అందమైన పూలతోట – ముళ్ళతోనే బాధ!

శ్రీమతి ఝాన్సీగారు కథకురాలుగా, నవలా రచయిత్రిగా, కవయిత్రిగా తెలుగు సాహితీలోకానికి సుపరిచితురాలు, పాఠకుల ఆదరణని విశేషంగా పొందిన ఉత్తమ సాహితీ విదుషీమణి. రచనలో తనదైన భావభావనలతో, అభివ్యక్తీకరణ గుణవిశేషాలతో ఒక ప్రత్యేకముద్రను సంతరించుకున్న రచయిత్రి.

_____________________

ఈ ‘జీవితం అంచున…Second Innings’ అనేది ఝాన్సీగారి ఆత్మకథనాత్మక నవల లేక నవలాత్మక ఆత్మకథ అనుకోవచ్చు. నిజానికి ఎవరి ఆత్మకథ అయినా ఒక నవలే. కారణం ఆ వ్యక్తి జీవిత ప్రస్థానంలోని కాలం, ఆ కాలంలోని సమాజం, ఆ సమాజంలోని మనుషులతో ఆ వ్యక్తి సంబంధ, సంఘర్షణలూ ఆత్మకథలో ప్రతిబింబిస్తాయి. అలాగే, ఆ వ్యక్తి నడిచిన, నడుస్తున్న ప్రదేశాల నేపథ్యం /వాతావరణం, విలక్షణతలూ కూడా ఆ రచనలో ప్రతిఫలిస్తాయి. వీటన్నిటి మధ్యనా కేంద్రంగా ఆ వ్యక్తి మనోధర్మం, చిత్తవృత్తీ, ప్రవర్తనారీతీ, మనస్తత్వ వైరుధ్యాలు కూడా పాఠకులకు అందుతాయి. కనుక, ఈ పుస్తకాన్ని మనం నవలగానే భావించవచ్చు. నేను అలా చదివే ఆనందించాను.
_______________________

నవలలో ‘జానూ’ అనే ప్రధానపాత్ర ఉత్తమ పురుషలో చెప్పిన కథనం ఏకబిగిన చదివించే గుణంతో సాగింది.
వైద్యవృత్తే పరమావధిగా పెరుగుతూ వచ్చిన జానూ అరవయ్యో యేట అసిస్టెంట్ నర్సింగ్ విద్యార్థిగా చదువు సాగించటంతో కథ మొదలవుతుంది.
ఆస్ట్రేలియాలో నర్సింగ్ కాలేజీ, చదువు, వాతావరణం, దేశదేశాల సహవిద్యార్థినీ విద్యార్థులు, తల్లి సంరక్షణకు తాను ఏర్పాటు చేసిన మనుషులు, ఆ తల్లి అసాధారణ ప్రవర్తన, ఇలా… నవలలో జానూ ఎక్కడికక్కడ ప్రతి అంశాన్ని గురించీ సవిస్తరంగా వివరాల్ని చెబుతుంది.

ఇన్ని ఇక్కట్ల మధ్యనా ఆమె తన ప్రవృత్తిమార్గం సాహిత్యారాధన, రచనా వ్యాసంగం మానలేదు. ఒక దీర్ఘకవిత, కథాసంపుటి పూర్తి చేసి వాటి ఆవిష్కరణకు హైదరాబాద్ వెళుతుంది. ఆ తరువాత రవీంద్రభారతిలో భారీ ఎత్తున జరిగిన కార్యక్రమం నవలలో ఒక అత్యంత ప్రధానమైన మలుపు.
ఇక్కడినుండి నవలంతా జానూ, రాఘవల మధ్య సాన్నిహిత్యపు మాటలు, కలిసి తిరగటం, ఆహార విహారాల్లో కలివిడితనం… ఇలా ఒక కళాజీవి, ఒక ప్రేమికురాలి ప్రేమోన్మాద చిత్రణ. అతను చాలాసార్లు పెళ్ళి ప్రసక్తి తెస్తాడు. ఈమె ఒప్పుకోదు. కానీ ప్రేమిస్తుంది.
ఆమె ఆలోచనా పరంపరలో ద్వైదీభావం హేమ్లెట్ ప్రశ్న!
భౌతిక వాస్తవాలూ, తాత్త్విక చింతనల మధ్య ప్రేమ గురించి చాలా విచికిత్సకు లోనవుతూ వుంటుంది. ఆమె మనసు, మేధ కూడా ఊగులాటకి వాసస్థానాలయినై.
మరి నవల ముగింపేమిటి? చివరి వరకూ చదివి తెలుసుకోవలిసిందే!!

‘జీవితం అంచున’ నవల ఒక ఉత్తమ సామాజిక నవల. ఈనాటి సామాజిక వాస్తవికత, ఎన్.ఆర్.ఐ లు, వారి సమస్యలు, వారి సంస్కృతీ సంప్రదాయాలు, మూలవాసుల జీవనశైలికీ, వీరి పద్ధతులకూ ఆచార వ్యవహారాలకూ మధ్యన వున్న తేడా ఇవన్నీ నవలలో కనిపిస్తాయి. హైదరాబాద్ లో హాస్పటల్స్, ఆస్ట్రేలియాలో హాస్పటల్స్ నిర్వహణ పద్ధతులు, మారుతున్న యువత అలవాట్లూ, స్వేచ్ఛావర్తన, పబ్ కల్చర్ ధోరణులు చిత్రితమైనాయి.
ఈ రచన ఒక ఉత్తమ కౌటుంబిక నవల. తెలుగు కుటుంబాలు, వాటిలో భిన్నత్వం, కులభేదాలు, పెళ్ళిళ్ళ వంటి ఆచారాల వర్ణన, కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు, రాకపోకలు, పరస్పర ఆత్మీయానురాగాలు, వాటి నడుమ మళ్ళీ అవసరం అవకాశం చేసే వికృతం, నమ్మినవారిలో నిజాయితీ, నమ్మకద్రోహం… అన్నీ చక్కగా పారదర్శకమై కథనాత్మకమైనాయి.

తండ్రి, తల్లి, కూతురు, అత్త, అల్లుడు, అమ్మమ్మ, మనవరాలు… వారి మధ్యనగల ఆత్మీయత, అనుబంధం, ఆప్యాయతలు వాటికి సమాంతరంగా వైరుధ్యాలు నవలాంశంగా మానవ సంబంధాల వైవిధ్యాన్ని చూపాయి.

నవల ఇతివృత్తంలో ‘ప్రేమ’ ఇరుసు. రాఘవ జానూల మధ్య ముదిమిలో మొగ్గ తొడిగిన ప్రేమకు, మానసిక సంఘర్షణకు సామాజికంగా, వ్యక్తిపరంగా మానసికంగానూ ఎంతో ప్రాధాన్యం ఉన్నది. దాన్ని గుర్తిస్తే ఆలోచనా, అలజడీ కూడా తీవ్రంగానే ఉంటాయి. అలాగే వారిద్దరి ప్రవర్తనకీ, మనసుల కలబోతకీ మూలాల్ని గురించి ఆలోచించినప్పుడు ‘ఫ్రాయిడ్’ మనల్ని కలవరపరుస్తాడు. నాకు బెర్గ్సన్ ఫిలాసఫీలో అతన్నన్న మాట ‘To exist is to change, to change is to mature, to mature is to go on creating oneself endlessly’ అన్న సూక్తి జాను మానసిక ద్వైదీభావంలోనూ, రాఘవ స్పష్టాతిస్పష్ట నిర్ణయంలోనూ పదేపదే గుర్తుకొచ్చాయి. ఆ పాత్రల బహిరంతర యుద్ధరంగాన్ని, ప్రత్యేకించి మహిళగా జానూ వ్యక్తిగత వాంఛలకూ, తల్లిగా బాధ్యతల గుర్తింపుకూ మధ్య నలిగిపోవడాన్ని చాలా నిజాయితీతో బహిర్గతం చేసింది రచయిత్రి.

నవలా నిర్మాణం, శిల్పం గురించి ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి ఒకటి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఝాన్సీగారు ప్రతి అధ్యాయం ఎత్తుగడలో కనిపింపజేసిన ఆమె రచనా నైపుణ్యం. ఉత్తమ కథాకథనం, నవలా శిల్పం గురించి చెప్పేటప్పుడు వాస్తవికతని సంఘటనాత్మకం చేయటం ఎంత ముఖ్యమో, అంతకంతగా జీవితాన్ని విశ్లేషించటమూ ముఖ్యం అంటారు. సరే. ఈ రెంటికంటే ప్రాథమ్యం వహించేది కథనంలో రచయిత చేసే జీవిత వ్యాఖ్యానం. దీని ద్వారా కథనానికి గాఢతను అద్ది..వస్తువునీ, సందేశాన్ని అనుభూతిప్రదం చేయగలుగుతాడు రచయిత. ఝాన్సీగారికి ఈ చాతుర్యంలో ‘డిస్టింగ్షన్’ ఇవ్వాల్సిందే! ఈ నవల పొడవునా అలాంటి వ్యాఖ్యానాలు కవితాత్మకంగా చాలా తగుల్తాయి. ‘ఆగు చూడు-నడు’ అని హెచ్చరిస్తాయి. పఠితని అంతర్ముఖీనుణ్ణి చేస్తాయి.

_________________

ఝాన్సీగారి శైలి సెలయేటిజాలు. సహజసరళసుందరంగా వుంటూనే. పాయసంలో జీడిపప్పుల్లా కొన్ని కొన్ని పోలికలూ, రూపకాలూ మధురంగా ఆస్వాదనీయం అవుతాయి.
__________________

‘జీవితం అంచున’ ఒక భావుకురాలి ఆత్మవ్యక్తీకరణం. ఆత్మ ముగ్ధత్వరూపం కూడా. మూసరచనల ‘మొనాటనీ’ పాలబడుతున్న రసహృదయుల్ని ఆత్మీయస్పర్శతో పులకింపజేసే తెమ్మెరసోన. చదివి ఆనందించండి.

-విహారి
98480 25600