నవ్వుల పువ్వుల తోట-యాత్ర నవల

సాహిత్యం

“ఏదయినా చదివితే, అది మనకో చక్కని అనుభవం కావాలి. మనసు వికసించాలి. కొంచెం సేపు పుస్తకం మూసి ‘మ్యూజింగ్స్’ లోకి పోగలగాలి. బలవంతాన రెక్కపట్టుకు చదివించాల్సి వస్తే ఏ రచనయినా కావచ్చు గాని మంచి ఫిక్షన్ మాత్రం కాజాలదు”- పురాణం సుబ్రహ్మణ్య శర్మ

విజయనగరం గుర్తొస్తే చాగంటి సోమయాజులు నోట్లో చుట్టతో కళ్ళ ముందుకు వచ్చేస్తారు. చా.సో కథ గుర్తొస్తే ఆయన 1942లో రాసిన మొదటి కథ “చిన్నాజీ” మనసులో మెదులుతుంది. చిన్నాజీతో పాటు చాగంటి తులసి ‘బామ్మ రూపాయి’తోనో, ‘యాష్ ట్రే’ తోనో తలంపులోకి కదలి వచ్చేస్తుంది.

అలా అలా 1978లో రాసిన ‘యాత్ర’ నవల పునర్ముద్రణ పొంది నా చేతిలోకి వచ్చింది. చదివితే ఈ నవలలో ఏముంది? నిజానికి ఏమీ లేదు.

__________

‘యాత్ర’ నవలలో పాపా, బాబూ మాటిమాటికీ గెంతుతూ నవ్వుతూ చేసే అల్లరి వుంది. సీతమ్మగారి కుటుంబంలో కొడుకూ,కోడలూ, వచ్చే స్నేహితులు ఒకర్నొకరు ఆట పట్టిస్తూ నవ్వుకొంటూ సీతమ్మ గారితో కలసి చేసే సందడి వుంది. అంతే కదా అనుకుంటే మాత్రం అంతే. కానీ అంతుపట్టని మూడు తరాల కుటుంబ గాథలో మొదటితరం సీతమ్మగారి అభ్యుదయ దృక్పథం ఉంది. తరాల అంతరాల భేదాన్ని వదిలి పెట్టి తర్వాతి తరం వారి ఆలోచనల్లోను, ఆచరణలోనూ అవసరమైన వాటిని అందిపుచ్చుకొని వారితో పాటూ నడవగలిగితే ఇల్లొక నవ్వుల పువ్వుల తోటగా మారి ఒక ప్రశాంత నిలయం అవుతుందనే పాఠం వుంది.
__________

కలకత్తాలోని కొడుకూ, కోడలుతో అభిప్రాయ భేదాలతో వాళ్ళతో కలిసి వుండలేక అమ్మన్న యాత్రకు పోతానని, ఒరిస్సాలోని కటకంలో వున్న బాల్యస్నేహితురాలైన సీతమ్మ ఇంటికి రావటంలో నవల మొదలౌతుంది .

‘యాభై అరవై ఏళ్ళనాటి స్తోత్రీయ బ్రాహ్మణ కుటుంబంలోకి వెళ్ళి మడీ, తడి, కుంపటి మీద వండుకోవటం, వితంతువులు తమ కోసం మడిగా సొజ్జనో, ఉప్పుడు పిండినో చేసుకొని తినటం మొదలైనవన్నీ విశ్వనాథ సినిమానో, బాపూ సినిమానో చూస్తున్నట్లుగా దృశ్యాలు దృశ్యాలుగా సాగుతాయి. సాంప్రదాయ బ్రాహ్మణ పుటుక పుట్టి బొత్తిగా మడీదడీ వదిలేయడమే కాక ఇంకా ఆవిషయం గొప్పగా చెప్పుకుంటుంది’ విసుగ్గా అనుకుంటుంది సీతమ్మను చూస్తూ అమ్మన్న. ఆ మర్నాడు తనకోసం వంటింట్లో కుంపట్లు చూసి ఊపిరి పీల్చుకుంటుంది.

