ఏ ప్రక్రియ అయినప్పటికీ పది కాలాల పాటు నిలబడే అంశాలు కవులు రచయితలు ఎంచుకోవాలి.
పురాణపండ అన్న ఇంటిపేరు వినగానే మనకు స్పురించే వ్యక్తి ఉషశ్రీ గారు. వారి కుమార్తెగా, ఉపాధ్యాయురాలిగా కెరీర్ ప్రారంభించి, సాక్షి దినపత్రికలో సాహిత్య విభాగంలో సుదీర్ఘకాలం పనిచేసి, ఎందరో ప్రముఖులతో ముఖా-ముఖీలు నిర్వహించి సాహిత్యంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శ్రీమతి పురాణపండ వైజయంతితో ఈ వారం కరచాలనం.
మీ బాల్యం విద్యాభ్యాసం క్లుప్తంగా చెప్పండి?
ఊహ తెలిసిన దగ్గర నుంచి బాల్యమంతా నాన్నగారితోనే గడిచింది. పోతన భాగవత పద్యాలు, రామాయణంలోని సన్నివేశాలు ముఖ్యంగా కబంధుడు, విరాధుడు కథలు ఆసక్తికరంగా చెప్పేవారు. అమ్మ కూడా రుక్మిణీ కల్యాణం, గజేంద్ర మోక్షం పద్యాలు చదువుతూ వంట చేసేది. అందువల్ల అవి కూడా చిన్నతనంలోనే కంఠోపాఠం అయ్యాయి. చదువు విషయానికి వస్తే, ఇంటర్మీడియట్‌లో లెక్కలు, డిగ్రీలో ఇంగ్లీషు, పి.జి.లో తెలుగు చదివాను. మా నాన్న గారైన ఉషశ్రీ రచనల మీద ‘ఉషశ్రీ రచనలు – సమగ్ర పరిశీలన’ పేరున పి.హెచ్‌డి. రాజమండ్రి బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశాను.
తెలుగు భాషపై ఆసక్తి మీ నాన్నగారి వల్లనేనా? ఆయన మీకు ఇంట్లో ఏమి చెప్పేవారు?
తెలుగు భాష మీద ఆసక్తి పూర్తిగా నాన్నగారి వల్లనే కలిగింది. తప్పులు లేకుండా మాట్లాడటం చిన్నతనం నుంచి అలవాటు చేశారు. ఎక్కడ అక్షర దోషం వచ్చినా సరిచేసేవారు. చిన్నతనంలోనే అంటే పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే ‘వేయిపడగలు’ చదవమని ఇచ్చారు. అలాగే రాజాజీ రామాయణం కూడా చదివించారు. ఇంకా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి చిన్నకథలు, మల్లాది రామకృష్ణశాస్త్రి గారి కథలు, అమరావతి కథలు, ఇలా మంచి సాహిత్యాన్ని మాత్రమే చదవటం నాకు అలవాటు చేశారు. మేం నేర్చుకున్నదంతా సాహిత్యమంతా నాన్నగారి దగ్గర నేర్చుకున్నదే.
మీరు అధ్యాపకులుగా పనిచేసి జర్నలిస్ట్ అయ్యారు. ఆ అనుభవం ఎలా ఉంది?
అధ్యాపకులుగా పనిచేసిన అనుభూతి ఎన్నటికీ మరువలేము. విద్యార్థులు ఏ దేశంలో ఉన్నా గురువును మరచిపోలేరు. నిష్కల్మషమైన మనసులతో ఉండే విద్యార్థుల మధ్య గడపటం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అన్ని విషయాల మీద పరిజ్ఞానాన్ని పెంచుకోవటానికి జర్నలిజం ఎంతో ఉపయోగపడుతుంది. మహానుభావులు, మేధావులతో మాట్లాడే అవకాశం జర్నలిస్టుకి మాత్రమే లభించే అరుదైన అవకాశం.
మీరు సాక్షి దినపత్రికలో చేసిన సాహిత్య కృషి గురించి చెప్పండి?
నన్ను నేను తెలుసుకోవడానికి, సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవటానికి, సాక్షి దిన పత్రిక ప్రధాన కారణం. అందుకు నేను సాక్షికి సర్వదా కృతజ్ఞురాలిగా ఉంటాను. ఆ పత్రికలో పని చేస్తున్న రోజులలో, డా.బాలాంత్రపు రజనీకాంతరావు, పాలగుమ్మి విశ్వనాథం, రావు బాలసరస్వతి, బుజ్జాయి, వేదాంతం సత్యనారాయణ శాస్త్రి వంటి ప్రముఖులతో సంభాషించే అదృష్టం కలిగింది. అంతేకాకుండా అనేక ఆధ్యాత్మిక అంశాల మీద వ్యాసాలు వ్రాయటం కోసం డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, డా.ఎన్.అనంత లక్ష్మి వంటి వారితో మాట్లాడి, జ్ఞానాన్ని పొందే అదృష్టం వరించింది. వృత్తిరీత్యా ఎంతో మంది సినీ ప్రముఖులతో మాట్లాడి అనేక వ్యాసాలు రచించాను. అందులో నేను మరచిపోలేనివారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, ఎస్.పి.బాలు గారు, కె.విశ్వనాథ్ గారు, కమలాకర కామేశ్వరరావుగారి కుమార్తె లక్ష్మి, నిర్మలమ్మ గారి కుమార్తె కవిత, సూర్యకాంతం గారి కుమారుడు పద్మనాభమూర్తి ఇంకా ఎంతో మంది ప్రముఖులతో సంభాషించి అనేక వ్యాసాలు రాశాను. మరో ముఖ్య అంశం ఏమిటంటే, యూట్యూబ్ స్టార్స్ పేరున యువతరం తీసిన షార్ట్ ఫిల్మ్స్ దర్శకుల గురించి సుమారు వంద వారాల పాటు శీర్షిక నిర్వహించాను. రామాయణాన్ని చిన్న చిన్న ప్రశ్నలు సమాధానాల రూపంలో సాక్షిలో శీర్షిక నిర్వహించాను. దానిని ‘‘ప్రశ్నోత్తర రామాయణం’’ పేరున పుస్తకంగా ప్రచురించాను. భారతం కూడా చేయాలనుకుంటున్నాను. ఇటువంటివి అనేకం చేయటానికి సాక్షి నాకు మంచి అవకాశం కల్పించింది. రెండు వృత్తులకు తగిన న్యాయం చేశానన్న సంతృప్తిని పొందానని చెప్పగలను.
మీరు కథలు కూడా వ్రాశారనుకుంటాను. ఆ వివరాలు?
వాస్తవానికి నేను కేవలం మూడు కథలు మాత్రమే రచించాను. బ్రహ్మమాయ (ఆంధ్రజ్యోతి వార పత్రిక), పరామర్శ (స్వాతి వారపత్రిక), అత్తారింటికి దారేది? (సాక్షి ఫన్ డే). ఉషశ్రీ రామాయణం ఆధారంగా ప్రశ్నోత్తర రామాయణం పుస్తకాన్ని ప్రచురించాను.
మీరు భవిష్యత్తులో చేయాలనుకుంటున్న కార్యక్రమాలు?
నాన్నగారి పేరు మీద ‘‘ఉషశ్రీ సంస్కృతి సత్కారం’’ పేరున నాన్నగారి మార్గంలో ఉన్నవారిని సత్కరిస్తున్నాం. ఇంకా నాన్నగారికి సంబంధించిన చాలా పనులు చేయాలనే ఆలోచనలో ఉన్నాను. 1928 లో నాన్నగారు జన్మించారు. 2027 నుంచి 2028 వరకు నాన్నగారి శత సంవత్సర వేడుకలు చేయాలనే సంకల్పంతో ఉన్నాను. దైవ బలం సహకరించాలి. ప్రస్తుతం యూ ట్యూబ్ ఛానల్ ‘‘వ్యూస్’’ ద్వారా తెలుగు ప్రజలందరికీ చేరువయ్యాను. సాక్షి నుంచి పదవీ విరమణ చేసిన తరవాత నేను, మావారు కె.వి.యస్.సుబ్రహ్మణ్యం, ఇద్దరం కలిసి వ్యూస్ పేరున యూ ట్యూబ్ చానల్ ప్రారంభించాం. ఇందులో పెద్దవారితో ఇంటర్వ్యూలు చేస్తున్నాం. అందులో ముఖ్యంగా గరికపాటి నరసింహారావుగారు, చాగంటి కోటేశ్వరరావుగారు, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం (మా గురువులు) గారు, మాడుగుల నాగఫణి శర్మ, సన్నిధానం నరసింహశర్మ, విశ్వనాథ సత్యనారాయణగారి కుమార్తె కనకదుర్గ, హరికధకుడు కోట సచ్చిదానంద శాస్త్రి, బొబ్బిలి రాజా బేబి నాయన, డాల్ఫిన్ అప్పారావు వంటి వారితో పాటు, సినీ రంగానికి చెందిన అరుదైన వారితో ఇంటర్వ్యూలు చేస్తున్నాం. ముఖ్యంగా ఆర్జీవీతో చేసిన ఇంటర్వూ ్య సెన్సేషన్ అయింది. మా చానల్‌లో గాసిప్స్ కాని, చెడుకి సంబంధించిన ప్రశ్నలు కాని ఉండవు.
వర్ధమాన కవులు రచయితలకు మీరిచ్చే సందేశం/సలహాలు?
ఎవరికీ సందేశం కాని సలహాలు కాని ఇచ్చేంత పరిజ్ఞానం నాకు లేదని అనుకుంటున్నాను. కాని ఒక పాఠకురాలిగా మాత్రం ఒక్క మాట చెప్పగలను. కవిత్వం అంటే అందమైన, అర్థవంతమైన పదాలను మాత్రా ఛందస్సులో రచించగలిగితే ఆ కవిత్వం కలకాలం నిలబడుతుంది. అలాగే కథలు, వ్యాసాలు, విమర్శలు యిలా ఏ ప్రక్రియ అయినప్పటికీ పది కాలాల పాటు నిలబడే లాంటి అంశాలు ఎంచుకుంటే బావుంటుందని నా అభిప్రాయం. వాస్తవానికి కవి నిరంకుశుడు. తనకు నచ్చిన అంశాన్నే వ్రాస్తాడు. ఆ నిరంకుశత్వంలో నిజాయితీ ఉంటే బావుంటుందనేది నా అభిప్రాయం.
– డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య