నాన్నగుండెలో వెలిగిన అక్షరదీపం “లేఖ్య”

“A daughter is the happy memories of the past, the joyful moments of the present, and the hope and promise of the future”

సమకాలీన తెలుగుసాహిత్యంలో అతి తక్కువ కాలంలో ఎక్కువ పేరు సంపాదించుకున్న యువకవుల్లో మొదటి వరసలో ఉండే యువకవి మెట్టానాగేశ్వరరావు. అద్భుతమైన కవిత్వాన్నయినా, ఆలోచనాత్మక విమర్శనైనా, అంతే వేగంగా రాయగల దిట్ట మన మెట్టా. తన మొదటి కవితాసంపుటి “మనిషొక పద్యం” తోనే పాఠకవిమర్శకుల హృదయం దోచుకున్న కవి. నిరంతరం కవిత్వాన్నే శ్వాసిస్తూ ఆధునిక మానవజీవితంలోని ఎన్నో సున్నితమైన విషయాల్ని తాత్విక గాఢతతో కవిత్వమల్లి విమర్శకుల్ని సైతం మెప్పించి ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్న కవి.
________________________

కొమ్మ నుంచి జారిపడే ఆకులు భూమాతను చేరే లోపు పడే ఆవేదనను, పరుగులు పెడుతున్న ఏరుకు దారిలో బండరాళ్ల తాకిడికి తగిలే గాయాల గురించి ఆలోచిస్తూ, చలించే మనస్తత్వం ఉన్న కవి కనుక, ప్రకృతిని దగ్గరగా, సున్నితంగా, అతిసునిశితంగా పరిశీలిస్తూ…సామాజిక సమస్యలతో పాటు, తన తాతతండ్రుల వృత్తి తాలూకు గాయాలను నెమరేసుకుంటూ, ఇతర బహుజనుల వృత్తుల గురించి కూడా తనదైన కోణంలో కవిత్వాన్ని, కవిత్వ విమర్శను చాలా బలంగా రాసే మెట్టా నాగేశ్వరరావు తన కూతురు ‘లేఖ్య’ గురించి కవిత్వం రాయడంలో ఎంత అద్భుతంగా ఆవిష్కృతం చేశాడో అర్థం చేసుకోవాలంటే లేఖ్య (స్వగతం) కావ్యంలోకి తప్పకుండా వెళ్ళాల్సిందే.
_______________________

లేఖ్య (A father’s soliloquy) అనే కవితా సంపుటిలోని కవిత్వం మొత్తం తన కూతురు మీద తనకున్న అవ్యాజమైన ప్రేమతత్వాన్ని ఒక తండ్రిగా, తనలోని కవిహృదయాన్ని మేల్కొల్పి అన్ని కవితలు రాయడం నిజంగా మెచ్చుకొదగిన విషయం. కూతురనే ఒకే వస్తువు మీద ఇన్నేసి కవితలు రాయడం అంటే! ఆ వస్తువు మీద ఈ కవికి ఎంత ప్రేమ ఉండాలి!, ఆ వస్తువుతో ఎంతగా తాదాత్మ్యం చెంది మమేకమై పోవాలి? అయితే కూతురున్న ప్రతి తండ్రి హృదయ తంత్రుల్ని మీటి గర్వపడేలా రాసిన సంపుటిలోని కవిత్వ వస్తువును, కవిత్వాన్ని, మెట్టా తట్టిలేపిన అనుభూతి చెమ్మను మెచ్చుకుంటూ సాహితీపెద్దలందరూ కవితా వస్తువైన లేఖ్యకు, ఆ వస్తువును కడురమ్యంగా కవిత్వమల్లిన మెట్టాకు అక్షరబహుమానాలు అందిచ్చారు. మెట్టా కూడా తన ఊపిరిలో ఊపిరైన కూతురమ్మకు “ఊపిరిలిపి” లో ఎలా నీరాజనం పడతాడో ఈ క్రింది కవిత్వపాదాల్లో చూడండి: “నాన్నా దుఖించకు / నేనున్నాను అని /గుండెలోపొంగుకొస్తున్న/ రక్తాన్ని తుడుస్తుది/ అవునూ మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా/ ఉంటే హాయిగా నిద్రపొండి..”

ఒకప్పుడు కొడుకున్న తండ్రికి ఒక ధైర్యం, ఒక భరోసా కానీ, ఈ ఆధునిక యుగంలో కొడుకైనా, కూతురైనా సమానమే అనే విధంగా తల్లితండ్రులు ఆలోచిస్తున్నారు. నాన్నా మీకు నేనున్నాను మీరు అధైర్య పడవద్దు అంటూ….ఆడపిల్ల తండ్రి గుండెలో ఉప్పొంగే ఆందోళనా స్వేదబిందువుల్ని తన చిట్టిపొట్టి మాటలతో తుడిచే శీతల వాయువులా అంటుంటే ఆ తండ్రి తన ఆనందాన్ని ఇలా వ్యక్తపరుస్తాడు: “బుజ్జీ!/ నువ్వు పుట్టావు బాగుంది /పెరిగావు ఇంకా బాగుంది/ నాన్నా అని పిలిచావు/ ఇంతకన్నా ఇంకేమైనా బాగుంటుందా? “

ఇంతకన్నా గొప్పగా ఒక తండ్రి తనయల మధ్య ఉన్న ఆత్మీయతను ఏ కవి రాయగలడు? ఒక మెట్టా తప్ప! కూతురు పిలిచే ఆ నాన్నా అన్న పిలుపులోని మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే నిజంగా కూతురుకు నాన్నయితేనే తెలుస్తుంది.

“మా కోసం కన్నీళ్లు కార్చే

కళ్ళని కనడం కంటే గొప్ప ఏముంటుంది”

….భవిష్యత్ లో తన దుఃఖాన్ని, బాధల్ని, అర్ధం చేసుకొని వయసుడిగిన కాలంలో ఆసరాగా ఉండి మమకారాన్ని అందించే కూతుర్ని కనడం కంటే గొప్ప ఏముంటుందీ ఈ ప్రపంచంలో అంటాడీకవి. చూడండి: “జీవితం మెట్లు ఎక్కి ఎక్కి/సాయంత్రానికి జీవితంలో / దిగుతున్నప్పుడు../ఇంట్లో పట్టీల కాళ్ళు నవ్వుతాయి../ అప్పుడు కొండమీదనే కాదు / గుండెమీద కూడా దేవుడు/ వెలుస్తాడనిపిస్తుంది..”

ఈనాటి యాంత్రిక జీవనపోరాటంలో అంతర్గత, బహిర్గత సమస్యలతో ఇంటికి వచ్చిన నాన్న మనసును తన చిన్నిచిన్ని కాళ్ళగజ్జల సుమధుర సంగీతనాదంతో అలసిన మనసుకు స్వాంతన కలిగిస్తే! అప్పుడు నిజంగా దేవతలూ దేవుళ్లూ మన ఇండ్లల్లో కూడా వెలిశారనిపిస్తుందంటాడు.

తన కూతురుకు తనకు మధ్య ఉన్న ఆత్మీయానుబంధం గురించి రాయడమే కాదు, ఈనాటి ఆధునిక యుగంలో ఏ ఆడపిల్లయినా గెలుపోటముల గురించి ఆలోచించకుండా ఎలా బతకాలో చెబుతాడు. కొండల్లాంటి బాధలు బండల్లా మీ మీదపడినా, గుండె ధైర్యంతో ఉండాలంటూ.. ఎదురుదెబ్బలు తినేకొద్ది రాటుదేలుతూ అవసరమైనప్పుడు కరవాలంలా పదును దేరాలంటూ.. తన కూతురుకు ధైర్యవాక్యాలు నూరిపోస్తాడు. అమ్మాయిలంటే అబలలు కాదు సబలలే అని, సుకుమారులే కాదు, అవసరమైతే ఆదిశక్తి అవతారం ఎత్తి అన్యాయాన్ని ఎదిరించాలంటాడు.

జీవితలో ఎదురయ్యే ఆటుపోటులను అధిగమించే Life Skills ను సమకూర్చుకోవాలని హితబోధ చేస్తాడు. జీవితమంటే Bed of roses కాదని, Bed of thorns అని ఆ ముళ్ళు చేసే గాయాల వల్ల కలిగే బాధను భరించే శక్తిని, వాటిని మాన్పుకునే శారీరక మానసిక ధీరత్వాన్ని కలిగి ఉండాలంటాడు. తన కళ్ళముందే ఎదిగిన కూతురును చూసి ఎలా ఆనందపు వాక్యాలై పోతాడో చూడండి :

“ఇక్కడ..

నన్నూమించి ఎత్తయ్యింది లేఖ్య

ఆకాశంలో రెండు చందమామలు….”

