తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం

హోమ్

పూరీ : ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరుచుకుంది. 46 ఏళ్ల తరువాత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు ఆ రహస్య గదిని తెరిచారు. రత్న భాండాగారంపై ఒడిశా ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు మధ్యాహ్నం 12 గంటలకు ఆలంయంలోకి ప్రవేశించారని, అంతరం పూజలు నిర్వహించిన తరువాత గదులను తెరించినట్లు ఒడిశా సిఎం కార్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 11 మంది మాత్రమే లోపలికి వెళ్లారు. రత్న భాండాగారం లోపలి, వెలపలి గదులు తెరిచిన తరువాత వారంతా బయటకు వచ్చారు. ముందుగా తాము రత్న భాండాగారం వెలపలి గదిని తెరిచామని, అందులో ఉన్న విలవైన వస్తువులు, ఆభరణాలను ఆలయం లోపల ఉన్న తాత్కాలిక స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించామని, దానికి సీల్‌ వేశామన్నారు. ఆ తరువాత ఆధీకృత వ్యక్తులు భాండాగారం లోపలి గదిలోకి ప్రవేశించారని పాధీ మీడియాకు తెలిపారు. అయితే అధికారుల వద్ద ఉన్న తాళం చెవిలతో ఏ ఒక్క తాళం కూడా తెరుచుకోలేదని, అందువల్ల ఎస్‌ఒపి నిబంధనల ప్రకారం మేజిస్ట్రేట్‌ సమక్షంలో మూడు తాళాలను పగులగొట్టామన్నారు. అయితే లోపలి గదిలోకి తక్షణమే విలువైన వస్తువులను మార్చకూడదని కమిటీ నిర్ణయం తీసుకందని చెప్పారు. రథయాత్ర ముగిసిన తరువాత వస్తువుల తరలింపును తేదీని ఖరారు చేస్తామన్నారు.
46 ఏళ్ల క్రితం తెరిచారు.
రత్న భాండాగారాన్ని చివరిసారిగా 46 ఏళ్ల క్రితం 1978లో తెరిచారు. సంపద ఉన్న పెట్టెలు జీర్ణావస్థలో ఉండే మార్చేందుకు వీలుగా 15 చెక్క పెట్టెలను అధికారులు సిద్ధం చేయించారు. వాటిలో ఆరింటిని ఆ గది వద్దకు ఆదివారం ఉదయం తరలించారు. శ్రీక్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మాలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్‌లు చేపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకుండా భాండాగారం తెరిచేందుకు అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు. ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియనంతా ఒడిశా ప్రభుత్వం డిజిటలైజేషన్‌ చేయనుంది. ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది? అనేది అధికారులు చెప్పలేక పోతున్నారు. భాండాగారం మరమ్మతులు, లెక్కింపు ఒకేసారి జరగనుందా ? అనే వివరాలపై స్పష్టత రాలేదు.
చివరి సారిగా 1978 లో లెక్కించగా, 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు కూడా దీన్ని సమర్థించింది. రహస్య గదులు జీర్ణావస్థకు చేరి, వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతున్నందున మరమ్మతులు చేయాలని కోర్టులు 2018 లోనే పురావస్తుశాఖను ఆదేశించాయి. 2019 ఏప్రిల్‌ 6 న నాటి నవీన్‌ పట్నాయక్‌ సర్కారు నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్లగా, రహస్య గది తాళపు చెవి కనిపించలేదు. దీంతో సభ్యులు వెనుదిరిగారు. తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి ప్రభుత్వం జస్టిస్‌ రఘువీర్‌దాస్‌ కమిటీని నియమించింది. ఇంతలో డూప్లికేట్‌ తాళపు చెవి పూరీ కలెక్టరేట్‌ ట్రెజరీలో ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు రఘువీర్‌ కమిటీ నివేదికను ప్రభుత్వం వెల్లడించలేదు. దీన్ని ఇటీవలి ఎన్నికల్లో బిజెపి ప్రచారాస్త్రంగా చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి , విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. ఆ కమిటీ రత్నభాండాగారం తెరవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *