మృతుల్లో ఒకరు తెలంగాణ వాసి
న్యూఢిల్లీ : భారీ వర్షం కారణంగా సెంట్రల్ ఢిల్లీలోని ఓ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వచ్చిన వరద నీరు వల్ల ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను తెలంగాణకు చెందిన తన్య సోని, కేరళ ఎర్నాకుళంకు చెందిన నవీన్ దాల్విన్, ఉత్తర్‌ప్రదేశ్ అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేష్‌పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ ఘటనపై 24 గంటల్లోగా విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఢిల్లీ రెవెన్యూ మంత్రి అతిశీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని ఎక్స్ వేదికగా అతిశీ పేర్కొన్నారు.
విద్యార్థులు మృతి ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. చిన్నపాటి వర్షాలకే వరదలు ముంచెత్తుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని 12 రోజుల క్రితమే కౌన్సిలర్‌కు తెలియజేశామని పేర్కొన్నారు. వారు వెంటనే చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. దీనికి కౌన్సిలర్, ఇతర ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.