కష్టాలకు ఓడిపోని ఓ గుణశేఖరుడి కథ – చింతలచేను నవల

నిజమే! కష్టాలు సునామీలా దండెత్తినప్పుడు కథానాయకుడు గుణశేఖరుడు ఓడిపోయి ఉంటే నవల ముగింపు, విషాదపు వస్త్రాన్ని నిండుగా కప్పుకున్న ఒక మృతదేహపు నమూనాగా మనల్ని పలకరించేది. కానీ అలా జరగలేదు. ఆర్.సి.కృష్ణస్వామి రాజు కలం నుండి ఊపిరి పోసుకున్న ఒక వ్యవసాయదారుడి సజీవ జీవన చిత్రం ఈ ‘చింతలచేను’ నవల.

__________________

ఈ రచన నిండు పౌర్ణమితో ప్రారంభమవుతుంది. ముగింపుకు ముందు అన్నీ దట్టమైన చీకటి కోణాలే. లెక్కలేనన్ని బాధలు, దుఃఖం వేదికల మీది నుంచి పలకరిస్తాయి. కొన్ని సంవత్సరాల తరువాత అనూహ్యమైన మార్పులతో అమావాస్యను జయించిన కొత్తచంద్రుడి వెలుగులతో ఆనందంగా ఈ నవల ముగుస్తుంది.
_________________

ఈ కథ ఒక సామాన్య రైతు జీవితానిది. కన్నీళ్ల బదులు రక్తం కారేలా దాడి చేసిన కష్టాలను జయించిన ఒక వీరుడి కథ ఇది. తనకు ఎదురైన ప్రతి విషమ సందర్భాన్ని ఒక తీర్థంలా స్వీకరించి విజయాలు సాధించిన ఒక సాహసికుడి కథ ఇది. ఈ నవల ఒక మనిషి కథ కాదు; ఒక ఊరి కథ, ఒక ప్రాంతం కథ. చెప్పాలంటే ఒక మానవ సమూహంలో ఒక సామాన్యుడి బాధలు, కష్టాలు, నష్టాలు, ఏడ్పులు, ఎదురీతలు, పోరాటాలు, యుద్ధాలు, విజయాలు, ఆర్థిక సంబంధాలు చివరికి సంతోషాలు… ఇవన్నీ ఎలా, ఎందరితో, ఎన్ని రకాలుగా ముడిపడి వుంటాయో చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలోని చెట్టునీడన పాఠకులందరినీ కూర్చోబెట్టి వివరించిన కథ ఇది. చదువరుల జ్ఞాపకాల అరల్లో ఒక స్నేహితుడిలా మళ్లీ మళ్లీ పలకరించడానికి సిద్ధపడే ఓ అద్భుతమైన సజీవ కళాత్మక కథ ఈ నవల.

ఒక కుటుంబ యజమానిగా తన బతుకు కంటే తనవాళ్ల బతుకు కోసం ఓర్పు, సహనాలను ఆయుధాలుగా నింపుకున్న కష్టజీవి గుణశేఖరుడు. మట్టిని నమ్ముకున్న ఈ మనిషికి తాను పండిస్తున్న పంటల్లో ఆశించిన ఫలితాలు శూన్యంగా మారి, జీవితాన్ని గడపడం కష్టసాధ్యంగా మారిన క్షణాలలో ‘గుణశేఖరా… నీకు డ్రైవింగ్ తెలుసు కాబట్టి ఒక ట్రాక్టర్ కొని బాడుగకు తిప్పకూడదా… కలిసి వస్తే కోటీశ్వరుడవైపోతావు. ఆలోచించు’ అన్నాడు ఇన్సూరెన్స్ ఏజెంట్ వెంకటముని. వినగానే ట్రాక్టర్ కొనడానికి కావలసిన డబ్బు విషయంలో గుండె గుభేలుమన్నా, చివరికి వెంకటముని మాట తిరుగులేని మంత్రంగా పనిచేసింది. ఐదు లక్షలకు పైగా అప్పు చేసి ట్రాక్టరు కొన్నాడు గుణశేఖరుడు. ఎందుకో కానీ అతనికి కాలం కలిసిరాలేదు. కుటుంబ తలరాతలు మారిపోతాయనుకున్న ఆశలు ఆవిరైపోయి, అనుకోని కష్టాలు విరామం లేకుండా తన మీద దండయాత్రకు క్రూరంగా సిద్ధమైపోయాయి. ఎంత పోరాడినా అపజయాలే వెక్కిరిస్తూ తన ముందు నడిచేవి. అడుగు వేస్తే ఏ ప్రమాదం తనను కబళిస్తుందోనని నిద్రలో సైతం ఉలిక్కిపడే స్థాయికి చేరుకున్నాడు గుణశేఖరుడు. అప్పులు తీర్చలేక వడ్డీలు తరగని కొండల్లా పెరిగిపోయాయి. సమస్యల మీద సమస్యలు వచ్చి చేరిపోయాయి. వాటిని తీర్చే మార్గం లేక ఊపిరి కూడా తనతో సరిగ్గా సహకరించని స్థితికి గుణశేఖరుడు చేరిపోయాడు.

ఓ రోజున అప్పిచ్చిన సిద్ధిరాజు నానామాటలతో నీచంగా అందరిముందు మాట్లాడి, దానికితోడు అప్పు కింద ట్రాక్టర్‌ను కోపంగా తోలుకొని వెళ్లిపోతాడు. ఆగని దుఃఖం, శిథిలాల కింద ఆశల అవయవాలు తెగిపోతున్న గుణశేఖరుడికి ‘చింతచేను’ ఇప్పుడు ‘చింతలచేను’ లా కనిపించడం మొదలుపెట్టింది. మాటల్ని సైతం మరిచిపోయి మూగవాడిగా నిలబడిపోతాడు. సరిగ్గా చినుకులు రాలుతున్న ఆ క్షణంలో ఆటో తోలుకుంటూ వెంకటముని తన దగ్గరకు వచ్చి ‘కొత్త జీవితం ప్రారంభిద్దాం’ అనగానే గుణశేఖరుడు ఉత్సాహంగా ఆటో వైపు అడుగులు వేస్తాడు. ఆ అడుగులే క్రమంగా పరుగుల్లా మారతాయి. ఆ తరువాత ఏం జరిగిందో కాలానికి మాత్రమే తెలుసు. గుణశేఖర్ జీవితం ఎవరూ ఊహించని ఉన్నతమైన ఎత్తుల్లో కొనసాగుతుంది. కొడుకు మెకానికల్ ఇంజనీరుగా అశోక్ లేలాండ్ కంపెనీలో పెద్ద మేనేజర్ ఉద్యోగం చేస్తున్నాడు. తన భార్యతో పాటు తల్లి ఒంటి నిండా ఇప్పుడు మోయలేనంత బంగారం. తాను ఇప్పుడు ఏకంగా నాలుగు కొత్త ట్రాక్టర్లకు యజమాని మాత్రమే కాదు, ప్రస్తుతం ఆ ప్రాంతానికి ట్రాక్టర్ల డీలరు కూడా. ఇలా గుణశేఖరుడి కథ, కాలం సైతం విస్తుపోయే సుఖమయ తీరాల వైపుకు సాగిపోయింది. అందుకు సరైన బీజం వేసిన మనిషిగా వెంకటముని చాలా ప్రముఖంగా మెరుస్తాడు.

ఆర్.సి. కృష్ణస్వామి రాజు అందించిన ఈ ‘చింతలచేను’ నవలను చదవడానికి నా కళ్ళను ఇష్టంగా అప్పగించగానే, నేను అమాంతం చిత్తూరు జిల్లా పుత్తూరుకు దగ్గరలోనున్న రాసపల్లి గ్రామం మధ్యలోకి విసిరివేయబడ్డాను. మీనాక్షయ్య కొట్టులో టీ తాగాను. పంచె అంచు నోట్లో పెట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన తిమ్మాపురం పుట్టారెడ్డితో చాలా కబుర్లు పంచుకున్నాను. అలా వీధిలో నడుస్తూ ఉంటే నల్లచారలున్న కుక్క నన్ను చూసి మొరగలేదు; ఏదో నాతో స్నేహమున్నట్లు నా వెనకే రావడం మొదలుపెట్టింది. అలా నేరుగా గుణశేఖరుడి ఇంటికి నా నడక సాగింది. ట్రాక్టరు కొనడానికి సిద్ధపడ్డ కొడుకుతో నారాయణమ్మ ‘ఒరేయ్ నాయనా… నేలమీద నడవరా, ఆశకు పోయి, ఉన్న గోచీని పోగొట్టుకున్నాడంట వెనకటికి నీలాంటి వాడు ఒకడు…’ అంది. ఆ మాటలు గుణశేఖరుడికి రుచించలేదు. ‘పోరాడితే పోయేదేమీ లేదు పేదరికం తప్ప’ అంటూ ట్రాక్టరు కొనడానికే సిద్ధపడ్డాడు. ‘బాగా కష్టపడాల్సి వస్తుందేమో కదండీ’ అంది భయపడుతూ భార్య హైమావతి. ‘ఎగబడి పోరాడకుంటే తిరగబడవు మన బతుకులు…’ అంటూ తన నిర్ణయాన్ని మరోసారి గట్టిగా నిర్ధారణ చేశాడు. జీవితమంటే నిత్యం జరిగే ఒక యుద్ధమని, పోరాటం తప్పదన్న భావాన్ని చివరిదాకా తన శ్వాసకు తోడుగా నడిపించి, చివరకు ఊహించని విజయాన్ని తన సొంతం చేసుకుంటాడు గుణశేఖరుడు.

ఈ నవల కేవలం ఒక మనిషి జీవితాన్ని మాత్రమే మనకందించదు. ఆ పల్లె నిండా పరుచుకున్న మట్టికణాల కనురెప్పలను తెరిచి చూస్తే ఎన్నో పాత్రలు ప్రవాహంలా మన ముందు హాజరవుతాయి. వడ్డీ వ్యాపారం మీద బతికే సిద్ధిరాజు, వ్యవసాయం మీద పీహెచ్.డీ చేస్తున్న సుమతి, కవిత్వం రాయడమంటే చాలా ఇష్టపడే నీలిరాజు, బీమా ఏజెంటుగా తిరిగే వెంకటముని, పుత్తూరు వైద్యుడు ప్రభాకరం, గొర్రెలను పెంచుకుని బతికే వీరమరాజు, డ్రైవర్ కన్నదాసన్… ఇలా సందర్భాన్ని బట్టి సన్నివేశాలను బలంగా నడిపించడానికి ఎన్నో పాత్రలు ఈ నవలా రచనలో ఏకంగా రక్తకణాలుగా మారిన దృశ్యాలు రచయిత సామర్థ్యానికి సాక్ష్యాలుగా నిలబడుతున్నాయి.
__________________

నవలలో ఈ పాత్రలు మాత్రమే కాదు, ఒకవైపు ధర్మరాజు గుడి, ఆ పక్కన చెట్టు మీద ఆడుకుంటున్న ఉడతలు, వాటి ముందు వినోదాన్ని ఆనందిస్తూ పిల్లలు, అలా వెళ్తే అక్కడ నుదుట రకరకాల బొట్లు పెట్టుకుని ఒక జ్యోతిష్కుడు, రంగమామ చేతిలో నవనవలాడుతున్న నాలుగు జామకాయల కమ్మటి వాసన, దీనికితోడు హమీద్ మటన్ బిర్యానీ ఘుమఘుమలు, అలా దారిలో నడుస్తూ ఉంటే ఆ పక్కన ఆరేటమ్మ గుడి, ఇంకాస్త ముందుకు వెళ్తే సైకిల్ వెనుక పెద్ద చీరల మూటతో వ్యాపారం చేస్తున్న వ్యాపారి చమత్కారపు మాటలు, అటువైపు పంచె ఎగ్గట్టి ‘పచ్చగడ్డి కోసేటి పడచు పిల్లో’ అంటూ ఆర్‌.ఎమ్.పి. డాక్టర్ పాడుతున్న పాట… ఇలా వందలాది విషయాలు ఈ నవలా నిర్మాణానికి వస్తుసామగ్రిలా తమ అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.
__________________

అన్నిటికంటే ముఖ్యంగా మనతో కరచాలనం చేసి, తన తలరాత బాధలను మనతో చెప్పుకునే పాత్ర గుణశేఖరుడు కొన్న ట్రాక్టర్ పాత్ర. నిజమే, అది ఒక యంత్ర పరికరాల సమూహమే కావచ్చు, కానీ మరో కోణం నుంచి చూస్తే దానికి కూడా మనసుంది. ట్రాక్టరుకు ప్రమాదం జరిగినప్పుడు తనకు జరిగిన నష్టం కంటే గుణశేఖరుడి ఒంటికి తగిలిన గాయాల గురించి చాలా వ్యధ చెందుతుంది. తన రాక గుణశేఖరుడికి లాభాలు తెచ్చిపెడుతుందనుకుంటే, విపరీతమైన అవస్థలకు తాను ఒక కారణంగా నిలిచిపోతుంది. చివరికి జప్తు కింద అప్పులిచ్చినవాడు తనను తోలుకొని పోతూ ఉంటే గుణశేఖరుడి కోసం ట్రాక్టరు రోదించిన వేదన అదృశ్యంగా మన గుండెలను తాకుతుంది.

కాలం గుణశేఖరుడికి పూర్తిగా అనుకూలించాక తిరిగి ఆ ఇంటికి చేరుకున్న ట్రాక్టర్ పొందిన ఆనందం, ఆ తరువాత నాలుగు కొత్త ట్రాక్టర్లుగా మారడమే కాకుండా ఏకంగా గుణశేఖరుడిని ట్రాక్టర్ల డీలర్‌ను కూడా చేస్తుంది. మానవసంబంధాలతో పాటు ఇటువంటి అపురూప బంధాల తోరణాలను సైతం సమర్థవంతమైన దిశ వైపు నడిపించిన కృష్ణస్వామి రాజు సాహిత్య విశిష్టత చాలాకాలం మన భుజాలను తడుతూ పలకరిస్తూనే ఉంటుంది.

ఎంతో వైవిధ్యమైన నవలా రచనకు హారతులు పట్టిన ఈ రచనాశిల్పం, ఒక సాహిత్య చతురతకు చిరునామాలా నిలిచిపోగలదు. పాఠకులను ఈ నవల ఉత్కంఠభరితంగా చదివించడమే కాదు, రచయిత ఎన్నుకున్న పాత్రలకు తోడు మరిన్ని కొత్త పాత్రలుగా పాఠకులు ఈ నవలలో కనిపించేలా చేస్తోంది.

నడుస్తున్న కథకు సంబంధం ఉన్న వ్యక్తులుగా, ఆ గ్రామ జీవన వ్యవస్థలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఉనికికి హక్కుదారులుగా పాఠకులు అనుభూతి చెందడం ఈ రచనలో ఉన్న విశేషం. ఈ నవలా చిత్రపటం ఇంత గొప్పగా సరికొత్త రంగులతో అందరినీ సమ్మోహనపరచడానికి కారకులైన రచయిత ఆర్.సి. కృష్ణస్వామి రాజు సాహిత్య కృషికి, ఆయన రచనా నైపుణ్య వైవిధ్యానికి హృదయపూర్వక అభినందనలు.

 

– ‘సాహిత్య ప్రపూర్ణ’ డాక్టర్ కె.జి. వేణు
98480 70084

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *