హైదరాబాద్ : స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతంకు పెంచాలని అఖిల పక్షం, 30 బిసి సంఘాలు, బిసి ఉద్యోగ సంఘాలు, 80 కుల సంఘాలు రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొని డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాదులో జరిగిన సమావేశానికి తెలంగాణ బిసి సంక్షేమ సంఘం కన్వీనర్ లాల్ కృష్ణ అధ్యక్షత వహించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులందరూ ముక్తకంఠంతో ఎన్నికలలో చేసిన వాగ్దానం ప్రకారం స్థానిక సంస్థల బిసి రిజర్వేషన్లను 42 శాతం కు పెంచకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో పెంచే వరకు ఎన్నికలు జరగనివ్వమని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్, వామపక్షపార్టీలు, బిజెపి, టిడిపి అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు, బిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రసంగిస్తూ స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్రంలో ప్రభుత్వంతో యుద్ధమే జరుగుతుందని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బిసి రిజర్వేషన్లు పెంచకుండా ప్రభుత్వం బిసిలతో చెలగాటం ఆడుతుందని దీనిపై స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ బిసిల ఎజెండా మోస్తూ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటిస్తుంటే ఇక్కడ నాయకులు బిసి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జనాభాలో బిసిల సంఖ్యకు అనుగుణంగ స్థానిక సంస్థలు, చట్టసభలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సాధించుకునేంత వరకు నక్సల్స్, తెలంగాణ ఉద్యమాల మాదిరిగా బిసి ఉద్యమాలు మొదలవుతుందని హెచ్చరించారు. మాజీ ఎంపి హన్మంతరావు మాట్లాడుతూ..బిసిల సమస్యలపై పోరాడే వారికి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. బిసిలు రాజకీయ పార్టీ పెడితే కులగుణన ఆగిపోతుందని హెచ్చరించారు. రాజ్యసభ సభ్యులు, మాజీ స్పీకర్, ఎంఎల్‌సి మధుసూదనచారి మాట్లాడుతూ.. బిసి కుల గణనతో పాటు అగ్రకులాల కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. వందలో నాలుగు శాతం ఉన్న వారే రాజ్యాధికారం చేపడుతున్నారని అన్నారు. బిసిలు ఐఖ్యంగా పోరాడితే రాజ్యాధికారం సాధించుకోవచ్చన్నారు. ఎంఎల్‌సి తీన్మార్ మల్లన మాట్లాడుతూ.. వారం రోజుల్లో ప్రభుత్వం బిసిల కులగణన ప్రారంభిస్తుందనే ఆశాభావం ఉందన్నారు. తెలంగాణకు చివరి ఒసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని అన్నారు. 2028లో బిసి నేతనే సిఎం అవుతారని ధీమావ్యక్తం చేశారు. ఒసి కాంట్రాక్టర్లు వందల కోట్లు దోచుకుంటున్న డబ్బు బిసి ప్రజల తలపై భారం పడుతుందన్నారు.బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ క్రిష్ణ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు జై తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎలా ఎగిసిందే అదే పద్దతిలో జై బిసి ఉద్యమంకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే బిసిలు రాజ్యాంధికారం సాధించుకోవాలన్నారు.నేతలు ఇందిరా శోభ మాట్లాడుతూ చట్టసభల్లో బిసిలు అత్యల్పంగా ఉన్నారని, జనాభాకు తగినట్లుగా లేరని, తరతరాలుగా బిసిలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో నేతలు ఎర్ర సత్యనారాయణ, గుజ్జ సత్యం, లాల్ కృష్ణ, జయంత్‌రావు, రాములు, గన్ మోహన్, వెముల వెంకటేష్, శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.
