ఆధునిక భారతదేశపు నాడిని పట్టుకున్న బషీర్ బద్ర్

పొద్దున్నే ఒక అందమైన అమ్మాయిని చూసి, మధ్యాహ్నానికి ప్రేమ ప్రతిపాదన చేసి, ఆమె తిరస్కరిస్తే సాయంత్రానికి యాసిడ్ పోయడమో, కత్తితో పొడవడమో చేసే ఉన్మాద లోకంలో మనం జీవిస్తున్నాం. ఇలాంటి కఠిన కాలంలో—

“కుఛ్ తో మజ్బూరియా ర హీ హోంగీ
యూ హీ కోయీ బేవఫా నహీ హోతా”
(ఖచ్చితంగా ఏవో కొన్ని బలవంతపు పరిస్థితులు ఉండే ఉంటాయి. కారణం లేకుండా ఏ ఒక్కరూ అలా నమ్మకద్రోహిగా మారి మనల్ని విడిచి వెళ్ళరు) అని పాడిన కవి భౌతికంగా వెళ్ళిపోతే ఎంత దుఃఖంగా ఉంటుంది?
మరోవైపు, ఉదయాన్నే లేవగానే కులం పేరుతోనో, మతం పేరుతోనో బుల్ డోజర్లు మన ఇళ్ల మీదకు చెలియలి కట్ట దాటిన సముద్రంలా దూసుకొస్తున్నప్పుడు—

“లోగ్ టూట్ జాతే హై ఏక్ ఘర్ బనానే మే,
తుమ్ తరస్ నహీ ఖాతే బస్తియా జలానే మే”
(ఒక ఇల్లు కట్టుకోవడానికి మనుషులు ముక్కలైపోతారు, మీకేమో బస్తీలను తగులబెట్టడానికి కాస్తైనా జాలి కలగదు) అని పాలకుల గుండెలను ప్రశ్నించిన కవి దూరమైతే ఎంత వేదనగా ఉంటుంది?
అవును, ఆధునిక ఉర్దూ కవిత్వానికి మూలస్తంభం వంటివారైన బషీర్ బద్ర్ మే 28, 2026న సజీవులైన కవుల ముషాయిరాను వీడి, తన పూర్వీకుల చెంతకు చేరారు. పి.బి. షెల్లీ అన్నట్లు కవులు సమాజానికి అనధికార శాసనకర్తలు. ఆ కొందరిలో ముందు వరుసలో నిలిచే బషీర్ బద్ర్, ఆధునిక భారతదేశానికి కవిత్వం ద్వారా గమనాన్నీ, గమ్యాన్నీ బోధించిన దార్శనికుడు.
అయోధ్యలో సయ్యద్ ముహమ్మద్ బషీర్‌గా జన్మించిన ఆయన, కేవలం ఏడేళ్ల ప్రాయంలోనే మొదటి కవిత రాశారు. 11వ ఏటనే ముషాయిరాలో పూర్తి గజల్‌ను ఆలపించి అందరినీ విస్మయపరిచారు. బషీర్ బద్ర్ పేరు వినగానే ప్రేమ కవిత్వము, అద్భుతమైన గజల్స్ గుర్తుకు వస్తాయి. ఆయన కవిత్వం నేల విడిచి సాము చేయదు, ఎక్కడా కఠినమైన భాషాపటాటోపాన్ని ప్రదర్శించదు. అలతి అలతి పదాలతోనే గాఢమైన భావాన్ని వ్యక్తం చేయడం ఆయన ప్రత్యేకత.
బద్ర్ 1985లో ప్రచురించిన కవితా సంకలనం ‘ఆమద్’ పీఠికలో, “2035వ సంవత్సరపు గజల్ పాఠకుడికి ఒక లేఖ” రాస్తూ ఒక విషయాన్ని బలంగా నమ్మారు. గజల్ పునాది కేవలం భావోద్వేగాల అమాయకత్వంపైనే కాదు, నిరంతరం మారుతూ ఉండే వాడుక భాషా సౌకుమార్యంపై ఆధారపడి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఉర్దూ కవిత్వాన్ని సామాన్యులకు దూరం చేసే భారీ సాంప్రదాయ అలంకారాలను తొలగించి, ప్రజల భాషను ఉపయోగించారు. శ్రోతలతో ఎంతో హుందాగా కనెక్ట్ అవుతూ ఆయన సాగించిన ప్రయాణం వల్లనే ప్రజలు ఆయనను ‘ప్రజల కవి’ అని పిలుచుకున్నారు.
బద్ర్ శృంగార భావనను, సౌందర్యాన్ని తన కవిత్వం ద్వారా పునర్నిర్వచించారు. ఎనభై ఏళ్లు పైబడినా ఆయన అంతరంగం యువ కవిలాగే స్పందించేది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సీతాకోకచిలుకలు వంటి ప్రాథమిక వస్తువులకే ఆయన తన కవిత్వంలో జీవం పోశారు. దేహాతీతమైన ప్రేమను పలికించిన మీర్ ను, క్లిష్టమైన తాత్విక చింతనను పలికించిన గాలిబ్ ను ఆయన ఆరాధించినప్పటికీ, పాత సంప్రదాయాలను సున్నితంగా తిరస్కరించి సరళతనే పరమావధిగా మార్చుకున్నారు.

“యే సోచ్ లో అబ్ ఆఖిరీ సాయా హై మొహబ్బత్,
ఇస్ దర్ సే ఉఠోగే తో కోయీ దర్ నా మిలేగా”
(బాగా ఆలోచించుకో, ప్రేమ అనేది ఆఖరి నీడ లాంటిది. ఈ వాకిలి దాటి వెళ్తే, నీకు మరే వాకిలీ దొరకదు)
మానవ జీవితంలో అన్నింటికంటే పవిత్రమైనది ప్రేమ. అహంతోనో, కోపంతోనో ఈ ప్రేమ అనే ఆశ్రయాన్ని వదిలి బయటపడితే, ఆ తర్వాత ఎంత వెతికినా అంతటి ఆత్మీయత మరెక్కడా దొరకదనే నిజాన్ని ఇంతకంటే సుందరంగా చెప్పలేము. ఇటువంటి సరళతను మనం పాతకాలపు దర్బారీ వాతావరణంలో చూడలేము.

1940ల నాటి ప్రగతిశీల రచయితల ఉద్యమం (Progressive Writers’ Association) కవిత్వాన్ని విప్లవాత్మక సాధనంగా మార్చితే, బద్ర్ మాత్రం కొన్ని కొత్త ప్రమాణాలతో పాత శృంగార శైలికే కట్టుబడ్డారు. ఆయన కవిత్వం నేరుగా రాజకీయ నినాదం చేయకపోయినా, సమాజంలోని వైరుధ్యాలపై వ్యంగ్యంగా, హాస్యస్ఫోరకంగా స్పందించేది. ఇందుకోసం ఆయన సామాన్యుడి జీవితాన్నే రూపకంగా మార్చుకున్నారు.

“ఘరోం పే నామ్ థే, నామోం కే సాథ్ ఓహ్ దే థే,
బహుత్ తలాష్ కియా కోయీ ఆద్మీ నా మిలా”
(ఇంటి గుమ్మాల మీద పేర్లు, వాటి పక్కన హోదాలు ఉన్నాయి. కానీ నేను ఎంత వెతికినా అక్కడ పదవులు, అహంకారాలు తప్ప ఒక సాధారణ ‘మనిషి’ కనిపించలేదు). ఈ తరహా సామాజిక వ్యంగ్యం సాంప్రదాయ గజళ్లలో ఊహించలేము. బద్ర్ కవిత్వంలోని మరో గొప్ప విజయం—ఉద్యోగం లేని సగటు యువకుడి ఆవేదనను ప్రతిబింబించడం:

“షామ్ తక్ కిత్నే హాతోన్ సే గుజ్రూంగా మైన్,
చాయ్ ఖానే మే ఉర్దూ కే అఖ్బార్ సా”
(ఈ రోజు సాయంత్రం లోపల నేను ఇంకా ఎంతమంది చేతుల్లో నలగాల్సి వస్తుందో! టీ కొట్టులో పడి ఉండే ఒక ఉర్దూ వార్తాపత్రికలా నా జీవితం అయిపోయింది). ఉపయోగించుకుని వదిలేసే సమాజపు తత్వాన్ని ఈ షేర్ నిర్మోహంగా చెపుతుంది.
1947 దేశ విభజన తర్వాత భారతదేశంలో ఉర్దూ నిర్లక్ష్యానికి గురైందని, పాకిస్తాన్‌లో అది కేవలం అధికారిక భాషగా బిగుసుకుపోయిందని బద్ర్ భావించారు. అయితే కొత్త పదాలు, ఆధునిక ఆలోచనలు ఉర్దూకు సరికొత్త శక్తిని తెస్తాయని నమ్మారు.

“ఆస్ హోగీ నా ఆస్రా హోగా,
ఆనే వాలే దినో మే క్యా హోగా;
మై తుఝే భూల్ జావోంగా ఇక్ దిన్,
వక్త్ సబ్ కుచ్ బదల్ చుకా హోగా”
(ఆశ ఉండదు, ఆసరా ఉండదు, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో! నేను నిన్ను ఒకరోజు మర్చిపోతాను, కాలం అన్నింటినీ మార్చేసి ఉంటుంది). ఈ పంక్తులు సామాజిక అనిశ్చితులనూ పలికిస్తాయి, ఉనికి కోసం పోరాడే వ్యక్తి నిరాశనూ ఆవిష్కరిస్తాయి. అలాగే, భారత పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ గారు సైతం ఉటంకించిన ఆయన ప్రసిద్ధ షేర్ ఇది:

“జీ బహుత్ చాహతా హై సచ్ బోలేన్,
క్యా కరేన్ హౌస్లా నహీన్ హోతా”
(నిజం చెప్పాలని మనసుకి ఎంతగానో అనిపిస్తుంది, కానీ ఏం చేయాలి? అంత ధైర్యం చాలడం లేదు). చుట్టూ జరుగుతున్న అన్యాయాలను చూసి నిజం మాట్లాడాలనుకున్నా, ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకునే ‘హౌస్లా’ (ధైర్యం) లేని సగటు మనిషి అంతర్మథనానికి ఇది అద్దం పడుతుంది.

