే – ‘నన్ను మట్టిలో పూడ్చి పెట్టినా సరే మనిషి అలికిడైతే చాలు/ మొలకెత్తే విత్తునై నేలను చీల్చుకుని శిరసెత్తుతాను’ అంటుంది. ‘మనుష్యుడే నా ఆదర్శం మనిషితనం నా సంతకం’ అని ముగించింది ఈ కవయిత్రి.. ఈ సంపుటిలోని మొదటి కవితను.

____________

ఈ కవిత శీర్షిక ‘మనుష్యుడే నా సంగీతం మానవుడే నా సందేశం’ ( పుట – 5) ఈ ఒక్క కవితలోనే చాలా విశేషాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది మనుషుల మీద ప్రేమకు సంబంధించిన కవిత కాబట్టి. జీవించడానికి నాలుగు గోడలు ఉండాలి. బతకడానికి నలుగురు మనుషులు కూడా కావాలి కదా! వాళ్ళు మంచి వారై ఉండాలి కదా. ఎదుటి వాళ్ళు మంచివారవడానికి ముందు..మనం మంచివాళ్ళం కావాలి. మనిషికి మనిషే ఆదర్శం. మనిషికి మనిషే నేపథ్య సంగీతం. ఈ మనిషితనాన్నే శారద మనిషి సంతకంగా అభివర్ణించారు.

వచన కవిత్వంలో ‘అమ్మ’ వస్తువుగా చాలా కవిత్వం వచ్చింది. ఈ సంపుటిలో కూడా అమ్మ మీద మంచి కవిత ఉంది. ఈ కవితలో అమ్మ యాది మాత్రమే కాకుండా అమ్మ స్ఫూర్తిని చెప్పడం విశేషం-‘చిన్నప్పుడు చేతిలోని గాలిపటం/చూస్తుండగానే పుటుక్కున తెగిపోయినట్లు/ రెక్కల్నే పతంగులుగా ఎగరేయమన్నది నువ్వే కాదా/ పరుగు పందెంలో బొక్కబోర్లా పడ్డప్పుడు/ యుద్ధ వ్యూహాన్ని తీర్మానించింది నువ్వే కాదా/ నేనిప్పుడు ఎగరేసిన వెలుతురు జెండా మీద/ తడారని సంతకమూ నీదే కదా/ ఒక పసుపు పచ్చ ప్రవాహమై చప్పుడు లేకుండా/ నా జీవనవాహికలోకి ప్రవేశించిన నువ్వు/ఉత్త జ్ఞాపకానివెలా అవుతావు’ (అమ్మ కోసం, పుట – 14).

కవి గానీ కవయిత్రి గానీ ఏదో ఒక అస్థిత్వ వాదానికి చెందిన వారైతే, వారికి ఆయా వాదాల మీద విశ్వాసం ఉన్నా లేకున్నా వారు ఆ భావజాలం నుండి తప్పించుకోలేరు. బై డిఫాల్ట్, వారు ఆయా అస్తిత్వవాదాలకు చెందిన వారై ఉంటారు. శారద స్త్రీ వాది మాత్రమే కాదు..స్త్రీ వాదానికి మద్దతుగా కవిత్వం రాశారు.

‘తరతరాల తారతమ్యాల కొసల నిలబడి/అలుపెరుగని అశ్రుకెరటమొకటి/అవిశ్రాంతంగా తీరానికి/తల బాదుకుంటూనే ఉంది’ (పుట – 25). ఈ పాదాల్లో ఆపాదమస్తకం ఒక దుఃఖిత మహిళ దర్శనం ఇస్తుంది. అవిశ్రాంతంగా తలబాదుకుంటుందనే మాట సమాజంలోని స్త్రీ దుస్థితిని తెలియజేస్తుంది. స్త్రీల సమస్యలు ఈనాటివి కాదు కదా! అంతేకాదు ఈనాటీకీ స్త్రీలు సమస్యల వలయంలోనే ఉన్నారనే వాస్తవ అభివ్యక్తి ఈ మాటల్లో గమనించవచ్చు.

‘పుటక పుటకంతా ఎత్తిపోతల
నానావిధ సంకీర్ణ శోకదగ్ధయై
ముడి పదార్థమూ మాదకద్రవ్యమైన
ఎత్తుకొలతల మాంసపు ముద్ద
గాయమై స్రావమై
వాడి వదిలేసిన పనిముట్టయి
సంఘం చెక్కిన బాధాతప్తసతి ఆమె’ (పుట – 26)

ఈ పంక్తులకి వివరణెందుకూ విశ్లేషణెందుకు. ఒక్కోసారి వస్తువు కవిత్వాన్ని మింగేస్తుంటుంది. ఇక్కడ వస్తువు ఎంత గంభీరంగా ఉందో, కవిత్వమూ అంతే చిక్కగా ఉంది.

‘వచన కవిత్వంలో నిరాశ, నిస్పృహలు, ఆకలి, దారిద్ర్యం ఎక్కువగా ఉంటాయి. అయినా వాటిలో ఒక స్ఫూర్తి వాక్యం, ఒక చైతన్యవంతమైన పాదం ఉంటే అవి నిరాశ నిస్పృహల నుండి బయట పడేస్తాయి. వెరసి వాస్తవాల్ని చెప్పడంతో పాటు చేయి పట్టుకుని సమస్యల్ని దాటించవలసిన బాధ్యత కూడా కవిత్వానికి ఉంటుంది. శారద కవిత్వంలో మనిషిని ముందుకు నడిపించే శక్తి చాలా చోట్ల మనం గమనిస్తాం. ఒక నాయకుడు ముందుండి నడిపించినట్టు ఉంటుంది ఈమె కవిత్వం -ఎలాగంటే: ‘ఎగరాల్సి వచ్చినప్పుడు/రెక్క విప్పాల్సిందే/ఒకానొక మెలుకువకై కనులు తెరవాల్సిందే/నిన్ను నువ్వు ఆవిష్కరించుకోకుంటే/వెలుగు నీడలకర్థం/ఎప్పటికీ తెలీదు/… … … … … … … /వేగుచుక్క విచ్చుకుంటేనే/ జీవ చైతన్యం పురివిప్పేది/ఆకాశం మూడంకె వేస్తే/చుక్క రెక్క ముడిస్తే/రాత్రి రహస్యం అనామకంగా నేల రాలుతుంది. (పుట – 75)

2010 నుండి కవిత్వం రాస్తున్న శారద..శిల్పదోషం లేకుండా కవిత్వం రాసి పాఠకులను మెప్పించగల దిట్ట. అందుకేనేమో ఈవిడ కవిత్వానికి చాలా ప్రధాన స్రవంతి పత్రికలు చోటు కల్పించాయి
____________

‘ఇన్ని నైరాశ్యాలూ నిట్టూర్పుల నడుమ/మరిన్ని వైరాగ్యాలూ తత్వచింతనలూ అక్కర్లేదు/జనన మరణాల్ని మించిన జీవన సత్యం లేదు కదా/ఇన్ని చేదు చీకట్లు చవిచూశాక/ కొత్తగా చావు వచ్చి పడక్కర్లేదు/ బతుకును మించిన బాధా సందర్భం లేదు కదా’ (పుట -104) నాటా, నవ్య వీక్లీ పోటీలో బహుమతి పొందిన కవిత ఇది.ఒక పెద్ద కేన్వాసు మీద బొమ్మ వేయడం ఎంత కష్టమో, యూనివర్సల్ విషయాల మీద కవిత్వం రాయడం అంత కష్టం. అటువంటిదే ఈ కవిత.
____________

ఈ ‘వర్ణాల వాన’ శారద ఆవాల తొలి కవితా సంపుటి.సాంద్ర కవిత్వ పరిమళాలు నిండిన మంచి కవిత్వం, మంచి భాష ఉంది. వస్తు విస్తృతితో కూడిన కవితల సమాహారమిది.

-డాక్టర్ బండి సత్యనారాయణ
99890 35136

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *