ఖ‌మ్మం… సుర్యాపేట జిల్లాల వ‌ర‌ప్ర‌దాయ‌నిగా మున్నేరు-పాలేరు లింక్ కానెల్‌

తెలంగాణ

* 50-60 టీఎంసీల వ‌ర‌ద జ‌లాల స‌ద్వినియోగం…

* రూ.162.54 కోట్ల‌ను మంజూరు చేసిన ప్ర‌జా ప్ర‌భుత్వం

* ఎన్నెస్పీ ప‌రిధిలో 1.38 ల‌క్ష‌ల ఎక‌రాలు, పాలేరు ఎగువ‌న 40 వేల ఎక‌రాల ఆయ‌క‌ట్టు స్థిరీక‌ర‌ణ‌

* ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి….

ఖ‌మ్మం: ఏళ్లుగా బంగాళా ఖాతం పాల‌వుతున్న మున్నేరు వ‌ర‌ద జ‌లాల‌ను ఒడిసిప‌ట్టి ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్టు స్థిరీక‌ర‌ణ చేసేందుకు ప్ర‌జా ప్ర‌భుత్వం న‌డుంబిగించింది. మున్నేరు నుంచి పాలేరుకు గ్రావిటీ ద్వారా నీటిని మ‌ళ్లించి బంగారు పంట‌లు పండించేందుకు వీలుగా కాలువ‌కు రూప‌క‌ల్ప‌న చేసింది. 4,500 క్యూసెక్కుల నీటి స‌ర‌ఫ‌రా సామ‌ర్థ్యంతో నిర్మించ‌నున్న కాలువ నిర్మాణ ప‌నుల‌కు గౌర‌వ ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఏదులాపురం వ‌ద్ద ఆదివారం శంకుస్థాప‌న చేశారు. ఈ కాలువ నిర్మాణానికి రూ.162.54 కోట్ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం మంజూరు చేసింది….

వ‌రంగ‌ల్ జిల్లా పాకాల చెరువు వ‌ర‌ద‌తో ఏర్ప‌డే మున్నేరు న‌ది ఖ‌మ్మం జిల్లాలోని ఖ‌మ్మం రూర‌ల్‌, చింత‌కాని మండ‌లాల మీదుగా ప్ర‌వ‌హించి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌వేశించి ఎన్టీఆర్ జిల్లా మున్న‌లూరు వ‌ద్ద కృష్ణా న‌దిలో క‌లుస్తుంది. ఖ‌మ్మం రూర‌ల్ మండలం తీర్థాల వ‌ద్ద ఆకేరు, బుగ్గ వాగు మున్నేరులో క‌లుస్తాయి. ఈ రెండు వాగుల క‌ల‌యిక‌తో మున్నేరులో ప్ర‌తి ఏటా వానా కాలంలో మున్నేరు ప్ర‌వాహం భారీగా ఉంటుంది. త‌ర‌చూ వ‌ర‌ద‌ల‌తో ఖ‌మ్మం న‌గ‌రంలోని శివారు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. మున్నేరు నుంచి ఏటా సుమారు 50 నుంచి 60 టీఎంసీలు కృష్ణా న‌దిలో క‌లిసి వృథాగా స‌ముద్రం పాల‌వుతున్నాయి. ఈ నీటిని నాగార్జున సాగ‌ర్ ఆయ‌క‌ట్టుకు, పాలేరు ఎగువ‌న ఉన్న ఆయ‌క‌ట్టుకు మ‌ళ్లించి దానిని స్థిరీక‌రించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. ఆ సంక‌ల్పంలో నుంచి పురుడు పుసుకున్నదే మున్నేరు-పాలేరు లింక్ కెనాల్‌…

* ముల్క‌నూర్ చెక్ డ్యాం నుంచి….

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరు గ్రామం వద్ద మున్నేరు నదిపై ఉన్న ప్రస్తుత చెక్‌డ్యామ్ నుంచి నీటిని మళ్లించి పాలేరు లింక్ కాలువకు తరలిస్తారు. మున్నేరు నది ప్రవాహ స్థాయి పాలేరు లింక్ కాలువ బెడ్ లెవెల్ కంటే సుమారు 4 మీటర్లు ఎక్కువగా ఉంది. ఈ మున్నేరు–పాలేరు లింక్ కాలువ పూర్తిగా గ్రావిటీ ఆధారితం. ఈ గ్రావిటీ కాలువ పొడవు 9.600 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కాలువ పనులకు ప్రభుత్వం G.O. Rt. No. 98తో 2025, మే 17వ తేదీన రూ.162.54 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ కాలువ ప్ర‌వాహ సామ‌ర్థ్యం 4,500 క్యూసెక్కులు.

* ప‌థ‌కంతో ప్రయోజనాలు

మున్నేరు పాలేరు లింక్ కెనాల్ పూర్త‌యితే ఖమ్మం జిల్లా ప‌రిధిలో పాలేరు రిజర్వాయర్ దిగువన నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు ప‌రిధిలోని 1.38 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోని పాలేరు రిజర్వాయర్ పైభాగంలో ఉన్న 40 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది. పాలేరు రిజర్వాయర్ ద్వారా భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం (DBM–60) ద్వారా SRSP దశ–II (ఖరీఫ్) పరిధిలోని 76,308 ఎకరాల ఆయకట్టుకు అదనపు నీటి సరఫరాకు అవ‌కాశం క‌లుగుతుంది. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో గ్రామీణ తాగు నీటి స‌ర‌ఫ‌రాకు 4.70 టీఎంసీలు కేటాయిస్తారు. ఈ ప‌థ‌కం పూర్త‌యితే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పరిధిలో ప్రభుత్వం చెల్లిస్తున్న విద్యుత్ వ్యయం ప్ర‌తి ఏటా సుమారు రూ.120 కోట్ల మేర త‌గ్గిపోతుంది. అలాగే పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న హైడెల్ ప్లాంట్‌లో 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్య‌మ‌వుతుంది.