వెంకట కృష్ణ చాలా సౌమ్యుడు, మితభాషి. కానీ ఆయనతో పది నిమిషాలు మాట్లాడితే చాలు, అతడెంత లోతైన మనిషో అర్థమవుతుంది. ఆయన లాగే ఆయన కథలు కూడా పైకి చాలా సరళంగా కనిపించినా, లోలోపల లోతైన అర్థాన్ని ఇముడ్చుకున్నాయి. ఒక్కొక్క పొర వొలుచుకుంటూ వెళ్తేనే గానీ ఆ కథల లోతు, విస్తృతి అర్థం కావు. వెంకట కృష్ణ విస్తృతంగా రాయకపోవచ్చు కానీ, రాసిన కొద్దిపాటి రచనలైనా ‘నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు’ అన్నట్టుగా ఉంటాయి.
_____________________
వెంకట కృష్ణ చూపు విస్తృతమైనది. తన నేల మీద నిలబడి, ఆ నేలను ప్రభావితం చేస్తున్న విశ్వవ్యాప్త అంశాల మీద తన వ్యాఖ్యను తనకే సాధ్యమైన రీతిలో ఒక సంతకంలా చేస్తారు. ‘నీలమెరుపు’ బహుశా ఆయన నాలుగవ కథా సంపుటి అనుకుంటాను. సామూహికంగా ప్రజలను వేధించే సమస్యలకు సామూహిక ఉద్యమాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని బలంగా నమ్మే వెంకట కృష్ణ, ఈ సంపుటికి ‘నీలమెరుపు’ అని పేరు పెట్టడం వెనుక కూడా అదే తాత్వికత ఉన్నది.
______________________
సామాజిక రంగంలో ఎరుపు, నీలం కలిసి ‘నీలమెరుపు’గా పనిచేయాలనే బలమైన ఆకాంక్షకు ఈ సంపుటి ఒక దారి చూపిస్తుంది. కర్నూలు జిల్లా నేపథ్యంగా అక్కడి సామాజిక జీవనాన్ని, కరువు కాటకాల విధ్వంసాన్ని, ఆ విధ్వంసం వెనుక ఉన్న కార్యకారణ సంబంధాలను, గ్లోబల్ సందర్భంలో సంపద తెచ్చే మార్పుల వెనుక ఉండే డొల్లతనాన్ని చాలా ప్రతిభావంతంగా వివరించిన కథలు ఇవి. తాను నివసించే ప్రాంతం పట్ల, ఆ మనుషుల పట్ల ఎంతో మక్కువ, ప్రేమ ఉంటే కానీ ఇలాంటి కథలు పుట్టవు. ఎంచుకున్న వస్తువు పట్ల స్పష్టత, నిర్మాణ క్రమం పట్ల ఎరుక సమృద్ధిగా ఉన్నవాడు కనుక, ఈ కథలన్నీ పాఠకుడి ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తాయి తప్ప ఎలాంటి గందరగోళంలోకి నెట్టవు. చరిత్ర పట్ల, దాని గమనం పట్ల నిరపేక్షంగా ఉండటం ఈ కథలలో కనబడే ప్రత్యేక లక్షణం. చరిత్రను తమకు ఇష్టం వచ్చినట్టు మార్చేస్తూ, వక్రీకరణలకు చట్టబద్ధత తెస్తున్న ప్రస్తుత విషాద సందర్భంలో, చరిత్ర పట్ల ఇటువంటి నిరపేక్ష దృష్టి సాహిత్య రంగానికి ఎంతో అవసరం.
తెలుగులో ‘గిల్ట్’ (అపరాధ భావం) మీద చాలా కథలు వచ్చి ఉండొచ్చు కానీ, వెంకట కృష్ణ రాసిన ‘వేదవతి’ కథ మాత్రం చాలా ప్రత్యేకమైనది. తన వల్లనే తాను ఇష్టపడిన వేదవతి, ఆమె కుటుంబం చనిపోయారనే అపరాధ భావంతో, పదిహేనేళ్లుగా తనకు తాను శిక్ష వేసుకుని జీవచ్ఛవంలా బతుకుతున్న నంజుండ జీవితంలోకి వేదవతి నది మీద నుండి వీచే చల్లగాలిలా కథకుడు వస్తాడు. ఈ వేదవతి నది, నంజుండ కోల్పోయిన వేదవతికి నిలువెత్తు మానవీయ రూపమని చెప్పి, అతడిని వేదవతి నదిపై ఎత్తిపోతల పథకం కోసం చేసే ఉద్యమంలో భాగస్వామిని చేస్తాడు. నిజానికి ‘వేదవతి’ కథ చదువుతుంటే అది కేవలం ఎత్తిపోతల పథకం కోసం చేసే ఉద్యమ కథ అనుకుంటాము. కానీ, అపరాధ భావంతో గడ్డకట్టిపోయిన ఒక నది లాంటి మనిషిని మళ్ళీ ప్రవహింపజేసిన స్నేహితుడి ప్రయత్నం అది. ఇది నీటి చుట్టూ తిరిగిన కథే అయినా, గుండె కింద తడి కోల్పోని మనుషుల కథ కూడా. మొదటిసారి చదివితే ఇది పాళ్యం ప్రాంత వాసుల ప్రయత్నంలా, రెండోసారి చదివితే దగాపడిన నంజుండ కథలా, మూడోసారి చదివితే ఎత్తిపోతల పథకం వస్తుందని తెలియగానే బళ్లారి ప్రాంతంలో స్థిరపడిన ఆధిపత్య వర్గాలు తక్కువ ధరకే భూములు కొనేసి తమ అధికారాన్ని స్థిరపరచుకునే ‘కేజీఎఫ్’ కథలా అనిపిస్తుంది. ఇలా ఒక లేయర్ మీద మరొక లేయర్ నేయడం వెంకట కృష్ణ శైలి.
‘ఒరుపు కన్నుల తల్లి’ కథలో రాయలసీమ, మరీ ముఖ్యంగా కర్నూలు ప్రాంతానికి ఎవరెవరు ఎలా అన్యాయం చేశారో సాధికారికంగా చెప్పారు. సిద్ధేశ్వరం నుండి నందికొండకు ప్రాజెక్టు ఎలా తరలిపోయిందో, అందుకు స్వంత నాయకుల స్వార్థం ఎంతవరకు దోహదం చేసిందో నిరపేక్షంగా వివరించారు. ఖోస్లా కమిటీ నందికొండను చూడటానికి వచ్చినప్పుడు స్వంత ఖర్చుతో రహదారి నిర్మించిన కోస్తా చైతన్యాన్ని, బ్రాహ్మణ నాయకత్వానికి తెరదించే క్రమంలో పప్పూరు రామాచార్యులను పక్కన పెట్టి కడప కోటిరెడ్డిని ఏనుగు అంబారీ ఎక్కించిన నీలం సంజీవరెడ్డి రాజకీయ వ్యూహాన్ని వెంకట కృష్ణ ఎక్కడా తడబాటు లేకుండా వివరిస్తారు.
ఎన్నార్సీ, సీఏఏల నేపథ్యంలో రాసిన ‘ఎవరామె’ కథ తెలుగు సమాజంలో పెనవేసుకుపోయిన హిందూ-ముస్లిం సమైక్యతను బలంగా దృశ్యమానం చేస్తుంది. ఈ కథ చదువుతున్నప్పుడు నాకు పశ్చిమ బెంగాల్‌లోని షంషేర్‌గంజ్‌లో ఒక ముస్లిం యువకుడు నిలదీసిన ఉదంతం గుర్తుకువచ్చింది— “ఇదుగో 1942లో మా తాత పేరున ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్, ఇదో 1972లో మా నాన్న పేరు మీదకు మారిన పత్రం.. నాకెందుకు ఓటివ్వరు?” అని. కాళ్ళ కింద ఉన్న నేల ఒక్కసారిగా పరాయిదై పోవడాన్ని మించిన బాధ మరొకటి ఉండదు.
‘దేశమూ-ద్వేషమూ’ కథ, ఒక మనిషిలో ద్వేషాన్ని నింపడానికి వ్యవస్థీకృతంగా (Organized) మనుషులు ఎలా పనిచేస్తారో విపులంగా చెబుతుంది. అందరూ అబద్ధం చెబుతున్న చోట నిజమే అబద్ధం అవుతుంది, అబద్ధమే నిజం అవుతుంది. కానీ దానికోసం బాధపడవలసిన అవసరం లేదు. నిజం ఎంత బలహీనంగా, ఎంత తక్కువ గొంతుకతో అయినా మాట్లాడుతూనే ఉంటుంది. కాకపోతే ఆ నిజాన్ని వినేందుకు మనం సిద్ధపడాలి, సహనంతో ఎదురుచూడాలి.
ఈ సంపుటిలో ప్రత్యేకంగా కనబడే కథ ‘కుముద్వతి’. పందులు పెంచుకుంటూ, అన్ని అవరోధాలను దాటుకుని ఏఎన్ఎంగా ఎదిగిన కుముద్వతి, అంబేడ్కర్ మార్గంలో నడుస్తూ “నన్ను గురించి కథ రాయవూ?” అని అడిగినట్టుగా కథానాయకుడికి అనిపిస్తుంది. బుచ్చిబాబు గారి ‘కుముదం’ పాత్రకు, వెంకట కృష్ణ గారి ‘కుముద్వతి’కి పోలిక లేదు కానీ, కథలోని ఆ చివరి వాక్యం చదివితే ఎవరికైనా కుముదం గుర్తుకు వస్తుంది. “కుముదాన్ని మించిన వస్తువు ఏముంది కథ రాయడానికి?” అని బుచ్చిబాబు అనుకుంటే, వెంకట కృష్ణ ఆమె అడగకుండానే ఆమె కథ రాసి, “నా గురించి కథ రాయవూ” అన్నట్టుగా తోచింది అంటారు.
ఈ కథ ప్రత్యేకం అని ఎందుకు అన్నాను అంటే.. ఇందులో బాల్య స్మృతులు, పేదరికం, మానసిక హింస, అధికార దర్పం పొరలు పొరలుగా ఉంటాయి. ‘కుముద్వతి’ అనే పేరే ప్రత్యేకం. ‘కుముదం’ అంటే తెల్ల కలువ పువ్వు, ‘వతి’ అంటే కలిగి ఉన్నది అని అర్థం. తెల్ల కలువలతో నిండిన సరస్సు అని దీని భావం. ఈ అర్థం ఆ పేరు పెట్టిన ఊరి కరణానికి తెలియదు. “నల్లగా ఉన్నా కళగా ఉంది, లక్షణమైన పేరు కుముద్వతి అని పెట్టు” అంటాడు. నిజానికి నలుపుదనం ఆమె శరీరానికి సంబంధించింది అయితే, ఆమె మనసు మాత్రం కుముదం అంత తెల్లనిది, స్వచ్ఛమైనది. జీవితాన్ని సరళంగా జీవించడం ఆమె తన అనుభవం ద్వారా తెలుసుకుంది.
“ఇలాంటి విషయాల్లో ఒక ఆడదాని వెనుక ఇంకో ఆడది ఉండటం కంటే, ఆమెకు కావలసిన ఒక మగవాడు ఉండటం ఎక్కువ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది సార్” అని కుముద్వతి కథకుడితో చెబుతుంది. మొదటిసారి ఈ కథను ఆంధ్రజ్యోతిలో చదివినప్పుడు, ఆ తర్వాత సంపుటిలో చదివినప్పుడు నాకు ఆ మాట నచ్చలేదు. కానీ ఒక్కొక్క పొర విప్పినప్పుడు ఆమె చూపిన ప్రాక్టికాలిటీ అర్థమై, ఈ కథ మరింత లోతుగా హృదయంలోకి చొచ్చుకుపోయింది.
వెంకట కృష్ణ కథలు చదువుతుంటే సాహిత్యం కేవలం కాలక్షేపం కాదని, అది కాలానికి పట్టిన నిలువుటద్దమని అర్థమవుతుంది. మనిషి లోపలి సంఘర్షణను సామాజిక చలనంతో ముడివేసి చూడటంలో ఆయనది అందెవేసిన చేయి. ముఖ్యంగా ‘నీలమెరుపు’ సంపుటిలోని కథలు ప్రాంతీయ అస్తిత్వాన్ని, విశ్వజనీనమైన మానవతా దృక్పథంతో కలిపి ఒక అరుదైన రసాయనాన్ని ఆవిష్కరించాయి. రచయిత బాధ్యత కేవలం సమస్యను ఎత్తి చూపడం మాత్రమే కాదు, ఆ సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కార దిశగా ఒక తాత్విక స్పష్టతను ఇవ్వడం. వెంకట కృష్ణ ఈ విషయంలో పరిపూర్ణ విజయం సాధించారు.
____________________
రచయిత, సమాజపు చీకటి కోణాలను వెలిగించే జ్యోతి కావాలి. వెంకట కృష్ణ కథలు సరిగ్గా ఇదే చేస్తాయి. ప్రసిద్ధ ఆంగ్ల రచయిత జార్జ్ ఆర్వెల్ అన్నట్టు, “In a time of deceit, telling the truth is a revolutionary act.” అబద్ధాలే రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో, నిరపేక్షమైన చరిత్రను, వాస్తవ గాథలను తన కథా వస్తువులుగా ఎంచుకోవడం ద్వారా వెంకట కృష్ణ తాను రాయవలసిన వాక్యాన్ని సమర్థవంతంగా రాశారు.
______________________
వెంకట కృష్ణ కథలు ‘వేదవతి’ నది లాంటివి. పైన నిశ్చలంగా కనిపించినా, లోపల జీవధారను మోస్తూ ఎండిపోయిన జీవితాలను పచ్చబరిచే శక్తి వీటికి ఉంది. నిక్కమైన నీలమెరుపులా ఈ కథలు తెలుగు సాహితీ ఆకాశంలో చిరస్థాయిగా మెరుస్తూనే ఉంటాయి.

-వంశీకృష్ణ
95734 27422











