అక్రమ కేసులతో వేధించిన వారిపై చర్యలు

ఆంధ్రప్రదేశ్

ఎంతటి వారు ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదు
సినీ నటి కాదంబరి జత్వాని కేసుపై హోంమంత్రి స్పందన
అమరావతి : అక్రమంగా కేసులు బనాయించి వేధించిన వారిపై చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రి అనిత హెచ్చరించారు. ముంబయి సినీ నటి కాదంబరి జత్వాని కేసుపై ఆమె స్పందించారు. నటి కాదంబరి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. కేసుపై విచారణ జరుగుతుందన్నారు. దర్యాప్తు కోసం ఓ మహిళా అధికారిని నియమించామని హోంమంత్రి అనిత తెలిపారు. ఓ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తామన్నారు. కేసులో ఎంతటి వారున్నా చట్టపరంగా శిక్షిస్తామన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని హోంమంత్రి పేర్కొన్నారు. పోలీసులు ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసి సొంత పనులకు ఉపయోగించుకున్నారని తెలిపారు. ఎక్సైజ్‌ విభాగాన్ని పూర్తిగా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. దిశా పోలీస్‌ స్టేషన్లు ను మహిళా పోలీస్‌ స్టేషన్లుగా మార్చామని హోంమంత్రి పేర్కొన్నారు. సర్క్యూట్‌ హౌస్‌ లో వినాయక చవతి ఉత్సవాల అనుమతిపై సింగల్‌ విండో పోర్టల్‌ను హోంమంత్రి అనిత ప్రారంభించారు. వినాయకచతి ఉత్సవాలకు సింగిల్‌ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఉత్సవాలకు అనుమతులు పొందవచ్చని తెలిపారు. రేపటి నుంచి యాప్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. యాప్‌ లో ఉత్సవాలకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తే అన్ని విభాగాల అధికారులు పరిశీలించి అనుమతులు ఇస్తారని చెప్పారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారని, ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. వినాయక చవితి ఉత్సవాల్లో భద్రత విషయంలో రాజీపడే సమస్య లేదని స్పష్టం చేశారు. ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా ఉత్సవాలు చేసుకోవాలని హోంమంత్రి సూచించారు. ముంబయి నటి కాదంబరి జత్వానిపై పెట్టిన అక్రమ కేసును రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ ఈ పిటిషన్‌ వేశారు. జత్వాని కేసులో పోలీసులు, వైసీపీ నేతలు కుట్రపూరితంగా వ్యవహరించారని ఈ సందర్భంగా లాయర్‌ పేర్కొన్నారు. ఒక్కరోజులోనే విచారణ, సాక్ష్యాల సేకరణ ఎలా సాధ్యమన్నారు. ఫోర్జరీ కేసులో సంబంధం లేకపోయినా జత్వాని తల్లిదండ్రులను అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారుల పాత్రపై లోతుగా విచారణ జరపాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *