కాలదోషం పట్టని వస్తుస్పృహే శివకుమార్ కథల బలం

సాహిత్యం

సాహిత్య జీవన షష్టిపూర్తిని జరుపుకున్న శ్రీ పి.వి.ఆర్. శివకుమార్ తెలుగు పత్రికాలోకంలో బహుళ ప్రాచుర్యాన్నీ, అత్యధిక పాఠకాదరణనూ పొందిన ప్రముఖ కథకులు, నవలాకారులు.

72-82 మధ్య, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో అనేక నాటికలు, కథలు, పూలజల్లు వంటి కార్యక్రమాలు, ఈనాడు దినపత్రికలో టూకీగా శీర్షిక, ఆదివారం అనుబంధంలో వ్యాసాలు, మినీ కథలు, సితార వ్యాసాలతో పాటు, సినిమా సమీక్షలు విరివిగా వచ్చాయి. విపులలో యాభై దాకా వివిధ భాషల అనువాద కథలు వచ్చాయి.

అలనాటి ఆంధ్రపత్రిక మొదలుకొని, ఈనాటి స్వాతి సపరివార పత్రిక, సహరి, పాలపిట్ట, జాగృతి, విశాలాక్షి, ఉషా, విశాఖ సంస్కృతి, విశాఖ సాహితి మొదలైన పత్రికలలో నలభై మూడు కథలకి బహుమతులు వచ్చాయి.కొన్ని కథలు కన్నడ భాషలోకి అనువదించబడి, మయూర, ప్రియాంక, తరంగ పత్రికలలో ప్రచురితమయ్యాయి.

‘అవ్యక్తరాగం’ శివకుమార్ గారి ఐదవ కథాసంపుటిలోని 25 కథల్లోనూ పుష్కలమైన వస్తు వైవిధ్యాన్ని చూస్తాము. ఆ వైవిధ్యంలో అనంతమైన నవ్యత కనిపిస్తుంది.

కొడుకు షష్టిపూర్తి జరపాలనే గోప్యంగా వుంచిన ఆకాంక్షతో కుటుంబసభ్యులు అందర్నీ తన దగ్గరికి రప్పించుకుని ఆ పండగను ఘనంగా, అత్యంత ఆర్థంగా, ఆత్మీయంగా జరిపిస్తాడు తండ్రి. కథ పేరు ‘ఆల్బమ్ లో ఆఖరిచిత్రం’. తండ్రి అనైతికంగా దారితప్పి తిరుగుతున్నాడు ‘అసంబద్ధ చిత్రం’ లో. కొడుక్కు కడుపు రగిలి, వెళ్ళి ఆయనను వలలో వేసుకున్న మహిళను ప్రశ్నలతో ఢీకొంటాడు. ఆమె అంటుంది, ‘ఇక్కడికి రావద్దని చెబితే, మీ నాన్న ఇంకెక్కడికైనా వెళతాడు గానీ, తన వ్యసనం వదులుకోడురా వెఱ్ఱివాడా?!’ అని. ‘తను ఆమె ఇంటికి వెళ్లి, నిలదీసి తప్పుచేశానా?’ అన్న ప్రశ్న అతన్ని వెంటాడుతూ వుంటుంది! ముగ్గురు మహిళల మధ్య మైత్రీ బంధాన్ని ఎంతో సహజ సుందరంగా అత్యంత ఆర్ద్రతతో చిత్రించిన కథ ‘వినిపించిన గుండె చప్పుడు’. భార్యాభర్తలు తమ మధ్య అనురాగబంధం తాత్కాలిక నిరసనలతో, పొరపొచ్చాలతో తెంపుకోరనే వాస్తవిక సూత్రాన్ని కథాత్మకం చేశారు ‘అవ్యక్తరాగం’ కథలో. సాంఘికంగా ఎంతో వాంఛనీయతని సంతరించుకొన్న ఉత్తమ కుటుంబ సంబంధమైన కథ ఇది.

మహిళా చైతన్య స్ఫూర్తికి అద్దంపట్టే కథలు ‘మూగబొమ్మ’, మగబుద్ధి వికృతిని చెప్పిన ‘ముళ్ల కంప’, ‘నీడను గెలిచిన మనిషి’ వంటివి. రాజకీయ చాతుర్యంతో ప్రజల సొమ్ము మింగటం అలవాటైన తర్వాత, ఆ రోగం పోదు. కథ పేరు ‘ఈ ఇల్లు ఎవరిదే చిలకా?’ ఆత్మన్యూనత, అపరాధ భావన పర్యవసానాన్ని ‘తన కుడ్యజాల రంధ్రాలు కథ’ చూపింది. స్వయం ఉపాథి అవకాశాల్ని ఉన్నతీకరించిన కథ ‘కొంగునున్న కొలుపు’.

_________________

ఈ సంపుటిలో అత్యుత్తమోత్తమ కథలు రెండు వున్నాయి. అవి ‘పితృదేవుడు’, ‘నాలుగు చేతులు-ఓ బుల్లి నోరు’. ఆకలి తీవ్రతను గుర్తించి ఎదుటివారికి సహాయం చేసేవారి ఔదార్యానికి కథారూపాన్ని ఈ రెండు కథల్లో అనన్యసామాన్యంగా శిల్పభరితం చేశారు శివకుమార్. తెలుగు కథా సాహిత్యాన్ని ఆరాధించే ప్రతిపాఠకుడినీ చేరవలసిన కథలు ఇవి. సంకలనాలు తెచ్చే వారి దృష్టికి రావలసిన కథలు.

_________________

సంపుటిలో కరోనా సంబంధమైన కథలూ వున్నాయి. వలస కూలీల వెతలకు ఆదరణనందించినవారి మంచితనం చిత్రితమైంది. శివకుమార్ కి పాఠకుల్ని రంజింపజేసే కథాకథన రహస్యం తెలుసు- ‘ముళ్లకంప’ లాంటి కథల్లో పోషింపబడిన ఉత్కంఠ భరితమైన కథనం – దీనికి నిదర్శనం.

సంపుటిలోని కథలలో ఎక్కువ భాగం ఉత్తమపురుష కథనంలో సాగినవి. అలాగే టెక్నిక్ దృష్ట్యా ‘నేడు-నిన్న-నేడు’ సరళిలో నడచిన కథనాలు. కథాశిల్పంలో ఎత్తుగడ ప్రాధాన్యం ఎక్కువ. ఇతివృత్తాన్ని ఉత్కంఠ ప్రేరకం చేయటానికి ఎత్తుగడ ప్రముఖపాత్ర. ‘నెలరోజులపైనే అవుతోంది తార ప్రవర్తనలో చంద్రశేఖర్ ఆ మార్పు గమనించి!’ అంటూ మొదలవుతుంది ‘ముళ్లకంప’ కథ. ఏమిటా మార్పు అనే ఉత్సుకత చదువరిని కథా పఠనంలో ముందుకు నెడుతుంది!

శివకుమార్ రచనలోని గుణవిశేషాల్లో ఒక మెరుపు-వాక్య నిర్మాణం ద్వారా సంఘటనని సూచించటం, కథని శిల్పాన్ని పోషించటం. ఉదాహరణకి ‘వినిపించిన గుండెచప్పుడు’ కథలో సహప్రయాణీకురాలు తన గురించి ఏదో చెబుతోంది. అక్కడ కథ నడకని చూడండి: “మౌనంగా విని ఊరుకుంది సునంద. ఆమె మనసునిండా శమంత ఉన్నదిప్పుడు. ఈ లోకాన్ని ఖాళీచేసింది గనుక, మరే బాదరబందీ లేదన్నట్టు వచ్చి, సునంద మనసులోనే తిష్టవేసుకుంది!” ఈ అభివ్యక్తిలో మిత్రసాన్నిహిత్యం అనిర్వచనీయమైన అనుభూతినందిస్తూ, ఆకుచాటు పిందెలా కనిపిస్తున్నది!. ఇలా, చాలా కథల్లో పాత్రల అంతరాత్మల్ని స్పర్శిస్తూ చేసిన వర్ణనలు ఉన్నాయి.

శివకుమార్ గారి జీవితానుభవం, సాహిత్య జీవితానుభవం రెండూ – విస్తృతమైనవి. కనుక, ఆయనకు మనుషుల గురించీ, సమాజం పోకడ గురించీ బాగా తెలుసు. వారి జీవితాల్లో నుంచీ దొరికే కథాంశాన్ని కథగా మలిచే ‘ఆల్కెమీ’ తెలుసు! అన్నిటికీ మించి కథలో ఏది చెప్పాలో, ఎంత చెప్పాలో తెలుసు. ఏది చెప్పకూడదో ఖచ్చితంగా తెలుసు! అందుకనే ఆయన కథలు అరవైఏళ్లుగా పాఠకుల్ని అలరిస్తున్నాయి. ఈ ‘అవ్యక్తరాగం’ అలాంటి పఠనానందాన్నిచ్చే మరో సంపుటి!

-విహారి
98480 25600