ఆదర్శాలు, ఆశయాలు, అభ్యుదయాలు అన్నీ ఆడ-మగ విభజన దగ్గర తేలిపోయేవేనని తన ప్రయాణం ప్రారంభంలోనే గ్రహించింది ఓల్గా. ఆ గమనింపే ఆమె గమనాన్ని నిర్దేశించింది. తన గమ్యాన్ని సూచించింది. ఆ పై ఎన్ని అవరోధాలు, అవమానాలు, వ్యక్తిత్వ హననాలు రుచి చూసినా బెదరలేదు. వెనుతిరగలేదు. అవన్నీ – స్త్రీ సొంత ఆలోచనను నిరోధించే రాజకీయమని గుర్తించింది. కనుకే first of its kind అనిపించే అనేక రచనలకు ఆద్యురాలయింది.
ఎనభైయవ దశకంలో అప్పుడప్పుడే పాశ్చాత్య ఫెమినిజం ఉద్యమాన్ని అర్థం చేసుకుంటున్న ఆధునిక రచయితలలో ఒకరైన ఓల్గా – స్త్రీ వాదం అసమసమాజాన్ని అర్థం చేసుకునే ముఖ్యమైన పరికరంగా భావించింది. అదే ఆమె దృక్పథానికి తోడయ్యింది. ఆమె సాహిత్య ప్రస్థానం అంతా దానికే కట్టుబడి సాగింది.
సమాజం మంచి చెడ్డల తూకం వేస్తుంటుంది. మగువ ఎప్పుడూ మంచి వైపే ఉండాలంటుంది. మంచి వైపు త్రాసు మొగ్గాలంటే కావలసిన లక్షణాలను సమాజం నిర్దేశించి ఉంచుతుంది. ఆ నిర్దిష్టత ప్రకారం నడుచుకున్నంత సేపూ మంచి. నిర్దేశాల్లో ఇమడలేనప్పుడు, చెడ్డది. ఈ కండీషనింగ్ నిశ్శబ్దంగా, స్త్రీ జీవితంలో అలవాటుగా మారిపోయినతనాన్ని ధ్వంసం చేస్తుంది ఓల్గా తన రచనల్లో.
మనుషుల్లో భాగమైన ఒక సముదాయాన్ని, స్త్రీలు గా ఎలా వేరు చేశారో వారి దేహనిర్మాణం – దాని చుట్టూ అల్లిన రాజకీయం వారిని ద్వితీయ తరగతి గా ఎట్లా అసుంట జరిపిందో మూలం నుంచి తెలియజేస్తాయి ఈమె కథలు. స్త్రీ ని సమాజం మనిషిగా కాక దేహంగా గుర్తిస్తుంది. రచయిత ఆ దేహభాగాలనే కేంద్రంగా ‘రాజకీయ కథలు’ గా మలిచి సమాజానికి షాక్ ఇచ్చింది. షాక్ కి కారణం – ఈ కథల్లోని పాత్రలు, వస్తువులు ఎక్కడో ఊహాకాల్పనిక లోకాల్లోవి కావు. అత్యంత సామాన్యమైన జనజీవితాల్లో భాగమైనవి. స్త్రీలు-పురుషులు అనే రెండు యూనిట్ లుగా మనుషులను కుటుంబమే ఎలా విడదీస్తుందో, కుటుంబమే స్త్రీలను ఎట్లా తయారు చేస్తుందో పునాదుల నుంచీ వివరిస్తాయి ఓల్గా రచనలు. అంతేకాక ఈ పరిస్థితి నుంచి బయటపడి స్త్రీలు వెన్నెముకతో ఎట్లా నిలబడాలో కూడా చెప్తాయి.
అప్పటి వరకూ సిద్ధాంతాలుగా, మేధావుల ప్రసంగాల్లో భాగంగా, అభ్యుదయ ఎజెండాల్లో అంశాలుగా పరిగణించే విషయాలను – సాధారణ ప్రజల దైనందిన జీవితాల్లో ఎలా ఆచరణలో పెట్టాలో చెప్పటం మొదలెట్టారు ఓల్గా. జండర్ విధానం గురించీ, సమానత్వ సాధన గురించీ స్త్రీలలో స్పృహ కలిగించే రచనలు చేశారు. అందుకోసం స్త్రీ యే మెలకువ కలిగి ఉండడం, ఒకడుగు ముందుకు వేయటం గురించీ మాట్లాడాయి. కుటుంబంలో బంధాల మధ్య ప్రజాస్వామికత ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. ‘సహజ’, ‘స్వేచ్ఛ’, ‘మానవి’ లాంటి నవలలన్నీ అలాంటి ఆచరణ గురించే మాట్లాడాయి. పితృస్వామ్య పునాదుల్ని కదిలించేస్తున్న రచనలవి అని అర్థం అవుతున్న కొద్దీ ఆమె రచనలపై అనేక చర్చలు జరిగాయి. అవి రాళ్ళైనా, ముళ్ళైనా ఆమె గమనాన్ని ఆపలేదు. కానీ, మనుగడలో ఉన్న పురుషాధిపత్య వ్యవస్థకు సవాలుగా నిలబడాలనుకోలేదు ఓల్గా. స్త్రీ పురుష సంబంధాల్లో – అధికారం స్థానంలో స్నేహం, అహంకారం స్థానంలో ప్రజాస్వామికత ఉంటే కుటుంబం తద్వారా సమాజం సమభావంతో విలసిల్లుతుందని అవగాహన కలిగించేందుకే అహరహం ప్రయత్నం చేసింది. అందుకోసమే స్త్రీ వాదం పనిచేస్తుందని అర్థం చేయించే ప్రయత్నం చేస్తూనే ఉంది.
సాహిత్యంలో ఏ ప్రక్రియ ఎంచుకున్నా-కవిత,కథ,వ్యాసం, నాటకం, నృత్యరూపకం ఏ కళారూపమైనా తన ధృక్పథాన్ని ప్రకటించేలా నిర్మిస్తుంది. అది చదువుతున్న పాఠకుల్లో, చూస్తూన్న ప్రేక్షకుల్లో ఓ ఆలోచన రేకెత్తిస్తుంది. ఓ మెలకువ కలిగిస్తుంది.
________________
స్త్రీలూ మనుషుల్లో భాగం అనీ, మానవ హక్కులు అంటే అవి స్త్రీలకు కూడానని, ప్రాథమిక హక్కుల మీద హక్కు పౌరురాలిగా స్త్రీ కీ ఉంటుందని ఓల్గా రచనల ద్వారా తేలికగా అర్థం చేయించింది. స్త్రీ సాధికారత గురించి, లైంగిక శ్రమ విభజన అవసరం, పునరుత్పత్తి విధానంలో సమాజాన్ని నిర్వచించాల్సిన బాధ్యత వంటి సిద్ధాంతపరమైన అంశాలనూ తన కథల ద్వారా సరళంగా సామాన్యుల్లో ఇంజెక్ట్ చేయగలిగింది.
________________
ఇంకా సులభతరం చేసేందుకు, పురాణపాత్రలను వెంటతెచ్చుకుంది. సీత, శూర్పణఖ, ఊర్మిళ, అహల్య, మండోదరి, శబరి, యశోధర వంటి ప్రసిద్ధి చెందిన పురాణపాత్రలను కాస్త కాల్పనికతను జోడించి స్త్రీ వాదం దృక్పథానికి అనుగుణంగా పునర్నిర్మించడంలో సఫలమైంది. ‘స్వేచ్ఛ’ అంటేనే పలకరాని పదంగా మలిచిన లోకానికి స్వేచ్ఛ అంటే బాధ్యత అని తెలిపే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంది.
ఎన్ని పోరాటాలు చేసినా, స్త్రీలపై సమాజంలోనూ, కుటుంబంలోనూ అణచివేత కొత్త రూపాల్ని సంతరించుకుంటూనే ఉంది. స్త్రీలపై హింస పెరుగుతూనే ఉంది. దాంతోపాటు స్త్రీలు ప్రశ్నించటమూ పెరుగుతోంది. దాంతో మళ్ళీ పాత నీతుల్లోకే స్త్రీలను మళ్ళించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇది స్త్రీ పురోగమనానికి ప్రమాద సంకేతం. ఈ సమయంలో ఓల్గా లాంటి వారి రచనల దృక్పథాన్ని అధ్యయనం చేయాలి.
ఓల్గాకు రచనా వ్యాసంగం ఒక విలాసం కాదు. రచన తన బాధ్యతగా, సామాజిక అవసరంగా భావించిన ఓల్గా గారి నాలుగు దశాబ్దాల సాహితీ ప్రయాణం – స్త్రీవాద సాహిత్యానికి ఓ చిరునామా.

-ఫణిమాధవి కన్నోజు
76598 34544
