కవిత్వంలో వస్తువును ఉదాత్తం చేయడం ఎలా?

కవిత్వంలో ఒక వస్తువును ఉదాత్తం చేయడం అంటే, నిత్యజీవితంలో మనం చూసే ఒక సాదాసీదా వస్తువును, ఒక చిన్న భావాన్ని లేదా ఒక మామూలు సంఘటనను దాని భౌతిక రూపానికి మించి, అత్యంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం. ఇది కేవలం ఆ వస్తువు బాహ్య రూపాన్ని వర్ణించడం కాదు; దానికి ఒక లోతైన అర్థాన్ని, ఒక సార్వత్రిక విలువను ఆపాదించడం.

ఈ ప్రక్రియ ద్వారా కవి ఒక సాధారణ విషయాన్ని కేవలం కంటికి కనిపించేదిగా కాకుండా, దాని ద్వారా ఒక పెద్ద సత్యాన్ని, గొప్ప ఆదర్శాన్ని లేదా గుండెను పిండేసే భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తాడు. ఇది పాఠకుడిని ఆ వస్తువును సరికొత్త కోణంలో చూడటానికి, దానిలో దాగి ఉన్న అంతర్గత సౌందర్యాన్ని, ప్రాముఖ్యతను గ్రహించడానికి సహాయపడుతుంది. కవిత్వంలో ఈ ఉన్నత స్థితిని సాధించడానికి కవులు వివిధ రకాల సృజనాత్మక పద్ధతులను ఉపయోగిస్తుంటారు.

మొదటిదిగా చెప్పుకోదగినది, ఒక సాదాసీదా వస్తువును ఒక గొప్ప ఆదర్శానికి లేదా భావనకు గుర్తింపుగా (ప్రతీకగా) మార్చడం. ఉదాహరణకు, దీపం అనేది కేవలం నూనె, వత్తితో వెలిగే ఒక భౌతిక వస్తువు మాత్రమే కాదు; కవి చేతిలో అది అజ్ఞానాన్ని చీల్చే జ్ఞానానికి, నిరాశలో వెలిగే ఆశకు రూపంగా మారుతుంది. అలాగే, ఒక తోటలో పూసే గులాబీ పువ్వును తీసుకుంటే, అది కేవలం రేకులు, ముళ్ళు ఉన్న ఒక వృక్షసంబంధమైన వస్తువు మాత్రమే కాదు. కవి దాన్ని ఉదాత్తం చేసినప్పుడు, ఆ గులాబీ పువ్వు నిఖార్సైన ప్రేమకు, సున్నితత్వానికి, ముళ్ళ వంటి కష్టాల నడుమ నవ్వుతూ జీవించే తత్వానికి ఒక అద్భుతమైన రూపంగా సాక్షాత్కరిస్తుంది. చివరకు నదిని చూసినా, అది కేవలం నీటి ప్రవాహం కాదు; కాల ప్రవాహానికి, ఆగని మానవ జీవన గమనానికి అది ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఇలా కవులు ఈ గుర్తింపులను ఉపయోగించి ఒక చిన్న వస్తువు ద్వారానే విశ్వజనీనమైన సందేశాన్ని ఆవిష్కరిస్తారు.

మరో పద్ధతిలో, ప్రాణం లేని వస్తువులకు లేదా కంటికి కనిపించని భావాలకు మానవ లక్షణాలను ఆపాదించి, వాటికి జీవం పోయడం ద్వారా వస్తువును ఉన్నత స్థానానికి తీసుకువెళ్లవచ్చు. గాలి గుసగుసలాడిందని, సూర్యుడు దయగా చూశాడని, లేదా రాత్రి తన చీకటి ముసుగును తొలగించిందని అన్నప్పుడు, ఆ ప్రకృతి అంశాలు కేవలం జడపదార్థాలుగా మిగిలిపోవు. అవి మానవ స్పర్శను పొంది, మనతో మాట్లాడే ప్రాణులలా మారి ఒక ఉన్నతమైన అనుభూతిని కలిగిస్తాయి. దీనికి తోడు, ఒక వస్తువులో లేదా పరిస్థితిలో సాధారణంగా ఎవరికీ కనిపించని ఒక ఆశావహ దృక్పథాన్ని, సానుకూలతను చూడటం కూడా వస్తువును ఉదాత్తం చేస్తుంది.

మట్టిలో నుండి ఒక చిన్న మొక్క మొలకెత్తడాన్ని కేవలం ఒక జీవశాస్త్ర ప్రక్రియగా కాకుండా, అలుపెరగని జీవశక్తికి, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పైకి ఎదిగే భవిష్యత్తు ఆశకు నిదర్శనంగా వర్ణించినప్పుడు ఆ వస్తువు ఎంతో గొప్పగా మారుతుంది.
___________________

కవులు ఒక వస్తువును లౌకిక పరిధి నుండి తాత్విక లేదా లోతైన జీవన తత్వపు స్థాయికి తీసుకువెళ్లడం కూడా జరుగుతుంది. మరణాన్ని కేవలం శూన్యంగానో, జీవితాంతంగానో కాకుండా, ఒక సుదీర్ఘ ప్రయాణ అలసట తర్వాత లభించే హాయిగా వర్ణించడం, లేదా మానవ జీవితాన్ని కేవలం ఒక భౌతిక అస్తిత్వంగా కాకుండా ఒక గొప్ప సృష్టి ప్రణాళికలో భాగంగా చూపడం వస్తువుకు అపారమైన గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.
_____________________

అలాగే, కవిత్వంలో ఒక వస్తువు ప్రాధాన్యతను నొక్కి చెప్పడానికి ఒక్కోసారి పోలికలను ఎంతో జాగ్రత్తగా, హద్దులు దాటకుండా వాడవలసి ఉంటుంది. ఒక వీరుడి ధైర్యాన్ని వర్ణించేటప్పుడు అతని వీరత్వానికి భూమి కంపించిందని అనడం కేవలం మాటల ఆర్భాటం కోసం కాదు, అతని గుండె నిబ్బరాన్ని ఉన్నతంగా చూపడం కోసం మాత్రమే. దీనితో పాటు, ఆ వస్తువు యొక్క రంగును, వాసనను, స్పర్శను, శబ్దాన్ని మన ఇంద్రియాలకు తెలిసేలా సున్నితంగా, వివరంగా వర్ణించడం ద్వారా దానికి ఒక కొత్త జీవం వస్తుంది. ఇది పాఠకుడిని ఆ వస్తువుతో మానసికంగా ముడివేస్తుంది.

ఒక సాధారణ వస్తువును కవి ఎలా ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాడో ఈ ఉదాహరణలో చూద్దాము:

‘వర్షపు చినుకు’ అనే వస్తువును తీసుకుంటే, “వర్షపు చినుకులు పడుతున్నాయి, నేల తడుస్తోంది” అని చెప్పడం కేవలం ఉన్న వాస్తవాన్ని ఉన్నట్లుగా చెప్పే ఒక సాధారణ వర్ణన అవుతుంది. కానీ, అదే చినుకును ఉదాత్తం చేస్తూ ఇలా రాయవచ్చు:

“ఆకాశం కరుణతో కరిగిన కన్నీటి బిందువులు,
నేల దాహార్తిని తీర్చే అమృత ధారలు,
ప్రతి చినుకులో ఒక చిరునవ్వు, ఒక ఆశ,
జనజీవన స్రవంతికి ప్రాణస్పందన
ఎండిన గొంతుకలకు జీవం,
నిరాశ నిండిన హృదయాలకు నవజీవనం
ప్రకృతి ఆశీస్సులై రాలిపడే ప్రతీ చుక్క,
భూమిని పునరుజ్జీవింపజేసే దివ్యౌషధం”

ఇక్కడ వర్షపు చినుకు అనేది కేవలం ఆకాశం నుండి పడే నీటి చుక్క కాదు. అది ఆకాశం కురిపించే కరుణకు, నేల మీద చూపే ప్రేమకు ప్రతీక. ఆ చినుకులకు చిరునవ్వును, ఆశను ఆపాదించడం ద్వారా వాటికి జీవం వచ్చింది. నిరాశ నుండి నవజీవనం వైపు నడిపించే ఒక తాత్విక కోణాన్ని ఇవ్వడం ద్వారా ఒక సాధారణ వర్షపు చినుకు కాస్తా జగత్తును బతికించే జీవన ప్రదాతగా ఉదాత్తం చేయబడింది.

మరో ఉదాహరణ చూద్దాము. ప్రకృతిలోని అత్యంత సుందర దృశ్యమైన ‘తొలకరి జల్లు’ను కవులు కేవలం ఒక వాతావరణ మార్పుగానో, ఆకాశం నుండి రాలిన నీటి బిందువులుగానో చూడరు. ఎండకాలపు తాపంతో తపించిపోయిన నేలపై పడే మొదటి జల్లును, సృష్టి పునరుజ్జీవనానికి నాందిగా, ఒక సరికొత్త ఆశల ఉదయంగా మార్చి ఉదాత్తం చేస్తారు. దీనికి నిదర్శనంగా ఈ క్లుప్తమైన కవితాత్మక వాక్యాలను గమనించవచ్చు:

తొలకరి జల్లు – ఆకాశపు తొలి ముద్దు!
విత్తన గర్భాన మేల్కొన్న జీవమంత్రం.
మట్టి పరిమళాల వెనుక
శ్రమజీవి కళ్లల్లో మెరిసే స్వర్ణ స్వప్నం!

​ఈ వాక్యాలను గమనించినప్పుడు, ఇక్కడ సుదీర్ఘమైన సమాసాలు లేకుండా కేవలం చిన్న చిన్న పదాలతోనే ఎంత పెద్ద భావాన్ని పలికించవచ్చో అర్థమవుతుంది. తొలకరి జల్లును ఆకాశం నేలకు అందించిన ‘తొలి ముద్దు’ అని రెండు పదాల్లో చెప్పడం ద్వారా ఆ జల్లుకు అత్యంత ఉన్నతమైన, పవిత్రమైన స్నేహ బంధాల గౌరవాన్ని కవి ఆపాదించాడు. వట్టి నీటి చుక్కలను ‘జీవమంత్రం’ అని అనడం ద్వారా భౌతిక వస్తువు కాస్తా తాత్వికమైన శక్తిగా రూపాంతరం చెందింది. అన్నింటికంటే ముఖ్యంగా, ఆ జల్లు కురవడంతో వచ్చే మట్టి వాసనను కేవలం ఒక సువాసనగా వదిలేయకుండా, అది శ్రమజీవి కళ్లల్లో మెరిసే ‘స్వర్ణ స్వప్నం’ అని చాలా క్లుప్తంగా చెప్పడం ద్వారా సామాజికమైన, ఆశావహమైన కోణాన్ని జోడించి వస్తువును పరమోన్నత స్థాయికి ఉదాత్తం చేయడం జరిగింది. జగత్తు ఆకలిని తీర్చే ఒక సృష్టి సంకల్పంగా తొలకరి జల్లును ఇంత చిన్న పదాల్లో చెబటం వల్లే, ఆ వస్తువు కాలానికి లొంగని ఒక చిరస్మరణీయ కవిత్వంగా పాఠకుడి అంతరంగాన్ని హత్తుకుంటుంది.

ఇంకో ఉదాహరణ చూద్దాము. సామాన్యంగా చేనేత కార్మికుల ఇళ్లల్లో కనిపించే ఒక ‘చేనేత మగ్గాన్ని’ తీసుకుందాం. “మగ్గం గుంటలో కూర్చుని చేనేత కార్మికుడు బట్టలు నేస్తున్నాడు” అనడం సాధారణ విషయం. కానీ దాన్ని కవిత్వంలో ఉదాత్తం చేసినప్పుడు ఆ మగ్గం శబ్దం ఒక యంత్రపు సవ్వడిలా కాకుండా, కాలంతో సాగించే ఒక నిశ్శబ్ద సంభాషణలా మారుతుంది. దీనికి నిదర్శనంగా ఈ కవితాత్మక వాక్యాలను గమనించవచ్చు:

మగ్గం గుంటలో
ఒక సూర్యుడు ఉదయిస్తున్నాడు!
పడుగు పేకల మధ్య బంధీ అయిన కాలం
లోకానికి రంగుల హరివిల్లుగా విచ్చుకుంటోంది!

​ ఈ వాక్యాలను చాలా శ్రద్ధగా గమనించినప్పుడు, ఇక్కడ మగ్గం గుంటను కేవలం ఒక చీకటి ప్రదేశంగానో, పేదరికానికి నిదర్శనంగానో వదిలేయకుండా కవి అక్కడ ‘ఒక సూర్యుడు ఉదయిస్తున్నాడు’ అని అనడం ద్వారా శ్రమ యొక్క తేజస్సును అత్యంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. కార్మికుడు మగ్గంపై గడిపే సమయాన్ని, అతని శ్రమను ‘పడుగు పేకల మధ్య బంధీ అయిన కాలం’ అని అనడం ద్వారా ఆ వస్తువుకు ఒక తాత్వికమైన లోతును ఆపాదించాడు. అన్నింటికంటే ముఖ్యంగా, ఆ నేత ద్వారా తయారయ్యే వస్త్రాన్ని కేవలం ఒక గుడ్డ ముక్కగా కాకుండా, ‘లోకానికి రంగుల హరివిల్లుగా విచ్చుకుంటోంది’ అని చెప్పడం ద్వారా ఆ చేనేత మగ్గం కేవలం ఒక కర్రల కూర్పు కాకుండా, ఒక సరికొత్త సృష్టి జరుగుతున్న పవిత్ర స్థలంగా, మానవ శ్రమకు ఎత్తిన నిలువెత్తు గోపురంలా ఉదాత్త స్థితిని పొందుతుంది.

ఇలా, కవిత్వంలో ఒక వస్తువును ఉదాత్తం చేయడం అనేది కేవలం భాషా నైపుణ్యమో, పదాల చమత్కారమో కాదు. అది కవి యొక్క లోతైన సామాజిక అవగాహనకు, గుండెలోని సున్నితత్వానికి మరియు సృజనాత్మక శక్తికి అద్దం పడుతుంది. ఇది పాఠకుడికి కేవలం ఒక వస్తువు గురించిన సమాచారాన్ని ఇవ్వదు; దానికి బదులుగా, ఆ వస్తువు ద్వారా ఒక సార్వత్రిక సత్యాన్ని, ఎప్పటికీ చెరిగిపోని ఒక మానవ అనుభూతిని అందిస్తుంది. ఈ అద్భుతమైన ప్రక్రియే కవిత్వానికి అసలైన ఆత్మను, లోతును చేకూర్చి, ఆ రచనను కాలం దాటి చిరస్మరణీయంగా నిలబెడుతుంది.

-ఆరుశ్ రుద్ర

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *