పెనుగులాట తప్పని జీవితాలే డా. శైలజ కథలు

జీవితం సంక్లిష్టమైంది, వేగవంతమైంది. ఒక కాలాన్ని సరైన సమయంలో నమోదు చేయకపోతే ఇట్టే జారిపోతుంది.

గాలి ఆడనప్పుడు ఉక్కపోత తప్పదు. ఎదురుపడిన ప్రతి జీవితంలోనూ ఊపిరిసలపని ఉక్కపోతలే ఉంటాయి. వృత్తి వ్యాపకాల్లో బిజీ అయినప్పటికీ, అభిరుచులు వెంటాడుతూనే ఉంటాయి. అలా అభిరుచుల్ని పండించుకున్న డా. కాళ్ళకూరి శైలజ సాహిత్య జీవితం కథలుగా, కవిత్వంగా, సమీక్షలుగా సాగిపోతూనే ఉంది. నిర్మాణాత్మకమైన ఆలోచనలతో సాహిత్యం పట్ల ఆసక్తి చూపిస్తూ, ఆమె తనదైన శైలిని ఏర్పరచుకున్నారు.
___________________

డా. శైలజ ఈ మధ్యనే తన రెండో కథాసంపుటి ‘ఆశీలు’ను వెలువరించారు. సమాజం కంటికి కనబడని చేతులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, చుట్టూరా ఉక్కపోతలే కనిపిస్తుంటాయి. అదే ఆమెను కథలుగా రాసేంతవరకూ కుదురుగా ఉండనీయలేదు. దైనందిన జీవితంలో వ్యక్తులు అనుభవిస్తున్న ఒత్తిళ్ళు కథలయ్యాయి. వృత్తుల్లో కంటికి కనిపించే, కనిపించని యుద్ధాలు కొన్ని కథలు రాయించాయి.
____________________

మానసిక సంఘర్షణలు కదిలించి, ఏమైనా చేద్దామన్నా సమాజం నుండి నిస్సహాయత ఎదురైన సందర్భాలు కొన్ని కథలుగా మారాయి. బలహీనతలతో ఒకరికొకరు గాయపరుచుకునే వికృత సంస్కృతిని ప్రత్యక్షంగా చూసి కొన్ని కథలు వచ్చాయి. సమాజంలోని రకరకాల మనస్తత్వాలు కొన్ని కథలు రాయించాయి. ఇవన్నీ డా. శైలజ చెప్పుకున్నవే. భావోద్వేగాలు అక్షరమై ప్రసవిస్తే సేదతీరినట్లే; మనమూ సమూహంలో భాగమేనని పలవరించినట్లే. ఇందులో బాధాతప్త హృదయాలు తారసపడితే, వాటిని అనునయంతో అర్థం చేసుకోమని ఆమె సందేశం ఇస్తున్నారు.

‘ఆశీలు’ కథల అంతస్సారం ఏమిటి? సమాజంలోని మనుషుల మధ్య సంబంధాలు అనుకున్నంత హాయిగా లేవు. అట్లాంటి పెనుగులాటలు లేదా ఉక్కపోతల్ని కథల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు డా. శైలజ. కథ చదివినప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని, కథలో చెప్పేదేమిటో కాసేపు ఆలోచిస్తాం. అలాగే చెప్పని విషయాలనూ ఊహిస్తాం. అలా ఊహించినప్పుడు ఒకానొక భావన విశాలమవుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా కల్పన జోడించిన కథలు కూడా ఇందులో ఉన్నాయి. అందులోని నాటకీయత కథ రూపాన్ని పట్టిస్తుంది. డా. కాళ్ళకూరి శైలజ ‘ఆశీలు’ కథలను పరిశీలించినప్పుడు ఈ భావనలు కలిగాయి.

‘ఆశీలు’ కథాసంపుటిలో పది కథలున్నాయి. అన్నీ వస్తువుపరంగా వైవిధ్యమైనవే; మానవ సంబంధాల్లో కొట్టొచ్చినట్టు కనపడే మార్పుల పర్యవసానాలే. ఈ కథలు ఉపరితల అన్వేషణలో పుట్టినవి కావు, వాస్తవ జీవన ప్రతిబింబాలే; ఊపిరిసలపని ఉక్కపోతలే. ‘ఆశీలు’ అంటే వాహనాలు ఒక నిర్దిష్ట ప్రదేశంలోకి రావడానికి ప్రవేశ పత్రాలుగా వసూలు చేసే అనుమతి పత్రాలుగా చెప్పొచ్చు. ఇవి మున్సిపాలిటీకి ఆదాయ వనరు. అయితే ఈ కథలో ఒట్టి ఆశీలు గురించే లేదు; రకరకాల పన్నులు, లంచాల దోపిడీల గురించి కూడా ఉంది. ఇవన్నీ జనాల్ని పీడించేవే. ఉక్రోషం, కోపం ఆపుకోలేక ఒక వీధి వ్యాపారస్థుని నిస్సహాయత దాడిగా మారి మనకు జాలి కలిగిస్తుంది.

ఆధునిక సాంకేతికత అనేక సౌకర్యాల్ని మన ముంగిటకు తెచ్చింది. అంతా బాగుందనుకుంటాం కానీ, అనుభవంలోకి వచ్చినవారికి ఇందులోనూ పెనుగులాట ఉంది; ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఒకపక్క ఉద్యోగ జీవితం, మరోపక్క వ్యక్తిగత జీవితం—ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిందే. ఆ ఒత్తిడుల వైనాన్ని ‘ఉనికి’ కథలో కళ్ళముందుంచారు.

అమ్మతనం కేవలం మాతృత్వం వల్లే రానక్కర్లేదు. ఒక పురుషుని ఇంటికి రెండో భార్యగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎంత ప్రేమ చూపించినా పిల్లలు అంత గమ్మున ఒప్పుకోకపోవచ్చు. ఏదో ఒక బలమైన సంఘటన లేదా ఒక ఆత్మీయత, ఆప్యాయతల కలబోత వల్ల మార్పు రావచ్చు. కుటుంబ సంబంధాల అంగీకారం, అనంగీకారాల మధ్య నలిగే పెనుగులాటే ‘ఓ అమ్మ కథ’.

చీకట్లో ఉన్నా అదే వెలుగు అని భ్రమపడటం ‘నక్షత్రాల చీకటి’. సహాయం పొందినవారు కృతజ్ఞులై ఉండాలి, ఇది లోక న్యాయం. అయితే అది చెప్పడానికి బిడియపడే వాళ్ళుంటారు. స్వేచ్ఛ లేకపోయినా ఉన్నట్లుగా జీవితాన్ని గడిపేవారుంటారు. ఇచ్చిపుచ్చుకోవడాలతో సంబంధం లేని ఆత్మీయతను ‘ఒకనాటి మాట’ చిత్రించింది. ఎవరి ఇష్టాలు వారివి, ఎదుటివారి ఇష్టాల్ని గౌరవించాలి; అనవసరంగా కల్పించుకుని పెద్దరికం వెలగబెట్టకూడదు; మనసుల్ని గాయపరిచే విధంగా ప్రవర్తనలు ఉండకూడదు అని ‘తెరచాటు’ కథ చెబుతుంది.

అన్నిటికన్నా ప్రాణం విలువ గొప్పదని, మిగిలినవన్నీ తాత్కాలికమని, జీవితంలో ఎదురుదెబ్బలు తగిలి తట్టుకోలేక క్షణికావేశంతో జీవితాల్ని ముగించకూడదనే పరమార్థాన్ని గ్రహించమని ‘ప్రాణం ఖరీదు’లో చెబుతారు. ఏదో ఉబలాటం కొలదీ చాలా కథల సారాన్ని చెప్పడం జరిగింది. ఒకటి రెండు వాక్యాల్లో చెప్పడం ఎందుకంటే, మొత్తం కథల్ని దొరకపుచ్చుకుని చదవమని చెప్పడానికే.
__________________

సమస్యలే ఉక్కపోతగా సంభావించుకుంటూ, చుట్టూరా జీవితాల్ని నిశితంగా పరిశీలిస్తూ డా. శైలజ రాసిన కథలివి. ఈ కథాసంపుటిలో చేర్చక్కర్లేని కథలు ఒకటో రెండో ఉంటే ఉండొచ్చు. అచిరకాలంలోనే ఆధునిక కవిత్వాభివ్యక్తినీ, కథాశిల్పాన్నీ ఆకళింపు చేసుకుని కవితలూ, కథలూ డా. శైలజ రాస్తున్నారు. వక్తగా లోలోతుల విశ్లేషణతో డా. శైలజ ప్రసంగం కూడా సాహిత్యాభిమానుల్ని ఆకట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.
________________

మన లోపలి గొంతును పట్టించుకుని, మనకు మానసిక స్వస్థత చేకూర్చాలనే బలమైన ఆకాంక్ష డా. శైలజ గారిది. భవిష్యత్తులో మరిన్ని ఉత్తేజితమైన, సందేశాత్మకమైన కథలెన్నో డా. శైలజ కలం నుండి వెలువడాలని ఆశిస్తూ సెలవు.

కథాసంపుటి కావాల్సినవారు ఒక్కో కథ పది రూపాయల చొప్పున, పది కథలకు 100 రూపాయలు ఫోన్ పే చేయవచ్చు. ఫోన్ పే నెంబర్: 99669 53191

-దాట్ల దేవదానం రాజు
94401 05987

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *