పండిత వంశంలో జన్మించి, నెల్లూరు సర్వోదయా కళాశాల అంధ్రోపన్యాసకునిగా, ప్రిన్సిపాల్‌గ పనిచేసి, అనేక గ్రంథాల సంపాదకత్వం వహించి, ఇప్పటికీ సాహిత్యంలో చురుకుగా ఉన్న కాళిదాసు పురుషోత్తంతో ఈ వారం ముఖా ముఖి.
మీ బాల్యం విద్యాభ్యాసం వివరాలు క్లుప్తంగా చెప్పండి?
మా పూర్వీకులది ప్రకాశం జిల్లాలోని తూమాడు గ్రామం. తాత ముత్తాతల కాలం నుండి మాది పండిత కుటుంబం. మా తండ్రి ‘‘విద్యావాచస్పతి’’ కాళిదాసు వేంకట సుబ్బశాస్త్రి. వ్యాకరణం, సంస్కత సాహిత్యంలో మహాపండితులు. నేను మొదట ఇంట్లో ఉండి వారివద్ద పన్నెండేళ్ళు వచ్చే వరకూ విద్యాభ్యాసం చేశాను. తర్వాత వారి అనారోగ్య కారణంగా 1953లో వెంకటగిరి రాజా వారి హైస్కూల్లో థర్డ్ ఫారంలో చేరి ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేశాను. మా తండ్రిగారి మరణం తర్వాత మా తల్లిగారు పల్లెలో ఉండి వ్యవసాయ పర్యవేక్షణ చేసేది. నేను నెల్లూరులో ఉంటూ 1964వ సం.లో తెలుగు, ఆర్ధికశాస్త్రం, చరిత్రతో బి.ఎ. పాసయ్యాను. అప్పటి కాలేజీ తెలుగు శాఖాధిపతి పోలూరు హనుమజ్జానక శర్మ ప్రోత్సాహంతో హైదరాబాదు వెళ్ళి ఉస్మానియాలో 1966 లో, ఎం.ఏ తెలుగు యూనివర్సిటీ ప్రథముడిగా నిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణపతకం సాధించాను. వెంటనే అక్కడే పీహెచ్డీ చేరి, ఆచార్య బిరుదురాజు రామారాజు మార్గదర్శకత్వంలో, ‘‘వెంకటగిరి సంస్థానం చరిత్ర-సాహిత్యం’’ అనే అంశంపై 1971 లో పీహెచ్డీ పట్టాపొందాను.
మీ ఉద్యోగ వివరాలు?
పీహెచ్డీ అయ్యాక, 1972 లో నెల్లూరులో సర్వోదయా కళాశాల స్థాపన జరిగింది. వెంటనే అక్కడ తెలుగు శాఖాధ్యక్షునిగా చేరి 2000 సం.లో అదే కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశాను.
తెలుగుపై తొలుత ఆసక్తి ఎలా కలిగింది?
తొలుత నుండీ మా కుటుంబంలో వేదం, సంస్కతం, తెలుగు, వ్యాకరణం మొదలైనవి వంశపారంపర్యంగా వస్తున్నవి. మా ముత్తాత గారు ‘చయనం’ చేశారు. మా తండ్రిగారి వద్ద చాలా సాహిత్య విషయాలు ఆకళింపు చేసుకున్నాను. నేను కొంత కాలం హైస్కూలు చదువుతో బాటూ నెల్లూరు వేద సంస్కత కళాశాలలో ‘‘కుమార సంభవం’’ క్లాసులకు కూడా హాజరయ్యాను. అలా క్రమేణా తెలుగుతో విడదీయరాని సంబంధం ఏర్పడింది. ఆ ఆసక్తితోనే నా చదువంతా తెలుగు ప్రాధాన్యంగానే సాగింది.
గోపీనాథుని వెంకయ్య శాస్త్రిగారి మీద పరిశోధన చెయ్యడానికి కారణం?
నెల్లూరులో ప్రముఖ న్యాయవాది, పండితులు ఎన్.ఎస్.కష్ణమూర్తిగారి ప్రోత్సాహంతో వెంకటగిరి సంస్థాన పండితుడైన వెంకయ్య శాస్త్రి రచనలమీద పరిశోధన చేశాను. తదనంతర కాలంలో ‘‘వెంకటగిరి సంస్థానం చరిత్ర సాహిత్యం’’ గ్రంధంగా తెచ్చాను.
మీ రచనల వివరాలు?
నేను సంపాదకత్వంపై ఎక్కువ దష్టి పెట్టాను. సంపాదకత్వం ద్వారా భిన్న విభిన్న విషయాలు వెలుగులోకి వస్తాయి. అవి రేబాల లక్ష్మీ నరసారెడ్డి షష్టిపూర్తి సంచిక, శివారెడ్డి పద్యాలు, దుర్భా సుబ్రహ్మణ్యశర్మ సమగ్ర రచనలు – కావ్య పంచమి, పొణకా కనకమ్మ ఆత్మకథ, కనకపుష్యరాగం, ఇంకా వర్ధమాన సమాజం వారి 1939-74 వరకూ నిర్వహించిన కవిత్రయ జయంతుల చరిత్రలు, కవిత్రయ కవితా వైజయంతి ఇలా అనేక గ్రంధాలను సహ సంపాదకత్వం వహించాను. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడెమీ వారి విజ్ఞాన సర్వస్వానికి కొన్ని వ్యాసాలు అందించడం చేశాను.
ఇంకా మీ అభిరుచులు? కెమేరా క్లబ్ సెక్రెటరీగా మీ అనుభవాలు?
నాకు సినిమా, ఫొటోగ్రఫీ, చరిత్ర, భాషలపై ఆసక్తి ఎక్కువ. ఫొటోగ్రఫీపై ఆసక్తి కొంచెం ఎక్కువే అని చెప్పాలి. 1974లో ది ప్రోగ్రెసివ్ ఫిల్మ్ అసోషియేషన్ నెలకొల్పి పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ అనుబంధంగా అనేక జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు చేశాము. 1979లో మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 15 రోజులు ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్సు చేశాను. 1980 డిసెంబరులో ప్రో-ఫిల్మ్ తరఫున నెల్లూరులో 10 రోజులపాటు జాతీయ స్థాయి ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్సు నిర్వహించాను. దానికి పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ క్యూరేటర్ పి.కె.నాయర్, డా.వనశ్రీ, ఆచార్య సతీష్ బహదూర్ పాఠాలు చెప్పారు. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వారి ఆహ్వానం మేరకు వివిధ విశ్వవిద్యాలయాల్లో ఫిల్మ్ అప్రీసియేషన్పై పాఠాలు చెప్పాను. దానిలో పాఠ్యాంశాలు నిర్ణయించే సభ్యుడిగా పనిచేశాను.
గురజాడపై మీరు చేసిన కృషి?
హైదరాబాదు స్టేట్ ఆర్కైవ్సులో ఉన్న గురజాడ రికార్డులు పరిశీలించి గురజాడ ఉత్తరాలు, దినచర్యలు, నోట్సు తదితర పత్రాలను యథాతథంగా మనసు ఫౌండేషన్ ప్రచురణ గురజాడ లబ్ధ సమగ్ర రచనల సంపుటంలో చేర్చి, ఆ సంపుటం’’గురుజాడలు’’ (2012)కు డాక్టర్ మన్నం వెంకట రాయుడు, స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకష్ణ, నేను ముగ్గురం సంపాదక బాధ్యత వహించాము. గతంలో వచ్చిన ఈ తరహా పుస్తకాల అనువాదాలు సరిగ్గా జరగలేదనే చెప్పాలి.
మీ భవిష్యత్ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి?
నేను అనేక విలువైన విశ్లేషాత్మక వ్యాసాలు గురజాడపై ఇంకా అనేక అంశాలపై వ్రాసినవి ఉన్నాయి. వాటిని ఒక పుస్తకంగా తెచ్చే ప్రయత్నంలో ఉన్నాను.
వర్ధమాన కవులకు/ రచయితలకు మీరిచ్చే సలహా/సందేశం?
ప్రత్యేకంగా సందేశం అని కాదు గానీ, కవులు రచయితలు తమ రచనల్లో సమకాలీన జీవితం ప్రతిబింబించే విధంగా వ్రాయాలి. గురజాడను మనం ఇన్ని సంవత్సేరాల తర్వాత కూడా తలుచుకుంటున్నది ఇందుకే! ఊహాలోకాల్లో విహరించి రాసినవాటికి భవిష్యత్తులో సాహిత్యంలో మంచి స్థానం ఉండదు అని చెప్పగలను.