అంటూ తన కూతురు చందమామ అంత చల్లగా, స్వచ్ఛంగా అంత ఎత్తుకు ఎదగాలని ప్రపంచానికి వెలుగునివ్వాలని ఒక తండ్రిగా మెట్టా పడే తపన పై కవితావాక్యాల్లో కనిపిస్తాయి.

ఇంకా ఈ కడురమ్యమైన కవితావాక్యాల్లో చూడండి : నువ్వు ఎగిరితే సీతాకోకలు చిన్నబోవాలి/ నవ్వితే కాలిమువ్వలు మూగబోవాలి/పాడితే కాలం శ్రోతలా నిలబడాలి.” ..అంటూ తన ఆటపాటల్తో అమ్మానాన్ననే కాదు, తన చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా ఆమె పరవశింపచేయాలని ఆశపడతాడు. ఆడపిల్లలంటే ప్రకృతికి పర్యాయపదాలంటాడు.

ఇంకా వాళ్ళ అమ్మగుండెకు ఆయువు పెంచి, ప్రాణతంత్రులు మీటాలట.. నాన్న కలలకు గెలుపు కుంచెతో కొత్తరంగులు పులమాలని తన గుండెలోతుల్లో దాగిన అవ్యక్తభావాల తాలూకు ఆశలు సఫలం కావాలనే మెట్టా తపన ఈ కవితా వాక్యాల్లో కనిపిస్తుంది.
______________________

కూతురుకు నాన్నంటే కొండంత ధైర్యం….నాన్నంటే నిలువెత్తు భరోసా…. ఇంట్లో అమ్మ తిట్టినా…అన్నకొట్టినా… నాన్నకు చెబుతానంటూ బెదిరిస్తుంది..ఏ కూతురుకైనా నాన్నే హీరో.. నాన్నే కూతురుకు తరిగిపోని ఆస్తి. అందుకే నాన్న కోపంగా చూసినా, మౌనంగా ఉన్నా, కూతుళ్ళు తట్టుకోలేరు.. అమ్మాయిలు ఎప్పుడైనా పొరపాటుగా ఏదైనా తప్పుచేసినా అధైర్యపడరు.. ఎందుకంటే నాన్న తమకు సపోర్ట్ చేస్తాడనే నమ్మకం ఉంటుంది. తండ్రులకు కూతుళ్ళ మీద అలాంటి మమకారం ఉంటుంది కాబట్టి. కుమారులు పెళ్లి అయ్యేవరకే మన కుమారులు, కానీ కూతుళ్ళు ఎప్పటికీ కూతుళ్ళే..
_________________________

ఇదే విషయాన్ని Thomas Fuller తన Gnomologia: adages and proverbs అనే గ్రంథంలో ఇలా రాశారు . “My son is my son till he has got him a wife, but my daughter is my daughter all the days of her life.” అందుకే ఒక కవితలో తన కూతురుని సంభోదిస్తూ ఇలా అంటాడు: “ ప్రాణంలో ప్రాణమా/నేవు పుట్టినాకే నేను జన్మించాను/ నా ఒడిలోకి ఒచ్చాకే / నాలో ప్రేమ మొగ్గలు చిగురించాయి.”

ఈ కవి తన కూతురు పుట్టాకే ఆజ్ఞానాన్ని వదిలేసి జ్ఞానం కోసం అన్వేషణ ప్రారంభించానంటాడు. ఇప్పటికీ సమాజంలో ఆడపిల్లలమీద వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల అంటే ‘ఆడ’పిల్ల అనే భావన బలంగా ఉంది. ఇలాంటి సందేశ కవిత్వం చదివిన వాళ్ళ ఆలోచనల్లో కొంత మార్పు వచ్చినా మెట్టా ఆశించిన ఫలితం దక్కినట్లే. కూతురు లేఖ్య గురించి కవిత్వం ద్వారా ఈ సమాజానికి ఒక ప్రేమైక ఉపదేశం అందించి ఆడపిల్లల తండ్రులందరికీ తన కవిత్వసంపుటిని అద్వితీయమైన కానుకగా అందించిన మెట్టాకు హృదయపూర్వక అభినందనలు. ‘లేఖ్య’ నిజంగా చాలా అదృష్టవంతురాలు. ఈ సందర్భంగా ఆ చిన్నారి లేఖ్యకు నా ఆశీస్సులు.

 

 

-ఆచార్య బాణాల శ్రీనివాసరావు
94404 71423

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *