వరదబాధిత ప్రాంతాల్లో కేంద్రమంత్రుల పర్యటన

తెలంగాణ

బాధితులకు అండగా ఉంటామని కిషన్‌ రెడ్డి హావిూ
వరద సమయాల్లో రాజకీయాలు తగవు
బిఆర్‌ఎస్‌కు చురకలంటించిన మంత్రి పొంగులేటి
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో గత వారం రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది. వానలు దంచికొడుతుండటంతో ఖమ్మం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వరద కాలనీలను నీరు ముంచెత్తడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, ఈటెల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్రెడ్డిలు పర్యటించి బాధితులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందని హావిూ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి విూడియా సమావేశం నిర్వహించారు. పొంగులేటి విూడియాతో మాట్లాడుతూ…. ఇలాంటి విపత్కర సమయంలో రాజకీయాలు ముఖ్యం కాదని.. ప్రజలను కాపాడటమే ముఖ్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తిర్మలాయపాలెం మండలం రాకాసి తండాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధితులను పరామర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా జిల్లాలు జలమయమయ్యాయని చెప్పారు. వరదలకు నష్టపోయిన వారికి అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మొన్న వ్యవసాయ శాఖ మంత్రి, ఈరోజు కిషన్‌ రెడ్డి వచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని అంచనా వేసి పంపించాలని కిషన్‌ రెడ్డి సెక్రటరీకి వరద సాయంపై కీలక ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఇక్కడ జరిగిన విపత్తుని దేశ విపత్తుగా తీసుకోవాలని కేంద్రాన్ని మంత్రి పొంగులేటి కోరారు. ఈ సమయంలో రాజకీయాలు ముఖ్యం కాదు, ప్రజలను కాపాడటమే ముఖ్యమని.. కేంద్ర ప్రభుత్వం చేయూత ఇస్తోందని వివరించారు. తెలంగాణ అంటే గతంలో లాగా ధనిక రాష్ట్రం కాదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి తెలియజేశామని చెప్పారు. విపత్తు మొదలైన రోజే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఫోన్‌ చేసి అండగా ఉంటామని హావిూ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ పార్టీ శవాల విూద చిల్లర ఏరుకుంటోందని విమర్శలు చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షం ప్రజలను ఆదుకోకుండా కూడా రాజకీయ లబ్ది కోసం పాకులాడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *