కొన్ని కథలు నిద్రపుచ్చుతాయి. కొన్ని కథలు నిద్ర మేల్కొలిపి, ఆలోచింపజేస్తాయి. ఆసక్తికరంగా చెప్పడం ఒక కళ. కథను చెప్పేతీరును బట్టి దాన్ని చదవడానికి, వినడానికి, మనం ఇష్టపడతాము. పెద్ద కథలు, చిన్న కథలు, బుల్లి కథలు – రకరకాల కథలు ఇప్పుడు వస్తున్నాయి. కొన్ని కథలు ప్రదర్శనయోగ్యంగా మలచబడి నాటికలుగా, నాటకాలుగా, సినిమాలుగా, టీవీ సీరియళ్ళుగా రకరకాలుగా వస్తున్నాయి. బలమైన కథనుబట్టే వాటికి లభించే ఆదరణ ఉంటుంది.
ఇప్పుడు కథలకు ఆదరణ పెరిగింది. చదివే అలవాటు క్రమంగా తగ్గుతున్నా, శ్రావ్యంగా, దృశ్యంగా ఉండే ప్రక్రియల్లో కథను చెప్పడానికి ఇప్పుడు ఆదరణ పెరుగుతున్నది. ఆలోచింపజేసే కథలైనా, కథనం బాగుంటేనే జనాదరణ పొందుతాయి. భాష సరళంగా వుండటం తప్పనిసరి.
‘అనగనగా’ కథా సంపుటంలోని పదమూడు కథానికల రచయిత కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ రెండు దశాబ్దాలకుపైగా నాకు తెలుసు. కళ్యాణ్ తండ్రి కరణం సుబ్బారావు గారు సామాజిక, చారిత్రకాంశాలపైనా, సాహిత్యంపైనా పరిశోధనాత్మక దృక్పథం కలిగిన వ్యక్తి. బలమైన వ్యాసాలను వ్రాశారాయన. అవి చిన్న పుస్తకాలుగా వెలువడి పెద్ద చర్చకు దారితీశాయి. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసిన ఆయనకు విప్లవ దృక్పథం కలిగిన కవి, రచయిత వెలుగు వెంకట సుబ్బారావు గారు సన్నిహిత మిత్రుడు. ఆ ఇద్దరి పేర్లు సుబ్బారావే కావడం యాదృచ్ఛికం. కళ్యాణ్ కృష్ణ కుమార్ వీరిద్దరినీ సన్నిహితంగా చూసినవాడు. పైగా నాకు తెలిసినంతవరకు – కరణం సుబ్బారావు గారు తన కుమారుడు జీవితంలో ఫలానా వృత్తినో, ఉద్యోగాన్నో చేపట్టాలని కోరుకోలేదు. కళ్యాణ్ అభిరుచులే,తను చేసిన కృషే తనని ఒక జర్నలిస్టుగా, పత్రికామాధ్యమంలో, టీవీ మాధ్యమంలోనూ నడిపించాయి. కవితలు, కథల రచయితగా కూడా కొన్ని అడుగులు వేయించాయి. ఆ అనుభవ జ్ఞానమే అతడి చేత ఈ కథానికలను రచింపజేసింది. కనుక నిద్రపుచ్చే కథలను గాక, చదువరులను ఆలోచింపజేసే కథలనే ఒక సంపుటంగా మనముందుకు తెస్తున్నాడీ రచయిత. తన తొలి ప్రయత్నంలోనే తెలుగు నేలపై ఇరవయ్యేళ్ళుగా సాగుతున్న మాతృ భాషోద్యమంలో నాతో కలిసి నడిచిన పై ఇద్దరు సుబ్బారావు గార్ల ప్రభావం కొంతైనా ఈ రచయిత మనోఫలకంపై వుండి ఉండవచ్చు.తాను కూడా భాషోద్యమంతో సంబంధాన్ని కొనసాగిస్తుండటం వల్ల నాకూ సన్నిహితుడయ్యాడు కళ్యాణ్.
కనుక ఈ రచయిత కలం నుండి జాలువారిన కథల్లో భాషోద్యమం వైపు చదువరులను ఆలోచింపజేసే రచనలు కూడా సహజంగానే చోటుచేసుకున్నాయి. వాటిలో రెండు మూడు కథానికలను ‘అమ్మనుడి’ పత్రికలో ప్రచురించాం కూడా.
ఇంకా మన సమాజంలో నెలకొన్న మరికొన్ని సమస్యలను గురించి కూడా చదువరులచేత ఆలోచింపజేసే కథానికలను కళ్యాణ్ వ్రాశాడు.
మానవ సంబంధాలు, తరాల మధ్య పెరుగుతున్న దూరం, దేశభక్తి, వలస బ్రతుకుల వెతలు వంటి సమస్యలపై మనసులను కదిలించే కథల్ని ఇందులో మీరు చదువుతారు. మన కళ్ళెదుట అనుభవంలోకి వస్తున్న వాటినే కథావస్తువులుగా చేసుకుని, వాటికి ఉపమానాలను, విశ్లేషణలను జోడించి, ప్రాణం పోసుకున్న శిల్పాలుగా వాటిని చదువరుల ముందుంచిన నేర్పరి ఈ కథానికల రచయిత కళ్యాణ్. చదివేకొద్దీ మరింత ఆసక్తిదాయకంగా ఉండి, చదువరులను లోబరుచుకుని, ఊహించని ముగింపుతో ఈ కథానికలు చాలా కాలం మనకు గుర్తుండిపోతాయి.
ఏ పనికిమాలిన కాలక్షేపపు ఊహలలోనో తేలియాడకుండా, పదుగురి శ్రేయస్సును కోరుకునే స్వభావం కలవాడు గనుక – మున్ముందు ఈ రచయిత నుండి ఇంకా ఎన్నో మంచి కథలను మనం ఆశించవచ్చు. ప్రాచీనతలోంచి ఆధునికతలోకి దూసుకుపోతున్న తెలుగుజాతి నడకలోకి, ఇంకా బలంగా చూపు సారిస్తే ఎన్నో విభిన్న అంశాలు కథావస్తువులుగా ఈ రచయిత ఎదుట నిలబడతాయి. ఆ దిశగా ఇంకా బలమైన ముందడుగులు వెయ్యాలని రచయితని కోరుచున్నాను.
– డా.సామల రమేష్ బాబు
‘అమ్మనుడి’సంపాదకుడు,
98480 16136