బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి… భానుమ‌తి

సినిమా

భారతదేశం గర్వంచదగ్గ నటీమణుల్లో భానుమ‌తి రామ‌కృష్ణ‌ ఒకరు. నటిగా, గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితరసాధ్యమైనవి. ఏడు దశాబ్దాలు ఆమె సినీకళామతల్లికి చేసిన సేవలు అజరామరం. అన‌న్య సామాన్యం.

“చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షరక్రమాన పేర్లు ఎన్నికచేస్తే ‘బి’ శీర్షిక కింద ఉండే మొట్ట‌మొదటి పేరు ఆమెది. కేవలం పురుషులకే సాధ్యం అయిన సినీ సాంకేతిక నైపుణ్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా, సంగీత దర్శకురాలిగా విభిన్న కోణాలను స్పృశిస్తూ సాటిలేని మేటి తెలుగు కళాకారిణిగా ఎదిగిన ప్ర‌జ్ణాశాలి భానుమ‌తి.

1925వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన.. ప్రకాశం జిల్లా, ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో భానుమతి జన్మించారు. హీరోయిన్లుగా ఆడవారి వేషాలు కూడా మగవారే వేసే ఆ రోజుల్లో ధైర్యం గా నేనున్నానంటూ కేవలం 13 సంవత్సరాల ప్రాయంలో ఇంట్లో సనాతన కట్టుబాట్లను ఎదిరించి, సంప్రదాయ సంగీత కళాకారుడైన తండ్రి బొమ్మ రాజు వెంకటసుబ్బయ్యను ఒప్పించి సినిమాలలో వేషం కట్టారు. తండ్రి స్ఫూర్తితో తాను కూడా సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని నేర్చుకుని అపార సంగీత జ్ఞానాన్ని సముపార్జించారు.

సి.పుల్లయ్యగారు ‘వరవిక్రయం’ (1939) సినిమాలో ఆమె ‘‘స్వాతంత్య్రమేలేదా స్త్రీ జాతికి’’ అన్నపాట, ‘‘జాతికి ఈ సూత్రంబె’’ అన్న పాట పాడారు. ఆ పాటలు ఆ రోజుల్లో ఇంటింటా మార్మోగాయి. సినిమా విజయం సాధించింది. సి.పుల్లయ్య తర్వాత తీసిన ‘మాలతి మాధవమ్‌’ (1940)లో ఆమెకు నాయిక పాత్ర ఇచ్చారు. ఆ చిత్రం పరాజయం పొందినా ఆమె వెనుక‌డుగు వేయ‌లేదు. ‘ధర్మపత్ని’, ‘భక్తిమాల’ సినిమాలు వచ్చాక, ‘కృష్ణప్రేమ’ (1943) వచ్చింది. ఈ ‘కృష్ణప్రేమ’ రామకృష్ణ ప్రేమగా మారింది. అంటే ఆ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేసిన రామకృష్ణారావుని భానుమతి ఇష్టపడి 1943, ఆగష్టు 8వ తేదీన వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ఏకైక కుమారుడు భరణి. ఆయన పేరుమీదనే ‘భరణి’ సంస్థను స్థాపించిన ఆ దంపతులు అనేక అపూర్వ చిత్రాలను అందించారు. చిత్రాల్లో ఆమె హీరోతో సమానమైన పాత్రలనే ఒప్పుకునేవారు . ఆమెకు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడ‌డం అల‌వాటు. దానిని అందరు త‌ల పొగరు అనుకునేవారు. అయినా ఆమె చలించేవారు కారు.
బి.ఎన్‌.రెడ్డి ‘స్వర్గసీమ’ (1946)తో భానుమతి, గొప్పనటిగా ప్రశంసలు పొంది, ‘స్టార్‌’గా ఎదిగారు. దక్షిణ రాష్ట్రాల్లో ‘స్వర్గసీమ’ విజయశంఖం మ్రోగించడంతో, భానుమతి కీర్తిపతాకం మీంటికెగసింది. ‘స్వర్గసీమ’లోని ఆమె పాత్ర అమాయకురాలైన కూచిపూడి నాట్యకత్తె. ఈ పాత్రలోని దశలు భానుమతి నటనా శక్తికి గీటురాళ్లు. సహజంగా సంభాషణలు చెప్పడంతో, పాడడంలో ఆమెకి ఆమే సాటి అని ఈ చిత్రం ద్వారా ఆమె నిరూపించుకున్నారు.

భానుమతి మధురమైన గాయని. ఆమె కంఠం సుడులు, చక్రాలూ తిరిగినట్టు పలుకుతుంది. ఆమెని అనుసరిస్తూ పాడడం తేలికైన విషయం కాదు. భానుమతి వేరెవరికీ ప్లేబాక్‌ పాడలేదు. తనకెవరూ పాడలేదు. అయితే ‘చండీరాణి’ హిందీలో మాత్రం సంధ్యకి భానుమతి గాత్రం వినిపిస్తుంది.
ఆమెలో మంచిహాస్యం, వ్యంగ్యం, చమత్కారం వున్నాయి. అవన్నీ కలగలిపి ఆమె ‘అత్తగారి కథలు’ రాశారు. అవి బహుళ ప్రసిద్ధి పొందాయి. ఆ రచనకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘విప్రనారాయణ’కు సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకుడయినా, భానుమతి- ‘సంగీత పర్యవేక్షణ’ అంటూ తనపేరు వేసుకున్నారు. తాను పాటలకి స్వర కల్పన చేసినా, రికార్డింగ్‌ మాత్రం సత్యం చేతా, వేణు చేతా చేయించారు. ఆమె నటనా ప్రతిభకు గుర్తింపుగా పద్మశ్రీ (1966) పద్మభూషణ్‌ (2000) 1975లో ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ పుర‌స్క‌రాలు అందుకున్నారు. భానుమతి మూడుసార్లు జాతీయస్థాయి ఉత్తమనటిగా అవార్డులు అందుకున్నారు. తమిళనాట కూడా ఆమె చిత్రాలు విజయదుందుభిని మోగించాయి. అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై భానుమతికి ‘కలైమామణి’ బిరుదును ఇచ్చి సత్కరించడం విశేషం. తమిళనాట ఆమెను అష్టావధానిగా పిలిచేవారు. ఎందుకంటే అప్పటికే భానుమతి నటిగానేగాక, తన పాత్ర కు తానే పాటలు స్వయంగా పాడుకునేవారు

త‌న కొడుకు భరణిపేరుతో రామకృష్ణ దర్శకత్వంలో చిత్రనిర్మాణం ఆరంభించి ‘రత్నమాల’, ‘లైలామజ్ను’, ‘ప్రేమ’, ‘చండీరాణి’, ‘చక్రపాణి’, ‘విప్రనారాయణ’, ‘చింతామణి’, ‘వరుడుకావాలి’, ‘బాటసారి’, ‘వివాహబంధం’, ‘గృహలక్ష్మి’, ‘అంతా మనమంచికే’, ‘విచిత్ర వివాహం’, ‘అమ్మాయిపెళ్లి’, ‘మనవడికోసం’ ‘రచయిత్రి’, ‘ఒకనాటి రాత్రి’ ‘భక్త ధ్రువ-మార్కండేయ’ త‌దిత‌ర చిత్రాలు నిర్మించారు. ‘చండీరాణి’ని మూడు భాషల్లో నిర్మించారు. భానుమతే డైరెక్టు చేశారు. అలా తెలుగులో మొదటి దర్శకురాలుగా పేరు తెచ్చుకున్నారు. ‘వరుడు కావాలి’, ‘అమ్మాయిపెళ్లి’, ‘మనవడి కోసం’, ‘రచయిత్రి’, ‘ఒకనాటి రాత్రి’, ‘భక్తధ్రువ-మార్కండేయ’ చిత్రాలకి కూడా ఆమెనే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దాదాపు 200కు పైగా చిత్రాలలో నటించిన భానుమతి మూడుతరాల నటులతో పనిచేసిన ఆమె ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణతో “మంగమ్మగారి మనవడు” చిత్రంలో నటించడమేగాక, ఆ చిత్రంలో టైటిల్‌ రోల్‌ను కూడా పోషించారు.

తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతీ రామకృష్ణ 2005వ సంవత్సరం, డిసెంబర్ 24వ తేదీన చెన్నైలోని తన స్వగృహంలో శాశ్వ‌తంగా కన్నుమూశారు. ఆ మహానటి అనంత దూరాల‌కు వెళ్లిపోయినా.. ఆమె గళం నుంచి జాలువారిన గీతాలు, చేసిన చిత్రాలు ఎప్పటికీ అజరామరంగా నిలిచే ఉంటాయి.
(సెప్టెంబ‌ర్ 7న‌ భానుమ‌తి రామకృష్ణ జ‌యంతి)

– దాస‌రి దుర్గా ప్ర‌సాద్‌