నేల వాసన, మౌన తిరుగుబాటు – పులికంటి కృష్ణారెడ్డి కథల సామాజిక సాక్ష్యం

సాహిత్యం హోమ్

పులికంటి కృష్ణారెడ్డి తెలుగు సాహిత్యానికి గంభీరతను, మట్టి వాసనను అందించిన విశిష్ట రచయిత. రాయలసీమ జీవన వాస్తవాలు, అక్కడి మనుషుల మానసిక నిర్మాణం, కుల ప్రాతిపదికన జరుగుతున్న ఘోరాలు, ఎండిపోయిన నేలలోనూ మొలిచే మానవత్వం – ఇవన్నీ ఆయన రచనల ప్రధాన బలాలు. రాయలసీమ అనగానే కరువు, హింస మాత్రమే కాదు; అక్కడి అంతర్లీన సంస్కారం, ఆత్మగౌరవం, మౌన విప్లవం కూడా పులికంటి కథల్లో స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ఆయన కథలు ప్రాంతీయమైనప్పటికీ సార్వజనీనతను సంతరించుకున్నాయి.
___________________

రాయలసీమ కథా సాహిత్యాన్ని ఒక స్పష్టమైన దశగా, సాహిత్య ఉద్యమంగా గుర్తిస్తే, ఆ గుర్తింపుకు కేంద్రబిందువు పులికంటి కృష్ణారెడ్డి. ఆయన రాయలసీమ మాండలికంలో కథలు రాసిన మొదటి వ్యక్తి మాత్రమే కాదు, ఆ మాండలికాన్ని కథ యొక్క మౌలిక శక్తిగా నిలిపిన తొలి కథకుడు. ఆయన రచనల్లో అనవసరమైన భావావేశాల ప్రదర్శన, వాక్య విస్తరణ, కృత్రిమ సౌందర్యం ఉండవు. కానీ, ప్రతి వాక్యంలో బరువు, ప్రతి మౌనంలో ఒక అర్థం ఉంటుంది.
______________________

పాత్ర చిత్రణ – మౌనమే ఆయుధం

పులికంటి కథల్లోని పాత్రలు రాయలసీమ మనిషి యొక్క లోతైన రూపాలు. పల్లెల్లో సర్వసాధారణంగా కనిపించే రైతులు, కూలీలు, చిన్న భూస్వాములు, వలస కార్మికులే ఆయన కథా నాయకులు. వీరి మాటల్లో ఆత్మగౌరవం, అలవాటైన భాష, మాటల మధ్య మౌనం కనిపిస్తాయి. ఆ మౌనమే పులికంటి కథలకు అత్యంత బలమైన ఆయుధం. రచయిత ఎక్కడా పాత్రలను తీర్పు చేయడు, భావోద్వేగాలను నడిపించడు. పాత్రలు తమ చర్యల ద్వారా, మాటల ద్వారా తమ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకుంటాయి. ఇక్కడే పులికంటి కథలు రాయలసీమ సాహిత్యానికి ఒక కొత్త దిశను చూపాయి.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పులికంటి కవిగా, నాటక రచయితగా కూడా ప్రసిద్ధులు. ‘నాలుగ్గాళ్ళ మండపం’, ‘ఆట వెలదుల తోట’ వంటివి ఆయన ముఖ్య రచనలు. మానవీయ కోణంలో, ముఖ్యంగా దళిత నేపథ్యంతో కథలు రాసిన తొలి తరం రచయితలలో ఆయన ఒకరు. ‘కొమ్ములు’, ‘పులిగుండు’, ‘కాణిపాకం వినాయకుని సాక్షిగా’ వంటి దళిత నేపధ్య కథలలో అగ్రవర్ణాల ముసుగులో దళితులు పడుతున్న పాట్లు, వారి దారుణమైన బతుకు పోరాటాలు, ఎదుర్కొంటున్న ఘోరాల్ని పాఠకుల కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు.

‘కొమ్ములు’ – సామాజిక సమీకరణాల జాతర: “కొమ్ములు” కథలో పైన కనిపించేది “నంది గంగమ్మ జాతర”. కానీ లోపల దాగి ఉన్నది గ్రామ సామాజిక నిర్మాణం. ఇది కుల విభేదాలను, నాయకత్వ మాయాజాలాన్ని, భక్తి–అంధభక్తి మధ్య గీతను చూపించే అద్భుత కథాఖండం. జాతర ఒక సామూహిక వేడుక మాత్రమే కాదు; అది గ్రామ సమాజపు చరిత్ర, ఆధిపత్య పోటీలు, భయం – అన్నింటి కూడలి. రచయిత జాతరలోని ఏకత్వాన్ని వర్ణిస్తూనే, ‘సముద్ర జలాలతో చక్కెర తయారు చేయవచ్చని నమ్మినా… ఏడూళ్లు ఏకమయ్యాయంటే నమ్మశక్యం కాదు’ అన్న వ్యాఖ్యతో గ్రామ రాజకీయాల గాఢతను వ్యక్తపరుస్తారు.

ఈ కథలో ‘కొండారెడ్డి మామ’ పాత్ర అత్యంత ఆసక్తికరమైనది. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక రహస్య శక్తి. రచయిత ఆయన గురించి ప్రత్యక్షంగా వ్యాఖ్యానించకుండా, ఇతరుల మాటల ద్వారా ఆయన ప్రభావాన్ని చూపిస్తారు. గొడవలు జరిగినప్పుడు ఆయన తర్కం చెప్పడు, ‘ఆ తల్లి కన్నెర్రజేసింది’ అని భక్తిని మధ్యవర్తిగా పెట్టి శాంతి నెలకొల్పుతాడు. అంటే, భక్తిభయాలను సామాజిక నియంత్రణ సాధనంగా వాడటంలో ఆయన దిట్ట. రచయిత మామ నవ్వును చాలా సున్నితంగా చిత్రించారు. అది అమాయకత్వమా లేక కుట్రనా అనేది పాఠకుడి నిర్ణయానికే వదిలేస్తారు.

కథలో మరో కీలక మలుపు హరిజనులు, అరుంధతీయులు కలిసి డప్పులు కొట్టడం. ఇది గాంధీజీ ఉద్యమాల కంటే గొప్పగా అనిపించినా, ఆ ఏకత్వం చాలా బలహీనమైనదని రచయిత చూపిస్తారు. చరిత్రాత్మక విభజనలు ఒక జాతరతో తొలగిపోవని, అవి ఉపరితలంపై కప్పబడి లోపల మిగిలే ఉంటాయని ఆయన హెచ్చరిస్తారు. ఇక్కడ వాడిన మాండలికం కథకు ప్రాణం పోసింది. “ఏరా అల్లుడూ!”, “గమ్మునుండండ్రా!” వంటి పదాలు ఆ ప్రాంతపు ఉద్వేగాలను సహజంగా పలికిస్తాయి. మాండలికం ఇక్కడ అలంకారం కాదు, అది కథ యొక్క ఆత్మ.

‘పులిగుండు’ – సత్యం పలికే ఎత్తు:

‘పులిగుండు’ కేవలం ఒక గ్రామీణ కథ కాదు, అది గ్రామ జీవితపు మానసిక చరిత్ర. ఒక గుండు చుట్టూ తిరిగే కథలా కనిపించినా, ఇందులో సత్యం, సామాజిక న్యాయం, అధికార దుర్వినియోగం వంటి అంశాలు ఇమిడి ఉన్నాయి. పులిగుండు ఇక్కడ సాహసానికి పరీక్షాస్థలం, అహంకారానికి బలి వేదిక. జగన్నాధుడు ప్రేమ వల్ల గుండెక్కితే, బాలిగాడు సత్యం పలకడానికి గుండెక్కుతాడు. ఇదే కథ యొక్క కేంద్రీయ విభేదం.

ఈ కథలో రంగవల్లి పాత్రలోని ద్విగుణ స్వభావం, ఆమె కూతురు రాణెమ్మ సాహసం పాఠకుడిని ఆలోచింపజేస్తాయి. ముత్యాలమ్మ జాతర వర్ణన ద్వారా అగ్రకులాల అధికార ప్రదర్శనను, భయ సంస్కృతిని రచయిత అద్భుతంగా చిత్రించారు. కథలోని బాలిగాడు పిచ్చివాడా లేక సమాజం పిచ్చిదా అనే సందేహం కలుగుతుంది. కోర్టులో నిజం చెప్పలేకపోయిన వాడు గుండెక్కి ‘నేను కాదు గుండెక్కింది నిజం!’ అనడం కథలోనే అత్యంత శక్తివంతమైన ఘట్టం. తక్కువ జాతి వాడికి నేల మీద నిజం చెప్పే హక్కు లేదనే చేదు నిజాన్ని ఈ ప్రతీక ద్వారా రచయిత ఎత్తిచూపారు. ఇది కేవలం కథ కాదు, ఒక గ్రామ సామాజిక విచారణ పత్రం.

‘కాణిపాకం వినాయకుని సాక్షిగా’ – ఆకలి, అన్యాయం:

ఈ కథ మంగ అనే స్త్రీ ఎదురుచూపుతో మొదలవుతుంది. ఆమె ఆవేదన కేవలం భర్త కోసమే కాదు, ఆ ఇంటి ఆకలి కోసం. కట్టెల మోపు కోసం అడవికి వెళ్ళిన భర్త కోసం ఆమె పడే ఆరాటం పేదరికపు బీభత్సాన్ని చూపిస్తుంది. ఆకలి ఇక్కడ ప్రధాన శక్తి; అది మాటలను కఠినం చేస్తుంది, గొడవలకు దారితీస్తుంది. కానీ ఆ గొడవల్లో కూడా మంగ చూపించే ప్రేమ ఆ కుటుంబపు గట్టి బంధానికి నిదర్శనం.

ఈ వ్యక్తిగత పోరాటం మధ్యలో అంకిరెడ్డి అనే ప్రభావశీలి పాత్ర ప్రవేశిస్తుంది. అతని చెల్లెలి చర్య వల్ల ఒక దళితుడు ప్రాణాలు కోల్పోవడం కథ యొక్క నైతిక కేంద్రం. అంకిరెడ్డి నేరుగా కత్తి పట్టకపోయినా, అతని మౌనం అన్యాయానికి సహకారం అందించినట్లే అవుతుంది. ఒక వర్గానికి చెందిన మనిషి ప్రాణం ఎంత తేలికగా తీసుకోవచ్చని భావించే సామాజిక నిర్మాణం ఇక్కడ బయటపడుతుంది. మంగ ఆరాటం మనసును కదిలిస్తే, దళితుని మరణం మనసాక్షిని ప్రశ్నిస్తుంది. ‘కాణిపాకం వినాయకుని సాక్షిగా” అనే శీర్షికలోనే ఒక ధర్మ సంకటం ఉంది. ఇది పేదరికపు వేదన మాత్రమే కాదు, కుల అసమానతపై ఒక నిశిత వ్యాఖ్య.

మాండలిక విశిష్టత మరియు శిల్పం:

పులికంటి కృష్ణారెడ్డి కథల్లో మాండలికం కేవలం భాషా రూపం కాదు — అది కథ యొక్క శ్వాస. రచయిత ప్రామాణిక తెలుగును వదిలి రాయలసీమ మాండలికాన్ని ఎంచుకోవడం ద్వారా కథకు సహజత్వం, స్థానిక వాతావరణం, పాత్రల అంతర్ముఖ జీవితం అన్నీ ఒకేసారి అందించారు. మాటలలోని కఠినత్వం, నిటారుతనం, సూటితనం ఆ ప్రాంత జీవన శైలిని ప్రతిబింబిస్తాయి. “మీరు గమ్మునుండండ్రా!” అనే వాక్యాన్ని సాధారణంగా “మీరు నిశ్శబ్దంగా ఉండండి” అని రాస్తే వచ్చే ఉత్కంఠ వేరుగా ఉంటుంది. మాండలికం కోపం, ఆవేశం, అవమానం, గర్వం — ఇవన్నింటిని సహజంగా వ్యక్తం చేస్తుంది.
___________________

ఈ కథలు కేవలం సంఘటనల రికార్డులు కావు, ఇవి ఒక ప్రాంత భాషా సంస్కృతికి దస్తావేజులు. మాయమవుతున్న పలుకుబడులు, స్థానిక రూపాలు సాహిత్య రూపంలో నిలిచిపోయాయి. ఇలాంటి ప్రయోగాల వల్ల పాఠకుడు సంఘటనలను చదవడు, అనుభవిస్తాడు. పులికంటి కథన శైలిలో రచయిత వ్యాఖ్యానించడు, తీర్పులు ఇవ్వడు. పాత్రల ప్రవర్తన ద్వారానే సామాజిక రుగ్మతలను ఎత్తి చూపుతాడు.
______________________

సాహిత్య సామాజిక బాధ్యత: పులికంటి కృష్ణారెడ్డి కథల్లో దళితులకు జరిగిన అన్యాయాలు కేవలం యాదృచ్ఛిక సంఘటనలు కావు, అవి సామాజిక నిర్మాణంలోని లోపాలు. ఆయన కథలు ఏ న్యాయస్థాన తీర్పునూ ఇవ్వవు; కానీ పాఠకుని మస్సాక్షిని న్యాయమూర్తిగా నిలబెడతాయి. మౌనం వెనుక దాగిన ఆధిపత్య పోకడలను, దోపిడీ తత్వాన్ని బట్టబయలు చేస్తూ, అణగారిన వారి ఆత్మగౌరవాన్ని ప్రకటించడమే ఈ రచనల ప్రధాన ధ్యేయం.

బాధ ఎవరికి? బాధ్యత ఎవరిది? న్యాయం ఎక్కడ? — ఈ ప్రశ్నలకు సమాధానం వెతకమని పాఠకుడిని ప్రేరేపించడమే పులికంటి సాహిత్య లక్ష్యం. దళితుని రక్తం నేలలో కలిసిపోదు, అది నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సింది ఈ సమాజమే.

పులికంటి కృష్ణారెడ్డి తన రచనల ద్వారా రాయలసీమ మట్టి పరిమళాన్ని, అక్కడి మనుషుల జీవన వేదనను తెలుగు సాహిత్య చరిత్రలో అజరామరంగా నిలిపారు.

 

-మహాసముద్రం దేవకి
99632 95997