ఇదే వికసిత భారత్‌ అనుకుంటే…

జాతీయం

వికసిత భారత్‌ పేరుతో ఇక ఎంతోకాలం అద్భుత ప్రసంగాలనే చేయలేం. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడా.. భారత్‌ వెలిగిపోతోందని మాట్లాడారు. బ్రహ్మాండగా అభివృద్ది చెందిందని, ప్రపంచంతో పోటీ పడుతోందని చెప్పారు. ఆర్థికంగా ఎదిగిందని అన్నారు. అనేక రంగాల్లో ముఖ్యంగా రైల్వే, విద్యుత్‌ రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించామని అన్నారు. నిజంగానే అభివృద్ది చెందితే ప్రజల బతుకులు ఎందుకు దౌర్భాగ్యంగా ఉన్నాయో తెలుసుకోలేకపోతున్నారు. రూపాయి ఎందుకు బలహీనపడుతుందో చెప్పడం లేదు. నిరుద్యోగుల ఆక్రందనలు ఎందుకు పట్టించుకోవడం లేదు. ధరలు అందకుండా పోతున్నా ఎందుకు చర్యలు కోవడం లేదు. ఇవన్నీ దాచి భారత్‌ పరుగులు పెడుతుందని, అభివృద్దితో దూసుకుపోతుందని ఎలా చెప్పగలుగుతున్నారు. సొంత డబ్బా కొట్టుకోవడంతోనే అమృత కాలం సాగుతోంది. ప్రజలు సజావుగా.. సక్రమంగా బతకడానికి అవసరమైన పరిస్థితులు ఉంటేనే ప్రజలు అమృతకాలం గొప్పదని భావిస్తారు. కాలం మంచిగా ఉండాలంటే పాలకుల్లో చిత్తశుద్ది ఉండాలి. ప్రజలకు మేలు చేయాలన్న తపనా ఉండాలి. ప్రజలకు బతుకుపై భరోసా కల్పించేలా పాలకుల విధానాలు కూడా ముఖ్యం. ఇవన్నీ ఉంటే ప్రజలు మరింత కష్టపడ గలరు. దేశ అర్థిక పురోభివృద్దిలో తమ చెమటను రంగరించగలరు. ముందుగా ఈ దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి. కులాలకతీతంగా అభివృద్ది సాగాలి. కులాల ఆధారంగా పేదరికాన్ని నిర్ధారించ లేమని గుర్తించాలి. కులగణన అంటున్న వారు…భారత్‌ను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలను పటిష్ఠం చేస్తున్నారని భావించాలి. ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకుని రావాలి. కులమతాలు అవసరం లేదంటున్న రాజకీయ నాయకులు ఈ విషయంలో ద్వంద్వ నీతిని పక్కన పెట్టాలి. ఒకేదేశంలో ఒకే చట్టం ఉండాలి. అది ఎవరికైనా ఒకే విధంగా ఉండాలని కోరుకోవాలి. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతి ఉండడం వాంఛనీయమే. సమాజంలో ఏ వర్గమైనా ఇవాళ వెనకబడి ఉండడానికి, కొద్ది మంది చేతుల్లో సంపద కేంద్రీకృతం కావడమే కారణంగా చూడాలి. ఈ అసమనాతలను తొలగించేలా పాలనా పరమైన చర్యలు తీసుకోవాలి. 50 శాతం సంపద కేవలం మూడు శాతం జనాభా చేతుల్లో ఉండడం వల్ల పేదలు మరింత పేదులగా మారారు. అత్యధిక జనాభా రెండుపూటల భోజనం చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నదని గుర్తించడం లేదు. అన్నధాన్యాలు పండుతున్నా పస్తులు ఉండాల్సిన ఖర్మ పడుతోంది. పేదరికం, అత్యాచారాలు, అవమానాలు, అణిచివేత ఈ దేశంలో సర్వసాధారణ విషయాలుగా మారయి. ఈ దేశంలో నిరుపేదలైన ఆదివాసులు చిన్నచిన్న నేరాలపై ఏళ్లతరబడి బెయిలు లేకుండా జైళ్లలో మగ్గు తున్నారు. ప్రధాని మోదీ పదేపదే మరో పాతిక సంవత్సరాల అమృత కాలంలో తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వికసిత భారత్‌ అంటూ కొత్త నినాదాం ఎత్తుకున్నారు. దేశం ఎలా ఉండాలో చెబుతున్నారు. తీసుకుంటున్న చర్యలు ఎలా సాకారం కాబోతున్నాయో చెబుతున్నారు. కానీ దానికన్నా ముఖ్యం ప్రజలు ఈ దేశంలో స్వేచ్ఛగా బతకగలిగేలా పరిస్థితులు రావాలి. బతుకుతామన్న ధీమా కూడా ముఖ్యమే. ఉద్యోగం లేదా ఉపాధి ఎంచుకుని బతుకుతామన్న భరోసాకు తగ్గట్లుగా పరిస్థితులు కల్పించాలి. ధరలను అదుపు చేయగలగాలి. ప్రధానమంత్రిగా మోడీ ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, లైంగిక, చట్టపరమైన అసమానతలపై మాట్లాడడంలో తప్పు లేదు. కానీ సామాన్యులు వీటిని పాటిస్తూనే.. బతకు దెరువు ఎలా అన్న బెంగలో ఉండరాదు. ఇకపోతే ఇవన్నీ చిత్తశుద్దిగా అమలు చేస్తూ..ప్రజల్లో విశ్వాసం కలిగిస్తే..పాలకులను వారే అక్కున చేర్చుకుంటారు. ప్రజల మద్దతు పొందేందుకు అప్పుడు ఎత్తులు జిత్తులు వేయాల్సిన అవసరం లేదు. తగిన అభివృద్ది విధానాలను కొనసాగిస్తే తద్వారా ప్రజలను ఆకర్షించి విస్తరించగలిగిన శక్తి దానతంతట అదే సమకూరుతుంది. అప్పుడు అధికారం కోసం ఎలాంటి అనారోగ్య కరమైన చర్యలకు పాల్పడాల్సిన అవసరం ఉండదు. దేశంలో అవినీతికి, కుంభకోణాలకు పాల్పడుతున్న శక్తుల్నీ ఏకమవుతు న్నాయని విరుచుకుపడిన మోదీ, వారి భరతం పట్టడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారన్నదే అనుమానం. కాళేశ్వరంలో అవినీతి జరిగితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. జగన్‌, కెసిఆర్‌ల అవినీతి గురించి పదేపదే మాట్లాడుతున్న బిజెపి నేతలు ఒక్క చిన్న చర్య కూడా తీసుకోలేక పోయారు.ప్రజల్లో విశ్వాసం కల్పించే బదులు రాజకీయ అవకాశ వాదం అవలంబిస్తూ వస్తున్నారు.పార్టీలను చీల్చడం, తమకు అనుకూలంగ ఆప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం మోడీ దృష్టిలో అభివృద్ది అవుతుందేమో. కేవలం ప్రతిపక్షాలపై మాత్రమే అవినీతి ఆరోపణలు చేస్తే ప్రజలు ఎలా విశ్వసిస్తారన్నది కూడా గమనించాలి. అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామన్న మోదీ ఉపన్యాసాలకు విలువ లేదని కూడా తేలిపోయింది. మోదీ హయాంలో బీజేపీ సైద్ధాంతిక విలువలకు తిలోదకాలు ఇచ్చింది. ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీ ఒక విశిష్టమైన పార్టీ అని చెప్పుకోలేని దుస్థితిలో ఏర్పడిరది. ఎన్నికల్లో గెలిచేందుకు ఎటువంటి దుష్కార్యాల కైనా వెనకాడదని నిరూపించుకుంటోది. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయడం, కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడవేయడం అన్న సూతాల్ర ఆధారంగానే పాలన సాగుతోంది తప్ప ..ప్రజలకు మంచి చేయడం ద్వారా పాలన సాగడం లేదని గ్రహించాలి. ప్రధాని మోడీ చెప్పినట్లు దేశం పురోగమించిందటే ఉపాధి పెరగాలి. ఉద్యోగాల కల్పనా జరగాలి. అవినీతి నేతలను బొక్కలో తోయాలి. ఇవేవీ జరగడం లేదంటే.. మోడీ మాటల్లో నిజం లేదని గుర్తించాలి. ఇదే వికసిత భారత్‌ అనుకుంటే చేసేదేవిూ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *