సృజన ప్రతిభలో దిగ్భ్రమ కలిగించే రాశీ, వాసీ!

సాహిత్యం

చంద్రశేఖర అజాద్ అనగానే సాహితీలోకంలో ఒక ప్రతిభా విరాణ్మార్తి దర్శనమవుతుంది. 850 కథలు, 87 నవలలు, 18 నవలికలు, 15 వ్యాసాలు, ముందు మాటలు, ఇంకా ఆలిండియా రేడియో కథలు, రూపకాలు, నాటికలు అనేకానేకం ఆయన సృజనశక్తికి నిదర్శనంగా ముందుకొస్తాయి. ఇక, బుల్లితెరపై 5000 ఎపిపోడ్స్ కు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు, 8 టెలీ ఫిల్ములు అనగానే ఒక ఆనంద పారవశ్యం, గగుర్పాటు కలుగుతుంది. 3 టెలీఫిల్ములకు స్వర్ణనంది పురస్కారాలు, ఒక టెలీఫిల్ముకి వెండినంది, పిల్లల సినిమాకు స్వర్ణనంది, బెస్ట్ స్క్రీన్ ప్లేకి రాధామధునంది, ఉత్తమ సంభాషణలకు బోన్సాయ్ నంది అవార్డుల్ని పొందారు. సాహిత్యంలో 100 కథలకు పైగా వివిధ పత్రికల్లో బహుమతులు, 34 నవలలకు తానా, ఆటా, స్వాతి అనిల్ అవార్డ్ పురస్కారాలు ఆయన రచనాశక్తికి కానుకలుగా లభించాయి. అజాద్ కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత కూడా. ఆంధ్రప్రదేశ్ వారి ఉగాది పురస్కారాలూ, (హంస) కళారత్న అవార్డ్, తె.వి.వి. వారి కీర్తి పురస్కారం కూడా లభించాయి.

_________________

రాశి దృష్ట్యా ఒక అనన్య సామాన్యమైన నిత్య నిరంతర రచయితని చూస్తుండగా, అజాద్ రచనలోని వాసి గుణ విశేషాల్ని విశ్లేషించుకున్నప్పుడు ఆయనలోని మేధా పరిణతి, జీవన తాత్త్వికత, విలువల నిబద్ధత మనల్ని దిగ్భ్రమకి గురి చేస్తాయి. చంద్రశేఖర అజాద్ బహుముఖీనమైన సృజన ప్రజ్ఞా పాటవాల్లో కేవలం ఒక్కపార్శ్వం- కథా తేజోరేఖని దర్శించటానికి మాత్రమే ఈ సంవీక్షణని పరిమితం చేస్తున్నాను. అందునా స్థాలీపులాక న్యాయాన్ని పాటించక తప్పటం లేదు! చిత్తగించండి.

__________________

తెలుగు సాహిత్యంలో మధ్యతరగతి మనుషుల నవ్వూ ఏడుపుల మీద చాలా కథలు వచ్చాయి. అయితే, కొన్ని కథలు మనిషి అంతఃకరణ లోతుల్ని తడివి, అంతరంగంలోని విభిన్న భావనోద్వేగాల్ని ఆవిష్కరించి, మానవీయ విలువల్ని ఉన్నతీకరించి, అనుభూతిప్రదంగా అమరత్వాన్ని పొందేయి. అలాంటి ఒక ఉత్తమ కథని చంద్రశేఖర ఆజాద్ అందించారు. అదే ‘ఆకలేస్తోందమ్మా’ అనే కథ.

“కొంతమందికి తమకు లేనిదాని గురించి ఏడుపు. కొందరికి తమకే వుందనే గర్వం. కొందరికి తమకంటే తక్కువ వున్నవారిని చూస్తే ఎంతో చులకన. మరికొద్ది మందికి యివేమీ పట్టవు. వీరికి ఆత్మతృప్తి, ఆత్మ స్థైర్యం, ఉన్నతమైన వ్యక్తిత్వం, ఆలోచనా వికాసం వుంటాయి. ఈ కథలో అన్నిరకాల వాళ్ళూ మనకు తటస్థపడతారు.

ఈ కథ నిర్మల చుట్టూ తిరుగుతుంది. పైన చెప్పిన వారిలో చివరి కోవకి చెందిన మనిషి నిర్మల. గృహిణి. భర్త వాసు. అతనిదీ దాదాపు అదే తరహా. కాకుంటే ఇంకొంచెం ఎక్కువ బుద్ధిజీవి.

ఒక ముసలావిడ తన వారి నిరాదరణకు గురయి ఇంటిబయట కుక్కిమంచంలో జీవచ్ఛవంలా పడి వుంటుంది. చలి అవనీ, ఎండవనీ, అన్నీ అక్కడే. కదలలేదు. కదలాలని వున్నా, శక్తి తెచ్చుకున్నా-కదలకూడదని ఆంక్ష. కొడుకూ, కోడలూ, ఆమెకేమీ పెట్టకుండా బయటికి వెళ్ళిపోతారు. ఏ రాత్రికో వస్తారు. ముసలావిడకి ఆకలి. ఎదురింట్లోకి కొత్తగా వచ్చారు నిర్మలావాళ్ళు. నిర్మలకేసి ఆశగా చేతులు సాచి, ఏదైనా పెట్టమని ప్రాధేయపడుతుంది సైగల ద్వారా ఆ ముసలావిడ. చాలా బాధపడింది నిర్మల. జాలేసింది. దగ్గరికి వెళ్ళింది. ఆమె దయనీయస్థితిని విన్నది. పరుగు పరుగున ఇంట్లోకి వచ్చి రెండు అరిసెలుంటే తీసుకుపోయి ఆమెకిచ్చింది. అభిమానాన్నీ, సిగ్గునీ వదలి, వణుకుతున్న చేతుల్తో ఆబగా తిన్నది. నిర్మలకు కళ్ళవెంట నీళ్ళొచ్చాయి. తర్వాత అంటుంది “ఇట్టా అని చెప్పబాకె తల్లె నన్ను బతకనీయదు. నాకు మాటలు వినిపిస్తాయి. చెవిటిదాన్ని చేసింది. గుడ్డిదాన్ని చేసింది. నేను చెబుతున్నానమ్మా. ఇంత వయసు వచ్చేదాకా ఎవరూ బతకకూడదు.” నిర్మల ఆ రోజు రెండుసార్లు బిగ్గరగా ఏడ్చేసింది కూడా.

ఇవాళ పరిస్థితి వేరు. ఈ యింటికీ, ఆ యింటికీ పడదు. మాటలు లేవు. ఎదురింటి రాజేశ్వరి భర్త తమ స్వంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దన్న విషయం మీద స్నేహాలు పుటుక్కుమన్నాయి.

ఈరోజూ ముసలావిడ నిర్మలకేసి చేయిసాచి ప్రాధేయపడుతోంది. నిర్మలలో తీవ్రమైన భావ సంఘర్షణ. మనసులో ద్వైదీభావం. కింకర్తవ్యతా మూఢతతో చాలా బాధపడుతుంది. ఆమెకేమైనా అయితే…? పెట్టే వాళ్ళు యాగీ చేస్తే?- ఏమిటో భయం, ఆరాటం.

ఆమెకేమీ పెట్టే సాహసం చేయలేదు నిర్మల. “ఆమెకు ఏమైనా అయితే ఆ హత్య చేసింది వాళ్ళు అవరు. నేను… నేను” అని ఏడుస్తుంది…

‘ఆత్మీయత, అనుబంధం అంతా ఒక బూటకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం’ అని సినీకవి అన్నాడు కానీ, దాని అర్థం పరమార్ధం మనుషుల మధ్య అనుబంధాలకే కాక, మనిషికీ మొక్కకూ మధ్యన పెనవేసుకొనే అనుబంధానికీ వర్తిస్తుంది. దీన్ని అంతర్వీక్షణ చేసిన అజాద్ “వాళ్ళిద్దరూ నూరువరహాలు” అనేది. ఈ సృష్టి రహస్యం అర్ధమయితే బాగుండును.

సృష్టికి భాష వుంటుందా- హృదయముంటుందా రెండూ వుండవా, అదేదో పరిశోధించాల్సిన అంశమే. మనిషికి అంత తీరికేది? ఇక్కడ- ఇప్పుడు ఉపయోగంలో లేనిదేదీ అస్తిత్వంలో వుండకూడదు.

‘మనిషయినా – మానయినా!’

‘బాజీ- బాజీ- ఈ చెట్టును కొట్టేద్దాం.’

‘చూద్దాం తల్లీ నాకెందుకో అది నూరు వరహాల్ని పూస్తుందని నమ్మకం…’

‘ఇన్ని రోజులుగా పూయంది ఇంకేం పూస్తుంది. ఆ చోటులో ఇంకొన్ని మొక్కలు నాటుకుందాం’

‘అలా అనకమ్మా పూలు పూస్తేనే అందం కాదు. ఆకుల్లో- కొమ్మల్లో కూడా అందం వుంది. అయినా ఆ చెట్టుని తీసేయటమంటే ప్రాణాన్ని తీసేయటమే.’ అ అమ్మాయి మాట్లాడలేదు. మొదటిసారీ- ఆ తర్వాత కూడా. ఆ అమ్మాయికి నూరువరహాలంటే ఇష్టం లేదు, అది ‘నూరు దరిద్రాలు’. ఆ మాట పైకి అనలేదు. ఏ తుఫానుకో ఆ చెట్టు కొమ్మలు విరిగిపోవాలని కోరుకునేది.

“అదేంటో పెద్దగాలి ఎప్పుడూ రాలేదు. వానలు వచ్చినా ఆ మొక్క మరింత దట్టంగా మారింది గాని చెక్కుచెదరలేదు. పైగా ఆ ప్రాంతమంతా ఆక్రమించుకొంది…”

అజాద్ కథారచనలో విశేషం ఎక్కడున్నదీ అంటే- ఆయన సంఘటనల్ని కూర్చటంలో మాత్రమే లేదు. ఆ సంఘటన ఆ వలయంలో, వలయానికి ఆవల ఈవల గల సున్నితమైన అంశాల వ్యాఖ్యానంలో వుంటుంది.

1991లో ఆజాద్ ‘ఏరు’ అని ఒక గొప్ప కథ రాశారు. గొప్ప అని ఎందుకు అంటున్నానంటే, రచయితగా ఆయనకు గల దార్శనికత వలన. ‘దార్శనికత’ అంటే కాలజ్ఞానం అంటామే అదీ. ఆ జ్ఞానం, ‘నిన్న-నేడు’ని చూపుతూ, ‘రేపు’ని చెప్పీ చెప్పకుండా, చూపీ చూపకుండా- పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆ ‘సత్యాన్వేషణ’లో పఠిత బుర్రగిరికీలు కొడుతుంది. ‘ఏరు’ని చూడండి :

“మైకుల్లో హెచ్చరికలు. ‘ఏరు పొంగుతూంది. జాగ్రత్త’. అసలు ఏరెందుకు పొంగాలి…? ఏరుకి పొంగటం నేర్పింది మీరు కాదూ…? ఇప్పుడిప్పుడే కాలు కూడ దీసుకుంటుంటే అంతలోనే ఈ విపత్తులా….

ఒక్క క్షణం ఆలోచించగలిగితే..ఏరునీ, ఏటిలోని నీటినీ, ఇసుకనీ స్వాహా చెయ్యగలవారు మా కళ్ళ ముందే ఉన్నారు.

‘ఏరు’ రకరకాల జీవితానుభవాల్ని నెరవేర్చుతుంది గానీ – నేర్చుకోవటానికే తీరిక ఉండటం లేదు.

వేసవికాలంలో ఇంకిపోయే ఏరు..ఇసుకనూ, ఆహ్లాదాన్ని అందించే ఏరు.. మురికినీటినంతా తన గర్భంలో దాచుకునే ఏరు… తను ప్రవహిస్తూ ఓ సందేశాన్ని వినిపిస్తుంది.

‘తను ఓ పెను ఉప్పెనలా మారగలను’ అంటోంది.

నిజమే… ఇలా ఏటిగట్టున నిలబడి పొంగుతున్న ఏటినాపటం ఎవరి తరం?

పొంగటం ఏరు తప్పుకాదు! వానలు కురిసి రకరకాల వాగులన్నీ తనలో ఐక్యమైనప్పుడు ఏరు పొంగుతుంది. కానీ మనం..

కష్టాల, కన్నీళ్ళ వరదలొచ్చినా… ఈ ప్రపంచమంతా ధ్వంసం అవుతున్నా పట్టించుకోం….

అవి మనల్ని ధ్వంసం చెయ్యటానికి ఉవ్వెత్తున లేచినప్పుడు మాత్రం ఆక్రోశిస్తాం… అన్నీ వ్యక్తిగత ఆక్రోశాలు…

కనీసం ఈ ఏడ్పులోనైనా అందరూ ఒకటై బిగ్గరగా ఏడవగలిగితే ఎంత బాగుంటుంది.

ఏటిగట్టున నిలబడిన వారందరినీ పిలిచి…“మనమంతా ఏటిగట్టున సాగిపోదామూ సెలయేరులా పొంగిపోదామూ” అని పాడుతూ ముందుకు నడవాలనిపించింది.

___________________

‘గోస’ అని రాసిన కథలో అజాద్ మనిషి మతం గురించిన చర్చలోని సంభావ్యతనీ, అసంభావ్యతనీ ఇతివృత్తం చేసుకుని, సార్వకాలీనమైన సత్యసందేశం ఇచ్చాడు. అందులో ఆత్మహత్య చేసుకున్న ‘మనిషి’ జేబులోని ఉత్తరంలో – ‘మనుషుల్ని బతికించాలనుకున్నోడే మనిషి. వాళ్ళే బతికించాలి. మనుషులు తెలుసుకోవాల్సిన ఆకరి సత్తెంగిదే’ అని వుంటుంది. ఇదీ ఘంటాపథంగా అజాద్ కథారచనలోని క్వాలిటీ. అంతేకాదు, ఇదీ ఆయనలోని ‘మనిషి’తనం ఆరాటం! అందుకే ఆయన కథలంటే నాకు ప్రాణం. పొట్టి పొట్టి వాక్యాలుండే ఆయన రచనా విధానంలోని మెరుపు అన్నా, ఆయన నేర్పే బతుకు ‘చదువు’ అన్నా ఆరాధనాభావం!

___________________

మునిపల్లెరాజు గారిని నేను ‘కథాఋషి’గా అభివర్ణిస్తూ ఆయన పుస్తకానికి ముందుమాట రాశాను. ఆ బిరుదు వలన, నా ముందుమాటవల్లనే తనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని సభల్లోనే ప్రకటించి నన్ను ఇబ్బంది పెట్టారు. అంతటి నా గురువుగారు చంద్రశేఖర్ అజాద్ గురించి ‘సోక్రటీస్ తో చంద్రశేఖరుడి పరకాయ ప్రవేశం’ శీర్షికతో ఏమంటారో వినండి :

“ఒక ప్రకరణంలో – విప్లవానికి ముందున్న గొప్ప రచనలు ఆ తర్వాతెక్కడ? అన్న గంభీరప్రశ్న లేవనెత్తాడు. ఏడు దశాబ్దాల సోవియెట్ పాలనలో చాలా మంచి సాహిత్యమే ఉద్భవించింది. కాని వెనకటి దోస్తోవిస్కీ, లెర్మాంటోవ్, పుష్కిన్, టాల్ స్టాయ్, గోర్కీ వంటి ఆత్మలు మళ్ళీ కనిపించవెందుకు? ఆ విశ్వజనీనత సార్వత్రిక సర్వకాల సత్యాలు ప్రకాశింపజేసిన సాహిత్యం వచ్చిందా? అన్నదే ఆ ఆవేదన..”

“… ఈ ‘మూడీ’ మనిషి భయకంపితుడై, శిశువుగా పలవరింతలుగా ప్రశ్నించటం లేదు. సందేహజీవిగా ఒక ట్రబుల్డ్ ఇంటలెక్చువల్ గా, సరిహద్దుల్లో నిలబడ్డ సంధ్యాజీవిగా ఈ ప్రశ్నల్ని సృష్టించినట్లుగా నాకనిపించటం లేదు. అతని సందేహాలన్నీ మేటర్ కు, స్పిరిట్ కు మధ్య రగులుతున్న కల్లోలాలే. కొన్ని గహనమైనవి, మరికొన్ని నిత్య వ్యవహారిక జగత్తులో సంభవించేవే. భౌతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక కల్లోలాల వివిధ స్వరూపాలే- ఈ ‘మూడ్స్’ (మానసికస్థితి అందాం). చలంగారి మ్యూజింగ్స్ చాలావరకు ఈస్తటిక్ స్టేట్మెంట్స్, భావోద్రేకానికి భాషోద్వేగం జోడైన ఆకృతులు. చంద్రశేఖర ఆజాద్ ఎచ్చోటా ఉద్రేకపడడు. నిలబడి నెమ్మదిగా ఆలోచించమంటాడు. నిరాశా నిస్పృహల సెంటిమెంట్స్ ను పరిహరించాడు. అధివాస్తవిక వాద సాహిత్య ఛాయల్లో పెరిగిన మేధావి యక్షప్రశ్నలివి….”

“… ఇతను సంభాషణా లేఖనలో చతురుడు. ఇది పొగడ్త కాదు. నా స్పందన మాత్రమే. ఏం చేయను ఈ వయసులో. తోటి రచయితను గౌరవించాలనే అజాద్ పన్నిన వలలో చిక్కుకున్న ఆశక్తుణ్ణి. అయినా నా మాటల్లో ‘నెపోటిజమ్’ లేదు అనే వినయపూర్వక నమస్కారబాణం వదులుతున్నాను…”

ఈ మార్చి 16న మునిపల్లెరాజుగారి శతజయంతి సాహిత్యపురస్కారాన్ని అందుకోనున్న చంద్రశేఖర్ అజాద్ గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు!

 

-విహారి

98480 25600