ఒక భావుకురాలి హృదయాంతరంగాల సవ్వడులు

సాహిత్యం

వెంటాడుతున్న దృశ్యాన్ని అర్థవంతంగా వ్యక్తీకరించడమే కవిత్వం. కాఠిన్యంతో కాక సహృదయంతో అక్కున చేర్చుకునేది కవిత్వం. రమణీయమైన ప్రకృతితో మమేకం కావడమే కవిత్వం. సంస్కారవంతమైన సాహిత్యాన్ని జీవన గమనానికి దిక్సూచిగా మలుచుకున్న యువ కవయిత్రి సాయి మల్లిక పులగుర్త. తన అంతరంగావిష్కరణకు నిలువెత్తు రూపం ‘నల్ల మబ్బు పిల్ల’ హైకుల సంపుటి. ఒక సృజనకారునికి అత్యంత ముఖ్యమైనది పరిశీలన. ఈ అమ్మాయి సునిశితమైన పరిశీలనా శక్తి సామర్ధ్యాలు ఈ హైకులతో అవగతమవుతున్నది.

మల్లిక కవయిత్రిగా మారడానికి ప్రేరణగా నిలిచిన సంఘటన గురించి తన మాటలో ఇలా రాసుకుంది. ‘ఒకరోజు వర్షం పడుతుంది. అమ్మ తీగ మీద ఆరేసిన బట్టలు తీసేసింది. బట్టలన్నీ తీసేసి తీగను మాత్రం వర్షంలో వదిలేశారని జాలేసింది. I knew it was a feeling that made no sense, అయినా నాకు దాని పేరు తెలియకుండా ప్రేమ జాలి కలిసిన భావోద్వేగం కలిగింది. నాకు కలిగిన ఆ చిన్ని కొత్త ఫీలింగ్ ను ఎక్కడైనా పెట్టాలనిపించింది. నా నోట్ బుక్ లాస్ట్ పేజీ చింపి, అందులో ఈ విషయాన్ని కవితలా రాసి అమ్మకు చూపించాను. అది చదివి అమ్మ నవ్విన సరదా నవ్వు నాకు భలే అనిపించింది. అప్పటి నుండి ఏ అందమైన, ముద్దుగా అనిపించిన విషయం కనిపించినా, ఆ సంతోషం నాతో ఉంచేసుకోకుండా, ఇంకొకరికి చూపించాలి అనిపించేది’.
____________

ఈ సంపుటిలో మూడు వందలకు పైగా హైకులున్నాయి. వాటిని పలు విభాగాలుగా వర్గీకరించి తన భావాలను వినూత్నంగా పంచుకున్నది. మనకు రోజు కనిపించే వాటి గూర్చి మన ఆలోచనలు వేరు, ఈ కవయిత్రి ఆలోచనలు వేరు. తన మనస్సు నుండి అవి అదృశ్యం కాకముందే నేర్పుగా కథలుగా, కవితలుగా రాస్తుంది. కొన్నింటికి అందమైన చిత్రాలు కూడా వేస్తుంది. వర్షాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా. సమస్త జగతికి ప్రాణాధారం వర్షం. ఆ వాన కురిసినప్పుడు ఆమెలో కలిగే భావాలు అనంతమైనవి. ‘వాన పాటలు’ పేరుతో రాసిన కొన్ని హైకూలు మనల్ని హత్తుకుంటాయి.
____________

చిన్న పిల్లల అల్లరిని వర్షమెట్ల మరిపిస్తుందో ఈ వాక్యాలు బోధపరుస్తున్నాయి. ‘అల్లరి చంటాడి /కన్నీటిని మరిపింది/హఠాత్తు వాన’. చిన్న పిచ్చుక దాహాన్ని తీర్చడాన్ని గూర్చి ‘చిన్ని వర్షపు చుక్క/పిచ్చుక పిల్ల పెద్ద/దాహాన్ని తీర్చేసింది’, అలాగే చిగురులపైన వాన చినుకులను గురించి ఈ హైకులో చదివి ఆనందపడుతాం. ‘చెట్ల చిగుర్లపై/వాలాయి, అలసిన/ముత్యాల చినుకులు’.

ఆకాశంలో వెన్నెలను ఆస్వాదించని వారు ఉండరు కదా. వెన్నెల రాత్రుల్లో కబుర్లు చెప్పుకోవడం ఒక తీపి జ్ఞాపకం. వెన్నెల వెలుగులను పంచుతున్న ‘చంద్రుడి వలపులు’ ను ఇష్టపడుతున్న మల్లిక ‘చంద్రుడుపై పొగడ్తలకు/అసూయ పడి కప్పేసింది/నల్ల మబ్బు పిల్ల’ అంటూ చమత్కారంగా చెప్పింది. ఇంకా అంతే అందంగా ఈ హైకులో ‘వెన్నెలమ్మ అందాన్ని మెచ్చి/నది, ప్రేమ పల్టీలు కొట్టింది/సాయంత్రం రాత్రులలో’ వర్ణించి చెప్పిన తీరుకు ముగ్దులమైపోతాం.

