విశిష్టమైన పరిశోధన “దమనకాండ”

సాహిత్యం

“కవులు, కళాకారులు, దళిత వీరవనితలు సమాజాన్ని భౌతికంగా మార్చడమే కాదు, మానసికంగా, సాంస్కృతికంగా మార్చిన అనేక తరంగాలు తరంగాలుగా ఈ పుస్తకంలో వెళుతుంటాయి. మనల్ని ఉద్రేక పరుస్తుంటాయి”(కత్తి పద్మారావు, ముందుమాట, దమనకాండ)

‘దమనకాండ’ తెలుగులో “దళిత సంఘటనాత్మక కవిత్వం’’ అన్నది డా॥ బద్దిపూడి జయరావు పరిశోధన గ్రంథం. ఆచార్య జి.యస్‌. భాస్కరరావు పర్యవేక్షణలో పరిశోధించి, ఈ గ్రంథం ద్వారా ఆయన తెలుగు విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌.డి. పట్టా పొందారు. విశ్వవిద్యాలయాలు ఉత్పత్తి చేసే సిద్ధాంత గ్రంథాలలో పదిశాతం మాత్రమే అచ్చయి వెలుగులోకి వస్తాయి. వాటిలో ప్రామాణికత, పఠనీయత ఉన్నవి అయిదు శాతం. జయరావు గారి సిద్ధాంతగ్రంథం ప్రామాణికంగానూ, పఠనీయంగానూ ఉంది. ఈ గ్రంథం నవలలాగా పాఠకుడితో చదివించుకుంటుంది. జయరావు విషయ వివరణ, అందమైన భాష పాఠకులను ఆకర్షిస్తాయి.

తెలుగునాట విభిన్న ప్రాంతాలలో, విభిన్న కాలాలలో దళితులమీద ఆధిపత్య వర్గ సంపన్నులు, భూస్వాములు, అగ్ర కులాలవాళ్ళు జరిపిన మారణకాండలకు నిరసనగా వచ్చిన కవిత్వంమీద పరామర్శ ఈ సిద్ధాంత గ్రంథం. విశ్వవిద్యాలయ పరిశోధకులు గానీ, సాధారణ విమర్శకులు గానీ, ఒక రచయిత, ఒక రచన, ఒక ఉద్యమం, ఒక భావజాలం, ఒక వర్గం, ఒక కులం, ఒక మతం, ఒక జండర్‌, ఒక ప్రాంతం, ఒక సామాజిక రంగం, ఒక సామాజిక సమస్య, ఒక కాలం ఇలా అనేక ప్రాతిపదికలమీద సాహిత్య పరిశోధన చేస్తుంటారు.

జయరావు గారి సిద్ధాంత గ్రంథం మామూలుగానైతే దళిత కవిత్వం మీద జరిపిన పరిశోధన. కాని ఇది జనరల్‌ దళిత కవిత్వ పరిశోధన కాదు. దళితులమీద అనక తప్పదు. జరిగిన అమానుష దాడులకు స్పందనగా వచ్చిన కవితల మీద పరిశోధన. ఇది ఒక ప్రత్యేకమైన స్వభావం గల పరిశోధన. జయరావు కన్నా ముందు డా॥ ఎం.సి. కనకయ్య అనేక సాంఘిక, సాంస్కృతిక సంఘటనల మీద వచ్చిన కవిత్వం మీద పరిశోధన చేశారు. ఆ వరవడిలో జయరావు మరింత నిర్దిష్టంగా తన పరిశోధన చేశారు. 1969-1998 మధ్య మూడు దశాబ్దాలలో తెలుగు నేలమీద దళితులమీద జరిగిన ఏడు హత్యాకాండలు వాటి మీద నిరసనగా వచ్చిన కవితలు ఈ అంశంమీద ఈ పరిశోధన సాగింది.

__________________

ఈ పరిశోధన గ్రంథం చదివితే పాఠకుల మనసు వికలమైపోతుంది. గుండె బరువెక్కుతుంది. మనది ఆధునిక దేశమే కాని మనది నాగరిక సమాజమేనా! మనం మనుషుల మధ్యనే జీవిస్తున్నామా! మనం రాసుకున్న రాజ్యాంగం అమలవుతున్నదా!! శాసన, కార్యనిర్వహణ, న్యాయ, పాత్రికేయ వ్యవస్థలు ఎవరి పక్షాన ఉన్నాయి? మనకు ప్రజాస్వామ్యం జీర్ణమైందా? మన స్వాతంత్ర్య ఉద్యమం సాధించిన ప్రయోజనాలు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయాయి? ప్రపంచ సమాజాల ముందు మన సమాజం తల ఎత్తుకొని తిరగ గలిగే స్థితిలో ఉందా? ఉద్యమాలన్నీ అణచివేతకు, అన్యాయానికి గురికావలసిందేనా? వంటి సవాలక్ష ప్రశ్నలు ఈ పుస్తకంలోకి వచ్చి మన మెదళ్ళలోకి దూరి, మనల్ని డిస్టర్బ్‌ చేస్తాయి.

__________________

ఈ సిద్ధాంత గ్రంథం చదివి డిస్టర్బ్‌ కానివాళ్ళను మనం మనుషులుగా గుర్తించలేం.కంచికచర్ల (1969), కారంచేడు (1985), నీరుకొండ (1987), తిమ్మసముద్రం (1991), చుండూరు (1991), చలకుర్తి (1991), వేంపెంట (1998). ఈ ఏడు గ్రామాలలో మనవత్వాన్ని మంటగలిపే రాక్షసక్రీడలు కొనసాగిన తీరును జయరావు చాలా స్పష్టంగా వివరించారు. ఒక్కొక్క సంఘటన జరిగిన కాలం, ఆ సంఘటనలకు దారితీసిన పరిస్థితులు, ఆ సంఘటనలోని మానవక్రౌర్యం వీటిని ముందు కూలంకషంగా వివరించి, వాటికి ప్రతిఘటనగా పుట్టుకొచ్చిన ఉద్యమాలు, పీడిత దళితజాతిలో కలిగిన చైతన్యం వంటి పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించి, ఆ సంఘటనలకు తెలుగు కవులు స్పందించి నిర్వహించిన కవిత్వరూప సామాజిక బాధ్యతలను విశ్లేషించారు.

రాచరిక వ్యవస్థ పోయి, వలసపాలన ద్వారా భారతదేశంలోని పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రవేశించింది. కానీ, భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత బలపడినా, దాని భూస్వామ్య స్వభావం మాత్రం చావలేదని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. చింత చచ్చినా పులుపుచావని తీరును తెలుగుకవులు ఎలా ఉతికి ఆరవేశారో జయరావు సిద్ధాంత గ్రంథం రుజువుచేసింది.

దళితులమీద దాడులు హఠాత్తుగా జరిగినట్లు కనిపిస్తున్నా, అవి జరగడానికి ఒక సుదీర్ఘకాల సామాజిక పరిణామం ఉంటుంది. అదొక చరిత్ర. జయరావు ఆ చరిత్రను చెప్పడంవల్ల మారిపోయినట్లు కనిపించే మన సమాజంలోని మారనితనం పాఠకులకు అర్ధమౌతుంది. పాలకులు మారుతున్నా పాలన మారడం లేదనేది ఎంత వాస్తవమో జయరావు గ్రంథం మనకు తెలియజేస్తుంది. రాజకీయాలకు, సాహిత్యానికి ఉండే విడదీయరాని సంబంధాన్ని కూడా ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. పోలీసులు ఎంత క్రూరంగా బలప్రయోగం చేస్తారో పీడితులు అంత ధైర్యంగా దానిని ఎదుర్కొంటారన్న వాస్తవాన్ని ఈ సంఘటనలు స్పష్టం చేస్తాయి.

కవులు సమాజం కన్నబిడ్డలు. ‘‘సమాజం కడుపుతో ఉండి, కవిని గన్నది’’ అన్నారు శివసాగర్‌. ‘‘కవిని గన్నతల్లి గర్భంబు ధన్యంబు’’ అన్నారు గుర్రం జాషువ. కత్తి పద్మారావు, గద్దర్‌, వంగపండు ప్రసాద్‌, ఎండ్లూరి సుధాకర్‌, ప్రభాత్‌, బాలకోటయ్య, శంబుక, ఉ.సా. వంటి అనేకమంది సామాజిక కవులు చండ్రగాడ్పులవంటి కవితలు రాశారు. ఈ గ్రంథంలో జయరావు ఉదహరించిన కవితలు ఆధిపత్య దౌర్జన్యవాదులలోని మనిషిలేనితనాన్ని ఎత్తిచూపుతూ, మరోవైపు అయినవారిని పోగొట్టుకున్న వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తాయి. సంఘటనలలోని విభిన్న సందర్భాలను ప్రతిబింబించిన కవితలను సమయోచితంగా ఉదహరించడం జయరావు సాధించిన విజయం.

కంచికచర్ల కోటేశు దహనం నాటికి దళిత చైతన్యం బలహీనంగా ఉంది. ఒక్కొక్క సంఘటన జరిగేకొలదీ దళితుల ప్రతిఘటన బలం పుంజుకున్నట్లే, కవుల స్పందన కూడా ఆ చైతన్యానికనుగుణంగా బలోపేతమైన తీరును జయరావు గ్రంథం ఆవిష్కరించింది.

కవిత్వంలో ఊహకు స్థానం ఉంటుంది. అయితే అది ఒక నిజంను బలంగా చెప్పడానికే. గాలిని మూట కట్టడానికి కాదు. వాస్తవికతను పాఠకునికి చేరవేయడానికి సాధనం ఊహ. బావినీరు పారడానికి కాలువ సాధనం అయినట్లు.

‘‘గాయపడిన చూపు మాట్లాడదు
తూటాలా గుండెల్ని చీల్చుకుపోతుంది
జారిన కన్నీటి చుక్కకు నోరుండదు
ఈటెలకు కలబడే పదునుంటుంది.’’

భువనగిరి నాగరాజు ‘కర్తవ్యం’ కవితలో నిజం ఊహ ఎంత బాగా కలిసిపోతాయో చూడాలి. ఇలాంటి కవితలతో జయరావు తన పరిశోధనకు పదునెక్కించారు.

కట్టేబట్ట తెల్లగుంటె వాని కంట్లో మండినట్లే
కాళ్ళజోడు మెరుపు ఉంటే
వాని కడుపు మండిపోయే

దళితుల శుచీ శుభ్రతను, నాగరికతను చూచి సహించలేని ఆధిపత్య కులాల ఈర్ష్య పట్ల ఆగ్రహపూరిత అధిక్షేపం గోరటి వెంకన్న ‘ఎన్ని సార్లు ఈ ఘోరాలు’ పాటలో ప్రతిధ్వనిస్తుంది.

అట్టుడికిన నా శరీరమంతా
అమ్ములపొది కావాలి
నాగేటి చాళ్ళలో ఒలికిన నెత్తుటి బొట్లన్నీ
బిగి పిడికిళ్ళై మొలవాలి

ఆధిపత్య కులాల మానవక్రౌర్యానికి పరిష్కారం తిరుగుబాటేనన్న ప్రబోధం చెరుకూరి సుధాకర్‌ ‘నెత్తుటిబొట్టు’ కవితలో మూర్తి కట్టింది. ప్రబోధం పేలవమైన వచనం కాకపోవడం విశేషం.

‘‘నన్ను బలవంతాన ఈడ్చుకుపోతున్న
కాలం కళ్ళల్లో కారం జల్లుతున్న’’

పీడిత దళిత మహిళ కోపం ఎలా ముద్ద కట్టుతుందో దరిశె శశినిర్మల (ముట్టుగుడ్డ కప్పుతున్నా) కవితలో ప్రదర్శించారు.‘‘నిచ్చెనమెట్ల నన్ను అడుగుకు నెట్టినచోట/ నిచ్చెనమెట్ల లోకంమీద కత్తిపీట/నూరుతున్నా’’

దళిత కవయిత్రి అభివ్యక్తిలో తెలుగుభాష ఎంత పదునెక్కుతుందో శశినిర్మల చూపినారు. ‘‘మాంసఖండాల జెండాల ఊరేగింపు’’ గుండెలుపిండే అభివ్యక్తి ప్రసాదమూర్తిది. ‘వేంపెంట సందేశం’లో ‘‘కారిన నీ సెమట సుక్కలు గాదెలల్లో గింజలు జేసి’’ శ్రమదోపిడి ఎంత క్రూరమైందో గోరటి వెంకన్న ఒక్క పాదంతో చెప్పారు ఆలీసమ్మ మరణాన్ని ‘‘నిజాయితీని నీతికి నెలవైన/ఆ గుండె నెత్తురు ఆకాశం మీద/నెత్తుటి నక్షత్రమై వెలిగింది.’’..అని ‘ఎర్ర నక్షత్రం’ కవితలో కత్తి పద్మారావు ఒక అక్షర చిత్రంలో చూపించారు.

ఇలాంటి విలువైన కవితలను వెలికితీసి, తెలుగు సమాజంలోని అసమాజికతను తెలుగు కవులు నిబద్ధతతో ఎలా కవిత్వీకరించారో పరామర్శించారు. భారత స్వాతంత్య్రోద్యమ సాహిత్యం మీద, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం సాహిత్యం మీద, శ్రీకాకుళ సాహిత్య పోరాటం మీద, దండకారణ్య ఉద్యమ సాహిత్యం మీద జరిగిన పరిశోధనలు ఎంత విలువైనవో, తెలుగునాట దళితుల ఊచకోత వస్తువుగా వచ్చిన కవిత్వం మీద జయరావు చేసిన పరిశోధన అంత విలువైనది. ఈ ప్రణాళికతో భారతీయ భాషలన్నింటిలో వచ్చిన ఇలాంటి కవిత్వం మీద పరిశోధన జరగాలి.

oplus_34

 

 

డా॥ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
94402 22117