విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

సినిమా హోమ్

పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (83) శకం ముగిసింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట ఆదివారం ఉదయం ఫిలిం నగర్‌లోని ఆయన నివాసంలో కోట కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2010 జూన్‌ 21న రోడ్డు ప్రమాదంలో కోట కుమారుడు కోట ప్రసాద్‌ చనిపోయారు. 1942 జూన్‌ 10వ తేదీన కోట శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో రుక్మిణీని పెళ్ళి చేసుకున్నారు. సినిమా పరిశ్రమకు రాక ముందు కోట శ్రీనివాసరావు బ్యాంకులో ఉద్యోగం చేశారు. 1978లో ’ప్రాణం ఖరీదు’ సినిమాతో కోట సినీ రంగ ప్రవేశం చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా వెండి తెరపై వెలిగిపోయిన ఆయన సుమారు 750కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ , కన్నడ, హిందీ సినిమాల్లో తనదైన శైలిలో నటనను ప్రదర్శించారు. తెలుగు తెరపై కోట ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కెరీర్‌ ప్రారంభంలో సహ నటుడు, ప్రతి నాయకుడి పాత్రలను పోషించిన కోట హాస్య రసాన్ని కూడా పండించడంలో దిట్ట అని మెప్పించారు. అహ నా పెళ్ళంట, ప్రతిఘటన ఖైదీ నెంబర్‌ 786, బొబ్బిలి రాజా, ఇడియట్‌ , సంతోషం, యమలీల, యముడికి మొగుడు, బొమ్మరిల్లు, జంబలకిడి పంబ, అతడు, ఆర్‌జీవి సర్కార్‌ వంటి సినిమాల్లో నటించిన కోట తన నటనకు గాను పలు సినిమాలకు నంది అవార్డులు అందుకున్నారు.
ప్రతి ఘటన, గాయం, తీర్పు, లిటిల్‌ సోల్జర్స్‌, గణేష్‌, చిన్న, ప్ళ్ళున కొత్తలో, ఆ నలుగురు, పృథ్వి నారాయణ వంటి చిత్రాలలో నటనకు తొమ్మిది సార్లు నంది పురస్కారం అందుకున్నారు. 2012లో వచ్చిన వందే జగద్గురుమ్‌ సినిమాకు సైమా అవార్డు అందుకున్నారు. సూపర్‌ స్టార్‌ క్రిష్ణ, చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున, బాలకృష్ణ నుంచి మొదలుకొని వరుణ్‌ సందేశ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ వరకు కోట శ్రీనివాసరావు నాలుగు తరాల నటీ నటులతో కలిసి నటించారు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతులమీదుగా కోట శ్రీనివాసరావు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

ఎమ్మెల్యేగా…
బ్యాంకులో ఉద్యోగిగా ఉన్న కోట శ్రీనివాసరావు రంగస్థలంలో నాటకాలు వేస్తూ వెండితెరపై వెలిగిపోయారు. తెరపై ఫుల్‌ బిజిగా ఉన్న సమయంలోనే కోట శ్రీనివాసరావు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1999- వరకు తూర్పు విజయవాడ నియోజకవర్గం నుంచి శాసన సభ్యుడిగా సేవలందించారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా కోట శ్రీనివాసరావు పని చేశారు. సినీ ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర జరిగింది. ఇందులో అభిమానులు పాల్గొని నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యుల సమక్షంలో పెద్ద మనవడు శ్రీనివాస్‌ అంతిమ సంస్కారాలు చేశారు.
సిఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు సంతాపాలు
తెలుగు చలనచిత్ర నటుడు కోట శ్రీనివాస రావు మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. చలన చిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిదని తెలిపారు. కోట శ్రీనివాస్‌రావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పోషించిన విభిన్న పాత్రలతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.