నిరుద్యోగ పెనుభూతం!

ఎడిటోరియల్

భారతదేశ జనాభాలో 35 ఏళ్ల లోపు యువత 65 శాతం ఉన్నారు. ఈ యువ భారతానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నైపుణ్య మానవ వనరులుగా మలచడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీని ఫలితంగా నిరుద్యోగం, ఉపాధి లేమి, నైపుణ్య లేమి కలిగిన యువత రేటు దేశంలో నానాటికి పెరిగిపోతుంది. మన దేశ నిరుద్యోగుల్లో 83 శాతం నిరుద్యోగ యువతదే అని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇటీవలే ప్రకటించిన నివేదికలో తెలిపింది. దేశంలో ఏటా కోటి మందికి పైగా కొత్తగా చదువుల పట్టాలు పుచ్చుకుంటున్నారు. వారికి సరైన ఉపాధి, ఉద్యోగాలు మాత్రం ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయి. ఈ నిజానికి మసి పూసి పాలకులు కొన్నాళ్లుగా మన దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందనే ప్రకటనలతో ఘనంగా ఊదరగొడుతున్నారు. ప్రజల వ్యక్తిగత ఆదాయం పెరగకుండా ఉపాధి కల్పించ కుండా, నిరుద్యోగ సమస్యలు తీర్చకుండా జీ డీ పీ ఎంత వృద్ధి చెందితే ఏమిటి ప్రయోజనం?. వాస్తవంగా యువతకు సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చూపగలిగితేనే దేశం సమగ్రంగా అభివృద్ధి చెందినట్లు. జీ డీ పీ మెరుపులకు సమాంతరంగా జనం బతుకుల్లో వెలుగులు నిండేలా ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటు నైపుణ్య సహిత అభివృద్ధి విధానాలను టైమ్ బాండ్ ప్రోగ్రాం(చిత్తశుద్ధి)తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుకు పూనుకోవాలి. అప్పుడే అసమానతలు లేని సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేసిన వారవుతారు.

అసలేం జరుగుతుంది.. మన దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నిరుద్యోగ పెనుభూతాన్ని తరిమి వేస్తామన్నారు. అధికారం కోసం ఎన్నికలకు ముందు హామీల వల విసిరి నిరుద్యోగుల ఓట్లతో అధికారాన్ని చేపట్టాక గత ప్రభుత్వాలు ఆ ఊసే లేకుండా కాలం వెల్లదీశారు. పైగా నిర్లజ్జగా సర్కారు ఉద్యోగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయలేదు. మరోవైపు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా ధారాదత్తం చేస్తున్నారు. దీనితో ఆ సంస్థలు ఉపాధి, ఉద్యోగ కల్పనలో వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, అమానుషంగా నిరుద్యోగ యువత జ్ఞాన దోపిడీకి, శ్రమ దోపిడీకి పాల్పడుతున్నది. వ్యాపారీకరణలో భాగంగా లాభార్జనే ధ్యేయంగా సమాన అవకాశాలు, సామాజిక స్పృహ కొరవడడంతో నిరుద్యోగ యువత ఆశలు, ఆశయాలు ఆవిరైపోతున్నాయి. విద్యార్హతలకు తగిన ఉద్యోగం లేక, స్వయం ఉపాధిలో కూడా ప్రభుత్వాల సహకారం అందక ఆర్థిక సమస్యలు, పేదరికం లాంటి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ, బతుకు గడవడం కోసం ఏదో చిరు ఉద్యోగాలతో జీవనం గడుపుతున్నారు. ఉన్నత చదువులైన డిగ్రీలు, పీజీలు చదివినా సరైన ఉద్యోగ అవకాశాలు లేక కొందరు వ్యవసాయం చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంపాదించిన సంపదనంతా ధారబోసి చదివించిన చదువు(పీజీ, డిగ్రీ)లు తిండి పెట్టలేకపోతున్నాయనే ఆవేదనలో నిరుద్యోగ యువత అరకొర ఆదాయంతో బతుకు బండి లాగడమే దుర్భరంగా మారింది. మరో వైపు పాలకుల హామీలు గాలి మాటలు, నీటి మూటలు కావడంతో నైరాశ్యం చెందిన యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు చూస్తుంటిమి. అయినా అధికార గద్దె ఎక్కడానికి ఓట్లు దండుకున్న పాలకులకు కనికరం లేదు. అంతే కాదు ప్రభుత్వా(నాయకు)లు మారుతున్నా వీరి ప్రధాన డిమాండ్ “నిరుద్యోగ సమస్యను” చిత్తశుద్ధితో నిర్మూలించలేక పోవుచున్నారు.
మనదేశంలో పెరుగుతున్న నిరుద్యోగ రేటు.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎం ఐ ఈ) నుండి వచ్చిన డేటా ప్రకారం భారతదేశంలో నిరుద్యోగ రేటు జూన్ 2004లో 8 నెలల గరిష్ట స్థాయి 9.2 శాతానికి పెరిగింది. ఇది అంతకుముందు నెలలో 7 శాతంగా ఉండింది. * శ్రామిక శక్తిలో ఉన్న వారిలో నిరుద్యోగం మరియు చురుకుగా పనిని కోరుకునే వ్యక్తుల నిష్పత్తిని నిరుద్యోగ రేటు ప్రతిబింబిస్తుంది. జూన్ 2023 లో 15.1 శాతంతో పోలిస్తే జూన్ 2024 లో స్త్రీల నిరుద్యోగిత రేటు జాతీయ సగటు కంటే 18.5 శాతానికి చేరుకుంది. పురుషుల నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉంది.
*గ్రామీణ ప్రాంతాలు నిరుద్యోగంలో గణనీయమైన పెరుగుదలను చవిచూశాయి. జూన్ 2023లో 8.8 శాతం నుండి జూన్ 2024 లో ఈ రేటు 9.3 శాతానికి పెరిగింది. *పట్టణ ప్రాంతాలలో చిన్న పెరుగుదల కనిపిస్తుంది. నిరుద్యోగిత రేటు మేలో 8.6 శాతం నుండి జూన్ 2024 కి వచ్చేసరికి 8.9 శాతానికి పెరిగింది.
నిరుద్యోగం సమస్య నిర్మూలించాలంటే?.. ఉపాధి కల్పనను ఓ హక్కుగా ప్రభుత్వాలు గుర్తించాల్సి ఉంది. దేశంలోని నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించినప్పటికీ అందుకు అయ్యే ఖర్చు జీడీపీలో మూడు శాతానికి మించదు. ప్రజలకు ఉపాధి కల్పన హక్కును కల్పించేలా పార్లమెంట్లో చట్టం చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలో 90శాతం వ్యాపారం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారానే జరుగుతుంది. ఈ పరిశ్రమలే 70 శాతం వరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రపంచ జీడీపీలో సగం ఈ రంగాల ద్వారానే వస్తుంది. మన దేశం కూడా ఈ రంగాలను ప్రోత్సహిస్తూ, వాటి ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెం(కల్పిం)చాలి. ఇది పాలకుల చిత్తశుద్ధి పైనే ఆధారపడి ఉంటుంది. “ఒక వ్యక్తి నిరుద్యోగిగా ఉండటం అతడు లేదా ఆమె చేసే తప్పు కాదు. ముమ్మాటికి ఆ వ్యక్తి జీవించే సమాజంలో ఉన్న సామాజిక వ్యవస్థదే ఆ తప్పు”. ఆ వ్యవస్థకు నిరుద్యోగ నిర్మూలన చేత కాదనేది నిర్ధారణ అవుతుంది. ఉద్యోగ, ఉపాధి కల్పన ఒక సార్వత్రిక హక్కుగా గుర్తించాలి. రాజ్యాంగపరమైన గ్యారంటీ ఇవ్వాలి. రాజకీయ హక్కులు, పౌర హక్కులు ప్రాథమిక హక్కులుగా గ్యారంటీ చేయబడ్డట్టే ఉద్యోగ, ఉపాధి కల్పన హక్కుకు కూడా గ్యారంటీ కల్పించాలి. ఏ నిరుద్యోగి యాచకుడు కాదు? ఉద్యోగ, ఉపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యత. సంపన్నుల సంపదపై అదనపు పన్నుతోనే నిరుద్యోగాన్ని సమూలంగా నిర్మూలించవచ్చు. యువశక్తిని నిర్లక్ష్యం చేస్తే సమాజంలో విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఉద్యోగాల భర్తీ అంటూ హడావుడి చేసి, ఆశలు రేపి ఆ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహారించే తీరు మారాలి. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల మేరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనిస్తూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సంపన్నుల సంపదపై అదనపు పన్ను విధించి నిరుద్యోగ పెనుభూతాన్ని దేశం నుండి తరిమివేయాలి.

 

మేకిరి దామోదర్,
సోషల్ ఎనలిస్ట్,
ఫోన్:9573666650

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *