జన సేనకు 20 ఏనా..
ఎన్నికల నోటిఫికేషన్ రాకపోయినా ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభం అయింది. వైసీపీలో ఇంచార్జ్ ల మార్పు పైన సీఎం జగన్ కసరత్తు ముమ్మరం చేసారు. టీడీపీ, జనసేన తమ తొలి జబితా విడుదలకు సిద్దమయ్యాయి. తాజాగా చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో సీట్ల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, సీట్ల ఖరారు వేళ అనూహ్య ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. సీనియర్లకు సైతం సీట్లు గల్లంతు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారనేది ఇప్పటి వరకు అధికారికంగా స్పష్టత రాలేదు. కానీ, తాజాగా చంద్రబాబు నివాసంలో జరిగిన భేటీలో పవన్ కు ఇచ్చే సీట్ల పైన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 40 సీట్ల వరకు పొత్తులో భాగంగా కావాలని పవన్ కోరినట్లు ఆ పార్టీల్లో ప్రచారం జరుగుతోంది. తాజా లేఖలో చేగొండి హరి రామ జోగయ్య కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసారు. కానీ, టీడీపీలో పరిణామాలు చూస్తుంటే 20 సీట్లకు మించి జనసేనకు దక్కే అవకాశం కనిపించటం లేదు. రెండు పార్లమెంట్ తో పాటుగా 18-20 అసెంబ్లీ స్థానాలకే జనసేనను పరిమితం చేసే పరిస్థితి ఉందని పార్టీ నేతల ద్వారా తెలిసింది అందులో భాగంగా జనసేన కీలక నేత మనోహర్ సీటు విషయం పైన ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. మాజీ మంత్రి ఆలపాటి రాజాకు ఆ సీటు ఇవ్వాలని స్థానిక టీడీపీ కేడర్ ఒత్తిడి పెంచుతోంది. దీంతో, మనోహర్ సీటు పైన చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డ సైతం జనసేనకు ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉందని తెలుస్తోంది. నియోజకవర్గంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనకు సీటు ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. తాజా చర్చల్లో తీసుకున్న నిర్ణయం మేరకు జనసేకు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, పిఠాపురం, విజయవాడ వెస్ట్, చీరాల, దర్శి, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, తిరుపతి, మాడుగుల, పోలవరం, పెడన, నంద్యాల, అనంతపురం రూరల్, ధర్మవరం, కల్యాణ్ దుర్గం, పూతలపట్టు స్థానాలు జనసేనకు కేటాయించేందుకు ఇప్పటికే అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో పవన్ పోటీ చేస్తారని ప్రచారంలో ఉన్న భీమవరం స్థానం ఈ జాబితాలో లేదని చెబుతున్నారు. దీని ద్వారా పవన్ పిఠాపురం లేదా తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. ఇక, టీడీపీ నుంచి సిట్టింగ్ లకు తిరిగి సీట్లు ఇవ్వనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ, జనసేన పార్టీల తొలి జాబితా త్వరలోనే విడుదల కానుంది. ఇక వివాదాస్పద నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణం రాజు కు ఏ పార్టీ నుండి టికెట్ లభించక పోవచ్చన్న ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. కాంగ్రెస్స్ విషయానికి వస్తె తమ పార్టీ సిఎం అభ్యర్థిగా చిరంజీవి పేరుని తెర పైకి తెచ్చారు. మరి ఏపీసీసీ అధ్యక్షురాలు ఈ ప్రతిపాదనకు ఆమోదం చెబుతారా..అన్నది ప్రశ్నార్థకమే.
ఇదిలా ఉండగా సిఎం జగన్ మాత్రం తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు.ఆయన గెలుపు గుర్రాల కే టికెట్ల ప్రకటనలు చేస్తున్నారు.ఈ కారణంగా తనకు సన్నిహితంగా ఉన్న వారికి సైతం టికెట్ల నిరాకరిస్తున్నారు.
ఇదిలా ఉండగా టీడీపీ నుంచి తొలి జాబితాతో కుప్పం- చంద్రబాబు, మంగళగిరి -లోకేశ్, టెక్కలి – అచ్చెన్నాయుడు, కనిగిరికి ఉగ్ర నరసింహారెడ్డి, తిరువూరుకు శ్యావల దేవదత్, ఆచంటకు పితాని సత్యనారాయణ, బొబ్బిలికి బేబి నాయన, తునికి యనమల దివ్య, వెంకటగిరిలో కురుగుండ్ల రామకృష్ణ, గుడివాడ- వెనిగళ్ల రాము, గంగాధర నెల్లూరుకు డాక్టర్ థామస్ పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి.
– గణపతిరావు పొలమర శెట్టి (జీయార్పీ)
సీనియర్ జర్నలిస్ట్
అసెంబ్లీ మీడియా కమిటీ మాజీ సభ్యుడు.