ప్రపంచీకరణ తరువాత శీఘ్రంగా వచ్చి పడుతున్న మార్పులు స్త్రీల జీవితాల్లో తెచ్చిన వత్తిడి తక్కువదేమీ కాదు. సాంకేతిక సౌలభ్యం భౌతిక శ్రమను కొంత తగ్గించినా సమాజంలో నిలిచివుండిపోయిన బంధనాలు మానసిక అసౌకర్యాన్ని అసహనాన్ని పెంచుతున్నాయే కాని తగ్గించడం లేదు. స్త్రీని చూసే చూపులో ఇవ్వవలసిన మర్యాదలో రావలసిన మార్పు రాలేదు. ‘ఇది మంచి ఇది చెడు,’ అనే కచ్చితమైన విభజన రేఖలను తుడుచుకుని ఆ నలుపు తెలుపులే కాక వివిధ రంగులు, వాటి తాలూకు వివిధ ఛాయలు వున్నాయనే ఎరుక లేదు. భంగపడిన స్త్రీలదే తప్పనే కుళ్లిపోయిన భావాలు పోలేదు. దాని తాలూకు ట్రామాని అధిగమించి జీవితాన్ని ముందుకు సాగించుకునే స్థైర్యం ఇంకా స్త్రీ లకు రాలేదు. వాళ్లకి అవసరమైన చేయూత లేదు, నీదికాని తప్పుకు నువ్వు శిక్ష పడక్కరలేదని చెప్పే వ్యవస్థ లేదు. చదువులు, ఉన్నతోద్యోగాల వల్ల కాస్త తనదైన సమయం లభించినా ఇంటిపని బాధ్యతంతా ఆమెకు తప్పడం లేదు. ఇంటా బయటా ‘సెబాష్’ అనిపించు కోవాలనే ఆరాటం వాళ్లు వదిలించుకోడం లేదు. మంచి పేరు మీద మమకారం తీరలేదు.
స్త్రీ పురుష భేదం లేకుండా వ్యక్తులందరి జీవితాలు యాంత్రిక వేగంతో పరిభ్రమిస్తున్నాయి. ఒక్క క్షణం నిలబడి ఊపిరి తీసుకుని చుట్టుపక్కల పట్టించుకునే తీరికను, ఓపికనూ, ‘మరి నా మాటేమిటి, నేనేం కావాలి,’ అని ఛెళ్లున వీపు వాయగొడుతుంది ఒక అభద్రతాభావం. జీవితానికి, ఉద్యోగానికి, ప్రేమకు, దేనికీ నిలకడ, భద్రత లేని కాలం. నిత్య పోరాటం, పరుగు పందెం. అయినా అంతరంగపు అడుగు పొరలలో దాక్కుని వున్న సౌజన్యం కొందరిని నిలదీసి ప్రశ్నిస్తుంది, అపరాధభావం రూపంలో.
ఉమా కథలు చాలా వరకు ఎగువ మధ్యతరగతి ఉన్నతోద్యోగి అయిన స్త్రీ ఉత్తమ పురుషలో చెప్పినవే. ఈ పరుగుల ప్రపంచంలో కూడా గోరంత దీపంలా శిశిర వంటి సామాజిక జీవులుంటారు. వాళ్లకి స్వచ్చమైన స్నేహాలుంటాయి. చీకటి గుహలాంటి ఇంట్లో పెరిగి తండ్రి స్వార్థానికి చితికి పోయిన గౌరిని కూడా నిలబెట్టే బంధువులుంటారు. అటూ ఇటూ కాని జండర్ సమస్యతో ఇబ్బందిపడే మహేష్ లను గుర్తించే మహిళలుంటారు. వివాహ వ్యవస్థలో ఇమడలేక రెక్కలు సాచుకునే మయూరలుంటారు. తన జీవితం, తన ఉద్యోగం అనే నాలుగు గోడల మధ్య బిగుసుకుపోయే ‘నిర్జన’ కళ్లు విడతాయి. చూపు విస్తరిస్తుంది. ఇంకా ఆశ మిగిలే వుంది. దాన్ని కొంగు కప్పి కాపాడుకోవాలి అంటాయి ఉమా కథలు. మనస్తత్వ విశ్లేషణ అదనం.
పన్నెండు కథలతో మన ముందుకు వస్తున్న ఈ కథాగుచ్ఛం నేటి జీవన శైలిని, అంతరంగ మథనాన్ని కళ్ల ముందు పెడుతుంది. ఇంగ్లీషు వాడకం కొంత తగ్గించుకుని వాటి తెలుగు పర్యాయపదాలు కనిపెట్టగలదని చనువుతో సలహా యిస్తూ ఉమా నుంచి త్వరలో మరిన్ని కథలు ఆశిస్తూ…
-పి. సత్యవతి