అమ్మన్న చేసిన ములక్కాడల కూర, సీతమ్మ కొడుకు కృష్ణ స్నేహితులు,ఒరియా వాళ్ళు వచ్చి వట్టి కూరనే నాక్కుంటూ తినటం చూసి ఆశ్చర్యపోతుంది.

పుట్టింట సదాచారం గల సీతమ్మ ‘నా మడి దేవుడికి రెండు పూలు పెట్టేంతవరకే’ అంటే ఏమనలేక వూరుకుంటుంది అమ్మన్న.

జగన్నాధుడికి ఇష్టం లేకపోతే పూరీ వెళ్ళినా దర్శనం కాదు అన్న పొరుగింటి రమణమ్మ మాటల్ని తీసి పారేస్తుంది సీతమ్మ. రమణమ్మను సమర్థించిన అమ్మన్నతో “మన బుద్ధీ, మన మనస్సూ మనల్ని తైతక్కలాడిస్తుంది. మనం చేసే ప్రతీ పనిని ఆ కనిపించని వాడికి అంటగట్టి లబోదిబో మనటం అలవాటైంది’ అని సీతమ్మ చేత పలికించటం సీతమ్మ కమ్యూనిస్టని రమణమ్మ వేళాకోళం చేయడంతో మొదలైన సీతమ్మ పాత్ర ఈ నవలలో ఆధునాతనంగా స్నేహం, మంచితనం,సహనం, సౌహార్థం నింపుకున్నదిగా తన తర్వాతి తరం వారి ఆలోచనల్లోని, ఆచరణల్లోని మంచిని గ్రహించి ముందడుగు వేసే వ్యక్తిగా తీర్చిదిద్దారు రచయిత్రి.

కటకం నుండి పూరీ, భువనేశ్వర్ అన్నింటినీ అమ్మన్నగారిని తీసుకూవెళ్తూ పాఠకులకి కూడా అన్ని ప్రాంతాలను పరిచయం చేసారు రచయిత్రి తులసి. లింగరాజ దేవాలయంలో లింగం లేకుండా పాన వట్టమే ఉండటాన్నీ, ధవళగిరిలో బుద్ధుని జన్మ వృత్తాంతాన్ని,పాలరాతి పగోడాలో శిల్పరూపంలో చూపిస్తారు.

“మానింది మందు, బతికింది వూరు” అన్నారు.సంసారమే సంసారం, వచ్చే కెరటం, పోయే కెరటం, శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని,పెళ్ళికెల్తూ పిల్లిని చంక పెట్టుకు వెళ్లినట్లు అంటూ కథా సందర్భంలో అనేక సామెతల్ని పాఠకులకు గుర్తుచేస్తుంది. ‘బాలీజాత్ర’ విశేషాల్ని వివరిస్తూ కార్తిక పున్నమి ఉదయం మహానదిలో స్నానం చేయించినట్లూ పాఠకులచేత కూడా దీపాల్ని వెలిగించి కాగితపు పడవలో వదిలినట్లూ, బామ్మగార్లతో పాటూ జెయింట్ వీల్ ఎక్కినట్లూ అనుభూతి పొందుతారు చదువుతోన్న పాఠకులు.

చిట్టచివరికి పూరీ వెళ్ళి అందరూ కలసి పెళ్ళిపెద్దలై మిత్రా, రత్నంలకు వివాహం జరిపిస్తారు. తెలుగు బ్రాహ్మల పిల్లరత్నం, బ్రాహ్మణేతరుడైన ఓఢ్రుల పిల్లవాడితో చేయబోయే కాపురం తలచుకొని అమ్మన్న దిగులు పడుతుంది.

