లాంఛనంగా ప్రారంభించిన సిఎం రేంవత్ రెడ్డి
దివంగత మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నట్లు ప్రకటన
పాతబస్తీ అభివృద్దిలో ఎంతో కీలకమన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్
హైదరాబాద్ : ఆరాంఘర్- జూ పార్క్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రూ.799 కోట్ల జీహెచ్‌ఎంసీ నిధులతో ఆరంఘార్ చౌరస్తా నుంచి జూపార్క్ వరకూ 6 లైన్ల ఫ్లై ఓవర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. 4.08 కిలోవిూటర్ల పొడువు, 23 విూటర్ల వెడల్పుతో అధికారులు దీన్ని నిర్మించారు. నగరంలో పీవీ ఎక్స్‌ప్రెస్ వే తర్వాత ఇదే రెండో అతి పెద్ద ఫ్లై ఓవర్.సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు, అధికారులతో కలిసి దీన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం దీనికి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం కావడంతో నగరంలో ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది. ఆరంఘార్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే బెంగళూరు హైవే నుంచి హైదరాబాద్ నగరంలోకి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తేలికగా ప్రవేశించవచ్చు. అలాగే ఎంజీబీఎస్ బహదూర్ పుర నుంచి ఎయిర్‌పోర్ట్, బెంగళూరు హైవేకు సులువుగా వెళ్లొచ్చు. తాడ్ బన్ జంక్షన్, దానమ్మ హాట్స్, శాస్త్రీపురం, హాసన్ నగర్, శివరాంపల్లి జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు లేకుండా దీనిపైనుంచి నగర వాసులు సులభంగా ప్రయాణించవచ్చు. ఎస్‌ఆర్డీపీ కింద నిర్మిస్తున్న 42 ప్రాజెక్టుల్లో ఇప్పటివరకూ 36 ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు అందుబాటులోకి వచ్చాయి. కాగా, 37వ ప్రాజెక్టుగా ఆరంఘార్-జూ పార్క్ ప్లై ఓవర్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఓల్డ్ సిటీ చాలా అందమైన నగరమని.. ఇక్కడ ఉండే ప్రజలంతా ప్రేమానురాగాలతో ఉంటారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు.. ఈ కార్యక్రమంలో అక్బరుద్దీన్ పాల్గొని ప్రసంగించారు. ‘ఓల్డ్ సిటీలో ఇంత పెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రూ.301 కోట్లతో సివరేజ్ పనులు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. వర్షం నీరు, మురుగు నీరు కలవకుండా వేర్వేరు లైన్ ఏర్పాటు చేయడం సంతోషం. మురుగు నీరును కూడా బాగు చేయడానికి ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారని.. దీంతో మూసీలో మురుగు లేకుండా చేయడానికి అవకాశం కలుగుతుంది.‘అని వివరించారు. గత ప్రభుత్వం ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్, సింగపూర్ చేస్తామని అన్నారని.. కానీ చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ఓల్డ్ సిటీకి ప్రతి రోజు వేల సంఖ్యలో టూరిస్ట్‌లు వస్తారని.. ఓల్డ్ సిటీని మరింత డెవలప్ చేస్తే టూరిజం మరింత పెరిగే అవకాశం ఉందని సూచించారు. ప్రభుత్వం తీసుకొస్తామన్న టూరిజం పాలసీలో మక్కా మసీదుతో పాటు ఇతర మసీదులను కూడా చేర్చితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఓల్డ్ సిటీలో కూడా హైరేంజ్ అపార్ట్‌మెంట్ కల్చర్ వస్తుందన్నారు. కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వం దృష్టిసారించి త్వరగా పూర్తి చేయాలని కోరారు. సిటీలో ఉన్న స్టేడియాలను పొలిటికల్ పార్టీ విూటింగ్స్ ఇవ్వకుండా స్పోర్ట్స్‌ను పెంచే విధంగా ఉండాలన్నారు. ఓల్డ్ సిటీ నుంచి ఒలంపిక్స్‌లో మెడల్స్ తీసుకువచ్చే ఫుడ్ బాల్ ప్లేయర్స్ ఉన్నారని.. వారికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఓల్డ్ సిటీలో హిందూ- ముస్లిం అనే తేడా లేకుండా కలిసిమెలిసి ఉంటారన్నారు. ఓల్డ్ సిటీకి మెట్రో రైలు తీసుకొస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి అక్బరుద్దీన్ ధన్యవాదాలు తెలిపారు.
అందుబాటులోకి ఆరాంఘర్- జూ పార్క్ ఫ్లై ఓవర్















