ద్వంద్వ ప్రమాణాలకు తావీయరాదు
‘బ్రిక్స్’ సదస్సులో ప్రధాని మోదీ
మాస్కో :ఉగ్రవాదంపై పోరుకు యావత్ ప్రపంచం ఏకతాటిపై నిలవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీనిపై ద్వంద్వ ప్రమాణాలకు తావీయరాదని పరోక్షంగా చైనా తీరును ఎండగట్టారు. కజాన్‌లో జరుగుతున్న 16వ బ్రిక్స్ సదస్సు ముగింపు సమావేశంలో మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం అనే తీవ్ర సమస్యను కలిసికట్టుగానే ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ఇలాంటి అంశాల్లో ద్వంద్వ ప్రమాణాలు సరికాదన్నారు. ఉగ్రవాదం, ఉగ్రవాదులకు నిధుల సరఫరా అనేవి చాలా తీవ్రమైన సమస్యలు. వీటిని చాలా సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ఇందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలి’ అని మోదీ సూచించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర నేరుగా ఏ దేశం పేరును ప్రస్తావించకపోయినప్పటికీ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌కు చైనా ఆర్థిక సహాయాన్ని ఎండగట్టారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే రాడికలైజేషన్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. యువతను అతివాదులుగా మారేందుకు ప్రేరేపించడాన్ని సమష్టిగా ప్రపంచదేశాలు అడ్డుకోవాలని అన్నారు. అంతర్జాతీయ తీవ్రవాదంపై యూఎన్ కాంప్రహెన్సివ్ కన్వెన్షన్‌లో ప్రస్తావించిన పెండిరగ్ అంశాలపై కూడా అంతా కలిసికట్టుగా పనిచేయాలని సభ్యదేశాలకు మోదీ పిలుపునిచ్చారు. సైబర్ సెక్యూరిటీ అనేది కీలకమని, సైబర్ సెక్యూరిటీ, సేఫ్, సెక్యూర్ ఏఐపై అంతర్జాతీయ రెగ్యులేషన్సపై సభ్యదేశాలు కలిసకట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, డబ్ల్యూటీఓ వంటి గ్లోబల్ సంస్థల్లో కూడా ఎప్పటికప్పుడు సంస్కరణలు తెచ్చేందుకు ముందుకు రావాలని సూచించారు. చర్చలు, దౌత్యానికి భారత్ బాసటగా నిలుస్తుందని, యుద్దానికి కాదని ప్రధాని మరోసారి స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, ఆహారం, నీరు, ఇంధనం, ఆరోగ్యం వంటి అంశాలు అన్ని దేశాలకు ప్రాధాన్యతాంశాలని అన్నారు. ’బ్రిక్స్’ అంటే విభజన గ్రూప్ కాదని, పబ్లిక్ ఇంట్రస్ట్ గ్రూప్ అనే స్పష్టమైన సందేశాన్ని ప్రపంచ దేశాలకు మనం ఇవ్వాలని అన్నారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశంగా కొత్త కొత్తదేశాలకు స్వాగతం పలికేందుకు ఇండియా సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు. అయితే ఇందుకు సంబంధించిన నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బ్రిక్స్ వ్యవస్థాపక దేశాల అభిప్రాయాలను గౌరవించాల్సి ఉంటుందన్నారు. జోహెన్సెస్‌బర్గ్ సమ్మిట్‌లో అంగీకరించిన సిద్దాంతాలు, ప్రమాణాలు, కైట్రీరియా, ప్రొసీజర్‌ను తూచ తప్పకుండా సభ్యదేశాలు పాటిస్తూ ముందుకు వెళ్లాలని దిశానిర్దేశర చేశారు.