__________

“బతుకంటేనే సర్దుకోవడం. నీకోసం నేనూ, నాకోసం నువ్వు సర్దుకుంటేనే బతుకు సరిగ్గా వెళ్తుంది, పెళ్లి చేసుకుంటే సర్దుకు బతకడం ఎలాగో తెలుస్తుంది. పట్టుపడుతుంది. ఒకళ్ల కోసం తన కిష్టమైనది వదులు కోవడం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు తమకయిష్టమైనవి అలవర్చుకోవడం ఎలాగో తెలుస్తుంది. పెళ్ళిముడితో ఈ పాఠం మొదలవుతుంది – మొగుడూ పెళ్ళాలకి ఒకరికోసం ఒకరు సర్దుకుపోడం రాలేదూ.. ఆ ముడి కాస్తా సడులుతుంది. కాపరం చెడుతుంది విడిపోయేవరకూ వస్తుంది” కొత్తగా పెళ్ళయిన వాళ్ళకి చెప్పాల్సిన గీతోపదేశంలా సీతమ్మ చేత ఉపదేశించారు రచయిత్రి.
__________

నిజమే జీవితమంతా మన చుట్టూ ఉండే బంధువులూ, తోబుట్టువులూ,స్నేహితులూ అందరితో సర్దుకుపోతుంటేనే ప్రశాంతంగా ఉంటుంది అనే విషయం అమ్మన్నకు అర్థం అవుతుంది.

“తన యాత్ర అసలు సిసలు యాత్ర ..ఈ యాత్ర తీర్థయాత్రే” అని తెలిసి తిరిగి తన కొడుకు దగ్గరికి కలకత్తా వెళ్ళటానికి సిద్ధం కావటంతో ఈ చిన్న నవలను పూర్తి చేసారు తులసి.

ఈ నవల పూర్తి చేసే సరికి పాఠకులు కూడా ఒరియా ప్రాంతానికి వెళ్ళి అక్కడి వారితో చిరుసంభాషణ చేయగలిగేటంతటి భాషని నేర్చుకోగలరు .

“ఇదేముంది ఒక సామాజిక వర్గానికి చెందిన ఆచారాలూ, సాంప్రదాయాలూ వివరించి, వాళ్ళకి మాత్రమే చెందిన రచన” అని నాలిక చప్పరించేసిన వారికి చెప్పేదేం లేదు.

ఈ సందర్భంలో పోరంకి దక్షిణామూర్తి గారన్న మాటల్నీ గుర్తు తెచ్చుకోవాలి.”పరిణామమన్నది సాహిత్యంలోనూ, సిద్ధాంత వాదాల్లోనూ వచ్చినంత తొందరగా సమాజంలో రాదు. సమాజ సమష్టిలో కనిపించేటంత తొందరగా వ్యక్తి జీవనంలోనూ రాకపోవచ్చు. పరిణామాన్ని ఆపలేమని తెలిసి కూడా పాతకాలపు ఆలోచనల్నీ ఆచారాల్నీ పట్టుకు పాకులాడేవాళ్లు ఉంటూనే ఉంటారు. అలాంటి వాళ్లలో పరివర్తన రావడానికి అనుభవమే గుణపాఠం నేర్పాలి తప్ప లెక్చర్లు పని చెయ్యవు ”

కానీ ఏజాతి, మత, కులాలకు చెందిన వారైనా తరానికీ తరానికే మారే జీవన విధానాలను,అంతరాలనూ వైవిధ్యాలను అర్థం చేసుకోవటమెలాగో తెలియజేస్తుంది. వారిమధ్య అంతరాల వలన కుటుంబాలలో జరిగే విధ్వంసాలను పట్టింపులను తొలగించుకొని ఆనందమయమైన ప్రశాంత జీవితాన్ని ఎలా గడపొచ్చో తెలియచెప్పేది చాగంటి తులసి రాసిన యాత్రనవల.

అందుకే “ఈ కథ ఎప్పుడో దాదాపు 40 ఏళ్ళ కిందట చదివాను. ఈనాటికీ గుర్తుంది. ఇందులో ‘జీవితం’ ఉంది. ‘విమర్శ’ ఉంది. ‘ఆదర్శం’ ఉంది. తులసి రాసిన ‘యాత్ర’ నాకు గుర్తొస్తూ ఉంటుంది.’ అంటారు రంగనాయకమ్మ.

 

– శీలా సుభద్రాదేవి
81068 83099

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *