శతాబ్దాల దాహాన్ని పరిమార్చే నది కావాలి!

సాహిత్యం

నీలిగ్రహం పుట్టుక మాటేమో గాని నీళ్లు లేని సీమల కరువు శాపాలను విమోచనం చేయడానికైనా ఈ భూగ్రహం తన భౌగోళిక స్వరూపంలో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే బాగుండు! నేల ఇప్పటికే అంతులేనన్ని ముక్కలై ఉంది కాబట్టి కొత్త ఖండాలేవీ ఏర్పడకపోయినా పరవాలేదు. ఇంకో మహా సముద్రమేదీ కొత్తగా రూపుదిద్దుకోకపోయినా నష్టం లేదు. కానీ నేలను దుఃఖపెట్టే అన్ని ఎడారులూ పంట పొలాలుగా పచ్చని అరణ్యాలుగా మారిపోతే బాగుండు. ఎడారుల్లో, వర్షాభావ ప్రాంతాల్లో కొత్తగా కొన్ని నదీనదాలు పుట్టుకొస్తే బాగుండు. ఈ భూమ్మీద కన్ను తెరిచిన ఏ ప్రాణికీ నీటికొరత లేకుండా అన్ని చోట్లా ఆదిజనని లాంటి మట్టికి సమృద్ధిగా జలాభిషేకాలు జరిగితే బాగుండు.

మహా సముద్రాలన్నీ జట్లేసుకున్నట్లే మహీతలం మీద నదులన్నీ చేతులు కలిపి నడిస్తే బాగుండు. దుఃఖ దాయనులన్నీ నింద మాపుకొని నీళ్లు లేక వేదన పడుతున్న నేలల పైకి నిండారా ప్రవహించుకొస్తే బాగుండు. పరుగు పరుగున సముద్రాల గొందిలోకి ఒలికిపోతున్న జీవనదులన్నీ తమ ప్రవాహ దిశను మార్చుకొని సీమ భూముల్లోకొచ్చి చిందులాడితే బాగుండు. నేను సైతం ఇప్పుడే ఈ క్షణమే అంతర్ధానమైపోయి రాయలసీమ రాళ్లగుట్టల మీద ఎక్కడో ఓచోట కొత్త నదినై పుట్టి సీమ నేలంతా జీవధారలు పారిస్తూ బీడువారిన పొలాల వెంట బిరబిరా పరుగులు తీస్తే బాగుండు. ఇలా ఎందుకు కోరుకుంటున్నానంటే మల్లెల నరసింహ మూర్తి “మాకూ ఒక నది కావాలి” అని నినదిస్తున్నారు కాబట్టి. తన ఆవేదనతో నేనూ తాదాత్మ్యం చెందాను కాబట్టి. తన కవిత్వం చదివిన తర్వాత నాలో ఈ భావాల జల ఉబికింది కాబట్టి. నా లోలోపల ఇన్నిన్ని ఆలోచనల సుడులు రేగాయి కాబట్టి.

_________________

చినుకుస్పర్శ కోసం, నీటి చుక్క కోసం, నది కోసం, చెలిమె కోసం, చెరువు కోసం, చెమ్మ కోసం, తడి కోసం, తేమ కోసం ఎంత ఆర్తి! ఎంత తపన! ఎంత నిరీక్షణ! ఈ కవి వాక్యాలను తడుముతుంటే కన్నీళ్లు. ఈ కవి పదాల వెంట పాఠకుడిగా నడుస్తున్నప్పుడు గుండె నిండా పగుళ్లు.

_________________

“నదీ! నువ్వు నిండుగా కదలిరా!

నిన్ను మా సీమజనం

కళ్ళలో పెట్టుకుని కాపాడుకుంటారు”

అని కవి చెబుతున్న మాటల్లో ఎంతటి ఆరాటం! పరస్పరం అలల కరచాలనంతో నదులు జరుపుకునే జల ఉత్సవంలా నదుల అనుసంధానం కల సాకారం కావాలని కోరుతున్న కవిది ఎంత న్యాయమైన ఆశ. ఈ ఆశా, ఆరాటం ఈ ఒక్క కవిది మాత్రమేనా? కాదు గదా. సీమ ప్రజలందరిదీనూ. సీమ నేలలో నీళ్లు పారాలని కలగంటూ ఈ కవి 2004లో తీసుకొచ్చిన సంపుటి “జలస్వప్నం”. దానికి కొనసాగింపు ఒకింత ఆగ్రహింపు మరికొంత హెచ్చరింపు ఇంకొంత జలపోరాటదీక్షా నిశ్చయింపు వెరసి “మాకూ ఒక నదికావాలి” ఒక కవిత్వ పలవరింపు. వేయి గ్రామాల సీమ జలతృష్ణ జలదరింపు!

సీమ కరువు తీర్చడానికి పాలనా యంత్రాంగం బాధ్యత పడాలని కవి అభ్యర్థన. నిజానికి ఇది ఈనాటిది కాదు. దశాబ్దాల కాలాన్ని కలల్లోనే కరగదీసుకున్నా నెరవేరని స్వప్నం. దీనికి రాజకీయ సంకల్పం కావాలి. ఆ దిశగా ఈ కవితా సంపుటి ఒక పోరాట శంఖనాదం, చైతన్యపు నినాదం. వందేళ్లుగా కన్నీటి వినతులన్నీ బుట్టదాఖలైపోయాయి. ఆరేడు నదులున్నా వాటి నీళ్లు నిండారా రాయలసీమకు అందడం లేదు. అందుకే సీమ గొంతు తడవడం కోసం ఏళ్లుగా నేరవేరని నదుల అనుసంధానం అనే తాజాపాత ప్రతిపాదన ఇలా మరోసారి ముందుకొచ్చింది. కవి గొంతు నుండి రాజకీయ యవనిక పైకి కవిత్వ రాయబారమై కదలివచ్చింది ఈ కవితల గుచ్చం.

ఈ సంపుటిలో ఒక గొప్ప కవిత “నీళ్ల నెమళ్లు” లోని ప్రారంభ వాక్యాలివి.

‘ఎన్నాళ్ళు రాస్తారప్పా నీళ్ల మీద కవిత్వం’

…“నీళ్లు

మా సీమ రైతుల కన్నీళ్లు

తుడిచేంతవరకు” –

ఈ సంపుటి సారాంశమంతా కవి చెప్పిన ఈ నాలుగు వాక్యాల్లో నేరుగానే అభివ్యక్తం అయింది. మొత్తం 29 కవితలున్న ఈ సంపుటంలో మల్లెల నరసింహమూర్తి గారి వాక్యాల తేజోయాత్ర జలస్వప్నం దగ్గర మొదలై జల చైతన్యం దిశగా సాగి జలసమరం తప్పదంటూ ముగుస్తుంది. వేరే అంశాల ప్రస్తావనలున్న ఓ మూడ్నాలుగు కవితల్ని మినహాయిస్తే ఇది ఒకే ఇతివృత్తాన్ని పలికే దీర్ఘకావ్యం.

ప్రస్తుత ఎనిమిది జిల్లాల సీమ శప్తభూమిగా సాహిత్య ప్రపంచానికి చిరపరిచితమే. రాజుల పాలనలో ఈ ప్రాంతంలో విరివిగా చెరువుల తవ్వకం జరగడం చరిత్రకు తెలుసు. ఆ చెరువులే సీమ సేద్యానికి కాస్తయినా ఆలంబనగా నిలిచిన గతమూ ఉంది. అలాంటి చెరువుల ప్రస్తుత స్థితి ఘోరంగా ఉందని తెలుస్తోంది. తూముల నిర్వహణ మరమ్మత్తులను కూడా పట్టించుకోకుండా పాలేగాళ్ల మీద పగతో రైతాంగానికి అన్యాయం చేసిన బ్రిటిష్ కాలపు విధానాల ఫలితంగా సీమలో చెరువుల నిర్వహణ గాడి తప్పిందని డా. అంకే శ్రీనివాస్ వంటి పరిశోధకుల గమనింపు. సీమలో కొన్ని ఊళ్లకు పేరు చివర సముద్రం అని ఎందుకు ఉంటుందోనని ఆశ్చర్యం. అసలు సముద్రపు అనుభూతికి నోచుకోని నేలలో బుక్కరాయ సముద్రం, పాలసముద్రం, భోగసముద్రం వంటి పేర్లు ఆయా ఊళ్లకు ఎలా స్థిరపడ్డాయో? వరిగింజ అనే కవితలో ‘కురిసే ప్రతి వాన చినుకూ ఒక సముద్రమంత పెద్దది’ అంటారు కవి. ‘దోసెడు వాన చినుకులు/ గుమిగూడి గబ్బట్లాడే/ ప్రతి చెరువూ మాకొక సముద్రమై కనిపిస్తుంది’ అన్న కవి వ్యాఖ్యల్లో పై ప్రశ్నకు బదులు దొరుకుతుంది. ప్రతి వానచినుకునీ మహా ప్రసాదంగా భావించే వర్షాభావ ప్రాంతాల్లో ఏ కొన్ని వాననీళ్లనైనా చెరువుల్లోకి చేరబిలిచే దృష్టి పాలకులకు ఉండాలి కదా! ఇలాంటి వేవేల దాహార్తుల జలాభావపు సంగ్రహింపు ఈ సంపుటిగా రూపుదాల్చిందని చెప్పొచ్చు.

‘నీళ్ళ తిర్నాల సేసుకుందాం/.. పల్లె పొలిమేరల్లో/ నీళ్ల తోరణాలు కడదాం’ అని అనడం కవి ఆకాంక్షే తప్ప వాస్తవంలో బీటలు వారిపోయిన నేలలోకి పంటల ప్రాణాలు ఇంకిపోతాయి. గొంతు ఎండిపోయిన నేల నుండి గావు కేకలు వినబడతాయి. నాలుక పిడచగట్టుకుపోయిన బీడు నుండి పెనుకేకలు పెగులుకొస్తాయి. నెర్రెలు వారిన పొలం నుండి పొగిలి పొగిలి బెబ్బురు కేకలు రగులుకొస్తాయి. దప్పికగొన్న నోరు, ఆర్తి ముప్పిరిగొన్న గుండెతో నీళ్ల కోసం అరిచీ అరిచీ అలమటిస్తుంది. శతాబ్దాల దాహం ఎలా ఉంటుందో అనుభవంలో ఉన్న నేలకు నీరు ఓ తీరని కల. వాన ఓ నెరవేరని ఆశ. నది ఓ అనంత ఆరాటం. ఈ విరూప విషాద ప్రతిఫలనాలన్నీ ఈ సంపుటిలో వాస్తవికంగా చిత్రించబడ్డాయి.

_________________

పొంగులెత్తే నదీ హస్తాన్ని ఎండిపోయిన మరో నదీ హస్తంతో కరచాలనం చేయించే చేతుల కోసం, చేతల కోసం సీమ కలాలు గళాలు కలవరపడుతుంటాయి. దిగులు నేల దుఃఖాన్ని పాడుతూ వర్షాన్ని పలవరిస్తుంటాయి. డొక్కల కరువు, ధాత కరువు, గెంజి కరువుల్లాంటి భయానక కాలాలను చూసిన కళ్ళకు నీళ్ళు కనిపిస్తే సంబరం. వాన దిగులు మాసిపోవాలని, చినుకు చింత తీరిపోవాలని పలవరింత. నీళ్ళు లేని సీమలో జనాలకు నీళ్ళంటే ప్రాణం, నీళ్ళుంటే ఏ వేళైనా సంబరం. ఏటి అలలు రాసే నీటి చరిత్రలకు భిన్నంగా.. ఇసుక మేటలు, ఎర్ర మట్టి బీటలు రాసే కన్నీటి చరిత్ర రాయలసీమది.

_________________

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, వై.శ్రీరాములు లాంటి ఎందరో సీమ కవులు కరువు స్థితిని, వర్షాభావ పరిస్థితుల్ని అక్కడి నేల దాహాన్ని, నీళ్లపట్ల మోహాన్ని ఏదో ఒక రూపంలో కవిత్వంలో పలికించిన వారే. ఈ కోవలో మల్లెల నరసింహమూర్తి గారు మరో ముందడుగు దిశగా తన అక్షరసైన్యాన్ని నడిపారు.

ఈ కవితా సంపుటంలో కవి వాడుకున్న సీమ జన వ్యవహారంలో ఉన్న భాష సహజంగా ఒదిగిపోయింది. ఇందులో సీమ నుడికారం అద్భుతంగా పండించిన ‘కట్లపొయ్యి, ఎల్లమ్మాడె నా తల్లి ఎల్లమ్మాడెనే’ వంటి కవితలు బాగా ఆకట్టుకుంటాయి. కొడకా! “కొండమింద రాయడా!” వంటి కవితల్లోని అనంత మాండలిక సొగసు అలరిస్తుంది.

126 పేజీల పుస్తకంలో సుమారుగా మూడోవంతు దిగ్ధండులైన సీమ సాహితీమూర్తుల ముందుమాటలతో నిండి ఉంది. కొన్ని చిన్న చిన్న పరిమితుల్ని పక్కనపెట్టి మొత్తంగా చూస్తే ఈ సంపుటి “నీళ్ళే మా అజెండా” అంటూ బలంగా నినదించిన సీమగొంతు.

 

– కంచరాన భుజంగరావు

94415 89602