ప్రపంచ వ్యాప్తంగా యోగా డే ఉత్సవాలు

జాతీయం హోమ్

శ్రీనగర్‌లో యోగాసనాలువేసిన ప్రధాని
యోగాతో ఆరోగ్యాన్ని సాధించవచ్చని వెల్లడి
శ్రీనగర్‌ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకున్నారు. పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. శ్రీనగర్‌లోని డాల్‌ సరస్సు నద ఒడ్డున యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. షేర్‌`ఏ`కశ్మీర్‌ సమావేశ కేంద్రం వద్ద ప్రధాని మోడీ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని, యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని, యోగాతో శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయని, యోగా నేర్పే మహిళలకు పద్మ శ్రీ అవార్డు కూడా దక్కిందని మోడీ ప్రశంసించారు. భారత దేశంలో అనేక వర్సిటీలు యోగా కోర్సులు ప్రారంభించాయని, యోగా, ధ్యానంతో ఏకాగ్రత పెరుగుతోందని, యోగా ఇవాళ కోట్ల మందికి దైనందిన కార్యక్రమంగా మారిందని కొనియాడారు. యోగా ప్రాముఖ్యతను అనేక దేశాల నేతలు తనని అడిగారని, యోగా ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతోందన్నారు. దాల్‌ సరస్సు ఒడ్డున మోదీ 7000 మందితో యోగా చేయవలసి ఉండగా వర్షం కారణంగా కార్యక్రమానికి అంతరాయం కలిగింది. కార్యక్రమాన్ని ఇండోర్‌ స్టేడియంకు మార్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. యోగాను ప్రపంచ మంచికి శక్తివంతమైన ఏజెంట్‌గా చూస్తోందని మోదీ తెలిపారు. యోగా మనకు జీవించడంలో సహాయపడుతుందని అన్నారు. ఇది మనలోని లోతైన భావాలతో కలుపుతుందని, మన చుట్టూ ఉన్నవారి సంక్షేమాన్ని గ్రహించడంలో యోగా సహాయపడుతుందన్నారు. నేటి ప్రపంచంలో యోగా అనేది ఒక విజ్ఞాన శాస్త్రమని, మనిషి మనసుపై దృష్టి పెట్టడమే దీనికి పరిష్కార మర్గామని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలు,విశ్వవిద్యాలయాలు యోగాపై పరిశోధనలను ప్రచురిస్తున్నాయి. యోగా ఇప్పుడు పరిమితం కాదు. ప్రపంచం కొత్త యోగా ఆర్థిక వ్యవస్థను చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు యోగాను నేర్చుకోవడానికి భారతదేశానికి వస్తున్నారని మోదీ వెల్లడిరచారు. ఇది యోగా టూరిజాన్ని పెంచుతోందని మోదీ తెలిపారు. ప్రస్తుతం 100కి పైగా సంస్థలు ఆయుష్‌ మంత్రిత్వ శాఖ యోగా బోర్డు ద్వారా ధృవీకరించ బడినందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో క్రమంగా యోగా చేసే వారి సంఖ్య పెరుగు తోందన్నారు. యోగ ద్వారా మనం పొందుతున్న శక్తిని అనుభూతి చెందగలమని ప్రధాని అభిప్రాయం వ్యక్తం చేశారు. యోగా దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రజలకు, ప్రపంచంలోని ప్రతి మూలలో యోగా చేస్తున్న వారికి ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, జర్మనీలో ఇవాళ కోటిన్నర మంది నిత్యం యోగా చేస్తున్నారని, ప్రపంచ యోగా గురువుగా భారత్‌ మారిందన్నారు. అంతర్జాతీయ యోగా గురించి 2014లో ఐరాసలో ప్రస్తావించినప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 177 దేశాలు సమర్థించాయని గుర్తుచేశారు. అప్పటినుంచి యోగా దినోత్సవం రికార్డు సృష్టిస్తుందని అన్నారు.ఇకపోతే భారత సరిహద్దుల్లో మంచుతో ఉన్న ఎత్తైన శిఖరాల మధ్య ఆర్మీ సైనికులు యోగా డే సందర్భంగా యోగా సాధన చేశారు. అంతేకాదు మంచు మధ్య యోగా చేస్తూ సూర్య నమస్కారాలతో ఫిట్‌గా ఉండాలనే సందేశాన్ని ప్రజలకు అందించారు. దీంతోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో యోగా శిబిరాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా మెళకువలు నేర్చుకున్నారు. రోవైపు తూర్పు లడఖ్‌లో కూడా ఆర్మీ సైనికులు యోగా ఆసనాలు వేశారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా చేస్తూ కనిపించారు. ఈ దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ విూడియాలో షేర్‌ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. దేశంలోని అనేక చారిత్రక కేంద్రాల్లో మంత్రులు, పిల్లలు, మహిళలు సహా అనేక మంది పాల్గొని యోగా చేస్తున్నారు. యోగా ద్వారా శారీరక అవయవాలతో పాటు మనస్సు, మెదడు, ఆత్మకు సమతుల్యత చేకూరుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల శారీరక, మానసిక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని వెల్లడిరచారు. యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత లభిస్తాయని నిపుణులు వివరించారు. మంచి ఆరోగ్యానికి… యోగా బాటలు వేస్తుందని అన్నారు. యోగాతో శాంతివస్తుందని మహర్షులు, ఆచార్యులు చెప్పారన్నారు. యోగాతో ప్రపంచానికి శాంతి లభిస్తుందన్నారు. యోగా మనల్ని బలవంతులుగా చేస్తుందన్నారు. ఆరోగ్యం, శాంతి, సంతోషానికి సూచిక యోగా అని అన్నారు. కొన్నేళ్ల క్రితం అయితే ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా కనిపించేదని, కానీ ప్రస్తుతం ప్రపంచం నలుమూలలా విస్తరించిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *