దేశంలో చట్టసభల గౌరవం తగ్గుతోంది..!

ఎడిటోరియల్ హోమ్

అధ్యక్షతరహా ప్రజాస్వామ్యాన్ని కాదని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మన (జాతి నిర్మాతలు)దేశం ఎందుకు ఎంచుకుందంటే?.చర్చలు, ప్రశ్నలు, జవాబులతో కార్యనిర్వహక వర్గాన్ని చట్టసభలను జవాబుదారీ చేయాలనే సదుద్దేశం దాగి ఉంది. దీనివల్ల ప్రజా ప్రతినిధుల ద్వారా నిర్మాణాత్మక అధికారం పౌరులందరి చేతుల్లో ఉంచబడుతుంది. ఈమధ్య మన దేశంలోని పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులు అమాయకుల ప్రాణాలు తీసినప్పుడు పాకిస్తాన్ పై యుద్ధ సన్నద్ధత కోసం మన పాలకులు అఖిలపక్ష సమావేశం జరిపినారు. దానికి ప్రధాని గైర్హాజరు కావడం గమనార్హం. ఆ తర్వాత నాలుగు రోజుల్లో యుద్ధం మరియు ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ విషయాన్ని పరాయి పాలకులు(ట్రంప్) “ఎక్స్”లో ప్రకటించడంతో మన ప్రభుత్వం దానికి అనుగుణంగా విరమించింది. ఈ పరిణామం భారతీయుల ఆత్మగౌరవానికి, సార్వభౌమాధికారానికి భంగం కలిగించినట్లు భావిస్తున్నారు. పాక్ తో యుద్ధం చేయడానికి అఖిలపక్షం, కాల్పుల విరమణ ఏకపక్షమా! అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ను అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టడానికి అఖిలపక్ష ఎంపీలతో ప్రతినిధి బృందాలను పంపడంలో ఉన్న శ్రద్ధ, పార్లమెంటును సమావేశపరిచి యుద్ధానంతర పరిణామాలను తెలియపరచడంలో లేదా!. గతంలో 1962,1971 ఇండో-పాక్ యుద్ధ సమయాల్లో సభకు ప్రతిదీ గత ప్రభుత్వాలు వివరించిన విషయం వాస్తవం కాదా!, నేడు వెనకాడడం ఎందుకు. భారత పునర్నిర్మాణం కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధ పాలన కోసం ఎంతో ముందు చూపుతో దీన్ని ఎంపిక చేసుకున్నారు. అమలులో ఉదాసీనత ప్రజా ప్రభుత్వాలకు మంచిది కాదు. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు ప్రతి ఏటా విరివిగా భేటీ కావాలి. రాజ్యాంగ విలువలే గీటురాళ్లుగా ప్రభుత్వాల పనితీరును అవి నిష్పాక్షికంగా సమీక్షించాలి. పాలకుల తప్పులను ఎండగడు (తూర్పారబడు)తూ ప్రజాసేవలో నాణ్యత, చిత్తశుద్ధి పెంపునకు దేశ ఆత్మగౌరవానికి, సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లకుండా సూచనలు అందించాల్సి ఉంది. పార్లమెంట్, అసెంబ్లీలలో ప్రజా సమస్యలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు గళమెత్తుతూ వాటి పరిష్కారానికి కృషి చేయడం వారి ప్రధాన కర్తవ్యం. కానీ చట్టసభలు మొక్కుబడి (నామమాత్రం)గా సమావేశం అవుతుంటే? ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతలను ఎలా నిర్వహించగలరు!. మన దేశంలో చట్టసభలు సమావేశం అయ్యే రోజులు నానాటికీ తగ్గిపోతున్నాయి. అంతేకాదు, ఉద్దేశపూర్వకంగా అంతరాయం కల్పించడం సంఖ్యాబలంతో చర్చలు జరపకుండానే ఏక పక్షంగా బిల్లులు ఆమోదించుకోవడం మూలంగా మన దేశ చట్టసభల గౌరవ మర్యాదలు అడుగంటి పోతున్నాయి. మనదేశంలో మొదటి లోకసభ వార్షిక సగటు పని దినాలు 135 రోజులు అయితే, 17వ లోకసభ (2019-24)కు వచ్చేసరికి అవి 55కు పడిపోయాయి. చట్టసభల భేటీ సంఖ్య తగ్గి పోవడం పై స్పీకర్ల సదస్సు (ఏఐపీఓసీ) గతంలోనే ఆందోళన చెంది, ఇవి సాలీనా ఎన్ని రోజులు సమావేశం కావాలో నిర్దేశిస్తూ రాజ్యాంగ నిబంధనలను రూపొందించాలని 1993 “ఏఐపీఓసీ” తీర్మానించింది. ఆ మేరకు 70 మంది కంటే తక్కువ సభ్యులు ఉన్న అసెంబ్లీ ఏడాదికి కనీసం 50 రోజులు కొలువుదీరాలని, మిగిలిన రాష్ట్రాల చట్టసభలు 90 రోజులు నడపాలని సంధాన సమీక్ష సంఘం (జస్టిస్ వెంకటాచలమయ్య) కమిషన్ సిఫారసు చేసింది. ఆ మేరకు రాజ్యసభ 100, లోకసభ 120 రోజులపాటు బేటీ కావాలి. కానీ ఈ సూచనలేవి అమలు కాకపోవడంతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. దీనితో ప్రభుత్వాలపై చట్టసభల పర్యవేక్షణతో పాటు పాలనలో పారదర్శకత అడుగంటి పోతుంది. చట్టసభల భేటీ తగ్గిపోవడంతో పాటు, అనవసర వాగ్వివాదాలతో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కాలాన్ని వృధా చేస్తున్నారు. నిశిత చర్చలు లేకుండానే మంద బలంతో చట్టాలు ఎన్నో ఆమోదించుకొని ప్రజాప్రయోజనాల్ని ,శ్రేయస్సును గాలికొదిలేసి నాయకు(పార్టీ)లు అధికారానికి సాగిలపడి వ్యక్తి పూజతో విలువైన సమయాన్ని, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు..

మనదేశంలోని శాసనసభల భేటీ కాలం.. పని వేళల సగటు 20 రోజులే.. 500 బిల్లులకు ఆమోదం అంటూ (పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రిసెర్చ్ సంస్థ) అధ్యయనం ఈ విషయాన్ని తెలియజేసింది. వివరాల్లోకి వెలితే.. మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాసనసభలు గత సంవత్సరం సగటున 20 రోజులు 100 గంటలు మాత్రమే పని చేశాయి. ఆ కాలంలో 17 బిల్లులను ఆమోదించాయి. వీటిలో 51శాతం బిల్లులు ప్రవేశపెట్టిన ఒక్కరోజు వ్యవధిలోనే ఆమోదం పొందాయి. ఒడిశా శాసనసభ 42 రోజులు, కేరళ శాసనసభ 37 రోజులు, పశ్చిమబెంగాల్ శాసనసభ 36 రోజులు పనిచేసి కొంత మెరుగనిపించాయి. కర్ణాటక శాసనసభ ఏడాదికి 60 రోజులు సమావేశం కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ, కేవలం 29 సీటింగ్స్ మాత్రమే జరిగాయి. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఏడాదికి 90 సీటింగ్స్ జరపాలని అనుకుంటే, కేవలం 16 సమావేశాలతోనే సరిపెట్టింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ కూడా 16 రోజులే సమావేశమైంది. మణిపూర్ లో 14, జమ్ము కాశ్మీర్ 5, నాగాలాండ్ 6, సిక్కిం లో 8 రోజులపాటు శాసనసభ సమావేశాలు జరిగాయి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనసభలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమావేశం కావాల్సి ఉంటుంది. కానీ ఒకటి రెండు రోజులు స్వల్పకాలిక సిట్టింగ్లతో కలిపి 11 రాష్ట్రాల్లో ఈ నియమాన్ని పాటించారు. 2017 నుంచి ఏడాదికి సగటున 30 రోజుల కంటే తక్కువగా సమావేశాలు జరిగాయి. ఆ సమయంలో 28 సీటింగ్స్ జరిగాయి. 2020లో కోవిడ్ కాలంలో ఆ సంఖ్య 16 కు పడిపోయింది. అప్పటినుంచి సగటున ఏడాదికి సుమారు 20 రోజుల పాటే సమావేశాలు జరిగాయి. 2018లో సగటున 26 సీటింగ్స్, 2019లో 24 సీటింగ్స్, 2021లో, 22లో 21 సీటింగ్స్ చొప్పున, 2023లో 22 సీటింగ్స్ జరగగా గత సంవత్సరం ఆ సంఖ్య 20 కి తగ్గిపోయింది. కొన్ని రాష్ట్రాలు శాసనసభ ద్వారా లేదా నిబంధనలు రూపొందించుకోవడం ద్వారా కనీసం వార్షిక సిట్టింగ్స్ ను నిర్దేశించుకున్నప్పటికీ 2017 నుంచి 2024 మధ్య వాటిలో ఏ రాష్ట్రము లక్ష్యాన్ని చేరలేదని నివేదిక వేలెత్తి చూపింది. గత సంవత్సరం శాసనసభలు సగటున 100 గంటలు సమావేశం అయ్యాయి. కేరళ అత్యధికంగా 228 గంటల పాటు సమావేశం నిర్వహించగా, ఒడిస్సా 193 గంటలు, మహారాష్ట్ర, రాజస్థాన్ 187 చొప్పున, గోవా 172, ఛత్తీస్ గడ్ 155, తెలంగాణ 149, కర్ణాటక 145 (గంటలు) తర్వాత స్థానాల్లో నిలిచాయి. బిల్లులకు సంబంధించి సగటున ప్రతి శాసనసభ 17 బిల్లులను ఆమోదించింది. గత సంవత్సరం మొత్తం మీద 500 బిల్లులు ఆమోదం పొందాయి. 49 బిల్లులతో కర్ణాటక మొదటి స్థానంలో నిలువగా, తమిళనాడు 45, హిమాచల్ ప్రదేశ్ 32, మహారాష్ట్ర 32 తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ శాసనసభ కేవలం ఒకే బిల్లును ఆమోదించగా, రాజస్థాన్ అసెంబ్లీ రెండు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇలా భారతదేశ స్వాతంత్ర్య అనంతరం ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధ పాలనలో ప్రజాప్రతినిధుల పాత్ర?చట్ట సభల నిర్వహణ భేటీ తగ్గి పోతుంటే! ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించబడతాయి. కీలక సందర్భాల్లో సైతం ప్రజాభిప్రాయాలు వెల్లడి చేసుకునే అవకాశం లేకపోవడం, వ్యక్తి ఆరాధన, పార్టీల సొంత ఎజెండా కోసం ప్రజా కాలాన్ని వృధా చేస్తూ నిశిత చర్చలు లేకుండానే చట్టసభలు ముందుకెళ్లడం భావ్యమా!. ప్రజాసామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడంతో ప్రజాస్వామ్య వ్యవస్థ పై ప్రజల నమ్మకం తగ్గుతుందని విశ్లేషకులు, నిపుణులు భావిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా నిర్థేశించుకున్న మేరకు చట్ట సభలను నిర్వహించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

 

మేకిరి దామోదర్,
సోషల్ ఎనలిస్ట్,
9573 666650