ఉర్దూ గజల్‌లో ఇంగ్లీష్ పదాలను సహజంగా చేర్చడం ఆయన ప్రయోగశీలతకు నిదర్శనం. ఈ షేర్ చూడండి.

“సున్సాన్ రాస్తోన్ కీ సవారీ నా ఆయేగీ,
అబ్ ధూల్ సే అటీ హుయీ లారీ నా ఆయేగీ”

ఇలాంటి సరళ శైలి వల్లే ఆయన కవిత్వాన్ని నేటికీ సినిమాలు, సామాజిక మాధ్యమాలు, పార్లమెంట్‌లో విస్తృతంగా వాడుతున్నారు. యూట్యూబ్‌లో ఆయన వీడియోలకు మిలియన్ల కొద్దీ వీక్షణలు వస్తున్నాయి.

బద్ర్ ఉర్దూతో పాటు పర్షియన్, హిందీ, ఇంగ్లీష్ భాషలలో నిపుణులు. ఆయన కవితా సంకలనాలు ‘ఆస్’, ‘ఆమద్’, ‘ఆహత్’, ‘ఇమేజ్’, ‘ఉజాలే అప్నీ యాదోం కే’ ఆయన ప్రతిభకు నిదర్శనాలు. ‘ఆస్’ పుస్తకానికి గానూ ఆయన 1999లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని, అదే ఏడాది పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.అలాగే 1980లో న్యూయార్క్‌లో ‘పోయెట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకున్నారు.

1972 నాటి సిమ్లా ఒప్పందం సమయంలో ఆయన రాసిన పంక్తులు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందాయి.

“దుష్మనీ జమ్ కర్ కరే లేకిన్
యే గుం జాయిష్ రహే,
జబ్ కభీ హమ్ దోస్త్ హో
జాయేం తో శర్మిందా నా హోం”
(శత్రుత్వం చేయాలనుకుంటే గట్టిగానే చేయండి… కానీ, భవిష్యత్తులో ఎప్పుడైనా మనం మళ్లీ స్నేహితులమైతే, ఒకరి కళ్లల్లోకి ఒకరం చూసుకోవడానికి సిగ్గుపడనంత అవకాశం మాత్రం ఉంచుకోండి). జుల్ఫికర్ అలీ భుట్టో నుండి భారత పార్లమెంటేరియన్ల వరకు సరిహద్దులకు ఇరువైపులా ఉన్న నాయకులు ఈ పంక్తులను ఉటంకించారు.

“యూన్ హీ బేసబబ్ నా ఫిరా కరే,
కోయీ రాత్ ఘర్ భీ రహా కరో
యే గజల్ కీ సచ్చీ కితాబ్ హై,
ఇసే చుప్కే చుప్కే పఢా కరో”

దీని అర్థం, “కారణం లేకుండా ఇలా వీధుల వెంట తిరగకు, ఏదో ఒక రాత్రి ఇంట్లోనే ఉండు. ఇది గజల్ నిజమైన పుస్తకం (నా హృదయం లేదా నా కవిత్వం), దీనిని ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా, ఏకాంతంగా చదువుకో.” ప్రేమలోని ఆత్మీయతను, ఏకాంతాన్ని ఎంతో మధురంగా వ్యక్తపరచిందీ షేర్.

ఆయన షేర్లు ప్రపంచాన్ని కొత్తగా చూడమని పాఠకులను ఆహ్వానిస్తాయి. ప్రేమను ఒక పెద్ద విషాదంగా కాకుండా, ఒక రోజువారీ అద్భుతంగా, జీవితాన్ని భరించేలా చేసే చిన్న చిన్న వెలుగుగా దర్శించమంటాయి.

ఆయనను చివరి సంవత్సరాల్లో, అల్జీమర్స్ సవాలు చేసింది, ఇప్పుడు ఆయన భోపాల్‌లోని బడా బాగ్ స్మశానవాటికలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ నిజమైన ఆయన విశ్రాంతి స్థలం ఆయనను చదివేవారి హృదయాలలోనే వుంది. మనకు వెలుగులను పట్టుకోవడం నేర్పిన మహాకవి, ఇప్పుడు తానే ఒక శాశ్వత వెలుగైపోయారు. ఆయన రాసిన కొన్ని చిరస్మరణీయ కవితా పంక్తులు ఎల్లప్పుడూ సమాజంలో వినబడుతూనే ఉంటాయి.

(28 మే 2026న సుదీర్ఘ అనారోగ్యంతో కన్నుమూసిన బషీర్ బద్ర్ కు సాహిత్య నివాళిగా ఈ ప్రత్యేక వ్యాసం)

 

 

-వంశీకృష్ణ
95734 27422

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *