మూసీ బాధితులకు పూర్తి అండ

తెలంగాణ

వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం
రాజకీయ పబ్బం గడుపుకునే వారిని నమ్మొద్దు
పేదల కోసం చర్చించడానికి సిద్దంగా ఉన్నాం
‘కాకా’ జయంతి సభలో సిఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌ : మూసి నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, వారికి అన్ని విధాలుగా అండగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వారందరినీ ఆదుకుంటుందన్నారు. ఎవరినీ అనాధలను చేయబోమన్నారు. ప్రత్యామ్నాయం చూపిస్తామని హావిూ ఇచ్చారు. అంతేకాదు.. ఎవరైనా వచ్చి రెచ్చగొడితే వారి మాటలను నమ్మొదని, వారి ఫామ్‌ హౌజ్‌లను కాపాడుకోవడానికే డ్రామాలాడుతున్నారని సీఎం విమర్శించారు. అలాగే రైతు రుణామఫీ కాని వారు కలెక్టరేట్ల్‌ఓ దరఖాస్తు చేయాలన్నారు. రెండు లక్షలపైగా ఉన్న రుణాల్లో పై మొత్తం చెల్లిస్తే ప్రబుత్వం 2లక్షలు చెల్లిస్తుందని అన్నారు. ఇంత కచ్చితంగా చెబుతున్నా బిఆర్‌ఎస్‌, బిజెపిలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని అన్నారు. రైతులు వారిని నమ్ముకుంటే నట్టేట ముంచుతారని గుర్తుంచుకోవాలన్నారు. శనివారం నాడు కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..మూసీ నిర్వాసితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మూసీ నిర్వాసితులు అధైర్యపడొద్దని.. ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. మూసీ బాధితులకు అండగా ఉన్నట్లు మాట్లాడే వారంతా పేదలకు ఏం చేద్దామో.. వారిని ఎలా ఆదుకుందామో చెప్పాలని కోరారు. ఇళ్లు ఇద్దామా.. డబ్బులు ఇద్దామా.. ప్రభుత్వ స్థలాలు ఇద్దామా.. అని విపక్ష నేతలను సీఎం ప్రశ్నించారు. హైదరాబాద్‌ నగరాన్ని నీటి ప్రమాదం నుంచి కాపాడాలని.. ప్రజల మంచి కోసమే ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. మూసీ దగ్గర ఉన్న వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాళేశ్వరంలో ఒక్క కుటుంబమే లక్ష కోట్లు మింగిందంటూ కేసీఆర్‌ కుటుంబం టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేశారు. మూసి బాధితులు అందరిని ఆదుకోవడానికి పట్టుమని రూ. పదివేల కోట్లు కూడా కావన్నారు. పేదల కోసం పదివేల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం వెనుకాడబోదన్నారు. ఈటెల రాజేందర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు సచివాలయానికి రావాలని.. ప్రజలకు ఏం చేద్దామో చర్చిద్దామని సీఎం రేవంత్‌ పిలుపునిచ్చారు. మూసీ విషంతో బతుకుతున్న నల్లగొండను ఎలా ఆదుకోవాలో చర్చిద్దామన్నారు. ఇలాగే వదిలేసి మూసీని మూసేద్దామా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ కోసం 64 వేల కుటుంబాలను తరలించారని.. కేవలం 16వేల కుటుంబాలకే పరిహారం ఇచ్చారని సీఎం రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటిదే హైదరాబాద్‌లో మూసీ రివర్‌ ఫ్రంట్‌ చేస్తే ఈటెల రాజేందర్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అకౌంట్‌లో రూ. 1,500 కోట్లు ఉన్నాయని.. అందులోంచి మూసీ బాధితులకు రూ. 500 కోట్లు ఇవ్వాలని సీఎం రేవంత్‌ డిమాండ్‌ చేశారు. ఈ డబ్బులను మూసీ నిర్వాసితులకు పంచిపెడదా మన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌కు వెయ్యి ఎకరాలు ఉందని.. అందులోకి 500 ఎకరాలు దానం చేస్తే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానని సీఎం అన్నారు. కేటీఆర్‌కు జన్వాడలో 50 ఎకరాల ఫామ్‌ హౌజ్‌ ఉందని.. అందులో 25 ఎకరాలు ఇవ్వాలన్నారు. ’ఇవన్నీ దోచుకున్నవే కదా? విూ తాతల నుంచి వచ్చినవి కాదు కదా 2009 నుంచి విూ ఆస్తులు ఎలా పెరుగుతూ వచ్చాయి.’ అని కేటీఆర్‌ను సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. రేస్‌ కోర్సు బయటకు తరలిద్దామని.. అంబర్‌పేటలో ఉన్న పోలీస్‌ అకాడవిూని బయటకు తరలిద్దామన్న సీఎం.. అందులో పేదలకు ఇళ్లు కట్టిద్దామని చెప్పారు. పేదలకు న్యాయం చేయడానికి ఒక కమిటీని వేస్తామని.. అందులో ఈటెల రాజేందర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు, పొన్నం ప్రభాకర్‌ను సభ్యులుగా నియమిస్తామన్నారు. పేదల బాధ తనకు తెలుసునని.. ఏ పని చేసినా అడ్డుపడొద్దని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌ దీక్షపై సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రెండు లక్షల వరకు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేశామని సీఎం పునరుద్ఘాటించారు. రెండు లక్షలపైన రుణం ఉన్న వారికి.. పైన డబ్బులు కడితే మిగతావి ఇస్తామని చెప్పామన్నారు. రుణమాఫీ జరగలేదని కేటీఆర్‌ దీక్ష చేపట్టారని విమర్శించారు. రెండు లక్షల పైనున్న వాళ్లకు మాత్రమే రుణమాఫీ జరగలేదని సీఎం వివరించారు. రైతులు ఎవరూ వీరిని నమ్మొద్దని హితవు చెప్పారు రేవంత్‌. ఏమైనా సమస్యలుంటే కలెక్టర్‌ను కలిసి అడగాలని.. సమస్యను పరిష్కరిస్తారన్నారు. సోషల్‌ విూడియాతో అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్‌ నాయకులు కలలు కంటున్నారని.. చిల్లర పనులు చేస్తే చర్లపల్లి జైలుకు వెళతారని చురకలంటించారు సీఎం. ఇదే సమయంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు మంత్రి పదవిపై సీఎం రేవంత్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో వెంకట స్వామి కుటుంబం పాత్ర ఖచ్చితంగా ఉంటుందన్నారు. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పక్రియ మరుగున పడొద్దని కాకా ఆలోచించారన్నారు. సోనియాగాంధీ, ప్రణబ్‌ ముఖర్జీని ఒప్పించి టీఆర్‌ఎస్‌తో పొత్తు కుదిర్చారన్నారు. టీఆర్‌ఎస్‌కు 42 ఎమ్మెల్యే, 5 ఎంపీ సీట్లు ఇప్పించడానికి ప్రధాన కారణం కాకా నే అని అన్నారు. కాకా వల్లనే ఆనాడు బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌) బలపడిరదన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత అసూయతో కాకాను వదిలేశారని సీఎం విమర్శించారు. మల్లిఖార్జున ఖర్గే సూచనతో వివేక్‌ వెంకటస్వామిని తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చానని రేవంత్‌ రెడ్డి చెప్పారు. వెంకటస్వామి సూచన మేరకే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టారని.. తుమ్మిడి హట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ నిర్మించిన కాళేవ్వరం ప్రాజెక్టు మన కళ్లముందే కట్టడం, కూలిపోవడం కూడా జరిగిందని సీఎం విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *