ప్రపంచంలో ఎంతటి ఘనకార్యాన్నైనా తప్పుడు మార్గంలోనో, దుష్ప్రచారం(మోసం)తోనో సాధించలేం. వాస్తవాలు, మంచితనంతో అన్ని పను(కార్యా)లూ సాధించవచ్చు. ప్రపంచంలో అందరూ అందరి నుంచి మంచిని ఆశిస్తారు. విజయాలను సంతోషంతో, అపజయాలను ధీరత్వంతో స్వీకరించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అహంకారం, గర్వం తలకెక్కితే ఎన్నో అనర్ధాలకు దారి తీస్తుంది.
పాలకులు ఎప్పుడూ సేవకులుగా నిబద్ధతను, చిత్తశుద్ధిని అలవర్చుకుంటేనే.. నాయకులయ్యే యోగ్యతకు అర్హులు. తప్పుడు సమాచారంతో వాస్తవాలను దాచడం, ఉద్దేశ పూర్వక దుష్ప్రచారం, ఆర్థిక అసమానతలు, యుద్ధభయం, ప్రకృతి వైపరీత్యాలు, కాలుష్యం, అనారోగ్యం, అశాంతి లాంటి వాటి మూలంగా ప్రపంచ ఆర్థిక, సామాజిక, జీవ మనుగడే పెను ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనలో నేడు ప్రపంచం ఉంది. ఎలాగైనా అధికారాన్ని, ఆధిపత్యాన్ని చెలాయించాలన్న దురాశ, చెడు ఆలోచనలు, దుష్ప్రచారాలు తాత్కాలికమైన రాజసాన్ని ఇస్తాయేమో!. కానీ వాస్తవాలు తెలిసిపోయిన తర్వాత ఎంత గొప్ప వారినైనా సర్వనాశనం చేస్తుందనేది మరిచిపోకూడదు. నిజం..చెప్పులేసుకోక ముందే, అ(బద్దం)వాస్తవం ప్రపంచాన్ని చుట్టేస్తోందనే సామెతలా సామాజిక మాధ్యమాలు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. వీటిని కట్టడి చేయాలనే చర్చ కూడా జరుగుతుంది.
నిజాయితీయే నిలబడుతుంది, వాస్తవాలే ఉనికికి ఊపిరి పోస్తాయనేది కఠిన సత్యం. ప్రపంచంలో భారత్, అమెరికా, బ్రిటన్ తో సహా పలు దేశాలలో ఎన్నికల వేళ దుష్ప్రచారంతో సమాజం చీలికలు పీలికలయ్యే ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక ఈ మధ్యనే తాజాగా వెల్లడించింది. త్వరలో జరగబోయే భారత్, అమెరికా, బ్రిటన్లతో సహా ప్రపంచంలోని పలు దేశాలు ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి. ఈ సందర్భంగా ఆన్లైన్లో, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం, తప్పుడు సమాచార వ్యాప్తి పెరిగిపోతున్నదని, అది కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాల అర్హతను, చట్టబద్ధతను శంకించడానికి దారితీస్తుందని ప్రపంచ ఆర్థిక నివేదిక హెచ్చరిస్తుంది.
ఇలా వచ్చే రెండేళ్లలో ఎన్నికల వేళ దుష్ప్రచారం ఫలితంగా సమాజం భిన్న వర్గాలుగా చీలిపోవడమే అతి పెద్ద ముప్పుగా నివేదిక తెలిపింది. దీంతోపాటు అంటువ్యాధులు, అక్రమ, ఆర్థిక కార్యకలాపాలు, ఆదాయ అసమానతలు, కార్మిక కొరతను స్వల్పకాలిక ముప్పుగా వర్గీకరించింది. వచ్చే పదేళ్లలో వాతావరణ వైపరీత్యాలను తీవ్ర ముప్పుగా డబ్ల్యు ఈ ఎఫ్ నివేదిక పరిగణించింది. మొత్తం మీద ఎన్నికల వేళ దుష్ప్రచారం, ప్రకృతి ప్రక్రోపాలు, సమాజం భిన్న వర్గాలుగా చీలిపోవడం, సైబర్ అభద్రత, దేశాల మధ్య సంఘర్షణలను ప్రపంచానికి ఎదురవుతున్న ఐదు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ముప్పులుగా డబ్ల్యు ఈ ఎఫ్ పరిగణిస్తుంది. ఇలా భారత్ తో సహా రెండేళ్లలో ఎన్నికలు జరుగుతున్న దేశాలలో తప్పుడు సమాచారం ప్రభుత్వాల చట్టబద్ధతకు అశనిపాతంగా మారనుంది.
ఈ కృత్రిమ మేధస్సు సృష్టించే తప్పుడు సమాచారం, డీఫ్ ఫేక్ లాంటి ప్రసార, ప్రచారాలను గుర్తించడం చాలా కష్టంగా మారిందని, మైనార్టీ కమ్యూనిటీ నిర్దిష్ట సమూహాలను లక్ష్యంగా చేసుకుంటుందని కూడా నివేదిక హెచ్చరించింది. ఇటువంటి కంటెంట్ ఓటర్లను ప్రభావితం చేయడంతో నిరసనలకు ఆజ్యం పోసి, హింసకు దారితీస్తుందని వివరించింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియల క్షీణతకు దారితీస్తుందని హెచ్చరించింది.
చాలా దేశాలు విపరీతమైన వాతావరణ సంఘటనలను ఎదుర్కొనే పెను ప్రమాదం ఉంటుందని స్పష్టం చేసింది. భూమి వ్యవస్థలో సంక్లిష్టమైన మార్పులు, జీవవైవిద్య నష్టం, పర్యావరణ అవ్యవస్థ, సహజ వనరుల కొరత ఏర్పడుతుందని పేర్కొంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్లో గత పది సంవత్సరాల పాలనలో తప్పుడు సమాచార వ్యాప్తి తీవ్రతరమైన విషయాన్ని సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులు చెప్తున్నారు. ఈ లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టాలని వాస్తవాలు, అవాస్తవాల విషయంలో పాలకులు ప్రజలను మభ్యపెట్టి వాస్తవాలు దాస్తూ అవాస్తవాలను ప్రచారం చేయడం, గణాంకాలను వారికి అనుకూలంగా ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ప్రజాస్వామ్య దేశానికి ఇలాంటి విధానం శ్రేయస్కరం కాదు.
ఇప్పటికీ భారత దేశం ఆర్థిక అసమానతలతో, పేదరికం కబంధహస్తాల్లో నిరుపేదలు విలవిలలాడుతున్నారు. విలాసవంతమైన జీవితాలలో సంపన్నులు తులతూగుతుంటే? కుటుంబ భారాన్ని మోయలేక బడుగులు, పేదలు, నిర్భాగ్యులు చతికిల పడిపోతున్నారు. కానీ కొద్ది మంది చేతుల్లోని సంపద అభివృద్ధికి బాటలు వేస్తుందనే దుష్ప్రచారాన్ని మొదలెడుతున్నారు. వాస్తవంగా దేశంలో పేదరికం, నిరుద్యోగం, ఆత్మహత్యలు, లింగ వివక్షత తగ్గలేదు. పత్రికా స్వేచ్ఛ హరించబడుతుంది. స్వతంత్రంగా ఉండవలసిన రాజ్యాంగపరమైన వ్యవస్థలను అస్థిరపరుస్తున్నారు.
ఇలాంటి వేళ దేశంలో ప్రజలందరూ ఎన్నికల ముందు ఎలాంటి భావోద్వేగాలకు, అవాస్తవాలకు లోనవ్వకుండా.. వాస్తవాలను తెలుసుకొని చైతన్యవంతులై జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నేటి పాలకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారు, ఇంకేం నెరవేర్చబోతున్నారో! చెప్పుకోవాలి. కానీ కల్లబొల్లి మాటలతో, దుష్ప్రచారాలతో అధికారాన్ని చేపట్టాలని చూస్తే? ఇప్పటికే తప్పుడు ప్రచార పరిపాలన ప్రభావం ఎంతగా ఉంటుందో.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వచ్చే రెండేళ్ల ముందే హెచ్చరించింది. అందులో ప్రధానంగా భారత్ ను అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరించింది. వాస్తవంగా “నిజాన్ని” మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి “నిజానికి” ఉంది. అందుకే నిజం నిలకడ మీద తెలుస్తోంది అంటారు.
ఆధునిక టెక్నాలజీ కాలంలో దేనికి ప్రచారం(పబ్లిసిటీ)ఉంటే, అదే గొప్పదనే భావన ఈ సమాజంలో ఉంటుంది. ఇలాంటి వేళ “నిజం” కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉం(డా)చాలి. లేకుంటే?”అబద్ధం” నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు, ప్రపంచాన్నే నాశనం చేస్తుంది. ఆ పరిణామాల నుంచి చైతన్యవంతులై స్థితప్రజ్ఞతతో ప్రజలు ఎన్నికల్లో వ్యవహరించాల్సి ఉంది..
– మేకిరి దామోదర్,
సామాజిక విశ్లేషకులు, వరంగల్