పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి
‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి నియామక పత్రాల అందజేత
హైదరాబాద్: కేసీఆర్ ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పినట్లుగా, ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆదివారం ఏర్పాటు చేసిన ’కొలువుల పండుగ’ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి నియామక పత్రాలను అందజేశారు. వివిధశాఖల్లో ఉద్యోగాలు పొందిన వారికి సిఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగం అంటే బాధ్యత మాత్రమే కాదని, అదొకఉద్వేగమని పునరుద్ఘాటించారు. మూడేళ్ల క్రితం నియామక పత్రాలు ఇవ్వకపోవడాని కారాణం ఏమిటని నిలదీశారు. దేశాన్ని నడిపించేదే ఇంజనీర్లు అని, వారు దేశానికి వెన్నముక అని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని, ఇంజనీర్ల కృషి, గొప్పతనం ఈ సమాజానికి చాలా అవసరమని పిలుపునిచ్చారు. 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్ నూతనంగా ఉద్యోగంలో చేరే వారి చేతుల మీదుగా నిర్మాణం కాబోతున్నాయని, ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ నిర్మాణం కాబోతున్నాయి. 55 కిలోమీటర్ల మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబెడతామని సూచించారు. మార్పు రావాలని, కాంగ్రెస్ గెలవాలన్న ఆలోచనతో ఆనాడు తాను చేపట్టిన ’విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్’కు అందరూ మద్దతిచ్చారని గుర్తు చే శారు. సంవత్సరాల కొద్దీ వాయిదా పడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలకు తమ మంత్రివర్గం పరిష్కారాన్ని చూపించిందని, 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చి వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూసే విధంగా చేశామని వివరించారు. ఈ నెల 9న సాయంత్రం 4గంటలకు ఎల్‌బి స్టేడియంలో 11,063 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించబోతున్నామన్నారు. తెలంగాణ ఉద్యమం అనే ముసుగు వల్లనే కెసిఆర్ ఎన్నో ఏళ్లు గౌరవం పొందారని, మొన్నటి వరకు ఆయన పొందిన గౌరవం తెలంగాణ ఉద్యమం ఘనతేనని, ఆయన గొప్పతనం కాదని విమర్శించారు.
మూసీని ప్రక్షాళన చేస్తాం
ఎంతోమంది తమ పిల్లలకు గంగ, యమున, కావేరి లాంటి నదుల పేర్లు పెట్టారని, కానీ మూసీ పేరును ఏ తండ్రి అయినా తమ కుమార్తెకు పెట్టుకున్నారా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ అంటే మురికి కూపమనే పేరు స్థిరపడిందన్నారు. ప్రజలు నిరాశ్రయులు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గంధమల్లు రిజర్వాయర్ల నిర్మాణంతో ఎవరి భూములూ పోలేదా? అని ప్రశ్నించారు మల్లన్నసాగర్ పేరుతో రైతులను బలవంతంగా ఖాళీ చేయించారన్నారు. మూసీ నిర్వాసితులకు మంచి స్థలంలో ఆశ్రయం కల్పిస్తామన్నారు.
