పలు ప్రక్రియలు అధ్యయనం చేయడం ద్వారా విద్యార్ధుల్లో ఆత్మధైర్యం చేకూరుతుంది
డా.కె.కరుణశ్రీ నెల్లూరు దొడ్ల కౌసల్యమ్మ కళాశాలలో తెలుగు శాఖకు అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. కళాశాల విద్యాభ్యాస సమయంలో స్వర్ణపతకం సాధించారు. కవితలు, వ్యాసాలు వారి నిత్య వ్యాసంగం. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్న అనుభవం వారి స్వంతం. డా.కె.కరుణశ్రీ గారితో ఈ వారం కరచాలనం.
మీ బాల్యం విద్యాభ్యాసం?
నేను నెల్లూరు జిల్లాలో ఉన్న సంగం అనే గ్రామంలో జన్మించాను. నేను వాస్తవానికి ఐదవతరగతి వరకూ పాఠశాలకు వెళ్ళి చదువుకోలేదు. ఇంట్లోనే ఉండి చదువుకున్నాను. స్కూలు అలవాటు కావడం కోసం నేను 3 వ తరగతి నుండి 5 వరకూ దగ్గరలో ఉన్న ఒక ప్రైవేటు స్కూలుకు వెళ్ళాను. 6వ తరగతి నుండి 10 వరకూ సంగం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నా విద్యాభ్యాసం సాగింది. తరువాత ఇంటర్, డిగ్రీ నెల్లూరు దొడ్ల కౌసల్యమ్మ మహిళా కళాశాలలో చదివాను. ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను. ఎం.ఫిల్., పిహెచ్.డి., ఆచార్య కె.కె.రంగనాథాచార్యులుగారి పర్యవేక్షణలో పూర్తి చేశాను. నేను చదివిన కళాశాలలోనే తెలుగు శాఖ అధ్యక్షురాలిగా చేయడం ఎంతో ఆనందంగా ఉంది.
మీకు తెలుగుభాషపై ఆసక్తి ఎలా కలిగింది?
తెలుగు మాతృభాష కావడం వల్లనో లేక సులభంగా ఒక్కసారి చదవగానే బోధపడడం వల్లనో మరి తెలియదు. చిన్నప్పటినుండి తెలుగు సబ్జక్ట్ అంటే బాగా ఆసక్తిగా ఉండేది. చిన్నప్పుడు చందమామ, బాలమిత్రతో మొదలై కొంచెం పెద్దయ్యాక ఆంధ్రజ్యోతి, పత్రిక వంటి వారపత్రికలు, ఈనాడు వంటి దినపత్రికలు మొదలునుండి చివరివరకూ వదలిపెట్టకుండా చదివేదాన్ని. ఆ ఆసక్తితో డిగ్రీ నుండి తెలుగంటే ఒక ప్రత్యేకమైన అభిమానంతో చదవడం, క్రొత్త విషయాలు నేర్చుకోవడం, ప్రాచీన, ఆధునిక అన్న భేదం లేకుండా అన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేయడం వంటివి ప్రారంభం అయ్యాయి.
మీ రచనల వివరాలు?
నేను వృత్తిరీత్యా తెలుగు బోధించడం వల్ల వ్యాసాలంటే అభిమానం ఉండి, ఎక్కువ వ్యాసాలు వ్రాసిన మాట నిజమే! అయితే వచన కవిత్వం కూడా ఇష్టమే. నా వచన కవితలు వివిధ పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. అలాగే కథా సాహిత్యంపై కూడా మక్కువ. కొన్ని కథలను కూడా రచించాను. వీటన్నిటినీ త్వరలో ఒక పుస్తక రూపంలో తేవాలని అనుకుంటున్నాను. ఎం.ఫిల్ సిద్ధాంత వ్యాసం మంగిపూడి వేంకటశర్మగారి మీద, పిహెచ్.డి ఆధునిక కవిత్వంలో సముద్రం అనే అంశంపై సాగింది. ఈ రెండూ గ్రంథాలుగా ప్రచురించాను.
మీరు సాధించిన బహుమతులు వివరాలు?
నేను బహుమతులు అవార్డులకోసం ప్రత్యేకించి దృష్టిపెట్టి వ్రాయడం జరగలేదు. నాకు కళాశాల దశలోనే రావూరి కాంతమ్మ స్వర్ణ పతకం లభించింది. అలాగే హైస్కూలు, కళాశాల విద్యలో ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు తెలుగు సబ్జెక్ట్‌మీద పెట్టిన పోటీల్లో నాకు బహుమతులు వచ్చేవి. ఇక సన్మానాలు, సత్కారాలు అంటారా, వివిధ సందర్భాలలో జరుగుతూనే ఉంటాయి. ఇక్కడకు వచ్చాక జిల్లా స్థాయిలో రెండు, మూడు అవార్డులు రావడం జరిగింది. నేను ఇప్పటివరకూ బహుమతుల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టకుండా వృత్తిలో సీరియస్‌గా కొనసాగుతూ, వివిధ విషయాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు వ్రాస్తూ ఉన్నాను.
తెలుగు సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల ఉపాధికల్పన సాధ్యమవుతుందా?
తప్పకుండా. సాధ్యాసాధ్యాలు మన కృషినిబట్టి కదా ఉండేది. ఇప్పుడు అనేక రంగాలు మనకు లభ్యమవుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. మామూలుగా చదవడం, ఉత్తీర్ణులు కావడం అని కాకుండా, విద్యార్ధి ఆసక్తి, తెలివితేటలు, వక్తృత్వ సామర్ధ్యం, ఒక విషయంపై అలవోకగా వ్యాసం రాసే నైపుణ్యం, యిలా, మనల్ని మనం మార్కెట్ చేసుకునే సామర్ధ్యం అంటే మనల్ని ఋజువు చేసుకునే సామర్ధ్యం ముఖ్యం. తెలుగు వాక్యం మీద పట్టు దొరికితే పత్రికా రంగంలో అనేక అవకాశాలున్నాయి. విద్యార్ధి నిరంతరం సబ్జెక్ట్ పట్ల అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. మీడియా రంగంలో టీవీలలో న్యూస్ రీడర్స్, కంటెంట్ ఎడిటర్స్, రిసోర్సు పర్సన్స్, టీచర్లు, లెక్చరర్లు యిలా అనేకం ఉన్నాయి. తెలుగు సాహిత్యంతో పాటూ సాంకేతిక పరంగా కూడా విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి. తద్వారా తనకున్న సామర్ధ్యాన్ని పదిమందికీ తెలియజేసే దిశగా అడుగులు వేయవచ్చు. ఈ పోటీ ప్రపంచంలో ముందు నిలబడడం చాలా అవసరం. తెలుగు అనే కాదు ఏ ఫీల్డ్‌లో నైనా విద్యార్ధికి ప్రత్యేక సామర్ధ్యాలు ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిష్టించవచ్చని అనుకుంటున్నాను.
ఈ తరం విద్యార్ధులు ఎలా ఉన్నారు?
విచిత్రం ఏమిటంటే ఈ తరం విద్యార్ధులు చూడ్డానికి ఆసక్తి లేనట్టు కనబడతారేమో గానీ లోపల అంతులేని ఆసక్తి ఉంటుంది. అలాగే అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ సాంకేతికత వల్ల మొబైల్ ఫోన్లు వాడ్డం వల్ల అలా అనిపిస్తుంది కానీ, ప్రతి విద్యార్ధికీ లోపల తపన ఉంటూనే ఉంటుంది. అవగాహన చేసుకోవడంలో విద్యార్ధుల్లో కొద్దిగా ముందూ వెనుక అనే తారతమ్యాలుండొచ్చేమో కానీ ఆసక్తి విషయంలో అందరూ శ్రద్ధగానే ఉంటారు. ఈ తరం వాళ్ళు ఇప్పుడున్న సాంఘిక మాధ్యమాల ద్వారా విషయాల్ని అవగాహన చేసుకోవాలన్న ఆసక్తి సహహజంగానే ఎక్కువగా ఉంది. అందరికీ ఇంజినీరింగు రంగంలో అవకాశాలు దొరకవు కాబట్టి ఆసక్తిని బట్టి చదువుకోవాలి. ఎక్కువ శాతం విద్యార్ధులు బాగా చదువుతూనే ఉన్నారని నేననుకుంటున్నాను.
ఇప్పటి విద్యార్ధులకు మీ సలహాలు సూచనలు?
మేము క్లాసు రూములో ఉన్నప్పుడు అనేక జాగ్రత్తలు చెబుతూ ఉంటాం. సలహాలను సీరియస్‌గా తీసుకుని ఫాలో అయ్యేవాళ్ళ శాతం ఎక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. తీవ్ర అధ్యయనం చెయ్యల్సిన అవసరం ఉంది. అనేక కవితలు, కథలు, నవలలు, పద్యాలు యిలా అన్నిరకాలైన ప్రక్రియలను అధ్యయనం చెయ్యడం వల్ల విద్యార్ధికి ఆత్మధైర్యం చేకూరుతుందని చెప్పగలను. కవితలు, కథలు వ్రాయడం అలవాటు చేసుకోమని, అనుకరణలు కాకుండా, రచనల్లో స్వంత ముద్ర సాధించుకోమని చెప్తూ ఉంటాను.
– డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య