కథలోని సంఘర్షణ రచయిత దక్పధానికి సంకేతం. ఎలాంటి సంఘర్షణలూ లేని కథలంటూ ఉండవనే చెప్పొచ్చు. అలా ఉంటే అది కథ కాదు అని అని కూడా అనొచ్చు. ప్రతి రచయితకూ ఒక ప్రాపంచిక దక్పధం ఉండి తీరుతుంది. అలాగే సాహిత్య దక్పధం కూడా ఉంటుంది. కథ నచ్చడమూ లేక నచ్చకపోవడమనేది వీటి మీదే ప్రథానంగా ఆధారపడి ఉంటుంది. ఒక పాఠకుడు ఫలానా కథ నచ్చిందని చెప్పడం వేరు. రచయిత చెప్పడం వేరు. పాఠకుడు చెప్పినంత సులువుగా రచయిత చెప్పలేడు. రచయిత ఇది మంచి కథ అని ప్రకటించాడంటే రచయిత తన ప్రాపంచిక దక్పధాన్ని, సాహిత్య దక్పధాన్ని, కథ పట్ల, కథా రచన పట్లా తన అవగాహనను చెప్పుకోవడమే అవుతుంది. ఆ కథ సమాజానికి పనికొచ్చేదిగా ఉండాలి. ఇలాంటి సామాజిక, సాహిత్య దక్పధాన్ని గత ఆరేడు దశాబ్దులుగా, బాధ్యతగా తలకెత్తుకొని ‘‘జయప్రదం’’గా మోస్తున్న రచయిత్రి డా.పెళ్ళకూరు జయప్రదను ఈనాడు క్రొత్తగా పాఠకులకు పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఊహ తెలిసినప్పటినుండి కథనే ప్రాణంగా పట్టుకున్న రచయిత్రి. ‘‘సమాజవాద కథలు’’ అని వేదగిరి రాంబాబు, ‘‘సందేశాత్మక కథలు’’ అని విహారిగారు, ‘‘గొప్ప మనస్తత్వ విశ్లేషణ దాగిఉన్న కథలు’’ అని సుధామ, ‘‘కుటుంబ ఛాయలున్న కథలు’’ అని తంగిరాల చక్రవర్తి, ‘‘మానవతా వాద కథలు’’ అని ముక్తేవి భారతి ప్రస్తుతించాక మనకు క్రొత్తగా చెప్పేది ఏముంటుంది? ప్రజా రచయితలకు (ప్లోరెటేరియన్ రైటర్స్) ఉండాల్సిన ప్రథాన లక్షణాలను గురించి మాక్సిం గోర్కీ ఒకచోట ‘‘మనుషులలో ఆంతరంగికంగాను, బాహ్యంగాను అణిచి ఉంచే ప్రతిదాన్ని, మానవుని స్వేచ్ఛాభివద్ధిని అరికట్టే ప్రతివిషయాన్నీ తీవ్రంగా ద్వేషించాలి. ప్రకతి శక్తులతో దినదినం పోరాడాలి. ‘స్త్రీ’ని దైహిక సుఖాన్నిచ్చే వ్యక్తిగా మాత్రమే కాక, దుర్గమ జీవితంలో పురుషునితో పాటూ ప్రయాణానికి సిద్ధంగా ఉన్న సహచారిణిగా చూడాలి’’ అంటాడు.
ఇంత సుదీర్ఘ ఉపోద్ఘాతం ఎందుకంటే జయప్రద ఇటీవల అంటే 2023 మే లో ‘‘విభిన్న శ్వాసలు’’ అనే 13 కథలున్న కథా సంపుటిని తెచ్చారు. ఈ కథా సంపుటిని జయప్రద వారి శ్రీవారు సోమిరెడ్డి శేషారెడ్డిగారికి అంకితం యిచ్చారు. ‘‘విభిన్న శ్వాసలు’’ కథా సంపుటిలో రచయిత్రి ప్రతి కథ ఆరంభంలో ఒక ట్యాగ్ లైన్ ఇస్తారు. ఆ ట్యాగ్ లైను ఆ కథా సారాంశాన్ని క్లుప్తంగా వ్యక్తీకరిస్తుంది. ఇందులోని కథలన్నీ స్త్రీల చుట్టూ తిరిగేవే! పురుషులకు స్త్రీలపై ఉండే చులకనభావం, చిన్నచూపు, అన్నివిధాలా వాడుకొని వదిలించుకునే మనస్తత్వం, చూసి చలించిపోయి, తమ ఉనికి సమాజంలోనూ, కుటుంబంలోనూ దిగజారిపోతూ ఉండడం మౌనంగా భరించలేక, అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని ప్రతిఘటించడం స్త్రీవాదం అంటారని అనుకొంటాను. అయితే అన్ని కథలూ స్త్రీవాదమేనని చెప్పడంలేదు కానీ దశాబ్దం క్రితం డా.కె.బి.లక్ష్మి ‘‘జయప్రద కథల్లో సహదయ పురుష పాత్రలున్నాయి. ఒక సంయమన సిద్ధాంతంతో తన ఆలొచనల్ని, స్త్రీ మానవతావాదుల్నీ కథా కథనాలుగా మలచారు. ఒక డాక్టరు సలహాలు, స్నేహితురాలి హితోక్తిగా, మనసున్న మనిషి చేసే మేలుగా సందేశాన్నిస్తాయనడంలో సందేహం లేదు. ఏదో చెప్పాలని కాకుండా ‘ఎంత ‘ చెప్పాలో తెలిసిన విధుషి జయప్రద’’ అన్న మాటలు ఈనాటికీ యధాతధంగా ‘‘విభిన్న శ్వాసలు’’ కథలకీ వర్తిస్తాయని అనుకుంటున్నాను.
కొన్ని కథలగురించి చెప్పాల్సి ఉంది. మొదటి కథ ‘‘కర్పూర దీపం’’ దీనికి ‘‘సంప్రదాయల కంటే గొప్పది – ఆర్థిక దీపం ఆరిపోకుండా చూసుకోవడం’’ అనే ట్యాగ్‌లైను ఇచ్చారు. వార్తల్లో హెడ్‌లైన్స్ లాగా కథ క్లుప్త పరిచయం ఇది. పది మందిని కన్నతల్లి రమణమ్మ బ్రతికి ఉన్నప్పుడు కనీసం చూడడానికి కూడా రాని సంతానం, మరణించాక దుఃఖిస్తే ఏం ప్రయోజనం? అలాగే తల్లి చివరి కర్మకాండలకు అయే ఖర్చు విషయమై ఎవరికి వారు సాకులు చెప్తూ తప్పుకోవడం చూసిన ఆమె స్నేహితురాలికి జ్ఞానోదయం అయి ఇంటికి వచ్చేసరికి, కొడుకు ఆమె మెళ్ళోని నగను వ్యాపారానికి ఇవ్వమని అడగడంతో కడుపు తీపికి లొంగకూడదని గట్టిగా నిశ్చయించుకొంటుంది. అలాగే మరణించినావిడ యింటికి వెళ్ళి కర్మకాండలకు అప్పులపాలయి ఖర్చులు పెట్టుకోవద్దని సంతానానికి సలహా ఇస్తుంది. తల్లిదండ్రులు ఉన్నంతకాలం వారి శరీరక శ్రమ ఆర్ధిక సహాయాలతో కర్పూరం లాగా కరగిపోవడం తప్ప ఏమి మిగిల్తుంది చివరకు వారికి అన్న సందేశమిస్తారు రచయిత్రి. అందుకే ఆర్థిక దీపం ఆరిపోకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యమని సందేశం ఈ కథలో ఉంది.
‘‘నిరీక్షణ’’ అన్న కథలో ఇల్లు కట్టించుకోవడానికి మధ్య తరగతి జీవులు పడే పాట్లను వివరిస్తూ ‘‘ఏ చట్టమైనా పెద్దవాళ్ళకు, పేద వాళ్ళకు సమానంగా వర్తించాలి’’ అంటూ లోకంలో తప్పులు చేసే వాళ్ళకే రోషాలు ఎక్కువ ఉంటాయి అంటారు. ‘‘పుస్తకం తెరిస్తే’’ అన్న కథలో ఎప్పుడో పదేళ్ళక్రితం మెడిసన్ చదివేటప్పుడు క్లాస్మేట్ అయిన ప్రేమించిన వ్యక్తి, ఆమె లాగే వివాహం చేసుకోకుండా ట్రెయిన్‌లో కనిపిస్తే ఏమౌతుంది అన్నదే కథ. ఆమె మనసులోని మర్మం దాచకుండా చెప్పబట్టే పదేళ్ళ తర్వాతయినా వారు వివాహ దిశగా అడుగులేయ గలిగారని చెప్తారు రచయిత్రి. ‘‘చావు చీరె’’ కథలో ఎవరో అభాగ్యురాలు మానభంగం జరిగి, బట్టలు సైతం లేకుండా రోడ్డు మీద కనిపిస్తే ఒక స్త్రీ ఎలా స్పందిస్తుంది? తన తల్లి మరణించి ఉన్నప్పటికీ ఇంటికి వెళ్ళి బట్టలు తెచ్చి ఆమె వంటిపై కప్పడం కళ్ళు చెమరుస్తాయి. రచయిత్రి అన్న ‘‘అమానుషత్వం దినదినాభివద్ధి చెందుతోంది’’ అన్న మాటలు పాఠకుల మస్తిష్కాల్లో ప్రతిధ్వనిస్తాయి.
ఈ కథా సంపుటికి ‘‘విభిన్న శ్వాసలు’’ అని పేరుపెట్టడం వెనుక ఉన్న కథలోకి వస్తే మూఢ విశ్వాసాలు ప్రపంచంలో ఏ మూల ఉన్నా వెంటాడుతాయని తెలియజెప్పే కథ. అమెరికాలో ఉన్నా మనుమరాలు అలాంటి విశ్వాసాలను నమ్మడం గమనించిన ఒక పెద్దావిడ కథ చివరలో ‘‘దుస్సంప్రదాయాల్ని జయించి సుఖపడుతున్నారనే శ్వాస!, చాదస్తాలతో బాధితులవుతున్నారనే నిశ్శ్వాస!! ఎన్ని చూసిన, ఎన్ని విన్నా మారడంలేదనే దుశ్శ్వాస!!!’’ అని కథకు మంచి ముగిపునిస్తారు. ఈ కథలోని ‘‘నా మాటల పాద ముద్రల్ని జన్మించకుండానే చెరిపేస్తుంటాయి’’ వంటి వాక్యాలు పాఠకులకు ఆనందాన్నిస్తాయి. అలాంటి మూఢ నమ్మకాలను గురించిన మరో కథ ‘‘మౌఢ్యమా వర్ధిల్లకే..’’ అనే సరిక్రొత్త శీర్షికతో ఉన్న కథ. దీన్లో ‘‘భగవంతుడు మనల్ని సష్టించలేదనీ, భగవతుణ్ణి మనకు కావల్సిన తీరులో మనం సష్టించుకున్నాం’’ అన్న వాక్యాలు కథకు సంపూర్ణతను ప్రసాదిస్తాయి.
‘‘హక్కు’’ అనే కథలో ఒక కన్న తల్లిని తన కుమారుణ్ణి బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేయాలనే తలంపుతో ఉండగా, డబ్బున్నదన్న మిషతో వాణ్ణి చదవనీయకుండా అడ్డుపడ్డ అత్తా మామల్ని, చివరకు మనుమలు, మనుమరాండ్రు ఉన్నా కంటి చూపుకు నోచుకోలేక తీవ్ర మానసిక రుగ్మతకు లోనైన ఒక అభాగ్యురాలి కథను ఒక డాక్టరు తన స్నేహితురాలికి వినిపించిన కథ చదివితే కళ్ళు చెమర్చక మానవు. ‘‘ఈవ్ టీజింగ్’’ ర్యాగింగుల వల్ల పిల్లలు ఎంత మానసిక క్షోభకు గురవుతారో తెలియ జెప్పే కథ, ఆడపిల్లలు అనుభవిస్తున్న మానసిక వ్యధకు అద్దం పడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కథలన్నీ జీవిత దశల్లోని విభిన్న పార్శ్వాలను తడిమేవే!
ఈ కథల్లో స్త్రీగా పుట్టడం వలన కలిగిన ఆవేదన చెప్పడానికి సమాజాన్ని విమర్శించడమో లేక వాచ్యంగా కసిని వెలువరించడమో కాకుండా రచయిత చాలా కథల్లో డాక్టరుగా పరిష్కారాలు చూపడం, కథ చివరికి ‘‘ అలా ఎందుకు జరిగిందబ్బా! ఇలా జరిగుంటే బాగుండేది కదా!’’ అన్న ఎరుకను పాఠకులకు స్ఫురింప జేస్తారు. కథా రచన ప్రారంభించిన దశనుండి రచయిత్రి, తొలి కథల్లోనే జయప్రద తన ప్రత్యేక ముద్రను పాఠక లోకంలో వదిలారు. ఇప్పటికి 10 నవలలు, మరో 10కి పైగా కథా సంపుటులు, కొన్ని వందల కథలే కాకుండా రచయిత్రి కవిత్వంలో సైతం, ఐదు సంపుటులు వెలువరించి తన ప్రతిభను నిరూపించుకున్నారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే కీర్తి పురస్కారంతో సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆరేడు దశాబ్దాలుగా సాహిత్యరంగంలో ఉంటూ నేటికీ యువ రచయిత్రులకు ధీటుగా కథలను రాస్తూ, మారుతున్న కాలానికి మారుతున్న సమాజపు ధ్వనులను, ప్రతిధ్వనులను వినిపించే ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు.
ముగింపుగా ఒక్క మాట. కథల్లో ప్రశ్నలు అడగడంలో తీవ్రత, చిత్తశుద్ధి జయప్రద చలం నుండి గ్రహించారా అనిపిస్తుంది. ఎవరూ అడగని కోణాల్లో ప్రశ్నలు సంధించి, స్త్రీలకు తమమీద తమకున్న అధికారాన్ని సాధించుకోవడానికి చలానికున్న నమ్మకమే జయప్రదకూ ఉందనిపిస్తున్నది. మనకు బాగా తెలిసిన జీవితాల నేపధ్యాలలోనే సామాజిక జీవితాలను ఎప్పటికప్పుడు తీవ్రంగా అధ్యయనం చేస్తూ కథలను వెలువరించడానికి గల శక్తిసామర్ధ్యాలు గొప్పవి. ప్రతి కథా క్రొత్తగా రాయడం, గమనించవచ్చు. ఆమె దక్పథం, వ్యంగ్యం, కోపంతో పాటూ ఈ సమాజం మారలేదన్న ఆక్రోశం, ఆవేదనలు కథల్లో కదం తొక్కుతాయి. ఈ సమాజ అసమానతల్ని ఒక్కసారిగా మార్చలేం! అంచలంచలుగా మార్పుకు గురి కావలసిందే! ఆ మార్పు కోసం, స్వచ్ఛమైన సమాజంకోసం రచయితలు రచయిత్రులు నిరంతరం కషి చేస్తూనే ఉంటారు. మార్పు కోసం ఎన్నో కాలాల్ని రచయిత(త్రు)లు తమ కాలాలను వెచ్చించక తప్పదన్న కతనిశ్చయంతో కథారంగంలో నిలిచి ఉన్న ధీర పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి. కవిత్వమైనా, కథయినా, రచనల్లో సత్య సందర్శనం, ఐంద్రియక జ్ఞాన సమైక్త్యత వల్ల సాధ్యమౌతుంది. ఇది తిరిగి అంతర్గతానుభవ సమైక్యతను నెలకొల్పుతుంది అంటాడు సెసిల్‌డే లెవిస్ అన్న పాశ్చాత్య పండితుడు ఒకచోట. ఈ సూక్తిని అర్ధం చేసుకుంటే జయప్రద రచనా ప్రాముఖ్యం అర్ధమవుతుందన్న భావనతో ముగిస్తున్నాను.
– డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య
(9490400858)