తెలుగు రాష్ట్రాలలో నింగి నేల ఏకం చేసేలా కురిసిన కుండపోత వర్షాల వలన ప్రజలను బయట అడుగు పెట్టనివ్వలేదు. తినడానికి తిండి లేదు, తాగడానికి మంచి నీళ్లు లేవు. ఒక్కసారిగా మహోగ్రరూపం దాల్చిన జల ప్రళయ బీభత్సంతో రెండు రాష్ట్రాల్లోని వరద ప్రాంతాల బాధిత జనం కట్టుబట్టలతో బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో రక్షణ శిబిరాలకు తరలారు. ఆ ప్రజల కష్టాలు, పాట్లు మాటలకందనంత హృదయ విదారకంగా ఉన్నాయి.
ఈ విలయతాండవం మూలంగా రెక్కాడితే డొక్కాడని పేదలు, చిన్న, సన్న కారు, మధ్యతరగతి వారు, ప్రధానంగా అన్నదాతలు పంట నష్టం, ప్రాణ నష్టం, ఆస్తుల విధ్వంసంతో బోరున విలపిస్తున్నారు. ఇలా మరెందరినో దారుణంగా కోల్కోలేని దెబ్బతీసింది. బాధితులను ఆదుకోవడంలో రెండు రాష్ట్రాల సర్కారీ యంత్రాంగం నిద్రాహారాలు మాని చెమటోడ్చి పని చేశా(స్తున్నా)రు. ఈ వరదలతో రోడ్లు, వంతెనలు, చెరువులు, ఆరుగాలం శ్రమించిన పంటలు, ఆస్తి నష్టంతో జనజీవనం ఛిద్రమైపోయింది.
విద్యుత్తు, కమ్యూనికేషన్ వ్యవస్థల సంబంధాలు తెగిపోయినాయి. వీరు ఈ పరిస్థితుల నుండి కుదుటపడ(కోలుకోవ)డానికి కొన్ని రోజులు పడుతుంది. అంతవరకు బాధితులకు బాసటగా నిలవడం భారతజాతి సమిష్టి బాధ్యత. ఇలా సమిష్టిగా మానవత్వం చాటాల్సిన చోట, ఆపత్కాలములో స్వార్థ శక్తులు “శవాల మీద పేలాలేరుకునే దౌర్భాగ్య” రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఒకరిపై ఒకరు అనుచిత విమర్శలు, వెటకారాలు, అవహేళన కౌగిలిలో మానవత్వం నలిగి పోతుంది. పొలిటికల్ మైలేజీ ఎన్నికల వేళ చేయాలి. ఈవిషాద(కష్ట) కాలంలో బాసటగా నిలవాలి. ప్రభుత్వాలు ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలి. పాలకుల లోటు పాట్లను సద్విమర్శ చేయాలి. విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకోరాదు. పట్టణాలు, నగరాల్లోని చెరువులు, కుంటలు, నాలాలు, వరద నీరు నిలువ ఉండే జల వనరులను దురాక్రమణ చేసి అక్రమ నిర్మాణాలను చేపట్టిన వారు, వారికి సహకరించిన గత పాలకుల మూలంగానే ఈ విపత్కర పరిస్థితి దాపురించింది. దీంతో వరద నీరు వెళ్లే దారిలేక నగరాలు, పట్టణాలు, జన ఆవాసాల్లోకి చేరి విధ్వంసం సృష్టించింది. పాలకులు బాధితులను ఆదుకుంటున్నారు.. ప్రతిపక్షాలు విమర్శల బురద చల్లేందుకే అన్నట్లుగా రాజకీయాలు మారాయి. వరద బాధితులకు సాయం అందించేందుకు కేంద్రం, పాలక, ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలన్నీ సమిష్టి బాధ్యతతో మానవత్వం చాటాలి. ఓట్ల నాడు గల్లీ గల్లీ తిరిగి ఓట్ల కోసం బిక్షాటన చేసిన పార్టీలు, నాయకులు ప్రజలు కష్టకాలంలో ఉన్నవేళ ఏ ఒక్క పార్టీ గాని, నాయకులుగాని వరద బాధితుల వైపు కన్నెత్తి చూడని తీరు అమానుషం.
ఈ ఆపత్కాలంలో స్పందించి ఒక్క రోజు వేతనాన్ని మానవత్వంతో సాయంగా ప్రకటించిన ప్రభుత్వ యంత్రాంగం మరియు సినిమా ప్రముఖులు, కొందరు నాయకులు, శక్తి మేరకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే? రాజకీయ పార్టీలను, నాయకులను, దురాక్రమణ దారులను ఈ విపత్తు కదిలించలేదు. రాజకీయ పార్టీలు, నాయకులు సేవ పేరుతో అధికారంలోకి వచ్చిన వారు, వారి వేతనాలు పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ, అవినీతి బంధు ప్రీతిలో ఉన్న చిత్త శుద్ధి, ఆకాశాహార్మ్యాల్లో విలాసవంతంగా జీవిస్తున్న వారిలో సామాజిక బాధ్యత, స్పృహ కానరావడం లేదు. ఆ సంపద ఎవరిది?. ఈ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనం కాదా!. ఎవరూ సాయం చేయరా?. స్వాతంత్ర్యానంతర పాలనలో అవినీతి పెరిగిపోయి, ఆర్థిక అసమానతల అగాధం పూడ్చలేని స్థాయికి వెళ్లుతుంది. పాలనా వ్యవస్థ కుళ్ళిపోతుంది. అలాంటి పరిణామాల మూలంగానే ఆ మధ్య శ్రీలంకలో, మొన్న బంగ్లాదేశ్లో తిరుగుబాటు పరిస్థితులు చూశాం. పాలకులారా మారండి జాతి సంపదను సమంగా పంచండి..
ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు పెట్టుకొని సేవ పేరుతో, వంతుల వారిగా ఇన్నాళ్లు అధికారం చెలాయించింది ఎవరిని ఉద్ధరించదానికి, మీ ఆస్తులు పెంచుకోవడానికి తప్ప!. పార్టీలు, నాయకులు ఎన్నికల ముందు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చేసిన కోట్ల రూపాయల చందాల దందా మరిచారా, ఇందులో అన్ని పార్టీలు ఉన్నాయి. రెండు కమ్యూనిస్టు పార్టీలు తప్ప. ఏ ఒక్క పార్టీ కానీ, ప్రధాన నాయకులు గాని అన్నమో రామచంద్రా అని తల్లడిల్లిస్తున్న బాధిత ప్రజల కోసం సాయం చేయరా?. ఈ ఆపద కన్నా పెద్ద విపత్తు ఏముంది. పార్టీలు, నాయకులు ప్రజలకు సేవ చేయడం కోసం ఏర్పడింది వాస్తవం. ఓట్ల నాడు ఇల్లు ఇల్లు తిరిగి కడుపులో తలపెట్టి, పొర్లు దండాలు పెట్టి ఓట్లు వేయించుకున్న విషయం మరిచారా!. నేడు ప్రజలు కష్టాల్లో ఉంటే తక్షణమే స్పందించి ఆదుకోవాల్సిన వేళ మీన మేషాలు లెక్కిస్తూ, నివేదికలు రావాలంటూ పరామర్శలు, ప్రవచనాలు వల్లిస్తూ కాలయాపన చేస్తున్నారు. ఇందులో అన్ని పార్టీలు బాధ్యులే, బాధితుల పక్షాన నిలబడవలసిన చిత్తశుద్ధి ఏ ఒక్కరికి లేదు. స్వార్థంతో ఓటు బ్యాంకు, బురద రాజకీయాలు మానండి.. మానవత్వం చాటండి. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి, విపత్తు నిధులను ఇవ్వండి. ప్రజలు యాచకులు కాదు? వారి హక్కులను బాధ్యతతో తీర్చుతారో, బదనామవుతారో ఆలోచించుకోండి. తాత్కాలిక సాయం కాకుండా బాధితులు నిలదొక్కుకొనేలా అందించాలి. జలవనరులు, చెరువులు, కుంటలు, నాలాలు, మురుగునీటి పారుదల వ్యవస్థల దురాక్రమణ దారుల నిర్మాణాలను కూల్చివేస్తూ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఏర్పరిచిన ప్రత్యేక హైడ్రాను రెండు రాష్ట్రాలతో పాటు జిల్లా కేంద్రాలకు విస్తరించి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఇన్నాళ్ల “తిలా పాపం తలా పిడికెడు” నుంచి విముక్తి కోసమైనా పార్టీలు, నాయకులు మద్దతు ఇచ్చి ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా చూడడమే తక్షణ కర్తవ్యం. అలా కాని పక్షంలో ఆపత్కాలంలో తల్లడిల్లుతున్న ప్రజల ఓపిక శృతిమించితే తట్టుకోలేరు.
మేకిరి దామోదర్,
సోషల్ అనలిస్ట్, వరంగల్.