వర్తమాన కాలంలో అస్తిత్వాన్ని ప్రకటిస్తూ ఆధిపత్యాన్ని ఎదిరించే ప్రముఖ కవి బిల్ల మహేందర్. మనసును హత్తుకుంటాడు. మనిషితనాన్ని ఎత్తుకుంటాడు. మనసును తొలిచే సమాజ స్థితిగతులను చూస్తూ, అక్షరీకరించడమే వారి నైజం. బాధలు లేని గాథలే బిల్ల మహేందర్ కవిత్వ లక్షణాలు.ఈ దేశంలో బలహీనుల మీద బలవంతులు అనబడే పులుల ఆట సాగుతూనే ఉందని బాధపడతాడు. “ఇప్పుడు/ఎవరి నోటి నుండైనా ‘పులి-మేక’ పదం జారి పడ్డప్పుడు /తెలియకుండానే కళ్ళనుండి రక్తం కారుతుంటది” అని విలపిస్తాడు.
బిల్ల మహేందర్ ఇప్పటికే ఒక గేయ సంపుటితో పాటు అయిదు కవితా సంపుటాలు వెలువరించాడు. పరిస్థితులు కల్పించిన సామాజిక సందర్భాలలో సంపాదకులుగా నాలుగు పుస్తకాలు సంధించాడు. వారి తాజా కవిత్వం ‘నేను మరణిస్తూనే ఉన్నాను’ పాఠక సమాజానికి నిలువుతో నిలువెడు ఆత్మస్థైర్యం అవుతాడు.
ఇందులో 63 కవితలు అనేక కోణాల సమ్మోహనం. ఆ పేరు వినగానే ప్రఖ్యాత మానవతావాది సాయిబాబా కవిత్వం ‘నేను చావును నిరాకరిస్తున్నాను’ గుర్తుకు వస్తుంది.
‘నేను మరణిస్తున్నాను’ అనే కవితలో మానసిక సంఘర్షణను చిత్రీకరిస్తూ “ఎవరైనా/ ఈ దుఃఖాన్ని చెరిపేస్తే బాగుండు/ గుండె చెరువైదాకా ఏడవాలంటే/ దేహంలో సత్తువ లేదు/ కళ్ళలో తడి జాడలేదు/ బతుకంతా అసమానత సిలువను మోస్తున్నాను/ అడుగడుగునా అవమానపు చూపులను ధరిస్తున్నాను/పేరులో మనిషిని మాయం చేసి మతాన్ని వెతుకుతున్నారు/కులాన్ని చూసి వెలికోత కోస్తున్నారు/ ఊరెప్పుడూ నాది కాలేదు/బతుకు చుట్టూత కంచె నాటి పొలిమేర పాతేసింది/నగరమెప్పుడూ నా భుజాన్ని తట్టి పలకరించలేదు/మురికి కాలువలు ఫుట్ పాతులు/నా చిరునామాగా మార్చింది/పిడికెడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని/ఏ తీరం వెంబడి పయనించినా/గాయాలు అలలు అలలుగా తాకుతూనే ఉన్నాయి/నా దేశం ఏ కులంగానో మతంగానో విడిపోయిన ప్రతిసారి/నేను మరణిస్తూనే ఉన్నాను” అని అనడంలో కవి యొక్క స్పష్టమైన ఉద్దేశం అవగతమవుతుంది. ఈ దేశం మీది మమకారం మంటగలుస్తున్నప్పుడు అతని బాధ క్షణక్షణం మరణిస్తున్నానని వ్యక్తీకరించడం కవి బాధ్యతకు పరాకాష్టగా నిలుస్తుంది. పాఠకుల మదీ గెలుస్తుంది.
_______________
సమాజంలోని అనేక అంశాలను తన కవితల్లో నిక్షిప్తం చేసి నిప్పులు చెరుగుతూ ఎగిరే క్షిపణిలా తీర్చిదిద్దాడు. ఈ కవితలలో తాత్త్వికత, మార్మికత కొట్టొచ్చినట్టుగా కనబడుతుంటాయి. సమానత్వాన్ని సాధనే ధ్యేయంగా మేలుకొలుపులా ఉంటుంది. వారి కవితా పంక్తులు సూక్తి సుధలు, ఆలోచనాత్మకం. నీతి నియమాలతో ఎలా జీవించాలో చెప్పే ప్రేరణాత్మకము, స్ఫూర్తిదాయకము అయిన ఉదాహరణలు ఎన్నో ఉంటాయి. ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను రాసే కవిత్వం సామాజిక బాధ్యతను నెరవేర్చాలి అంటాడు. భూమికి బరువైన కవిత్వం కాదని ‘నిప్పుల్లో కాల్చినా నిలబడే వాక్యాన్ని రాయి’మనే మహేందర్ ఆరాటం పోరాటంలా కనబడుతది. ఇంకా నాశనం కాని అక్షరాన్ని గురించి గొప్పగా ఆవిష్కరిస్తూ ‘నీ కవిత్వం నీ కంటే ముందుగా వెళ్ళాలి. నీ కవితా వాక్యం తర్వాతే నీ పరిచయం మొదలవ్వాలని, చలనం కలిగినప్పుడు నువ్వు మరణిస్తున్నా సరే వాక్యాన్ని రాయి బతికే ఉంటావ్’ అంటాడు.
______________
మనిషి ఒక మొక్కలా ఎదిగి కొమ్మలాగ విస్తరించాలి. అప్పుడే ఎన్నో జీవులకు ఆవాసమైనట్లుగా మనిషి బతుకు పరిపూర్ణమవ్వాలని కోరుకుంటాడు. నిజమైన సాహిత్య లక్షణం కూడా అదే చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్మిన కవి. మనిషి మహోన్నత స్వభావాన్ని గురించి వివరిస్తాడు. మనిషి సాంఘిక జీవి అని చెప్పిన ప్రసిద్ధ సూక్తిని ఆధారం చేసుకుని మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో విశ్లేషిస్తాడు. మనిషి పదిమందికి సాయపడే మంచితనం అద్దుకోవాలని ఆశిస్తాడు.
“వర్ణమేదైనా మనిషి పువ్వై పుష్పించాలి/ ఏ సిగలోనో మెడలో దండలానో/నలుగురి గుండెల్లోనూ కొలువవ్వాలి”(మనిషి పుష్పించాలి) అని ఉత్కృష్టమైన మానవ జన్మని ప్రభావవంతంగా చిత్రీకరణ పట్టాడు. విశ్వనరుడను నేను అని ప్రకటించుకున్న గుర్రం జాషువా వలే తాను..ఒక మనిషికి, నాకు విభజన రేఖలు వద్దని నినదిస్తూ “దయచేసి మీరెవరు/నన్ను ఏ మతం అని అడగకండి/ఎందుకంటే నేను మతాన్ని కాదు మనిషిని” (మతాన్ని కాను) కవితలో తనను తాను మతానికి అతీత వ్యక్తిగా ప్రకటించుకుంటాడు.
మనిషి మహోన్నతను గురించి తెలియజేస్తూ మనిషిని దేవుడిగా మలచిన తీరు హృద్యంగా ఉంది. మనుషులకు మనుషులే తోడవ్వాలని అండగా నిలవాలని పదే పదే మనిషితనాన్ని గుర్తు చేస్తాడు. “రండి/ఇవాళనే కాదు/ప్రతిరోజు అతడికి చప్పట్లు కొట్టి మనసారా అభినందిద్దాం/ మనిషే దేవుడని నిర్భయంగా ప్రకటిద్దాం” (మనిషి దేవుడని ప్రకటిద్దాం) అని అక్షరాలతో నినదిస్తున్నాడు ఈ కవి.
కొత్త పదబంధాలు, పదచిత్రాలు, భావ చిత్రాలతో కవిత్వం సంపద్వంతంగా తీర్చిదిద్దాడు. ఈ కవిత్వానికి ముందుమాట రాసిన కాత్యాయని విద్మహే ప్రశ్నకు మరణం ఉండదు. అది ఎప్పుడూ నియంత గుండెకు గురిపెట్టిన ఆయుధంగా పదునైనదనీ, ఆ తాత్త్వికత తెలిసిన కవిగా మహేందర్ కనబడతాడని వ్యాఖ్యానించడం సబబుగా ఉంది. అణచివేయబడ్డ వాళ్ళ పట్ల కేవలం సానుభూతి మాత్రమే కాదు నిబద్ధత కనబడుతుందని నారాయణస్వామి వెంకట యోగి పేర్కొనడం మహేందర్ నికార్సుతనానికి, నిజాయితీకి నిదర్శనం. సామాజిక బాధ్యతగా సాహిత్యంలో మనిషితనమే మహోన్నతమని సమర శంఖం పూరిస్తున్న బిల్ల మహేందర్ అభినందనీయుడు.
-డా. సిద్దెంకి యాదగిరి
94412 44773