పాన్ ఇండియా సినిమాల శకం నడుతున్న ప్రస్తుత తరుణంలో తెలుగు చిత్రాలు, నటులకు పరభాషా అభిమానుల ఆదరణ పెరుగుతుందని సినీనటుడు వడ్డి నాగ మహేష్ అన్నారు. ఖైదీ నంబర్ 150 సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన వరుసగా రంగస్ధలం, గద్దలకొండ గణేష్, ఉప్పెన, అఖండ, సార్, స్కంథ చిత్రాలతో ప్రేక్షకులలో మంచిగుర్తింపు సొంతం చేసుకున్నారు. రచయితగా ప్రయాణం మొదలు పెట్టి నటుడిగా స్థిరపడిన నాగ మహేష్ హనుమాన్ జంక్షన్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో హజరు అయ్యేందుకు వచ్చిన సందర్భంగా ఆయనతో చిట్ చాట్..
ప్రశ్న : తొలి సినిమానే మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం ఏలా దక్కింది?
నాగ మహేష్: నటనపై ఆసక్తితో 1990లో చెన్నై వెళ్లి ప్రయత్నాలు ప్రారంభించా. కానీ ఫలితం దక్కలేదు. దీంతో స్థిరాస్తి వ్యాపారంలోకి వెళ్లిపోయా. ఆ తర్వాత 2016లో ద్వితీయ ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి మొదటి సినిమా ఛాన్స్ వస్తుందని ఊహించలేదు. ఈ విషయంలో చిరంజీవి, దర్శకుడు వి.వి.వినాయక్లకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.
ప్రశ్న: ఇప్పటి వరకూ ఎన్ని చిత్రాల్లో నటించారు?
నాగ మహేష్: నిజానికి ఖైదీ నంబర్ 150 సినిమాలో నటించిన తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. అప్పటి నుంచి ఆసలు వెనుకతిరిగి చూసుకునే అవకాశం దక్కలేదు. ఇప్పటికి సుమారు 50కిపై తెలుగు చిత్రాలలో నటించాను. ప్రసుత్తం మరో ఎనిమిది సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి.
ప్రశ్న: మీరు గుర్తింపు తెచ్చిన సినిమాలు ఏవి?
నాగ మహేష్: ఖైదీ నంబర్ 150లో ఇన్స్పెక్టర్ పాత్ర, రంగస్థలంలో హీరోయిన్కి తాగుబోతు తండ్రిగా, ఉప్పెనలో విజయ్ సేతుపతితో పాటు నటించిన గోవింద్ పాత్రలో నటన ప్రేక్షకులకు దగ్గర చేర్చింది. ఆ తర్వాత గద్దలకొండ గణేష్, అఖండ, సార్, స్కంథ చిత్రాలతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు లభించింది.
ప్రశ్న: ప్రస్తుతం ఏఏ చిత్రాలలో నటిస్తున్నారు?
నాగ మహేష్: సలార్, ఉస్తాద్ భగత్ సింగ్, గేమ్ ఛేంజర్, యురేకా కసామీసా, శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్, రజకార్ చిత్రాలలో నటిస్తున్నాను.
ప్రశ్న: రచయిత నుంచి మళ్లీ నటుడిగా ఎలా మారారు?
నాగ మహేష్: 1996లో నేను రచించిన ‘కొత్తపుంతలు’ తొలి ప్రచురణ జరిగింది. ఆ తర్వాత రచించిన పలు కధలు, నాటికలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఎస్కే మిశ్రో శిష్యరికంలో రంగస్థల నటుడిగా పలు సాంఘిక నాటకాలలో నటించాను. శ్రీవల్లి చిత్రానికి రచయిత విజయేంద్రప్రసాద్ వద్ద సహాయకుడిగా పని చేశారు. నటనపై మొదటి నుంచి ఉన్న ఆసక్తితో మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించాను.
ప్రశ్న: తెలుగు చిత్రాలలో పరభాష నటులకు అవకాశాలు కల్పించటంపై మీ అభిప్రాయం?
నాగ మహేష్: నటనకు భాషా బేధం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల శకం నడుస్తుంది. దీంతో మన తెలుగు నటుటు ఇతర భాషల్లో నటిస్తున్నారు, అలాగే ఇతర భాషాలకు చెందిన నటులకు ఇక్కడ అవకాశాలు దక్కుతున్నాయి. సినిమాకు పాన్ ఇండియా మార్కెటింగ్ కోసం దర్శక, నిర్మాతలు ఆయా ప్రాంతాలకు చెందిన నటీ, నటులను ఎంపిక చేసుకుంటున్నారు. దీని వల్ల తెలుగు నటులకు ఇతర భాషా సినిమాల్లోనూ అవకాశాలు పెరుగుతున్నాయి.