జీవితంలో లభించిన వరం ఒక స్నేహం. ఆ స్నేహపు వాత్సల్యాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే. తన స్నేహాన్ని గురించి ‘స్నేహపు తలపులు’ పేరుతో రాసిన కొన్ని హైకులలో వివరించింది. మిత్రుల మాటల ముందు కోకిల గానమే మూగబోయిందని ఈ హైకూ ద్వారా వెల్లడించింది. ‘వేప చెట్టు నీడన మూగిన/మిత్రుల కిల కిలల ముందు/కోకిల బోసిపోయింది’.

ప్రకృతికి శోభను చేకూర్చేవి పూవ్వులే కదా. అట్లాంటి పూలను విస్మరించలేరు. అనేక రకాలైన పూల అందాల గురించి.. ”పూ‘లయ’ లు” అంటూ ప్రత్యేకంగా రాసిన హైకూల్లో మల్లిక సుకుమారమైన హృదయం దర్శనమిస్తుంది. దిగులుతోనున్న పువ్వుకు సంతోషాన్ని తెచ్చింది తన వాక్యాలతో ఇలా ‘బాధగా వంగిన పువ్వుకు/తన ప్రతిబింబం చూపి/నవ్వించింది చెరువు’. ఎదురు చూడడంలోని కోపాన్ని ‘సీతాకోకచిలుక రాకకై/ఎదురుచూస్తూనే/ఎరుపెక్కింది మందారం’..అంటూ సుతిమెత్తని తనాన్ని ప్రదర్శించింది.

శిశువుల నవ్వులకు పులకరించి పోతామందరం. కల్లా కపటం తెలియని ఆ స్వచ్ఛమైన మనసులను అక్కున చేర్చుకుంటాం. పిట్టలన్నా పసిపిల్లలన్నా, పువ్వులన్నా చెట్టు కొమ్మలన్నా, నక్షత్రాలన్నా వెన్నెలన్నా అమితంగా ఇష్టపడే మల్లిక ‘బుజ్జిగాళ్ళ సందళ్ళు’ అంటూ రాసిన హైకూలు అందమైన హరివిల్లుల్లా ఆకట్టుకుంటాయి. ‘మూత కింద పడినంత/చిన్న కారణం చాలు/ఆ బుల్లి అల్పసంతోషి నవ్వుకి’ అన్న ఈ మాటలు ఎంతో హుషారునిస్తాయి. వస్తుమయమైన ప్రపంచంలోని దుఃఖమంతా దిగమింగుకొని పసి పిల్లలతో గంతులేస్తాము. ఈ హైకూ ద్వారా చెప్పిన విషయంతో అందరం ఏకీభవిస్తాము. ‘చిరునవ్వుల మూటలు/ పంచే, బుల్లి బాబుకి/అందరూ మిత్రులే’.

జీవితంలో మళ్ళీ తిరిగి రానిది బాల్యమే కదా. ఆ చిలిపి పనులు, తెలిసి తెలియని మాటలు, అమాయకమైన నవ్వులు, తరగతి గదిలోని ముచ్చట్లను జ్ఞాపకం చేసుకుంటూ ‘అప్పటి రోజులు’ అంటూ రాసిన హైకూల్లో టీచర్ గురించి రాసిన ఈ పదాలు విశిష్టమైనవి. తాను మరువని గురువులకు మల్లిక అందిస్తున్న కానుక ఈ హైకూ ‘ఎన్నిసార్లు తప్పు చేసినా/మళ్లీ వెయ్యిన్నొకటో సారి కూడా/సరి చేసేది టీచర్ మాత్రమే’. గడిచిన గుర్తులను తలుచుకుంటూ చెప్పిన ఈ మాటలు విలువైనవి.’బ్లాక్ బోర్డు, సుద్ధ ముక్కలు/ డస్టర్, బెంచీలు, హోంవర్కులు/ ఒకప్పుడు వద్దనుకున్నా,/ఇప్పుడు కావాలనుకున్న కుదరదు’.

ఇప్పుడు మనందరికీ ఆరోప్రాణం స్మార్ట్ ఫోన్. అది లేకుండా క్షణం కూడా కదలడం లేదు ఎవరికి. బుక్ కల్చర్ వెళ్లి లుక్ కల్చర్ వచ్చిన పరిణామాన్ని ‘మొబైల్ కబుర్లు’ శీర్షికలో తన భావాలను పంచుకున్నది. చదవడం ఇష్టం కాబట్టి ఈ హైకూని ఇలా రాయగలిగింది. ‘మా పుస్తకాల కొత్త వాసన/మీ కిండిల్ ఇవ్వగలదా/అని గర్వంగా ప్రశ్నించాయి’. ‘అతడి లతలు’ అంటూ రాసిన హైకును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘ఎండాకాలంలో చిన్ని వానలు/చలికాలంలో పిల్ల ఎండలు/నీ జాలిలో వచ్చిన అల్లర్లే’ నని సూర్యుని చిత్రాలను తలుచుకుంటుంది.

ఏ ఫంక్షన్ అయినా సరే వీడియో, ఫోటోగ్రాఫర్ల విచిత్ర విన్యాసాలను చూడవలసిందే. వాళ్ల సూచనలను తప్పనిసరిగా పాటించవలసిందే. వాళ్ళ చేష్టలు ‘ఫోటో చిత్రాలు’ గా రూపుదిద్దుకున్నాయి. ఆ వ్యంగ్య ధోరణి ఈ హైకులో కనిపిస్తుంది. ‘అమ్మాయి, అబ్బాయి/ పూజారి తల్లిదండ్రులు అందరున్నా/పెళ్లి ఆపాల్సి వచ్చింది/ఫోటోగ్రాఫర్ ఇంకా రాలేదట’. ‘క్షణకాల అందాలు’ విభాగంలో రాసిన ఒక హైకులో ప్రతి దానికి ఒక గుర్తింపు ఉంటుందనేది కాదనలేని సత్యం. వాడి పడేసిన పాత బకెట్ గురించి ‘వానలో తడిచి/పక్షులకు నీళ్ల సహాయం/చేసింది, విరిగిందని/పడేసిన పాత బకెట్’. ఇంకా ‘సంక్రాంతి చలి’ గూర్చి ‘మా ఇంటి రోడ్డు ఇవాళ/స్నానం చేసి, రంగులతో /ముద్దుగా ముస్తాబయ్యింది’ అంటూ చక్కని పోలికతో ముగించింది.
____________

నగరంలోని ట్రాఫిక్ రద్దీ అనుభవాలతో ‘ట్రాఫిక్ కళలు’ లోని హైకూలను చదువుతుంటే ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని చూసినట్లుగా ఉంటుంది. ‘చల్లటి వాన గాలిలో/రోడ్డుపై పల్టీలు కొడుతున్న/ ఖాళీ కవరు’ గాలికి ఎగురుతున్న కాగితాల గురించి కాదు స్పీడ్ బ్రేకర్ల గురించి కూడా ఇలా రాసింది మల్లిక. ‘వాహనాల బద్ధకపు నిద్రను/ వదలగొడుతూ నాట్యం/చేయిస్తున్న స్పీడ్ బ్రేకర్స్’.
____________

ఇప్పుడు అంతటా నియమాలను ఉల్లంఘించడమే కానీ పాటించడం మాత్రం లేదు. రోజురోజుకు తరిగిపోతున్న మానవీయతను కాపాడుకోవాలనే కాంక్షతో ‘కలికాలపు సంఘటనలు’ రాసింది. నిర్లక్ష్యం మనుషులకే కాదు పక్షులకు కూడా ప్రాణాపాయం కలిగిస్తాయని ఈ హైకూ ద్వారా వ్యక్తం చేసింది. ఇంకా మానవత్వం బతికి ఉందనే నమ్మకాన్ని కలిగిస్తున్నది. ‘బుజ్జి పిట్టలేవైనా/చిక్కుకుంటాయని, డాబా మీది/పతంగుల దారాలన్నీ తీసిన పాప’.

దీపావళి పండుగ ప్రతి ఇంటింటా వైభవంగా జరుగుతుంది. ‘దీపాల సిరులు’ అంటూ రాసిన కొన్ని హైకూలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. టపాసులు ఇతర మందు గుండు సామాగ్రి కొనలేని పేదవాళ్లను గుర్తు చేసుకుంటూ ‘కాగితాల చెత్తలో దొరికిన/టపాకాయ పేలకుండానే/ పిల్లాడి అరుపులు పేల్చింది’ అని వాస్తవ పరిస్థితులను వివరించింది.

పాతికేళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి మల్లిక ‘నల్ల మబ్బు పిల్ల’ హైకూల సంపుటి వెలువరించడం అభినందనీయం. ఒక భావుకురాలి వాన పాపల వంటి హైకూల సంపుటిది. ఈ పుస్తకానికి సుప్రసిద్ధులైన సాహితీవేత్తలు కె.సత్యవతి, వాడ్రేవు చిన వీరభద్రుడు గార్లు రాసిన ముందు మాటలు ఈ హైకూల ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నాయి. చదువరులకు దారిని చూపుతున్నాయి. మల్లిక హృదయాంతరంగాలకు ఈ హైకూలు అద్దం పడుతున్నాయి. పసితనపు ముద్దు పలుకుల వంటి ఈ బుజ్జి బుజ్జి హైకూలతో కరచాలనం చేద్దాం.

 

 

– గోపగాని రవీందర్
94409 79882

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *